
కుంభిక
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– శింగరాజు శ్రీనివాసరావు
తననుతాను చంపుకుంటూ
అందరికీ ఆనందాన్ని పంచుతూ
తాను ఖట్టికమీదశవమై
తపించేవారికి వశమై
ఎండిన మనసుకు
ఎంగిలి మెరుపులు అద్దుతూ
పడకమీద పువ్వులతో
పెదాలమీద ప్లాస్టిక్నవ్వులతో
తానుకోరని బ్రతుకును
విధి విధించిన శిక్షగా
పసుపుతాడులేని పడుపుతనమే
వంచన ప్రేమకు వారసత్వంగా
వెలుగుచూడక నలిగిపోయే
వెలయాలి బ్రతుకులు
పరువునుపూడ్చే బరువులు కావు
సమాజదేహం మీద పచ్చబొట్లు
ధరణిఒడిలో మొలకలై పెరిగి
మనకు తోబుట్టువులుగా ఎదిగి
కాలంకత్తికి తెగిన చిగురాకులను
కామెర్లకళ్ళతో చూడకండి
ఉన్నత ఆశయాలతో నిలిచి
ఊబి నుంచిలాగి ఉపాధికల్పించండి
కుంభికలను కూపం నుంచి తప్పించడం
సమాజసేవ కాదు, బాధ్యత అని గుర్తించండి..
*****

నేను భారతీయ స్టేట్‌బ్యాంకులో డిప్యూటిమేనేజరుగా బాధ్యతలు నిర్వహించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో 2016 సంవత్సరం నుంచి కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవితను మరియు మొదటి కథను ప్రచురించినది “ఆంధ్రభూమి వారపత్రిక”. మొదటిసారిగా “నేలతల్లి” కథకు ఆంధ్రభూమి దినపత్రికలో ద్వితీయ బహుమతి లభించింది. ఇప్పటి వరకు సుమారు 50 కథల పైగా వివిధ వార, మాస పత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. అందులో 20 కథలకు బహుమతులు లభించాయి. రెండు వందల వరకు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 30 కవితల వరకు బహుమతులు పొందాయి.



ధన్యవాదములండీ
కవిత చాలా బాగుంది.