
అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
-సింగరాజు రమాదేవి
విషాదమేమీ ఉదాత్తమైన భావన కాదు!
దాన్ని అర్ధం చేసుకుని అధిగమించేందుకు
చేసే ప్రయాసలోనే ఉంది ఉదాత్తత!
పిరికితనం నేరమేమీ కాదు!
భయపడుతూ అయినా చేసే తిరుగుబాటు
ప్రయత్నంలోనే దాగి ఉంది ధీరత్వం!
నిరంతరం ఒకరి నీడలో, బేలగా
పరాధీనగా బ్రతికితే అంతా ప్రశాంతమే!
జీవితపు ఉపరితలం పై అలవోకగా
ఆనీ ఆనకుండా అడుగులేస్తుంటే
అంతా నునుపే!
గుండెలనిండా ఊపిరిపీల్చుకుని
బలంగా కాలు మోపితేనే కదా…తెలిసేది
నిల్చున్నది గట్టి నేలా…
విరిగిపోయి బుడుంగున మునిగిపోయే
మంచు ముక్కా.. అన్న నిజం!
తామరాకు మీద నీటిబొట్టులా
తాకిన దేన్ని తడపకుండా
జారిపోవటం గొప్పేమీ కాదు!
తాను కొంత తడిసి..కొందరి జీవితాల్లోని
కొన్ని క్షణాలనైనా చెమ్మ చేస్తేనే
కదా అస్థిత్వపు అసలు అర్ధం!
*****

పేరు : సింగరాజు రమాదేవి ఊరు : వరంగల్, తెలంగాణా వృత్తి : ఎల్.ఐ.సి ఆఫ్ ఇండియా లో సాహిత్యం, సినిమాలు ఇష్టం. పాత తెలుగు హిందీ సినిమా పాటలు ప్రాణం. 1999 నుండి అనేక ప్రముఖ దిన,వార,మాస పత్రికలలో,అంతర్జాలంలో కథలు, కవితలు, వ్యాసాలు, అనువాద కథల ప్రచురణ.పలు కథలు, కవితలకు పోటీలలో బహుమతులు.పలు నాటకాలు, గేయాల రచన. *ఆగస్ట్ 2014 లొ కధా సంపుటి ’ఒక పరిచయం… ఒక పరిమళం’ విడుదల.
