
చిత్రం-53
-గణేశ్వరరావు
ఫోటోగ్రఫీ అంటే కేవలం ఫోటోలు తీయడం కాదు, ‘అదొక సృజనాత్మక ప్రక్రియ, అనుభూతి.. అనుభవం, ప్రేరణ, ఉద్వేగం.. ఇది కళ, ఇది జీవితం! ఈ రకం ఫొటోగ్రఫీలో – ఆలోచన నుంచి ఆచరణ వరకూ అన్నిటినీ ఆస్వాదిస్తాను’ అంటాడు. మైకేల్. మైకేల్ డేవిడ్ ఆడమ్స్ న్యూ యార్క్ లో పేరు పొందిన ఫ్యాషన్ & ప్రకటనల ఫోటోగ్రాఫర్. అండర్ వాటర్ ఫోటోగ్రఫీలో ఆయన తర్వాతే మరెవరినైనా చెప్పుకోవాలి. ఆయన పద్ధతే వేరు. దీన్ని ఎవరూ నేర్పలేరు, పుట్టుకతోనే ఆ నైపుణ్యం రావాలి. నీటిలో మునిగి ఉన్నప్పుడు మనకి మన బరువు తెలీదు, నోట్లోంచి గాలి బుడగలు రాక తప్పదు. ఇలాటి అంశాల పైన అతను దృష్టి పెడతాడు. తను తీసే ఫోటోలలో అవి కనిపించవు. బదులుగా మనకు స్వప్న సుందరి కనిపిస్తుంది. ప్రకటనలకి అలాటి వాటి ఆవశ్యకత వుంది కదా! కవిత్వ సంకలనాలు..కథా సంకలనాల్లా .. ఫోటో సంకలనాలూ కూడా వున్నాయి. మైకేల్ తను తీసిన ఫోటో సిరీస్ కు పేరు పెడతాడు. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన ఫోటో, మైకేల్ ‘నీటిలో నా రాణి ‘ అన్న పేరు పెట్టిన సీరీస్ లోది. వీటిలో మెరిసిపోతున్న దుస్తుల్లో ఉన్న రూపదర్శిని రక రకాల భంగిమలో కనిపిస్తుంది, ఒక సారి పింగళి వర్ణించే ‘నీల మేఘమాలికలో మెరిసిపడే చంచలలా .. మురిపించే మిల మిలలా .. ఊహలోనే తళుకు మని మోహములో ముంచి వేసే ముద్దుగుమ్మలా .. సౌందర్య దేవతలా.. మరో సారి మండి పోతున్న మేఘాలా అన్న భ్రమ కలిగించేలా . మైకేల్ ఫోటోలలో ఉంటారు వాళ్ళు. చూపరులే వాటి అర్థాలను వెతుక్కోవాలి. ఈ ప్రక్రియలో మైకేల్ వాడే కెమేరాలూ, లెన్స్ లూ, ఆ వాతావరణం కనిపించడం కోసం అతను పడే శ్రమా, నేపథ్యంలోని నీటిని అంత నల్లగా చూపించే అతని ‘రీ టచింగ్’ నైపుణ్యాలను వివరించడం నా లాటి వారికి సాధ్యమా?*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
