భయం (హిందీ అనువాద కథ)

హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          శారద తిరిగి పనిలోకి వచ్చింది. ఒక్క నెల వయసున్న పసివాడిని తన ఒడిలో ఎత్తుకుని తీసుకొచ్చింది. తలుపు మిసెస్ రస్తోగీ తెరిచింది. ఆమెని చూస్తూనే సంతోషం వ్యక్తపరిచింది –“సంతోషం శారదా. మంచిదయింది నువ్వు వచ్చేశావు. నువ్వు పెట్టి వెళ్ళిన అమ్మాయి బొత్తిగా పనిదొంగ. పని ఎగ్గొట్టడం కూడా ఎన్నిసార్లని. ఏదీ చూడనీ, నీ పిల్లాడు ఎల్లా వున్నాడు?”

          శారద పురుడు పోసుకున్నాక తనలో ఇంకా నిగారింపు వచ్చిందని ఆవిడ గమనిం చింది. చూడటానికైతే అంత అందగత్తె కాదు, పైగా నలుపురంగు. కాని ఆమె మెరిసే కళ్ళు, సౌష్ఠవం ఉన్న శ్రమించే శరీరం, దేన్నీ లెక్కచెయ్యకుండా వుండే నడకని చూశాక ఆమె అనాకారిగా ఉందన్న విషయం మీదికి ఎవరికీ ధ్యాసపోదు.

          శారద లోపలికి వచ్చి పొత్తిగుడ్డల్లో ఉన్న తన బిడ్డ ముఖం మిసెస్ రస్తోగీకి చూపించ డానికి ముందే ఆవిడ అమెను ఆపుజేసింది, “కాస్త ఆగు. ఉట్టిచేతులతో చంటిబిడ్డ ముఖం చూడకూడదు. ముందు కొంచెం ఏదైనా తీసుకొస్తాను” అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది. డ్రాయింగ్ రూంలో ఆవిడ తిరిగి వచ్చేలోపల శారద తన బిడ్డని తివాసీ మీద పడుకోబెట్టి స్టీరియో మీద మంచిపాటలున్న ఒక క్యాసెట్ పెట్టింది. ఆవిడని అడిగింది –“అమ్మగారూ, అయ్యగారెల్లా ఉన్నారు, ప్రియ అమ్మగారెలా వున్నారు, సందీప్ బాబు ఎల్లా ఉన్నారు, మీ మోకాళ్ళలో నొప్పి ఇప్పుడెల్లా వుంది?” చంటిపిల్లవాడిని చేత్తో నిమురుతూ శారద వెనకటి రెండు నెలల వివరాలు తెలుసుకుంటోంది.

          మిసెస్ రస్తోగీ చంటివాడి ముఖం చూడగానే కొంచెం ఆందోళనగా ఒక్కసారిగా వెనక్కి తప్పుకుంది. “ఇదెలా సాధ్యం!” ఆవిడ శ్వాస వేగవంతమయింది. నుదుటి మీద చెమట పట్టింది. ఆవిడ శారద వైపు చూసింది. ఆమెకి తన బిడ్డను చూసుకుంటూ, మరో ధ్యాస లేదు. సోఫాను పట్టుకుని ఆవిడ అక్కడే కూర్చుంది. నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. “ఎంత పని జరిగింది! ఇలా ఎలా జరిగింది! శారద పిల్లాడు మరి….” ఆవిడ మనస్సులో ఏదో చెప్పలేని ఆరాటం మొదలయింది. “ఈ పిల్లాడికి సందీప్ పోలిక ఎలా వచ్చింది? అదే గుండ్రని ముఖం, నీలి కళ్ళు, గడ్డం మీద నల్లని మచ్చ!”శారద పూర్తిగా నల్లగా ఉంటుంది. ఆమె మొదటి ఇద్దరు పిల్లలకి కూడా వాళ్ళ తల్లిపోలిక వచ్చింది. దాని భర్త కూడా ఇంచుమించు అలాగే ఉంటాడు. అయితే మరి… అలాంటప్పుడు… ఈ పిల్లాడు తమ స్వంత మనవడేనా? శారదకి… ఈ నల్లటి పనిదానికా? పెళ్ళి అయిన, ఇద్దరు పిల్లల తల్లికా?… ఇంటింటా ఎంగిలి పాత్రలు తోముతూ ఉండే దీనికా….? ఇంక ఆ పైన ఆవిడ ఆలోచించలేక పోయింది. శారద ధ్యాస ఇంకా తన పిల్లవాడి పైనే ఉంది. తన ముద్దుల కొడుకు గురించి ఏమిటేమిటో చెప్పుకు పోతోంది. ఆవిడ ఇంక అక్కడ కూర్చోలేక పోయింది. పిల్లవాడికి ఇవ్వదలుచుకున్న డబ్బులు అక్కడ పెట్టి, సంతోషం వ్యక్తం చేసే పదాలు గొణుక్కుని లోపలికి వెళ్ళి పోయింది. ఎంత పని జరిగింది? సందీప్ మాత్రం…. సందీప్ మాత్రం….  ఆవిడకి ఎలా తెలియలేదు సందీప్ ఈ పనిమనిషితో…. ఆవిడ కెప్పుడూ ఏ మాత్రం అనుమానం రాలేదు. విషయం ఇంత వరకూ ముందుకి వచ్చే సింది….. ఆవిడ తల తిరగసాగింది.

