పేషంట్ చెప్పే కథలు – 21

చివరి మజిలీ

ఆలూరి విజయలక్ష్మి

          ముడతలుపడ్డ నల్లటి ముఖం, రెండు కనుబొమ్మల మధ్య విభూది, ఊపిరి తీసు కుంటున్న గుర్తుగా కదులుతున్న ఛాతి, అగరొత్తులు వాసన. కబుర్లు చెప్పుకుంటూ సరస్వతమ్మ మంచం చుట్టూ కూర్చున్న ఆమె కూతుళ్ళు, కోడలు, మనవరాళ్ళు, మనుమలు… విశాలంగా వుండే గది ఎంతో ఇరుకుగా ఉన్నట్లుంది. 

          ఎదురుగా నడవాలో కుర్చీలో పడుకున్నాడు సరస్వతమ్మ మామగారు రఘు రామయ్య. గాజు కళ్ళతో కోడలి వంక చూస్తున్న ఆ ముదివగ్గు గుండె భారంగా వుంది. తనెంత దురదృష్టవంతుడు! కన్న కొడుకు చేతుల్లో నిశ్చింతగా తనువు చాలించాల్సిన తనకు కడుపుశోకం మిగిల్చి నడివయసు దాటకుండానే కన్నుమూశాడు ఒక్కగానొక్క కొడుకు. కొడుకు మరణానికి గుండె బ్రద్దలైన తన భార్య కొద్ది రోజులు కూడా గడవకుండానే కొడుకును వేదుకుంటూ వెళ్ళిపోయింది. కాపురానికి వచ్చింది మొదలు తనను, తన భార్యను కడుపున పుట్టిన బిడ్డకంటే ఆప్యాయంగా చూసుకున్న కోడలిప్పుడు కొడిగట్టిన దీపంలా ఈ నిమిషంలోనో, మరునిమిషంలోనో ఆరిపోయేలా వుంది. తనమీద మాత్రం మృత్యుదేవతకు కనికరం లేకుండా వుంది… కోడలు పోయాక తన గతి అధోగతే. తనకి మనిషిగా విలువిచ్చి ప్రేమగా పలకరించడం మాట దేవుడెరుగు, రెండుపూటలా రెండు ముద్దలు విదిలిస్తారో లేదో కూడా అనుమానమే… కోడలు చనిపోతూందన్న దుఃఖంతో పాటు తన ముందు బ్రతుకెంత అద్వాన్నంగా గడుస్తుందోనన్న బెంగకూడా తోడయింది రఘురామయ్యకు.  

          “మహా దొడ్డయిల్లాలు. చేతికి ఎముక లేదు. చుట్టూ ప్రక్కల వాళ్ళందరికీ ఏ కష్ట మొచ్చినా నేనున్నానని నిలబడేది. భర్తపోయాక అందరి నక్కజిత్తుల్నీ కాచుకుని ఆస్థిని వృద్ధిచేసి నలుగురిచేత శభాష్ అనిపించుకుంది. బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసింది. ఆడ పిల్లల్ని మంచి ఇళ్ళల్లో యిచ్చింది” సరస్వతమ్మ గురించి చెపుతూంది ఎదురింటి మహాలక్ష్మమ్మ. 

          “చిన్నకొడుకు కోసం యింకా జీవుడు బొందిని విడవడం లేదు. ఆ ఢిల్లీ మహాపట్టణం నుంచి ఈ పల్లెటూరికి ఎప్పటికి చేరతాడో వాడు!” పయటచెంగుతో కళ్ళొత్తుకుంది సరస్వతమ్మ చెల్లెలు కాంతమ్మ. 

          డాక్టరమ్మ కోసం పట్నం వెళ్ళిన రామం కోసం అంతా ఆతృతగా ఎదురుచూడ సాగారు. అప్పటికి మూడు రోజులుగా స్పృహ లేకుండా పడున్న సరస్వతమ్మను చూడడానికి రోజూ వస్తూంది శృతి. 

          “ఆమె కండిషన్ అంత బాగాలేదు. ఫిజీషియన్ సలహా తీసుకుంటే మంచిది. హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం” అంది శృతి మొదటి రోజున సరస్వతమ్మను చూడగానే. 

          “మాకు మీ మీదే నమ్మకం. మీ చేయిపడితే చాలు అమ్మకి నయమయిపోతుంది” తానేమైనా ‘అమ్మా, బాబానా’ తన చెయ్యి పడగానే నయమయి పోతుందని వీళ్ళు భ్రమపడడానికి?! సరస్వతమ్మ కొడుకు మాటలు విని లోలోపల విసుక్కుంది శృతి. 

          “మీ కంటే బాగా మరో డాక్టరు, మరో డాక్టరూ చేస్తాడంటే నమ్మకం లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. శ్రమనుకోకుండా రోజూ వచ్చి చూడండి. ఆ పైన మా అదృష్టం” సరస్వతమ్మ పెద్ద కూతురు అందుకుంది. ఆమె మాటలకు వంత పలికేరామె చెల్లెళ్ళు. వాళ్ళది అమాయకత్వమనుకోవాలో, అతి తెలివనుకోవాలో అర్థం కాలేదు శృతికి. సరస్వతమ్మను తన కంటే ఫిజీషియన్ బాగా ట్రీట్ చెయ్యగలడనేది తనకు తెలుసు. పైగా కొన్ని పరీక్షలు చేయించాలి. వాటిని బట్టిగాని రోగ నిర్ధారణ చెయ్యడానికి వీల్లేదు. పేషెంట్ అనుక్షణం డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. రోజుకోసారి వచ్చి చూసి చేయగలిగేది కాదు. అదే వాళ్ళకు వివరించి నచ్చజెప్పాలని చూసింది శృతి. 

