ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం

(నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

– డా.కటుకోఝ్వల రమేష్

పొద్దు పొద్దున్నే
ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది
గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు
నా రెండు కళ్ళూ సారిస్తానా…
పత్రికలో ఆమె
పదునైన అక్షరాల కొడవలి
మెరుగైన లక్షణాల పిడికిలి

కన్నీళ్ళు కాటుక కళ్ళల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతోంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న సిపాయవుతోంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతోంది

ఆమె నాకు పాఠమో
నేను ఆమెకు గుణపాఠమో అర్థంకాదు
నేను బండి పై బడిబాట పట్టగానే
ఆమె కెమెరాకన్నుల్ని మనసుకు తగిలించుకొని
విపణిని వీక్షించే విహాంగమవుతోంది

నేను ఇల్లు చేరుకోగానే
ఆమె బరువెక్కిన సమాచార సంచవుతోంది
అలసిన నా దేహానికి
పలకరింపుల పాలను వొంపి
వార్తా పదబంధాల కోసం తనకుతానే
క్షీరసాగర మథనమవుతోంది
అక్షరాలే ఆమెకు ఆయుధం
అక్షరాలే ఆమెకు అమృతం

ఆశయాల అల్లికతో కుస్తీ
మానవత్వ మల్లికతో దోస్తీ
ఎప్పుడూ ఆమె వ్యాపకం చైతన్య కారకం

అప్పుడప్పుడూ ఈ అడవిలో
మృగాల చూపుల ఘర్షణలో ఎరుపెక్కి
ఆటుపోటుల సముద్రమవుతోంది
పరిపరి విధాల పరివ్యాప్తమవుతున్న
రేపటి నిజం కోసం నిజంగానే
ప్రసవ వేదనల మాతృకవుతోంది

నిద్రపట్టక నినాదాలను నెమరేసుకుంటూ..
తిమిరాలను రాత్రంతా చీల్చుకున్న నాకు
ప్రతిరోజు ఆమె ఒక సూర్యోదయం

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.