
కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-12
వేదుల మీనాక్షీదేవి
-డా. సిహెచ్. సుశీల
తెలుగులో తొలి కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ అన్న ప్రచారం విస్తృతంగా ఉన్నా, స్త్రీవాదులు ప్రత్యేకంగా శ్రద్ధగా పట్టుదలగా చేసిన పరిశోధన వల్ల 1902లో భండారు అచ్చమాంబ గారి ” ధన త్రయోదశి” తొట్టతొలి కథ అని నిర్ధారణ అయింది. 1893 నుండే ఆమె చాలా కథలు రాసినట్టు తెలిసినా 10 మాత్రమే లభ్యమై నాయి. అలాగే అనేక కథలు, పెక్కురు రచయిత్రులు తెరవెనుకనే ఉండిపోయారు. కొందరి గురించి గూగుల్ లో చాలా కొద్ది సమాచారం అందుతోంది. కొన్ని కథల పేర్లు తెలుస్తున్నాయి కానీ, కథా నిలయంలో కూడా పరిమిత సంఖ్యలో కథలు మాత్రమే లభ్యమౌతున్నాయి.
“వందేళ్ళ కథకు వందనాలు” పేరిట 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం 12 మంది రచయిత్రుల కథలనే స్వీకరించడం శ్రీమతి శీలా సుభద్రాదేవి గారిలో ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి, కొన్ని కథా సంపుటాలను, పాత పత్రికల్లో కథలను సేకరించారు. సుభద్రా దేవి గారి ఆసక్తి, పట్టుదల, కృషి అభినందనీయం. అందులో శ్రీమతి వేదుల మీనాక్షీదేవి ఒకరు.
శ్రీమతి వేదుల మీనాక్షీదేవి
ప్రఖ్యాత కవి, రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి మనుమరాలు వేదుల మీనాక్షీదేవి. కాకినాడలో జూన్ 26, 1917 లో జన్మించిన మీనాక్షీదేవి పండిత వంశం, సాహిత్య వాతావరణంలో పెరిగి సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పట్టు సాధించారు. 1933 నుండి రచనలు ప్రారంభించినా 1950 లో గృహలక్ష్మి పత్రికలో మొదటి కథ “దినదిన గండం” ప్రచురింపబడింది. అప్పటి నుండి ఆమె విరివిగా కథలు రాశారు.
ఆనాడే కాదు, ఈనాటి రచయితలకూ ఒక మార్గదర్శకంగా, సందేశాత్మకంగా ఉండే కథ “మానివేసిన కథ”.
కథలోని పాత్రలు ప్రత్యక్షమవడం, రచయితను ప్రశ్నించడం ఇప్పటికీ కొన్ని కథల్లో, సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ కథలో కూడా ఇదే సన్నివేశం. అయితే
సమకాలీన పరిస్థితుల పై, రచనా ధోరణుల పై రచయిత్రి స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఇందలి విశేషం. కథ కొంత రాసి నిద్రపోయిన రచయిత్రికి కథ లోని ముఖ్య పాత్ర ప్రత్యక్షమై, ప్రశ్నించడమే కాక, తన జీవితాన్ని చిత్రించిన విధానానికి అభ్యంతరం చెప్పడం మంచి ఇతివృత్తం.
మానివేసిన కథ
కథ ప్రారంభంలోనే ఒక note పెట్టారు రచయిత్రి – “ఇందలి పాత్రలు కేవలం కల్పితాలు, యే వ్యక్తికీ సంబంధించినవి కావు” అని.
కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా యాభై సంవత్సరాల ఆర్ముగం అయ్యరుకి జీతం 80 రూ.లు. ముగ్గురు ఆడ పిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. భార్య కుట్టెమ్మాళ్ నాలుగేళ్ళ క్రితం మరణించింది. ముసలి తల్లిని, ఆరుగురు సంతానాన్ని పోషించడానికి అతని జీతం చాలదు. దానికి తోడు తల్లి పోరుతో పెద్ద కూతురుకి పెళ్ళిచేయడం అతనికి తలకి మించిన భారం. వెయ్యి రూపాయలు ఖర్చు చేసినా వియ్యాలవారిని తృప్తి పరచలేక పోయాడు.
చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలు పడి తనని పెంచి, చదివించిన తల్లి చనిపోతే పరలోక క్రియలు గొప్పగా చేయకపోయినా, రెండు వందల అప్పు చేయ వలసి వచ్చింది. పెద్ద పిల్లవాడు ఇంటరు చదువుతున్నాడు.ఇద్దరు హైస్కూల్ కి వచ్చారు. చివరి ఇద్దరినీ స్కూల్ కి పంపలేక ఇంట్లో తనే తీరిక చేసుకొని చదివిస్తున్నాడు. ప్రతినెలా అప్పులే. తీర్చే మార్గం లేక రాత్రిళ్ళు నిద్ర పట్టక కుంగిపోతున్నాడు. ఏడాది పైగా ఇంటి అద్దె కూడా చెల్లించలేక పోతున్నాడు. అడిగి అడిగి చివరికి ఇంటి యజమాని ఒకరోజు కొందరిని పోగేసుకుని వచ్చి మర్నాటికల్లా ఇల్లు ఖాళీ చేయమని ఖచ్చితంగా చెప్పి వెళ్ళాడు. “అయినా అరవ వాడిని నమ్మకూడదు” అన్నాడు మరో పెద్ద మనిషి. ఆ మాటకి చాలా బాధపడ్డాడు ఆర్ముగం. ఇల్లు ఖాళీ చేసి సత్రంలోకి చేరాడు పిల్లలతో. రాత్రి అయింది. పిల్లలు నిద్రపోతున్నారు.
ఇంత వరకు ‘చాలా దీనంగా ఆర్ముగం కథ’ రాసిన రచయిత్రి తర్వాత ఏంరాయాలా అని ఆలోచనలో పడింది.
“ఆర్ముగం అయ్యరు చేత ఆత్మహత్య చేయించడమా? పరారీ చేయించడమా? చిన్నప్పుడు తల్లి వేయించిన లాటరీ తాలూకు డబ్బు వచ్చినట్లు చెయ్యడమా? “… అని
ఆలోచిస్తుంటే, “అమ్మా, ఆ కాగితాలు ఇవ్వవా, పడవలు చేసుకుంటాం” అని పిల్లలు అడుగుతుంటే “అవి ఇచ్చేవి కావు” అని చెప్పి, మధ్యాహ్నం ఎండకు అలసటగా ఈజీ ఛెయిర్ లో పడుకుంది. మాగన్నుగా నిద్ర పట్టబోతుండగా –
చెయ్యెత్తు మనిషి, చామనఛాయ, విశాలమైన నుదురు, రోల్డుగోల్డు ఫ్రేమ్ కళ్ళ జోడు, తల ముందు భాగం నున్నగా ఉండి, వెనుక సగం నెరిసిన జుట్టు ముడి, గూడకట్టు, హాఫ్ షర్టు వేసుకుని, పైన అంచు లేని తెల్ల కండువా, చేతిలో సంచీ ఉన్న మనిషి ఎదురుగా నిలబడ్డాడు. ఎవరని ఆశ్చర్యపోయింది రచయిత్రి.
“నా జీవితం దుర్భరం చేసావని చెప్పడానికి వచ్చాను” అన్నాడు. “ఆరుగురు పిల్లలు, నిక్షేపంగా ఉన్న భార్యను చంపేయడం, నన్ను అప్పుల పాలు చేయడం, నడి వీధిలో నలుగురి చేత తిట్టించడం, ఇల్లు ఖాళీ చేయించి సత్రంలో కాపురం పెట్టిం చడం…. ఇవన్నీ కాక నా చేత ఆత్మహత్య చేయించాలా పరారీ చేయించాలా అని ఆలోచిస్తావా” అని తీవ్రంగా ప్రశ్నించాడు.
దిగువ మధ్యతరగతి వ్యక్తి కానీ, ఇంటి నౌకరు కానీ ఒకే విధంగా ఉంటారని (ఉండాలని) వర్ణిస్తారు కథల్లో, సినిమాల్లో. కానీ పై వర్ణన చూస్తే రచయిత్రి ఆ రోజుల్లోనే దానిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
అతని ఆవేశానికి రచయిత్రి మొదట బిత్తరపోయింది. తర్వాత కోపంతో “మొదటే చెప్పానుగా కేవలం ‘కల్పిత పాత్రలు’ అని” అంది. “ఇందులో సంగతులన్నీ ఏ ఒక్కరివో కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న సుబ్రహ్మణ్యం గారికి ఆరుగురు పిల్లలు. ఆయనకీ మధ్యనే భార్యా వియోగం కలిగింది. అప్పులు ఎగవేసి సత్రంలో చేరడం మా ఊర్లో వెంకన్న గారి సంగతి. తెలిసిన వారి సంగతులు తీసుకొని, కొంత కల్పించి రాసాను. పైగా ఎన్.జి.వో.ల పైన సానుభూతి కలగడానికి రాసానీ కథ” అంది.