          శారద ఇల్లంతా తిరుగుతోంది. పైగా అంటోంది –“ఆ అమ్మాయి ఇల్లంతా పాడుచేసి పెట్టింది. నేను నాలుగు రోజుల్లో ఇంటిని ముందులాగా కళకళలాడేలాగా చేస్తాను.” ఆమె చాయ్ పెట్టింది. ఒక కప్పు ఆవిడకి ఎదురుగా పెట్టింది. ఆవిడ తీక్షణ దృష్టితో శారదని చూసింది. నూతన మాతృత్వంతో ఆమె ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆవిడకి ఏదో అడగాలని వుంది. కాని మాటలు పెదవుల వరకూ వచ్చి ఆగిపోతున్నాయి. శారద ఆగకుండా చెప్పుకుంటూ పోతోంది –“నా దొరబాబు లక్షల్లో ఒకడు. నేను వీడిని చాలా గొప్పవాడిగా చేస్తాను. అసలు విసిగించడు. ముందు పిల్లలు నన్ను ఎంత విసిగించేవారో.” మిసెస్ రస్తోగీ కి ఏమీ వినిపించడం లేదు. శారద చెబుతున్న మాటలు మనస్సు మీద సుత్తితో కొట్టినట్టు ఠక్… ఠక్… అని మోగుతున్నాయి. ఆవిడ భావశూన్యమైన కళ్ళతో చూస్తోంది. ఆవిడ ఒకటి-రెండు సార్లు శారదని చేతితో సైగ చేసి మౌనంగా ఉండమని అందామను కుంది. కాని అలా ఏమీ చేయలేకపోయింది.

          శారద వంటింట్లో చాయ్ పాత్రలు కడగడానికి వెళ్ళింది. ఆవిడ చడీచప్పుడూ చెయ్యకుండా మరోసారి మళ్ళీ పిల్లవాడిని చూసి వచ్చింది. “అనుమానమేమీ లేదు. వాడి నీలి కళ్ళు, తెల్లని రంగు, మొత్తం కథంతా చెబుతున్నాయి.” ఒక్క క్షణం ఆవిడ వాడిని చూస్తూ ఉండిపోయింది. వాడిని ఎత్తుకునేందుకు చేతులు కూడా ముందుకు సాచింది. ఏమయినా తన రక్తం. కాని మళ్ళీ తటపటాయించి చేతులు వెనక్కి తీసుకుంది. వేగంగా తన గదిలోకి తిరిగి వచ్చింది. ఆవిడకి కొద్దిగా కనుపించిన దృశ్యం… శారద సందీప్ గదిలో అతడి ఫోటో ముందు నిలబడివుంది. అయితే… శారద ఈ పిల్లవాడిని అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో చొరబడేందుకు కలలు కంటోందా? ఎంతపని చేశావురా నాయనా సందీప్! కాస్త వెనకా-ముందూ ఆలోచించి వుండవలసింది! ఆవిడ కాళ్ళూ-చేతులూ ఆడటం లేదు. శారద తొందరగా వెళ్ళిపోతే బాగుండునని ఆవిడ ఎదురుచూడసాగింది. ఆవిడకి దుఃఖం ఆగడం లేదు.

          శారద చాయ్ తాగి వెళ్ళిపోయింది. “పని చేయడానికి రేపటి నుంచి వస్తాను.ఇప్పుడు మిగతా ఇళ్ళలో కూడా చెప్పాలి. ఈ అమ్మాయితో అన్నిచోట్లా చాలా కష్టమైపోయింది.”

