నా జీవన యానంలో- రెండవభాగం- 53

-కె.వరలక్ష్మి

          ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. ఫ్రాంక్ ఫర్ట్ లో దిగేక రెస్ట్ రూం లో బ్రష్ చేసుకుని రిఫ్రెష్షై వెయిటింగ్ లాంజ్ లో కొచ్చి కూర్చున్నాను. నాకు ఎస్కలేటరంటే భయం అంటే అక్కడి టాప్ లెస్ ఎలక్ట్రిక్ జీప్లో ఎక్కించుకుని, జీప్తో బాటు కిందికి దిగి (లిఫ్ట్ లో) గేట్ నెం. బి22 లో కూర్చోబెట్టి వెళ్లింది డ్రైవరు. పర్స్ లో ఉన్న సీనావాళ్లమ్మ ఇచ్చిన బ్రెడ్ పీస్ తింటూంటే పక్కనే ఉన్న నార్తిండియన్ (అహమ్మదాబాద్) పెద్దావిడ ఒక పెద్దసైజు దాల్ రోటీ ఇచ్చింది, అది తిన్నాక ప్రాణం లేచొచ్చింది, కాని, దాహం వేసింది. నీళ్లు దొరకలేదు. రాత్రి 1.25 కి ఫ్లైట్ ఎక్కగానే కడుపునిండా నీళ్లు తాగేసి సీట్ నెం. 49డి లో కెళ్లి సెటిలై హాయిగా నిద్రపోయాను. ఇది కూడా మధ్యవరసలో సీటే. డిన్నర్ టైంకి లేపి నాన్ వెజ్ ట్రే అంటూ ఒక పెద్ద ఫ్రైడ్ చికెన్ ముక్క ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. అది తిని మళ్లీ నిద్రపోయాను. రాత్రి ఇండియన్ టైం 1.30 కి ఫ్లైట్ ముంబై ఆకాశంలో చాలాసార్లు చక్కర్లు కొట్టి చివరికి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. నాకు తలంతా దిమ్ముగా అయిపోయి విపరీతమైన తలనొప్పి ప్రారంభమైంది. చాలా నీరసంగా అన్పించింది. ఫ్లైట్ లో బ్రెడ్ పేకెట్స్ సర్వ్ చేసేరు. తినబుద్ధికాలేదు. దాంతో ఆకలి ఒకటి. బోర్డింగ్ పాస్ చెక్ చేసిన చోట బెల్ట్ మీది నుంచి సూట్ కేసులు తీసుకుని, పట్టుకుని వెళ్లి డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లో హైద్రాబాద్ కి వెళ్లాల్సిన కింగ్ ఫిషర్ ఫ్లైట్ ఎక్కమని చెప్పేరు. నాకేమో అసలు బెల్ట్ మీది నుంచి సూట్ కేసులు ఎలా తియ్యాలో అర్థం కాలేదు. బి.పి. పెరిగి పోయింది. అక్కడి పోర్టర్లు మూడొందలు ఇవ్వండి, రెండొందలు ఇవ్వండి అని బేరాలు మొదలు పెట్టేరు. నా పర్స్లో అసలు డబ్బులు లేవు. మొత్తానికి నేనే ఎవర్నో హెల్స్ అడిగి బెల్ట్ మీది నుంచి సూట్ కేసులు దించి, ట్రాలీమీద లగేజి పెట్టుకుని ఆ చివరెక్కడో ఉన్న బస్ స్టాప్ కి (మధ్యలో బోలెడన్ని చెకింగులు) వెళ్లి బస్సెక్కడం, ఆ బస్సు మలుపులు తిరిగీ తిరిగీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ చేరడం, మళ్లీ చెకింగులు, మెట్లు – ఎస్కలేటర్లు ఎక్కిదిగడం, చివరికి సూట్ కేసులు కింగ్ ఫిషర్ వాళ్లకి అప్పగించి ‘‘హమ్మయ్య’’ అని నిట్టూర్చేను. సెల్ ఫోన్ స్విచాన్ చేసినా అది యాక్టివేట్ కాలేదు. వెయిటింగ్ టైం ముగిసేక ఫ్లైట్ లోకి ఎలవ్ చేసేరు. ఉదయం 6.20 కి కదలవలసిన ఫ్లైట్ 8.30 కి కదిలి, 9.40 కి హైదరాబాద్ చేరుకుంది. మా అబ్బాయి, కోడలు బైట ఎదురు చూస్తున్నారు. ఇంటికి చేరేసరికి పన్నెండు కావచ్చింది. దారంతా ఒక మార్పులేని అస్తవ్యస్తంగా నడుస్తున్న దేశాన్ని, మనుషుల్ని చూస్తున్న ఒక చికాకు, అసహనం, ఆవేదన – ఇక్కడి సౌండ్స్ భరించలేకపోతున్న చెవులు – ఒక అయోమయ పరిస్థితి. సాయంకాలానికి నిద్ర ఆగలేదు. అర్థరాత్రి మెలకువొచ్చి రాత్రంతా అనిద్ర… ఆకలి… గీతలాగా నా పరిస్థితిని, జెట్ లాగ్ నీ అర్థంచేసుకునేవాళ్లు లేరు ఇక్కడ. ఏం కావాలో తీసుకునేంత చనువూ లేదిక్కడ.

