
పండుటాకు పలవరింత
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– డా. సమ్మెట విజయ
వసంతం వచ్చేసింది
పూలవనం పానుపు వేసిందిగుత్తుల గుత్తుల పూలని చూసి
గతం తాలూకు గమ్మత్తులను
మనసు పదే పదే పలవరిస్తుంది
జ్ఞాపకాల హోరు నాలో నేనే
మాట్లాడుకునేలా చేయసాగాయి
చెవులు వినిపించక కంటి చూపు ఆనక
జీవన అవసాన దశలో ఉన్నాను నేను
కర్ర సాయం లేనిదే అడుగు ముందుకు పడటం లేదు
ఎప్పుడు పిలుపు వస్తుందా అని
ఆకాశం వేపు పదే పదే చూస్తున్న నేను
ఒకప్పుడు ఆకాశంలో విహరించిన అందాల పావురాన్నే
కాలు నేల మీద నిలపక వయ్యారంగా
నడకలు వేసిన నాట్య మయూరాన్నే
నలుగురినీ కలుపుకుని మాటల గలగలల సెలయేరునీ నేనే
పద్మరేకుల కళ్ళు పెదాల పై చెరగని నవ్వు
వెను తిరిగి చూస్తూ వెళ్ళే వారే అంతా
నేను కదలి వస్తే కనకాంబరాలు
పలకరిస్తే సుగంధ పరిమళాల మల్లెల గుభాళింపు
అంటూ నా మీద వర్ణనల వర్షం కురిపించేవారు
నాతో ఎంత పెద్ద సమూహం ..
నీకెప్పుడూ మనుషులు కావాలి
నీ చుట్టూ పెద్ద బలగమే నంటూ నవ్వే వారంతా
ఇప్పుడా నవ్వుల పువ్వులేవి
మాటల మకరందాలేవి
మనుషుల ఆనవాలేవి…
నన్నో మూలగదిలో పడేసి
నా మానాన నన్ను వదిలేసి
తప్పనిసరి పరిస్థితులలో ఓ ముద్ద పడేసి
నా దగ్గరకు ఎవరొచ్చినా
ఎక్కువ సమయం వెచ్చించనివ్వక
ముసలి తనానికి లేని రోగాలంటగట్టి
మాస్కులు తొడిగి చేతులు కడిగి
నన్నో అంటరానిదాన్ని చేసేసారు..
వీళ్ళ ఒళ్ళంతా రుద్ది రుద్ది కడిగి స్నానాలు పోసాను
తిప్పిచ్చి తిప్పిచ్చి తంటాలు పెట్టినా
వెంటపడి నోట్లో ముద్దలు పెట్టాను
చేయి కడిగాక తుడుచుకునే కొంగు ఆనాడు ఆనందమైంది
ఈనాడు బతుకుపోరాటంలో పనికి రాని గుడ్డపీలికైంది
నేడు ..నేనొక ఒంటరి పక్షిని ..
ఒక్క పలకరింపు కోసం పడిగాపులు కాసే ఎండమావిని
ఏ చల్లని సమీరం నా దరికి రాదు
వాడిన జీవితపు పండుటాకును కదా
ఎప్పుడు రాలిపోతుందా అని ఎదురు చూసే వారే అంతా
ఎన్ని ప్రేమలు ఎంత మమకారం
నేనల్లుకున్న బంధనాల భావనలన్నీ బూటకాలై
నన్ను వెక్కిరిస్తున్నాయి..
అవసరం కోసం ఏర్పరచుకున్న ప్లాస్టిక్ ప్రేమలు
రంగు విహీనమై రేకలు ఊడిన కాడలయ్యాయి
ఇంతచేసి బతుకు మీద ఆశే
మనిషి పుట్టుక కదా …
అందరి పై ప్రేమా ఆరాటం చావదే
ఏ పలకరింపుకోసమో గుండె పలవరింత
ఏదేదో ఎవరెవరికో చెప్పాలనే ఆరాటమే
వినేవారెవరైనా ఉన్నారా
వింటున్నారా … సమాధానం శూన్యం
దీపం కొడిగట్టుతుంది
వెలుగు తాలుకు రేకలు ముసిమి వయసు పెదాల పై
చెరగని ముద్రలై పరుచుకున్నాయి
బంధాలు అనుబంధాలు కంటి పొరల మధ్య మసకబారుతున్నాయి
ఎవరితో మాట్లాడుతుందో అనుకుని తొంగి చూసాక తెలిసింది
ఆమె మరణంతో మాట్లాడుతుందని ..
*****

డా..సమ్మెట విజయ కవయిత్రి , రచయిత్రి, పరిశోధకురాలు, ఉపాధ్యాయురాలు. రైల్వే మిశ్రమోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సమ్మెట విజయ అనేక వ్యాసాలు, కవితలు, కథలు పరిశోధనా పత్రాలు రచించారు. ఎం .ఏ, పిజి డిప్లమ ( పబ్లిక్ రిలేషన్స్ ) , ఎం.ఫిల్, ఎం . ఎడ్ , పి. హెచ్ డి విద్యార్హతలు. ఉద్యోగం : మిశ్రమోన్నత పాఠశాలలో హైదరాబాద్ లోని సౌత్ లాలాగూడలో సీనియర్ టిజిటి గా పని చేస్తున్నారు.
రచనలు: • . తెలుగులో నాటకరచన-1991-2000 ( పరిశోధన గ్రంథం) • భావనాంజలి -కవితా సంపుటి • బడే నా లోకం ( నవల ) • అనుటెక్స్ శ్రీ పులవర్తి రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర (జీవిత చరిత్ర ) • తెర వెనుక (నాటక రంగం)/ • ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి , వనిత, భూమిక, అభినయ పత్రికలలో వ్యాసాలు అక్షరయాన్ లో : అక్షరయాన్ మహిళా రచయిత్రుల వేదిక ఉపాధ్యక్షురాలిగా వివిధ సాహితీ కార్యక్రమాల నిర్వహణ. ఆకాశవాణిలో : • హైదరాబాద్ యువవాణి లో , హైదరాబాద్ బి కేంద్రంలో ప్రసంగాలు చేసారు. • ఆదిలాబాద్ లోకల్ రేడియో స్టేషన్ లో కాజువల్ అనౌన్సర్ గా పనిచేస్తూ అనేక కార్యక్రమాలు చేసారు. ఉపాధ్యాయినిగా : • తెలుగు బోధిస్తూ విద్యార్థులను వక్తృత్వ , వ్యాస రచన , పాటలు , సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రతిభను పెంచేందుకు కృషి చేసారు. తాను కవితలు రాస్తూ విద్యార్థులకు సాహిత్యాన్ని పరిచయం చేసారు.