          అంటే దీని అర్థం ఒక గంటలో మొత్తం కాలనీలో అందరికీ శారద ఎత్తుకుని ఇంటింటికీ వెళ్ళి సంతోషం పంచుకుంటున్న మూడో పిల్లవాడు ప్రొఫెసర్ వి.డి. రస్తోగీ గారి తెలివైన సుపుత్రుడు సందీప్ రస్తోగీ యొక్క సంతానమని తెలిసిపోతుంది. కాలనీలో వున్న ఎవరింటికి ఇది వెళ్ళినా, అక్కడే ఈ పిల్లవాడి కులం-వంశం గురించిన వివరాలు అందరి ముందూ బట్టబయలవుతాయి. అందరూ వీడి జాతకం చెప్పడం మొదలు పెడతారు. ఏం చెయ్యాలి? ప్రొఫెసర్ గారికి ఫోన్ చేస్తే? కాని ఆయన మూడు గంటలకే రాగలుగుతారు. ప్రియకి ఫోన్ చేసి చెబితే ఎలా వుంటుంది? పాపం ఇది విని కంగారుపడి పోతుందేమో? ఏం చెయ్యాలి మరి? ఆవిడ పిచ్చి పట్టినట్లుగా ఇల్లంతా పచార్లు చేయ సాగింది. సందీప్ ఎంత పని చేశాడు? ఎక్కడా ముఖం చూపించుకోడానికి అర్హత లేకుండా చేశాడు. ఇంక కాలనీలో ఈ విషయం పొక్కడానికి గంట కూడా పట్టదు. అందరూ అసహ్యించు కుంటారు. బంధుత్వం ఉన్న వారిలోనూ, కేంపస్ లోనూ, ప్రియ ఆఫీసు లోనూ అన్నిచోట్లా రెక్కలు కట్టుకొని ఈ విషయం పాకిపోతుంది. ఈ దిక్కుమాలిన దానికి ఈ ఇల్లే దొరికిందా నాశనం చేయడానికి? ఇంత పెద్ద ప్రమాదాన్ని పెంచి పోషిస్తున్నానని నాకేం తెలుసు? అయ్యో-అయ్యో అనుకుంటూ ఆవిడ ఏడుపు లంకించుకుంది.

          ప్రొఫెసరుగారు రాగానే మిసెస్ రస్తోగీ తన గుండెల మీద ఉన్న గుదిబండను తీసి ఆయన గుండెల మీద పెట్టింది. ఆయన అవాక్కయిపోయారు. ఛీ. సందీప్ ఇంత నీచంగా ఇష్టపడ్డాడా. యవ్వనంలో అంత ఎక్కువగా ఏం తగలబడిపోతోందని? నోటితో చెప్పి వుంటే బాగుండేది. ప్రియకి సంబంధాలు వెతకడానికి ముందు వాడికోసమే పిల్లని చూసే వాళ్ళం కదా. ఏదో ఒకటి తొందరగానే చెయ్యాలి. ఈ సంగతి ప్రియకి కాబోయే అత్తవారింటి దాకా కూడా చేరవచ్చు. ఇంకా సంబంధం ఖాయపరుచుకో లేదు. ఆయన కూడా దిగులు తో కూర్చుండిపోయారు. ఏంచెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇదంతా నిజమైతే సందీప్ కాన్పూర్ నుంచి తిరిగి వచ్చేలోగానే ఏదో ఒకటి చెయ్యాలి. శారదని ఇక్కడి నుంచి పంపించెయ్యాలి. ఆ పిల్లది ఏముంది. ఎక్కడైనా తన పాక వేసుకుని ఉంటుంది. నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంది. కాని ఇక్కడ శారదని ఈ బిడ్డతో ఎవరు చూసినా, మన వంశాన్ని చూసి నవ్వుతారు. ఇన్ని సంవత్సరాలుగా సంపాదించుకున్న గౌరవం, మర్యాద మంటకలిసిపోతాయి. వాటిని మూటకట్టుకుని శారద ఇంటింటికీ తిరుగుతుంది. ఎదురుగా ముఖం మీద ఎవరూ ఏమీ అనరు. కాని అందరూ ఆనందిస్తారు. ఏంచెయ్యాలి?

          ఆయన భార్యని అడిగారు- “నువ్వేమంటావు? కాస్త డబ్బూ దస్కం తీసుకుని ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా? ఏం చేస్తాడు వీళ్ళాయన?”

          “చేసేదేముంది? రోజంతా కల్లుతాగి పడివుంటాడు. ఇది పనికి వెళ్ళినప్పుడు వెనకాల పిల్లలని చూసుకుంటాడు. ఎక్కడో తోటమాలిగా ఉన్నాడని విన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటాడో లేదో తెలియదు.”మిసెస్ రస్తోగీ అడిగింది- “ఇవాళ రేపట్లోనే దాని పిల్లాడిని తీసుకునిపోయి దూరంగా  ఏదైనా అనాథాశ్రమంలో చేర్చేస్తే సరిపోతుంది కదా? ఇలా ఏమన్నా వీలుపడుతుందా? కాని ఇలాగైనా అది ఒప్పుకుంటుందో లేదో తెలియదు.”

          “దాని వైఖరి ఎలా ఉంది?”

          “చాలా మిడిసి పడుతోంది. అందరికీ తనే చుట్టమైనట్టుగా అందరి గురించి ఎలా వున్నారని అడుగుతోంది. లోపల సందీప్ గదిలో వాడి ఫోటో ముందు నిలబడింది. చూడండి. నాకు ఇంకో భయం కూడా వేస్తోంది.” ఆవిడ తన అనుమానం వెలిబుచ్చింది- “దీని లక్షణాలేమీ బాగుండలేదు. ఇంటికి యజమానురాలవుదామని కలలు కంటోం దేమో?”

          “నువ్వు అంత దూరం ఆలోచించకు. ఇంట్లో దూరడం అంత తేలికేమీ కాదు. పిల్లాడికి సందీప్ పోలికలు ఉన్నాయని నీకు పూర్తి నమ్మకంగా ఉందా?” ఆయన ఒకసారి మళ్ళీ ఆ విషయాన్ని ధ్రువపరుచుకోవాలనుకున్నారు.