          వచ్చిన రెండో రోజునే తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న ‘కథతో ఒకరోజు’ కార్యక్రమానికి వెళ్లేను. సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకూ ఇంచుమించు తెలుగు రచయితలంతా అటెండయ్యారు. నన్ను తెలిసిన వాళ్లంతా వచ్చి పలకరించేరు. సాయంత్రం వరకూ అందరి ప్రశంసాపూర్వకమైన చూపులు, ఆత్మీయతలతో మనసు నిండిపోయింది. మధ్యాహ్నం భోజనం చేస్తూండగా జెట్ లాగ్ తన ప్రభావం చూపించింది. అనుకోని అనీజీనెస్ ఆవరించి కళ్లు తిరిగి, నేలమీద చతికిలపడిపోయాను. కొంత తేరుకున్నాక ప్లేటు అక్కడ పడేసి ఆడిటోరియంలోని ఫేను కిందకొచ్చిపడ్డాను. కనీసం రెండు గంటలు ఇబ్బంది పడి తేరుకున్నాను.

          నవంబరు 24 న ముఖ్యమంత్రి రోశయ్య చేత రాజీనామా చేయించింది కేంద్రం.

          డిశంబర్ 9 ఉదయానికి జగ్గంపేటలోని నా ఇంటికి చేరుకున్నాను, ఇంచుమించు 8 నెలల పాటు ఇంట్లో లేకపోవడం ఇదే మొదటిసారి. 

2010 లో పత్రికలలో నా కథలు ఈ క్రింది క్రమంలో వచ్చాయి-

6.1.10 నవ్య వీక్లీలో ‘కలకానిది –విలువైనది’ కథ-

2010 జనవరి చినుకు మంత్లీలో ‘విముక్త’ కథ-

14.2.10 ఆదివారం వార్తలో ‘మార్పు’ కథ-

14.2.10 ఆదివారం ఆంధ్రజ్యోతి నవ్యలో ‘జాలిలేని జాబిలి’ స్కెచ్-

7.3.10 ఆదివారం ఆంధ్రభూమిలో ‘సహచరి’ కథ-

ఏప్రిల్ 2010 ‘కథ’ మలయాళ మాసపత్రికలో రాజీవ్ అనువదించిన ‘కలకానిది-విలువైనది’ కి అనువాదం ‘ఆశ్వసతింటే తీరథు’ కథ-

జూలై 2010 పాలపిట్టలో ‘ఎక్కడికీ ప్రస్థానం?’ కవిత-

16.6.2010 నవ్యవీక్లీలో ‘కథకు నీరాజనం’ శీర్షికలో నా ఇంటర్వ్యూ –

6.12.10 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ‘గాలిపటం’ కథ-

15.12.10 నవ్య వీక్లీలో ‘వెనక్కి నడుస్తున్నామా?’ కథ-

జూలై 2010 స్థానిక పాలన లో ‘విముక్త’ కథ రీప్రింట్-

జనవరి 2010 ‘కథాబింబ్’ హిందీ పత్రికలో ‘మున్నీ’ (పాప) కథ-

డిశంబర్ 2010 ముంబైవన్ లో ‘కాలిఫోర్నియాలో కథాభిమానులు’ వ్యాసం-

          నేను వచ్చేసిన తర్వాత మా గీత నా పైన రాసిన అద్భుతమైన పోయెమ్ ఆంద్రజ్యోతిలో వచ్చి కన్నీళ్లు తెప్పించింది. అంతమంచి ఆలోచన ఎవరికొచ్చిందోకాని, ‘కథకు నీరాజనం’ శీర్షికన గుర్తింపు పొందిన రచయితల ఫోటోలతో, వాళ్లకు నచ్చిన ఒక కథతో నవ్యవీక్లీ చేసి, ప్రచురించిన ఇంటర్వ్యూలు చాలా సక్సెస్ అయ్యాయి.

