
అమ్మ
(అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం)
-వి.విజయకుమార్
గర్భస్రావాలు నిన్ను మరవనివ్వవు
చేతికందినట్లే అంది, చేజారిన బిడ్డల జ్ఞాపకాల తలపులు మరపురానివ్వవు,
పిసరంతో, అసలెంతో లేని జుత్తుతో తడియారని మాంసపు ముద్దలవి,
గాయకులో, శ్రామికులో ఎప్పటికీ శ్వాసించని వారు.
నువ్వెప్పటికీ దండించలేని వాళ్ళు, అలక్ష్యం చెయ్యని వాళ్ళు
మిఠాయిలిచ్చి ఊరుకోబెట్టనూ లేవు.
చీకే వారి బొటనివేలి చుట్టూ ఎప్పటికీ ఒక పట్టీని కూడా చుట్టలేవు
వొచ్చే దయ్యాల్ని తరిమేయనూ లేవు.
గాఢమైన నిట్టూర్పులు నియంత్రించుకుంటూ,
వారినెప్పటికీ వదిలేసి వుండనూ లేవు,
ఏ చిరుతిండినో ఆప్యాయంగా అమ్మప్రేమ రంగరించి
తిరిగివ్వనూ లేవు.
వీచేగాలి సవ్వడుల్లో ఆకృతి దాల్చకుండానే
కడతేరిపోయిన నా బిడ్డల స్వరాల్ని నేను వింటున్నాను.
కృశిస్తూ, వ్యాకోచిస్తూ,
ఎప్పటికీ పాలిచ్చుకోలేని ఈ పాలిండ్లపైన
నా రూపుదాల్చని ప్రియతమ బిడ్డల్ని తడుముకొంటున్నాను.
నాలో నేను చెప్పుకుంటాను, ఓ నా పసికందుల్లారా, నేను పాపం చేస్తే గనుక,
మీ అదృష్టాన్ని నేను కబళిస్తే గనుక,
గమ్యానికి చేరకమునుపే, అర్ధాంతరంగా మీ జీవితాన్ని దోచేస్తే గనక,
మీ పుట్టుకల్నీ, మీ పేర్లనీ నేను దొంగిలిస్తే గనక,
మీ ఆటల్నీ, మీ పసి కన్నీటి మూటల్నీ,
మీ అనురాగాల్నీ, మీ అమూల్య ప్రేమల్నీ, మీ దొమ్మీల్నీ
మీ పెళ్ళిళ్ళనీ, మీ బాధల్నీ, మీ మరణాల్నీ,
ఒకవేళ, యింకా పీల్చని మీ తొలి శ్వాసల్ని నేను విషపూరితం చేసుంటే గనక,
నమ్మండి నా పసికూనల్లారా,
నా ఇచ్ఛా పూరిత సమ్మతిలో సైతం,
నిజానికి నేను స్వేచ్ఛగా లేనప్పుడే.
అయినా మరి ఎందుకీ తీరని వేదన నాకు,
ఈ నేరం నాది కాక మరెవరిదో నన్న ఆవేదనా?
ఎలాగూ మీరు కడతేరిపోయారు కాబట్టా,
అయినా మీరు,
ఎప్పటికీ ఆకృతి దాల్చినట్టు కాదుగా.
ఇంకా చెప్పాలంటే బహుశా మీరు అపరిపక్వ రూపాలేగా
ఓహ్! ఏం చెప్పాలి, నిజమెలా చెప్పాలి?
జన్మించారు మీరు, శరీరముంది మీకు, కడతేరి పోయారు మీరు
ఇంకా, చిరునవ్వు చిందక మునుపే, అలా అనుకోక మునుపే, ఏడవక మునుపే.
నమ్మండి నన్ను, మిమ్మల్నందర్నీ ప్రేమించాన్నేను.
విశ్వసించండి నన్ను, కొంత అస్పష్టంగా నైనా, నేను మిమ్మల్ని ఎరుగుదును,
మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్నందర్నీ ప్రేమించాన్నేను.
*****

నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.