          “ఇంక నేను మీకేం చెప్పను, రేపు మీ కళ్ళతో మీరే చూడండి.” ఆవిడ మళ్ళీ వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది, “కాని ఏం చేసినా తొందరగా చెయ్యండి.”

          ముగ్గురికీ రాత్రంతా కంటి మీద కునుకు లేదు. మిసెస్ రస్తోగీకి రాబోయే కీడు గురించిన భయం రాత్రంతా వేధిస్తూనే వుంది. ఆమె వచ్చింది. ఒక చేత్తో పిల్లాడినీ, మరో చేత్తో బట్టల మూటనూ పట్టుకుని. ఆమె జబర్దస్తీగా సందీప్ గదిని స్వాధీనం చేసుకుంది. వాళ్ళను ఇంట్లోంచి బయటికి నెట్టేసింది. ప్రియ మీద కూడా ఆమె తన పెత్తనం చలాయి స్తోంది. తను యజమానురాలైపోయి మొత్తం ఇంటిల్లిపాదినీ సతాయిస్తోంది. సందీప్ కూడా చేతులు కట్టుకుని ఒకపక్క నిలబడ్డాడు. రాత్రంతా ఆవిడకి బాధించే, పీడించే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాలనీలో అందరూ అభినందనలు తెలపటానికి వస్తున్నారు. వాళ్ళు బాగా నవ్వుతున్నారు. వేళాకోళం చేస్తున్నారు. హిజడాల సైన్యం వచ్చింది గుమ్మం ముందు నృత్యం చెయ్యడానికి. బహుమానం తీసుకోకుండా వెళ్ళే  ప్రశ్న లేదు. ఆవిడ రాత్రంతా లేచి కూర్చుంటూ ఏడుస్తూ, విలపిస్తూ ఉంది.

          మరోపక్క ప్రొఫెసర్ రస్తోగీ రాత్రంతా నిద్రలేక ఇటూ-అటూ దొర్లుతున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారాయన. కాని వంశగౌరవం మంటకలిసిపోతూ తను ఏమీచేయలేని పరిస్థితి ఇంత వరకూ రాలేదు.

          ప్రియ విపరీతంగా ఆలోచిస్తూ పిచ్చిదానిలా అయిపోతోంది. అందరి చూపులనీ తను ఎలా ఎదుర్కోగలదు. ఈ సంగతి అత్తవారింటికి తప్పకుండా చేరుతుంది. యావజ్జీవితం తన పుట్టింటివారిని అవమానించడానికి వాళ్ళకి ఒక సాకు దొరుకుతుంది. అది కాకుండా ఆఫీసు కూడా ఉంది. అక్కడ కూడా మనుషులున్నారు. అందరూ గుచ్చిగుచ్చి అడుగు తారు. ఎలాగో తెల్లవారింది. ఆమె వచ్చింది అదే ఆత్మవిశ్వాసంతో కూడిన దేన్నీ లెక్క చేయని తన వైఖరితో. ఆమె రాగానే అందరికీ రక్తపుపోటు పెరిగింది. అందరూ తమను పూర్తిగా పనిలో నిమగ్నమైన వాళ్ళలా చూపించుకుంటున్నారు. ప్రియ ఒక పుస్తకం తీసుకుని కూర్చుంది. ప్రొఫెసర్ గారు కొన్ని ఫైళ్లు తీసుకుని స్టడీలో లీనమయ్యారు. మిసెస్ రస్తోగీ తన కీళ్ళ నొప్పులతో బాధ పడుతూ బెడ్ రూం లోకి వెళ్ళి పడుకుంది. 

          ముందయితే ఆమెకోసం తలుపు తెరవడానికి ఎవరూ రాలేదు. రెండు-మూడుసార్లు ఆమె వరుసగా బెల్ మోగిస్తే అప్పుడు ప్రియ లేచి వచ్చింది. ఇద్దరి కళ్ళూ కలిశాయి. శారద నవ్వింది –“ఎలావున్నారు అమ్మాయిగారూ?”  ప్రియ ఏమీ మాట్లాడకుండా ఒక పక్కకి తప్పుకుంది. ఏమీ మాట్లాడలేకపోయింది. శారద వడివడిగా లోపలికి వచ్చింది. పిల్లవాడిని తివాసీమీద పడుకోబెట్టింది. స్టీరియో పెట్టింది. ఎ.సి. ఆన్ చేసింది. తర్వాత చాయ్ పెట్టడానికి వంటింటివైపు నడిచింది. ఇంతసేపూ అందరికీ శ్వాస నిలిచి పోయివుంది. అందరూ ఆమె అధీనంలో ఉన్నారేమో అన్నట్లు ఆమెని ఆపుజేయడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ప్రియ ఆమెమీద అందరికన్నా ఎక్కువ అరుస్తూ ఉంటుంది. ఎవరైనా సరే, తన వస్తువులను, ప్రత్యేకించి స్టీరియోను ముట్టుకుంటే తను అసలు సహించదు. ఈ రోజు ప్రియ నిస్సహాయురాలిగా చూస్తోంది. శారదకి వెనకాలే వుండి పనుల్లో లోటుపాట్లు లెక్కపెడుతూ తిరుగుతూవుండే మిసెస్ రస్తోగీ కూడా పూర్తిగా మౌనంగా ఉండిపోయింది. ముగ్గురూ ఊపిరి బిగబట్టి, బిజీగా ఉన్నట్లు నాటకమాడు తున్నారు. ఇల్లంతా స్టీరియో ధ్వని ప్రతిధ్వనిస్తోంది. దాన్ని ఆపుజేయమని చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలడంలేదు.