          రచయితలకు మరింత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి, అలా నేను అమెరికాలో ఉండగా వచ్చిన ఇంటర్వ్యూ చూసిన చాలా మంది రాసిన ఉత్తరాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. కొందరికి ఫోన్ల ద్వారాను, కొందరికి ఉత్తరాల ద్వారానూ కృతజ్ఞతలు చెప్పుకొన్నాను. తర్వాత, 2013 లో అలా వచ్చిన ఇంటర్వ్యూల నుంచి 50 మందివి ఎంచి జగన్నాథశర్మగారి సంపాదకత్వంలో అమరావతి పబ్లికేషన్స్ తరఫున వల్లూరు శివప్రసాద్ గారు 680 పేజీల పుస్తకాన్ని తెచ్చారు. ఆ పుస్తకంలో నా ఇంటర్వ్యూ కూడా ఉండడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ పుస్తకం వచ్చాక తెలిసింది. ఆ ఆలోచన ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణగారిదని.

          2011 జనవరి 10 న మా అబ్బాయి, కోడలు, పిల్లలు వచ్చి నన్ను వాళ్ల కారులో ఎక్కించుకున్నారు. దారిలో చిన్న చిన్న కొండలు, గుట్టలు చూసుకుంటూ రాత్రికి సింహాచలంలో ఉన్న మా పెద్ద ఆడపడుచుగారింటికి చేరుకున్నాం. ఆ మర్నాడు సాయంకాలం విశాఖపట్నం ఆర్.కె. బీచ్ లో చాలాసేపు గడిపి, ఇంకా కొన్ని బీచ్ లు చూసుకుంటూ ఓల్డ్ టౌన్ మీదుగా పోర్టుయార్డు చూసుకుంటూ గాజువాక మీదుగా సింహాచలం తిరిగొచ్చాం. ఆ మర్నాడు ఉదయాన్నే చుట్టాల్తోబాటు బయలుదేరి ఉత్తరానికి ప్రయాణిస్తూ ముందుగా దంతపురి వెళ్లేం. అక్కడున్న పురాతన బౌద్ధారామాన్ని బుద్ధుడి దంతం ఉంచి నిర్మించారని ప్రతీతి. అక్కడ పొలాల్లో ఒకచోట తవ్వకాల్లో బైట పడిన బుద్ధ విగ్రహం నిలబెట్టి ఉంది. దానికి స్టేండ్ గా ఏర్పాటు చేసిన మార్బుల్ రాళ్లు ఎవరో ఎత్తుకుపోయారట. అదీ మన సంస్కారం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే దానికి ప్రభుత్వంవారు చూపించిన ఖర్చు 2 కోట్లు. అక్కడి నుంచి ప్రాచీన శ్రీముఖ లింగం వెళ్లి అక్కడి ఆలయ సముదాయం చూసాం. చిన్న చిన్న ఊళ్లమీదుగా ప్రయాణిస్తూ వంశధార నది వొడ్డున ఉన్న ఒకప్పటి పెద్ద బౌద్ధారామం శాలిహుండం చూసి, ఇంటి దగ్గర్నుంచి పట్టుకెళ్లిన పదార్థాలతో భోజనాలు చేసాం. పురావస్తుశాల