          “ఈ ఇంటికప్పు క్రిందే ప్రాణం విడవాలని అమ్మ కోరిక. అమ్మ కండిషన్ సీరియస్ గా ఉందని మీరే అంటున్నారు. మళ్ళీ హాస్పిటల్ కెందుకులెండి?” రామం మాటలు విని నొచ్చుకుంది శృతి. 

          “సీరియస్ గా వుంది కాబట్టే బ్రతికించడానికి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ప్రాణం పోయేంత వరకు బ్రతుకు గురించే ఆలోచించాలి కానీ, చావు గురించి కాదు” ఓర్పు తెచ్చిపెట్టుకుని వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నించింది శృతి. 

          గంటసేపు వాళ్ళతో మాట్లాడాక శృతికో కటువైన సత్యం బోధపడింది. ఎవరి సుఖం కోసం ఇన్నేళ్ళుగా సరస్వతమ్మ అహర్నిశలూ శ్రమించిందో వీళ్ళిప్పుడు ఆమె ప్రాణం నిలపడం కోసం డబ్బు ఖర్చు చెయ్యడానికి సిద్ధంగా లేరు. మరీ బొత్తిగా అలా వదిలేసి ఊరుకుంటే నలుగురూ నాలుగు మాటలంటారనే భయంతో టాక్సీ మీద తనను తీసు కొచ్చి చూపిస్తున్నారు తప్ప, ఆమెను బ్రతికించుకోవాలనే తపన వాళ్ళకు లేదు. తనను పిలవడం వెనుక ఉన్న అంతరార్థం బోధపడ్డాక మరురోజు రావడానికి శృతి మనసు ఎదురు తిరిగింది. కానీ, తనకు పరిచయమయినప్పటి నుంచీ తనకెంతో ఆదరం చూపిన సరస్వతమ్మకు ఆ మాత్రం చెయ్యడం తన నైతిక బాధ్యతగా భావించి రోజూ వస్తూంది. 

          శృతి అక్కడ ఉండగానే సరస్వతమ్మను ఇంటి వెనుక పాకలోకి తరలించితే మంచిదనే ఆలోచన వచ్చింది వాళ్ళకు. తర్జన భర్జన చేసి అందరూ ఆక్షేపిస్తారేమోననే సంశయంతో ఆగిపోయారు. 

          కారు హార్న్ వినిపించి అందరూ బిలబిలా ఎత్తు అరుగుల మీదకు వచ్చారు. శృతికి ఎదురెళ్ళి లోపలకు తీసుకొచ్చింది రామం భార్య. సరస్వతమ్మను పరీక్షచేసి, నర్స్ ని ఇంజక్షన్ తియ్యమని చెప్పి, పేషెంట్ పరిస్థితి యింకా దిగజారినందుకు విచారపడు తున్న శృతి గుసగుసలు వినిపించి ప్రక్కకు తిరిగింది. అక్కడున్న ఆడవాళ్ళందరికీ శృతి చేతిని ఉన్నా పగడాల గాజుల్ని చూపిస్తూంది సరస్వతమ్మ కూతురు. పార్టీకి వెళ్ళి రాగానే గాజుల్ని తీసెయ్యడం మరిచిపోయి పేషెంట్ దగ్గరకు వచ్చినందుకు కించ పడింది శృతి. 

          “మా అమ్మ గొలుసు, గాజులు, దుద్దులు కలిసి మొత్తం ముప్పై తులాలుంటుంది బంగారం. అది మా ముగ్గురక్కచెల్లెళ్ళకీ చెందేదే కదా! ఒక్కొక్కరికి పదేసి తులాలొస్తుంది. డాక్టరమ్మగారి గాజులించక్కా ముచ్చటగా వున్నాయి. ఇలాంటివి చేయించుకుంటాను” చిన్నగా చెప్తోంది సరస్వతమ్మ మూడో కూతురు. ఆమె మాటల్ని నివ్వెరపోయి వింటూం ది శృతి. వీళ్ళల్లో ఏ ఒక్కరికీ ఆవిడ మాట్లాడుతున్నా మాటలు అసమంజసంగా, పరమ దారుణంగా వున్నాయనిపించ లేదా? తెలిసో తెలియకో కన్నతల్లి మృత్యుశయ్య దగ్గర నిలబడి ఆవిడలా అంటూంటే తప్పని ఒక్కరూ మందలించరేం?… నిర్వికారంగా వింటూ, మామూలుగా మాట్లాడుకుంటున్న వాళ్ళ నుంచి చూపులు తిప్పుకుని మరోసారి సరస్వతమ్మను పరీక్ష చెయ్యడానికి స్టెత్ ని చేత్తో పట్టుకుంది శృతి. 

          “వదినా! రేపో, ఎల్లుండో బంగారమిస్తే అమ్మ దినం నాటికి చేసి యిస్తాడంటావా కంసాలి?” సరస్వతమ్మ కూతురి ప్రశ్న. శృతి చెయ్యి స్టెత్ మీద బిగుసుకుంది. 

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.