          శారద చాలా వేగంగా పని చేసుకుంటూ పోతోంది. మధ్యమధ్యలో వచ్చి తన దొరబాబుని కూడా చూసుకుంటోంది. ఇంట్లోని పనులతోపాటు వాడికి పాలు తాగించడం, వాడి బట్టలు మార్చడం… ఇవన్నీ నడుస్తున్నాయి. ఆమె బట్టలు ఉతకడానికి బాత్ రూంలోకి వెళ్ళినప్పుడు మిసెస్ రస్తోగీ చటుక్కున లేచి ప్రియనీ, ప్రొఫెసర్ గారినీ డ్రాయింగ్ రూంలోకి తీసుకువచ్చింది.

          “అరే! వీడు నిజంగా సందీప్ పోలికే. పిల్లాడు ముద్దొస్తున్నాడు.” ప్రొఫెసర్ గారిలో వాడిని చేతుల్లోకి తీసుకోవాలని ఆత్రుత మొదలైంది. ఆయన అతికష్టం మీద తనను తాను ఆపుజేసుకున్నారు. ప్రియకి ఏడుపు ముంచుకొచ్చింది. మిసెస్ రస్తోగీకి కళ్ళు  తిరిగాయి. ఆవిడ అక్కడే పడిపోయింది. ఇద్దరూ ఎలాగో ఆవిడని ఎత్తుకుని బెడ్ రూం దాకా తీసుకువెళ్ళారు.

          ఆమె ఇంట్లో ఉన్నంత వరకు అక్కడ కేవలం ఆమె మాత్రమే  ఉన్నట్లు అనిపించింది. మిగిలిన ముగ్గురూ కొయ్యబొమ్మల్లాగా ఉండిపోయారు. పూర్తిగా మౌనంగా. ఏదో దుఃఖపూరిత వాతావరణం నెలకొన్నట్లుగా కూర్చుండిపోయారు. ఆ రోజు ప్రియకి కూడా అనిపించింది ఆమె మాటిమాటికీ సందీప్ గది వైపుకి చూస్తోందని. ఆమె సందీప్ గదిని చీపురుతో చాలా బాగా తుడిచి, తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసింది. అన్నిటికన్నా ఎక్కువసేపు ఆ గదిలోనే ఉంది. ప్రియ కూడా శారద సందీప్ గురించి ఏమైనా అడిగితే ఆమెని వెంటనే నిలదీయడానికి మానసికంగా సిద్ధంగానే వుంది. కాని శారద అలా తొందరపాటు ఏమీ చూపించలేదు. రెండున్నర-మూడు గంటలసేపు ఆ ముగ్గురినీ బంధితులుగా ఉంచిన తరువాత ఆమె చకచకా…. వెళ్ళిపోయింది.

          ఆమె వెళ్ళిపోగానే ముగ్గురూ తల పట్టుకుని కూర్చుండిపోయారు. మొదటి సమస్య ఆమె నోటి నుంచి చెప్పించి ఎలా ఒప్పించడం. సందీప్ తో తర్వాత కూడా ఎలాగో చూసుకోవచ్చు. ముందుగా దీనితో త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మొత్తం కాలనీలో ఈ వార్త పాకిపోయివుండవచ్చు. ప్రస్తుతం సందీప్ ని కాన్పూరులోనే ఇంకా కొన్ని రోజులు ఉండమని ఫోన్ చేసి చెప్పాలని అప్పటికే నిర్ణయించుకున్నారు. సందీప్ ఇప్పుడే రావడం సరికాదు. ఎందుకంటే వాడు ఒకవేళ శారద పక్షాన మొగ్గు చూపితే అంతా గుండమై పోతుంది. వాడికి ఫోన్ లో దీని గురించి ఏమీ చెప్పకూడదు.

