
రథసారథులు
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– శింగరాజు శ్రీనివాసరావు
పంచాక్షరి దిద్దవలసిన వయసున పరక చేతికిచ్చి
పనిమనిషి పనికి అక్షరాభ్యాసము చేసిననాడు
“పలక నాకు పనికిరాదా” అన్నపలుకు పలకనేలేదు
మగవాడి మొలతాడును పురిపెట్టి పసుపుతాడును పేని
మెడకు ఉరిబిగించి మరబొమ్మను చేసి ఆడించినా
మూగగా రోదించినదే తప్ప నోరుమెదప లేదు
పేగుల దారాలు లక్ష్మణరేఖను అడ్డుగా గీస్తే
బక్కచిక్కిన మనిషి మీద ఆకలి చీకటి హాహాకారం చేస్తే
శబ్దంలేని ఉరుము గుండెల్లోనే ఆగిపోయింది
తాటాకు చాపమీద వేడుక ఛాయలు తప్ప
కనకపుసింహాసనాన్ని ఎక్కించిన దాఖలాలు లేవు
మహిళాదినోత్సవాన అందించిన అవార్డు చెక్కలు తప్ప
మాటవరసకైనా ఆమె మాట ఆలకించిన క్షణాలులేవు
వానచుక్కరాలని బీడుభూమి గుండెలతో ఎన్నాళ్ళు?
చావుదెబ్బలు తినే చాకిరేవుబండలా ఇంకా ఎంతకాలం?
సుడిగుండాలు దాచుకున్న సంద్రపు సునామీ మీలోపొంగే దెపుడు?
ఎడారిరేవులో ఎదలు పులకించే పూలగాలి వీచే దెపుడు?
అంతరంగపు ఘోష ఆకాశవాణి గళమై మ్రోగాలి
ఆదరించే చేతులు సాధికారతకై పిడికిలి బిగించాలి
తమ తలరాతలను తామే మార్చుకునేలా తరుణులు కదలాలి
నవచైతన్య రథానికి నారీమణులే రథసారథులు కావాలి
*****

నేను భారతీయ స్టేట్‌బ్యాంకులో డిప్యూటిమేనేజరుగా బాధ్యతలు నిర్వహించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో 2016 సంవత్సరం నుంచి కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవితను మరియు మొదటి కథను ప్రచురించినది “ఆంధ్రభూమి వారపత్రిక”. మొదటిసారిగా “నేలతల్లి” కథకు ఆంధ్రభూమి దినపత్రికలో ద్వితీయ బహుమతి లభించింది. ఇప్పటి వరకు సుమారు 50 కథల పైగా వివిధ వార, మాస పత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. అందులో 20 కథలకు బహుమతులు లభించాయి. రెండు వందల వరకు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 30 కవితల వరకు బహుమతులు పొందాయి.
