
ఉయ్యాల్లో టెర్రరిస్ట్
-వి.విజయకుమార్
ష్…పారా హుషార్
వీడు మామూలోడు కాడు
పనిపిల్ల బుగ్గ కొరికిన
కీచకుడు
పక్కింటి పిల్ల
కొంగు లాగిన దుశ్శాసనుడు
తాత మొహాన్నే ఫెడీల్ మని
తన్నిన కర్కోటకుడు!
సాధించుకోవడం
ఎలానో ఎరిగిన కిమ్ వాడు
లేస్తూనే జాకీ చానై
కిక్ బాక్సింగ్ మొదలెడతాడు
చిట్టి రాముడై శరాలు సంధిస్తూ
యుద్ధానికి సిద్ధమంటాడు
ఎడం కాలితో
భూగోళాన్నీ
కుడికాలితో
చందురుడ్ని
అలవోకగా తంతూ
వళ్ళు విరుచుకుంటాడు
మోనార్క్ నంటూ
విర్ర వీగుతాడు
బజ్జున్నప్పుడే
వీడు రారాజు
లేచాడా
ప్రాథమిక హక్కులన్నీ
పారా హుషార్!
వీడు సౌండ్ ఇంజనీర్
జాగ్రత్తగా మసలకపోతే
తస్మాత్ జాగ్రత్త!
లేస్తూనే
ఇంట్లో అందరూ ఎలర్ట్
కెవ్వు మంటే
వరండాలో తాత
ఉలిక్కిపడాలి
అవ్వ ఎటెన్షనవ్వాలి
బడికి రెడీ అయ్యే అక్క
ఆగాలి
మగత నిద్దర కూడా
కరువైన అమ్మ
మంచం దూకి రావాలి
పనిలో వున్న నాన్న
ఎగిరి గెంతుకు వచ్చి వాలాలి
గిన్నెలు తోమే పనమ్మాయి
వచ్చి చేతులుకట్టుకు
నిలబడాలి
అమ్మో వీడు
నిర్దయుడు
ఉయ్యాల నుంచే
శాశించే ముస్సోలినీ వీడు
గుండెల్లో నిద్దర పోయే
హిట్లర్ గాడు
అయితేనేం
వాడి బోసినవ్వు కోసం
యావత్తూ
సామ్రాజ్యమే క్యూ కడుతుంది
వాడు క్రీగంట చూపు విసిరితే
జగత్తే ఫిదా అవుతుంది
కంట నీరు
ఒలికితే మాత్రం లోకం
శోకమే అవుతుంది.
*****

నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.