          ఒకవేళ శారద ఒప్పుకోకపోతే ముందుగా ఆమెకి ఎంతో కొంత ముట్టచెప్పి ఇక్కడ నుండి శాశ్వతంగా వెళ్ళిపొమ్మని చెప్పాలి. అదికూడా ఇవాళ రేపట్లోనే. అలా కాదంటే ఆమె నుండి పిల్లాడిని తీసుకుని ఏదైనా అనాథాశ్రమంలో ఇవ్వడానికి ప్రయత్నించాలి. మరో మూడో ఉపాయం ఏదీ వాళ్ళకి తట్టలేదు. ఒకవేళ ఆమె ఇంట్లో చొరబడటానికి ఏ మయినా ప్రయత్నిస్తే అప్పుడు దానికి ముందు నుంచే ఇదే ఆలోచన వుందని తేటతెల్లం అవుతుంది. అందుకనే ఇది సందీప్ ని ఇరికించిందని తెలుస్తుంది. అటు వంటి పరిస్థితి లో దీని వ్యవహారం పరిష్కరించడం తేలికవుతుంది. అందరూ వీళ్ళనే సమర్థిస్తారు.  

          ఒక చోటికి వచ్చి విషయం ఆగిపోయింది. ప్రస్తుతం కాలనీలో ఉన్నవాళ్ళ దృష్టిని ఎలా ఎదుర్కోవడం? బయటికి వెళ్ళడం-రావడం తగ్గించెయ్యవచ్చు. పూర్తిగా మానేయ డం కుదరదు. జనానికి ఏదయినా మాట్లాడాలంటే మసాలా కావాలి. వాళ్ళు దాన్ని రుచి చూస్తూ ఆనందిస్తారు. వీళ్ళని అసహ్యించుకుంటారు. మొత్తం అంతా ఇలాగే నడవనిస్తే రేపు పిల్లాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఈ వీధుల్లోనే ఆడుకుంటాడు. ఎవరెవరి నోళ్ళు  మూయించగలం?

          సాయంత్రం వరకు వాళ్ళు కేవలం ఆలోచిస్తూనే వున్నారు. ఏదీ నిర్ణయించుకోలేక పోయారు. తిన్నగా శారదని ఈ విధంగా అడగలేరు –చూడు,  నువ్వు మా సందీప్ తో గడిపావు, ఆనందంగా ఉన్నావు. ఎవరు ఎవరిని ఇరికించారన్నది వదిలిపెట్టు. కాని మీ ఇద్దరి మూర్ఖత్వం యొక్క ఫలితం ఇప్పుడు ఎదురుగా వుంది. చూడు, మేము గౌరవంగా బతుకున్నవాళ్ళం. నిస్సందేహంగా వీడు మా అబ్బాయివల్ల పుట్టాడు. కాని ఈ పిల్లాడు ఇక్కడ ఉండటంవల్ల మా గౌరవమర్యాదలకి భంగం కలుగుతోంది. అందువల్ల నువ్వు వీడిని, నీ స్థిరపడిన జీవితాన్ని, నీ జీవనాధారాన్ని తీసుకుని ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపో.

          ఇలా ఎవరు అనగలరు? వాళ్ళకి శారదకి ఎదురుపడటానికే ధైర్యం చాలలేదు. ఆమె సంతోషంగా ఉండటాన్నీ, దేన్నీ లెక్కచేయకుండా వుండడాన్నీ వాళ్ళు  సహించుకోలేక పోతున్నారు.

          సాయంత్రం ఆమె మళ్ళీ వచ్చింది. అందరికీ మళ్ళీ పక్షవాతం వచ్చినట్లయింది. ఎవరికీ చేతులూ కాళ్లూ ఆడటం లేదు. రోజంతా ఆలోచించిన ప్రణాళికలు పనికిరాకుండా పోయాయి. పిల్లవాడిని అదే విధంగా తివాసీ మీద పడుకోబెట్టడం, స్టీరియో పెట్టడం, మొత్తం ఇల్లంతా కూనిరాగాలు తీస్తూ తిరగడం, పిల్లవాడి గురించి ఎన్నో విషయాలు చెప్పడం, వాడికి పాలు పట్టడం, ఏదో ఒక వంకతో సందీప్ గదిలోకి వెళ్ళడం… ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఒక నాటకంలాగా ఆమె తన పాత్రని పోషిస్తోంది. మిగిలిన ముగ్గురూ మూగప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు సందీప్ గురించి ఏమీ అడగలేదు, అనుకున్నట్లుగా మాట్లాడే అవకాశం ఎవరికీ దొరకలేదు.

          మరోసారి ఆమె తప్పించుకుంది. ఆమె వెళ్ళగానే మళ్ళీ ముగ్గురూ ఒకచోటికి చేరారు. ఇంతకీ ఆమె ఏం కావాలనుకుంటోంది? ఒకపక్క ఈ ఇంటిని తన ఇల్లుగా భావించి ఇంట్లోని వస్తువులన్నీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. మరోపక్క ఏ విధంగానూ ఎటువంటి డిమాండ్ చేయడంలేదు. ఏమీ చెప్పడంలేదు. ఆమె మొత్తం ఇల్లంతటినీ గట్టిగా నిర్బంధించివుంచింది. పని మానేయమని కూడా ఎలా చెప్పడం. మాట్లాడటానికి ఏదైనా ఆధారం దొరకాలికదా. రెండుసార్లూ, ఆమెతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కాని ఆమెకి ఏమీ లెక్కలేదు. తన పిల్లవాడి విషయంలోనే నిమగ్నమైవుంది.