చూసాం. దగ్గర్లోనే ఉన్న కళింగ పట్నం బీచ్ మా అందరికీ చాలా నచ్చింది. వంశధార సముద్రంలో కలుస్తున్న చోటు అది. వొడ్డున లక్షలకొద్దీ నత్తలు, ఎర్రపీతలు తమదే సామ్రాజ్యం అన్నట్టు తిరుగుతున్నాయి. అలికిడైతే చాలు గబగబా బొరియల్లో దూరిపోయే పీతల్ని చూడడం ఒక మరపురాని దృశ్యం. చాలా సేపు అక్కడే ఇసుకలో నడుస్తూ ఉండిపోయాం. సాయంత్రం 5.30 కి శ్రీకూర్మం వెళ్లేం. అతి ప్రాచీనకాలం నాటి ఆలయం అది. గర్భగుడిలో ఉన్న ఉలితో చెక్కనిరాయి అచ్చంగా తాబేలు ఆకారంలో ఉంది. అక్కడి నుంచి అరసవిల్లి వెళ్లి సూర్యదేవాలయం చూసాం. శ్రీకూర్మం, అరసవిల్లి శ్రీకాకుళంలోనే ఉన్నాయి. శ్రీకాకుళంలో రోడ్ సైడ్ స్టాల్లో వేడివేడి నూడుల్స్, చికెన్ పకోడీ తిన్నాం రాత్రి భోజనంగా. రాత్రి 10కి సింహాచలం తిరిగి వచ్చేసాం. ఆ సంవత్సరం సంక్రాంతి అక్కడే చేసుకున్నాం. మా ఆడపడుచులు (నా భర్త చెల్లెళ్లు) అందరితో కలిసి. తర్వాత నన్ను జగ్గంపేటలో దించి మా అబ్బాయి వాళ్లు వెళ్లేరు. నేను ఇంటికొచ్చేసరికి ‘సాహితీ స్రవంతి’ నుంచి సి.పి. బ్రౌన్ సంస్థ లెటరొచ్చింది. 31 లోగా మంచి కథను పంపి 5 వేలు రెమ్యూన రేషన్ని అందుకోమని. ఒక్క వారం మాత్రమే ఉంది. నేను కథను డైరెక్ట్ గా వ్రాసెయ్య లేను. కథరాసి, అవసరమైనవి చేర్చి, అనవసరమైనవి తీసివేసి అప్పుడు గుండ్రని అక్షరాల్తో ఫెయిర్ చేస్తాను. పైగా పోస్టులో కథ హైదరాబాద్ చేరడానికి టైం పడుతుంది కదా! అసలే ప్రయాణాలు చేసి జలుబు, దగ్గుతో ఇంటికొచ్చాను. కొంత నీరసం, ఓపికలేని తనం. కథకి సబ్జెక్ట్ కావాలి కదా! రాయడం కుదరదులే అనుకున్నాను. కాని, ఆ రాత్రి నిద్రలో హఠాత్తుగా సబ్జెక్ట్ స్ఫురించి 12 పేజీల ‘అన్వేషణ’ కథగా రూపుదిద్దుకుంది. రాత్రీ పగలూ అదే పనిగా కూర్చుని రాసి మూడోరోజు పోస్ట్ చేసేవరకూ నిద్రపట్టలేదు. ఇన్ టైంలో కథ అంది, సెలక్టై తర్వాతి నెలలో ‘కథకి నీరాజనం’ శీర్షికతో ప్రచురింపబడి, ప్రతికతో బాటు రెమ్యూనరేషన్ అందింది. మరో ప్రత్యేకత ఏమిటంటే కథ చదివిన యండమూరి వీరేంద్రనాథ్ ఫోన్ చేసి ‘‘కథ మెచ్యూర్డ్ గా చాలా బావుంది’’ అని చెప్పడం.

