
ఏమి జంతువది
అస్సామీ మూలం & ఆంగ్లానువాదం: నీలిమ్ కుమార్
తెలుగు సేత: వారాల ఆనంద్
ఏమి జంతువది
దాని ఆకలి ఎంతకూ తీరదు
అసలే తృప్తి చెందదు
దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది
ఎంత ఆహారం కావాల్నో దానికే తెలవదు
ఆ సర్వభక్షకుడి పేరేమిటి
భూమి ఇండ్లు వంతెనలు
చెరువులు కుంటలు చెట్లు
నదుల రెండు తీరాలు
అది వేటినీ వదల్లేదు
ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న
ఆ జంతువేమీటది
ఎల్లవేళలా ఆకలితోనే వుంటుంది
వార్తా పత్రికల్ని టీవీ ఛానళ్ళనీ
వారి పొలాల్ని పర్వతాల్నీ తోటల్నీ
ప్రజల కలల్నీ
చిరునవ్వుతో మింగేస్తుంది
దాని కుటుంబం మొత్తం
ఆకలితో దొర్లుతుంది
ఏమి జంతువది
ఎంతకూ తృప్తి చెందని ఆకలి దానిది
దాని కడుపులోని ఆకలి దానికే అర్థంకాదు
ప్రమాదకరమయిన దాని ఆకలి అంతం కావాలనీ
దాని కడుపులో వున్న మంట చల్లారాలనీ
అందరూ దాని కోసం ప్రార్థించండి
ఓ నిట్టూర్పు విడిచి
ఇక అందరూ ఉపశమనం పొందనీ
*****

వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు.
రచనలు-
లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం), ముక్తకాలు(చిన్న కవితలు)
అర్థవంతమయిన ‘సినిమా’ల పై పుస్తకాలు- నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, సినీ సుమాలు , 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణాలో చలన చిత్రం,
తెలంగాణ సినిమా దశ దిశ, Signature of Love(poetry), Children’s Cinema, Documentary films made-
తెలంగాణా సాహితీ మూర్తులు: ముద్దసాని రాంరెడ్డి, యాది సదాశివ,
శివపార్వతులు, Long Battle with short messages,
A Ray of Hope, KAFISO a saga of film lovers.