          కాలనీలో గుసగుసలు మొదలయ్యాయి. ఒకరిద్దరు మహిళలు ఏదో వంకతో ఇంటికి కూడా వచ్చారు. శారద గురించి కూడా ఉటంకించారు. ఆమె తిరిగి రావడంవల్ల మీకు సౌకర్యంగా ఉందని అన్నారు. కాని ఏం చెప్పడానికి వచ్చారో అది మాత్రం చెప్పలేదు. కొందరు వనితలు మాత్రం తిన్నగా శారదని గుచ్చి అడగడానికి ప్రయత్నించారు కాని ఆమె స్పష్టంగా తిరస్కరించింది. జనం నవ్వుతున్నారు – ఆమె కాదంటే ఏమవుతుంది, వాడిలో ఎవరి రక్తం ప్రవహిస్తున్నదో ఎవరైనా చెప్పగలరు. ఆమె ఎటువంటి వేళాకోళానికీ జవాబివ్వదు. తోసిపుచ్చుతుంది.

          ఇప్పుడు ఆమె ముందులాగా మురికిబట్టల్లో రాదు. పిల్లవాడిని కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచుతుంది. తన స్థాయికి తగ్గట్టు ఖరీదైన బట్టలు వేస్తుంది. ఆమెకి ముందు పుట్టిన ఇద్దరు పిల్లలనూ ఆమెతో కూడా ఎవరూ ఎప్పుడూ చూడలేదు.  కాని ఈ మూడో వాడు మాత్రం ఎప్పుడూ ఆమె ఒడిలోనే ఉంటాడు. కొన్నిఇళ్ళలో ఆమెకి పిల్లవాడి కోసం పాతబట్టలు ఇవ్వబోతే ఆమె తీసుకోవడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. ముందు మాత్రం ఇదే శారద తన కోసం, పిల్లల కోసం అన్నీ అడుగుతూ ఉండేది.  

          మూడోరోజు ఉదయం విషయం కాస్త ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళలేదు, బెడిసికొట్టింది. ఆ సమయంలో ప్రొఫెసర్ గారు ఇంట్లో లేరు. ఆమె వచ్చింది. పిల్లాడిని తివాసీ మీద పడుకోబెట్టింది. స్టీరియో పెట్టడానికి ఉపక్రమించగానే ప్రియ ఒక్కసారిగా మండిపడింది –“వీడిని ఇక్కడి నుంచి తీసుకుపో. రోజూ తివాసీ మీద పడుకోబెడు తున్నావు. పాడైపోతుంది ఇది.”

          శారద తిరిగి కొంచెం ఏదైనా చెప్పేలోపలే ప్రియ మరొక ఆర్డరు జారీ చేసింది –“ఈ రోజు నుంచి నా స్టీరియోని ముట్టుకున్నావంటే జాగ్రత్త. పద్ధతిగా పని చెయ్యదలుచు కుంటే చెయ్యి, లేకపోతే ఇంకో ఇల్లు చూసుకో.”

          శారద ఒక్కసారిగా నిశ్చేష్టురాలై నిలబడి పోయింది. ఆమె బహుశా ఇలా వినవలసి వస్తుందని అనుకోలేదు. ఆమె పిల్లవాడిని ఎత్తుకుని ఒక మూలగా కూర్చుంది. మిసెస్ రస్తోగీకి కూడా మంచి అవకాశం దొరికిందనిపించింది. ఆవిడ కూడా ముందుకి వచ్చింది –“సందీప్ ని ఎప్పటి నుంచి వల్లో వేసుకున్నావో చెప్పు. మాట్లాడు.”

          “ఏమిటి మీరనేది?” శారద ఆవేశంతో అడిగింది, “ఎవరు ఎవరిని వల్లో వేసు కున్నారు?”

          “అయితే మరి ఈ పిల్లాడికి సందీప్ పోలిక ఎలా వచ్చింది?” ఎంత ఆపుజేసుకున్నా ఆవిడ గొంతుక బొంగురు పోయింది.

          “నాకేం తెలుసు?” శారద నిర్లక్ష్యంగా అంది.

          “నీకు తెలియకపోతే మరెవరికి తెలుస్తుంది? ఎక్కడెక్కడ రుచులు మరుగుతావో తెలియదు. మా అమాయకుడైన కుర్రాడిని వల్లో వేసుకున్నావు. మమ్మల్ని అప్రతిష్ట పాలు చేశావు.”

          శారద ఒక్కసారి లేచి నిలబడింది –“ఏంటమ్మగారూ, నా స్వభావం గురించి ఏంటేంటో అనేస్తున్నారు, నేనింతసేపూ ఏం మాట్లాడకుండా వింటున్నాను. మీరు ఏదేదో చెప్పేస్తున్నారు. నాకు నా పని తప్పితే ఇంకేమీ అక్కర్లేదు. అక్కర్లేని విషయాల్లో నేను పడను.”