“అయితే సాటి ఆంధ్రుల పేరు పెట్టక, అరవ పేరు పెట్టడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? అవహేళన చేసానని ఆనందిస్తున్నావా? మా ఎన్.జి.వో.లకు ఆ ప్రాంతీయ భేదం లేదు. ఎక్కడైనా మేమంతా ఒక్కటే. శ్రీశ్రీ అన్నట్టు ‘గనిలో వనిలో కార్ఖానాలో పాటుపడే దౌర్భాగ్య జీవులూ మేమూ ఒకటే. మాకు ఫలితం తక్కువ. ఏ విధమైన గౌరవానికీ అర్హులము కాము…. అయినా అన్ని బాధలూ ఒక్కడికే తెచ్చిపెడితే ఎలా బ్రతుకు తాడనుకున్నావు? పోనీ కథను సుఖాంతం చేయరాదూ” అన్నాడు.
రచయిత్రి నింపాదిగా చెప్పింది – పూర్వం మన భారతీయులు కథలన్నీ సుఖాంతం చేసేవారు. ఇంగ్లీష్ భాషా పరిచయం జరిగాక, ట్రాజెడీలు నచ్చడంతో దుఃఖాంతం కథలు వస్తున్నాయి. ‘ అయినా ప్రజల్ని ఏడిపించినంత సులువుగా నవ్వించలేం’ !
“ఇంత అస్వాభావికమైన కథలు రాయకపోతేనేం! ఎవడేడ్చాడు” అతను తీవ్రంగా అన్నాడు.
నిజమే కదా! ఆనాడే కాదు ఇప్పుడు కూడా రచయితలు – ముఖ్యంగా ‘అవార్డులు’ రావాలంటే బోలెడన్ని కష్టాలు రాసి, గుండెలవిసేలా, కన్నీరు ప్రవహించేలా రాస్తున్నార న్నది అసత్యం కాదనుకుంటాను. పరమ దుర్మార్గమో, రక్తపాతమో, హింస ధ్వంస రచనమో ఉంటేనే పత్రికలు వేసుకుంటాయి, పాఠకులు కన్నీటి పర్యంతం అవుతారు, మేధావులు ‘కళాత్మకం’ అని పొగుడుతారు – అనే అభిప్రాయం ఈనాటికీ ఉంది. పైగా సంపన్నులైన రచయితలు, ఏ.సీ. రూముల్లో, సుఖవంతమైన జీవనం గడుపుతూ ‘కటిక పేదల’ గురించి, తామేనాడూ అనుభవించని కడగళ్ళు గురించి రాయడం… న్యాయం కాదు. ధర్మం కాదు. నిజానికి నమ్మశక్యం కాదు. 1952 నాటికే ఇలాంటి అస్వాభావిక కథల తీరుతెన్నులు, కథకుల బాధ్యతా రాహిత్యం గురించి వేదుల మీనాక్షీదేవి ఇలా వ్యంగ్య ధోరణిలో కథ రాయడం ప్రశంసనీయం. అది కూడా, రచయిత్రి కథలో ప్రవేశించి, నినాదాలు చేయడమో, ప్రవచనాలు వల్లించడమో చేయకుండా – రచయిత్రి మాగన్నుగా నిద్రలోకి జారిపోతుండగా, తను రాసిన కథలో ఎంత అనౌచిత్యం ఉందో ఆత్మవిమర్శ చేసుకోవడం బాగుంది. కథలోని పాత్రే ప్రత్యక్షమై, తనకు అన్యాయం చేసావు అని రచయిత్రిని ప్రశ్నించడం ఆనాటికి నూతన కథా శిల్పమే.
శ్రీమతి వేదుల మీనాక్షీదేవి విరివిగా రాసిన కథల్లో ఈ కథ 30.7.52 లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైనది. “మానివేసిన కథ” లో అసంబద్ధమైన కథను రాయలేక రచయిత్రి ‘మానివేసింది’ అనీ, ఆమెకు మెలకువ వచ్చేసరికి ఆ అసంపూర్ణ కథ తాలూకు కాగితాలను పిల్లలు పడవలుగా తయారు చేసుకుంటున్నారనీ అనడం కొసమెరుపు. ఇలాంటి కథల పర్యవసానం ‘కాగితపు పడవలే ‘ అన్న రచయిత్రి అభిప్రాయం ఇప్పటికీ న్యాయబద్ధమైనదే.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)