          ఒక రోజు మధునాపంతుల సత్యన్నారాయణగారు కాబోలు వీరలక్ష్మి గారి ఇంట్లోంచి ఫోన్ చేసి ఫిబ్రవరి 13 న మధునాపంతుల వెంకట్రావుగారి కథల పుస్తకం ఆవిష్కరణ పల్లిపాలెంలో జరుగుతుందని, ‘కథ-నాడునేడు’ అనే వ్యాసం రాసుకొస్తే అందరి వ్యాసాల్తో ఓ పుస్తకం తెస్తామని, ఆ ఉదయం కాకినాడ వచ్చేస్తే వీరలక్ష్మిగారితో కలిసి రావచ్చని ఫోన్ చేసారు. ‘అవును’ అంది వీరలక్ష్మి. తీరా ముందురోజు ఫోన్ చేస్తే తనకి వేరే కార్యక్రమం ఉందని, చెప్పడం మరచిపోయానని అంది. పాపం వాళ్లు వేరే ఏర్పాటు చేసి నాకు ఫోన్ చేసారు. దాని ప్రకారం ఆ ఉదయం నేను బస్సులో వెళ్లి కాకినాడ కలెక్టరు ఆఫీసు దగ్గర కొబ్బరాకు సుధాకర్ కారులో రచయితలు శ్రీకంఠస్ఫూర్తి, మరో బి.ఎస్.ఎన్.ఎల్. ఇంజనీరు గారితో కలిసి పల్లిపాలెం చేరుకున్నాను. యానాంకి ఇవతల మెయిన్ రోడ్డు వదిలేసి కుడిపక్కకు వెళ్లి ఇంజరం ఊళ్లో మళ్లీ కుడికి మళ్లితే చిన్న అగ్రహారం లాంటి పచ్చని పల్లె అది. సాయంకాలం వరకూ చక్కని సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. మధ్యలో మంచి విందు భోజనం. నేను, శ్రీకంఠస్ఫూర్తి కథ గురించి మాట్లాడేం. తిరిగి అదే కారులో ఇంటికి చేరుకున్నాను. మార్చిలో టేంక్ బండ్ మీది విగ్రహాల విధ్వంసం జరిగింది. స్కైబాబా ఫోన్ చేసి ఆవిషయం మీద ఆంధ్రజ్యోతిలో ప్రచురించడానికి నా అభిప్రాయం కావాలని అడిగేడు – ‘తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలనుకుంటోంది. కాని, ఆగ్రహాన్ని విగ్రహాల మీద చూపించడాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. గోల్కొండ కోట, పురాతన భవనాలు, మసీదులు – ఆలయాలు ఎలాంటివో, ఇటీవలి కాలానివైనా విగ్రహాలు కూడా అలాంటి కళా సంపదకిందికే వస్తాయి. పోరాటం అసంబద్ధం కాకుండా జాగ్రత్తపడాలని పోరాటవాదుల్ని కోరుకుంటున్నాను. మళ్లీ విగ్రహాలు నిలబెడతామంటున్న రాజకీయనాయకులు ఈ వంకతో ఇంకెంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారో! అలాగే వాళ్ల పిల్లల్ని ఇళ్లల్లో భద్రంగా ఉంచుకుని అమాయకులైన విద్యార్థుల్ని ఆత్మాహుతికి ప్రోత్సహిస్తున్న నాయకుల గురించి కూడా ఆలోచించి సంయమనంతో నడుచుకోవాలని యువతను కోరుకుంటున్నాను’’ – అంటూ ఫోన్లో నేను చెప్పిన విషయం మరికొందరు రచయితల అభిప్రాయాల్తో బాటు 12-3-11 ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

          మార్చి 28 నుంచీ హాస్పిటల్లో ఉన్న పుట్టపర్తి సత్యసాయిబాబా ఏప్రిల్ 24 ఉదయం శివైక్యం చెందినట్టు న్యూస్ లో వచ్చింది. ఆ సాయంకాలం నుంచీ భక్తుల సందర్శన కోసం ప్రశాంతి నిలయంలో ఉంచారట. 27న అంత్యక్రియలు జరిగేలోపల చూడడానికి జనం అన్నివైపుల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రయాణించడం వల్ల బస్సులు, ట్రెయిన్లు, ఫ్లైట్స్ రద్దీ ఏర్పడిందట. మార్చి 2 న అమెరికా సైన్యం ఆప్ఘనిస్థాన్ లో బిన్ లాడెన్ ని చంపేసింది.

          దాసరి అమరేంద్ర పూణే నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యే క్రమంలో ఆ పరిసరాలు చూపించాలని ఒక్కొక్కసారి కొందరు సాహిత్యకారుల్ని రెండు మూడు రోజుల కోసం పిలిచి ఆతిథ్యమిస్తున్నాడు. మే 20న నాకు ఫోన్ చేసి ఎవరెవరొస్తున్నారో చెప్పి నన్నూ రమ్మని పిలిచేడు. ఒక్కదాన్నీ అంతదూరం వెళ్లగలనా అన్పించి ‘వీరలక్ష్మిని పిలవనా’ అని అడిగేను. తను ‘సరే’ అన్నాడు. నేను వీరలక్ష్మికి ఫోన్ చేసి చెప్పేను. అలా చెయ్యడం ఎంత పొరపాటో, రచయితలు ఎంత రాజకీయవేత్తలో నాకప్పుడే అర్థమైంది. నన్ను చాలా అవమానించి, తేరుకోలేని డిప్రెషన్ కి కొన్నాళ్లపాటు గురిచేసిన  ఆ ప్రయాణం గురించి తర్వాత చెప్తాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.