          “అక్కర్లేని విషయాల్లో పడకపోతే మరి పిల్లలకి ఎవరి పోలికైనా ఎలా వస్తుందో చెప్పు?” ఈసారి తర్కాన్ని ప్రియ ఎత్తుకుంది.

          “నాకేం తెలుసు? మీరు పని మాన్పించదల్చుకుంటే అదే చెప్పండి. నేను ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతాను. కాని నాకు పనికిరాని మాటలు చెప్పకండి.” ఇలా అంటూ ఆమె పిల్లవాడిని ఎత్తుకుని ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోయింది.

          ఒక్క క్షణం తల్లీకూతుళ్ళిద్దరూ స్తబ్ధులైపోయారు. ఏం జరిగిపోయింది? వాళ్ళు కొంత ఊరటతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడింక కనీసం ప్రతిక్షణం నెత్తిమీద స్వారీ చెయ్యదు. ఒక అసమంజస స్థితి ఇప్పుడు కూడా వాళ్ళ ముందు ఉంది. ఆమెతో మాట్లాడుకుందా మనుకున్న పరిస్థితి ఒక్కసారిగా చేతిలోంచి జారిపోయింది. ఎంతో కఠినంగా చేతిలోకి వచ్చిన అవకాశం ఇద్దరూ పోగొట్టుకున్నారు. ఇప్పుడింక వాళ్ళు కాలనీ విడిచిపెట్టి వెళ్ళిపొమ్మనికాని, పిల్లాడిని ఇవ్వమనికాని ఆమెకి చెప్పలేరు. ఆమె వైఖరి చూస్తే అంత తేలికగా వాళ్ళని చెయ్యి పెట్టనివ్వదని తెలుస్తూనే వుంది. మొత్తం మీద ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది ఈ ఇంట్లోకి చొరబడాలనే ఆలోచన తనకేమీ లేదని.

          ప్రొఫెసర్ గారికి విషయమంతా తెలిశాక ఆయన చిరాకు పడ్డారు. “మీకు ఓర్పు అనేది అసలు లేకుండా పోయిందా? తెలిసి-తెలిసి మొత్తం రంగం అంతా చెడగొట్టారు. అది తనంతట తను ఇష్టపడి పనికి రావడం మానేస్తే దాన్ని ఏదైనా అనడానికి మనకేమీ హక్కు ఉండదు.”

          శారద నిజంగానే పనికి రావడం మానేసింది. మిగిలిన ఇళ్ళలో అదే చురుకు దనంతో పిల్లవాడిని తీసుకుని తిరుగుతోంది. లోలోపల నడుస్తున్న గుసగుసలు ఇప్పుడింకా బహిర్గతమవుతున్నాయి. జనానికి ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలగసాగింది.

          చాలా ఆలోచించిన తరువాత తనను తాను అన్నివిధాలా సిద్ధం చేసుకుని ప్రొఫెసర్ రస్తోగీ రాత్రి చీకట్లో శారద పూరింటికి వెళ్ళారు. శారద పదేళ్ళలో కూడా సంపాదించలేనంత డబ్బు తీసుకుని వచ్చారు. కాని, శారద డబ్బులు చూడగానే మండి పడింది, “దేనికండి డబ్బులు? పని చేసేటప్పుడు డబ్బులు తీసుకునేదాన్ని. కాయకష్టం చేసుకుంటున్నాను. చేసుకుంటూనే వుంటాను. నేనెందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి? ఎక్కడికి వెళ్ళను?”

          ప్రొఫెసరు గారు ఆమె వైఖరి చూశాక ఇంకో ఎర చూపించసాగారు–“ఇంకా పైన ఈ డబ్బులు కూడా తీసుకో. నీ పిల్లవాడిని మాకు ఇచ్చెయ్. ఎప్పటికీ.” ఇది వినగానే శారద పేట మొత్తం వినేటంత గట్టిగా అరిచింది –“జాగ్రత్తగా వినండి సార్. వీడు నా బిడ్డ. కేవలం నా కొడుకు. వీడిని ఎంత విలువ కట్టి ఇచ్చినా నేను ఇవ్వను. తెలిసిందా? వీడు సందీప్ బాబు కొడుకని మీకు అనుమానమైతే మీరు వెళ్ళి ఆయన్నే ఎందుకు అడగరు? ఆయన్ని ఎక్కడ దాచి ఉంచారు?” విసవిసా నడుచుకుంటూ ఆమె తన పూరింట్లోకి వెళ్ళిపోయింది.

          ప్రొఫెసర్ గారు పూర్తిగా కుంగిపోయి, చీకట్లో ఎదురుదెబ్బలు తింటూ తిరిగి వస్తున్నారు. ఆయన ఆలోచిస్తున్నది రేపుగాని, ఎల్లుండిగాని ఇల్లు మారి ఇంకెక్కడికైనా మరో కాలనీలో ఉండటానికి వెళ్ళిపోదామని.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.