అనుసృజన

సూఫీ కవిత్వం

అనుసృజన: ఆర్ శాంతసుందరి

          ఒక సూఫీ వేదాంతి, జ్ఞానవృక్షం ఫలం తిన్న వారికి జనన మరణాలు ఉండవని చెప్పగానే, దాన్ని వెతకడానికి ఒకడు బయలుదేరుతాడు. అదెక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి ఒక యోగి ‘అది జ్ఞానిలోనే పెరుగుతుంది, పేరును బట్టి, రూపాన్ని బట్టి వెతికితే దొరకదు. గుణగుణాలను బట్టి వెతుకు,’ అని సలహా ఇస్తాడు. సూఫీ వేదాంతి అయినా, జెన్ వేదాంతి అయినా, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అయినా – వారందరూ అనేది ఒక్కటే: ‘నిన్ను నువ్వు తెలుసుకో!’
          కాగా అందరూ అన్వేషకులే! మతాన్ని అనుసరించేవారు దేవుని చేరే మార్గాలు వెతుకుతుంటారు. బుద్ధి జీవులకు ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. పి సత్యవతి కథలోని ఇల్లాలు తన పేరు మర్చిపోతుంది, స్త్రీ అస్తిత్వ వేదనకు ఇదొక ఉదాహరణ. ఇక ముస్లిం కవులు – ఖాజా, స్కైబాబా ఇత్యాదులు తమ మూలాలు వెతుకుతూ ఉంటారు. అమెరికన్ నాటక రచయిత O’Neill నాటకం ‘Hairy Ape ‘ లో ఒక శ్రామికుడు ధనిక ప్రపంచంలో తన స్థానం ఏమిటో వెతుక్కుంటాడు. ఆంగ్ల కవి Auden ఈ identity crisis నే తన కవిత Unknown Citizen లో వ్యక్తీకరిస్తాడు.
          సాహిత్య అకాడమీ గ్రహీత, కవి పాపినేని శివశంకర్ కూడా వీళ్లందరిలా అన్వేషి. పి సత్యవతి కథలోని ఇల్లాలు లా – తన కవితా సంపుటి ‘రజనీగంధ ‘ లో – ఇల్లలుకుతూ ఒక ఈగ / తన పేరు మర్చిపోయింది / పేరు మర్చిపోవడానికి ఈగే కానక్కరలేదు’ … ‘నిజానికి పుట్టినప్పటి నుంచి / ఒక పేరు కోసమే వెతుకుతున్నా ‘ అంటాడు.
          తను తన పేరు తెలుసుకున్నా, ఏ సంబోధనా తనని బంధించలేదని అనుకుంటాడు. ఎందుకంటే అది అసలు పేరు కాదు. ‘నిజానికి ఎవరి పేరు వారు గుర్తించటమే జీవితం/ మనుషుల అడవుల్లో మసలాను / అటవీ సముద్రాల్లో అలనయ్యాను /సముద్రపుటెడారుల్లో బిడారునయ్యాను /ప్రతి ప్రాణి ముంగిట సోక్రటీసులా / కాగడా పెట్టి వెతికాను.. చివరికి ఈగ తన పేరు కనుగొన్నది / అట్లాగే ఈ మనిషి .. ఇప్పటి నా పేరు / అన్వేషి’ అని ముగిస్తారు . ఒక సత్యాన్వేషకుడిగా జీవన సత్యాన్ని ఆవిష్కరిస్తారు . అతని అన్వేషణ ముందు – తనైక తాను గాను పరిణమించింది. మనిషిని ఆవరించి ఉండే అజ్ఞానం విచ్చేదం చేసిన మహానుభావులంతా కుల మత జాతి భేదాలు అధిగమించినవారే! సోక్రటీస్ ‘నేను అథినియా కు చెందిన వాణ్ని కాదు, గ్రీకు దేశస్థుడుని కాదు, నేను మానవుడిని ‘ అంటాడు. అన్వేషణ – పాపినేని కవిత్వంగా నేటికీ సాగుతూ వస్తోంది. భేదభావాలని అతిక్రమించిన స్థితికి ఈ కవితలో చేరుకుంటాడు కవి. అదే అతని చిరునామా. ఈ కవిత పాపినేని మేనిఫెస్టో!
          హిందీలోకి నేను అనువదించిన ఈ కవితను సాహిత్య అకాడమీ పత్రిక ప్రచురించింది. పైన ఉదహరించిన పంక్తుల సౌందర్యం అనువాదంలో ఎలా వచ్చాయో చూడండి:
सच पूछो तो / अपना नाम पहचानना ही है असली जीवन/लोगों के जंगल में घूमा / जंगल के सागर में / कारवां बना सागर के रेगिस्तान में बादल बना रेगिस्तान के आसमान में / हर प्राणी की चौखट पर / मशाल लेकर तलाशा सुकरात की तरह आखिर मक्खी को मिल गया अपना नाम / उसी तरह यह इंसान। …/ अब मेरा नाम है /अन्वेषी

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.