
కనక నారాయణీయం -69
–పుట్టపర్తి నాగపద్మిని
మార్చ్ 5వ తేదీ. రాత్రి 8 గంటల సమయం.
కనకవల్లి పంటి బిగువున నొప్పి భరిస్తూ ఉంది. శేషమ్మ, తరులతా ఆమె దగ్గర లోనే ఉన్నారు. మంత్రసాని ఆజ్ఞతో వేడి నీళ్ళు కాస్తున్నారు, తులజా అరవింద్! నాగ భయం భయంగా ఇంట్లోకీ బైటికీ పరుగులు పెడుతూ ఉంది.
ఇదివరకు తెలియని దృశ్యం మరి!
మధ్యలో శేషమ్మ తరులతకు కూడ జాగ్రత్తలు చెబుతూ ఉంది, ఏదో విషయమై! అప్పుడప్పుడు తరులతకు కూడ వాంతులూ అవీ అవుతున్నట్టు కనిపెట్టిందామె!
పెద్దరికానికి పట్టుపడని విషయాలుండవేమో!
వచ్చేపోయే దారిలో నిల్చునివున్న నాగను దగ్గరికి పిలిచి చెప్పింది శేషమ్మ, ‘నాగా, నువ్వు మీ సంగీతం సార్ కొండప్ప ఇంటికి పోవే! అక్కడే పండుకో యీ రోజు! పొద్దున్నే వద్దువుగాని!’ అవ్వ అని వెళ్ళిపోయిందక్కడి నుంచీ! ఆమె మాటంటే అది ఆజ్ఞే!
నాగ మెల్లిమెల్లిగా కొండప్ప సార్ వాళ్ళిల్లు చేరుకుంది. కొండప్ప దంపతులకు ఇంకా సంతానం లేదు కాబట్టి ప్రస్తుతం నాగపద్మినిని వాళ్ళు తమ బిడ్డలాగే చూసుకునేవాళ్ళు. ఆమెకు అక్కడే పడుకునే ఏర్పాటు వెంటనే చేసేశారు. ఇంట్లో హడావిడి తలుచుకుంటూ ఉండగానే నిద్రాదేవి ఆవహించింది. అంతే!!
***
పొద్దున్న లేచీ లేవగానే కొండప్ప సర్ చెప్పేశారు, ‘నాగమ్మా! నీకు బుల్లి చెల్లెలు పుట్టిందంట!’ అని! వార్త వినగానే ఆఘమేఘాల మీద ఇంటికి పరుగులు పెట్టింది. తన నీడకే తనకంటే తొందరెక్కువగా ఉన్నట్టుంది, తనకంటే ముందు పరుగులు పెడుతూంది..’ అనుకుంటూ!! (నిజం, ఇప్పటి మీ యీ పద్మినికి ఆ క్షణాలూ, భావనా అన్నీ గుర్తే! అప్పటి ఉద్వేగం అలాంటిది. అప్పటికి మీ యీ పద్మిని వయస్సు సరిగ్గా తొమ్మిదేళ్ళా, ఏడు నెలలు.)
తన నీడకన్నా ముందుగా ఇల్లు చేరుకుని చిన్నారి చెల్లెలిని చూడాలని ఆరాటం ఆ చిన్ని మనసుకు!
ఆఘ మేఘాల మీద ఇంటికి పరుగులు పెట్టింది. ఇంట్లో..చిన్నారి పాప కేర్ కేర్ లు!
అటు అవ్వ శేషమ్మ పిల్లలలకు పనులు పురమాయిస్తూ ఉంటే ఇటు ఆమె చెప్పిన పనులు చకచకా బుద్ధిగా చేసుకుంటూ పోతున్న అక్కయ్యలు!
అమ్మ అలిసి పోయి పడుకున్నట్టుంది.
అయ్య పడసాలలో తన కుర్చీలో కూర్చుని తొలి కాఫీ తాగుతూ!
తులజక్కయ్యను బ్రతిమాలి, అమ్మ పక్కనే వెచ్చని బట్టల్లో ముడుచుకుని నిద్రపోతున్న చిన్నారి చెల్లెలిని చూసింది.
ముద్దుగా, తెల్లగా మెరిసిపోతూ, తలనిండా జుట్టుతో పాప!
ఎంత బాగుందో!
‘ముట్టుకోవచ్చా?’ అడిగింది మెల్లిగా!
‘ఇప్పుడొద్దు. అవ్వ తిడుతుంది. ముఖం, చేతులు కడుక్కుని వచ్చి! సరేనా?’
‘అమ్మో, అవ్వ తెనాలి రామ కృష్ణుని కథలు చెప్పేటప్పుడెంత సరదాగా ఉంటుందో! కానీ నియమాలు పెట్టేటప్పుడు కటువుగానే ఉంటుంది. ఆమె మాటంటే అయ్యా అమ్మలకు వేద వాక్కు. అటువంటిది, ఇప్పుడామె మాటలు దాటే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే, నాగ మెల్లిగా ఇంకోసారి చెల్లెలి ముఖాన్ని తృప్తిగా చూసి ముఖం కడుక్కునేందుకు బావి దగ్గరికి పరుగు పెట్టింది.
***
పుట్టపర్తికి ఇప్పుడు కొత్త వ్యాపకం ఏర్పడింది. చిన్నారి పాపలో తన తల్లి పోలికలు లీలగా కనిపిస్తుండటమే దానికి కారణం. పైగా బుట్టబొమ్మలా తెల్లగా తలనిండా వెంట్రుకలతో పెద్ద కళ్ళతో ముద్దుగా ఉన్న పాప ఇప్పుడు ఇంటిల్లిపాదికీ ముద్దుల పాపే అయింది.
నాగకైతే స్కూల్ కు వెళ్ళి చదువుకోవటం కంటే ఎల్లవేళలా చెల్లెలిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆడించటమే మహదానందంగా ఉంది.
శేషమ్మ మరో పదిహేను రోజులుండి, హైద్రాబాద్ ప్రయాణమైంది, బాలింతకు అవసరమయ్యే కారాలు వంటి సరంజామా తయారు చేసి పెట్టి!
తరులత అక్కడుండగానే రెండవ అల్లుడు రామానుజాచార్యులు కూడా వచ్చి కొన్ని రోజులున్నాడు.
తిరుగు ప్రయాణంలో వాళ్ళు గుంతకల్లు జంక్షన్ లో దిగి బళ్ళారి రైలు పట్టు కోవాలి మరి. పైగా రెండు రైళ్ళ సమయాల్లో దాదాపు రెండు గంటలు వ్యత్యాసం ఉంటుంది.
ప్లాట్ ఫారంలు కూడ ఆయా ప్రకటనలను జాగ్రత్తగా వింటూ వాటిని బట్టి మారాల్సి ఉంటుంది. ఒంటరిగా ఆడవాళ్ళు సామానుతో పాటూ అలా వేళ కాని వేళల్లో రైళ్ళు మారటం, ఆ రోజుల్లో కష్టమే! అందుకే రామానుజం కూడా వచ్చారు, తరులతను తీసుకుని వెళ్ళడానికి కూడా! పుట్టపర్తి రెండవ అల్లుడితో జ్యోతిష్య చర్చలు బాగానే చేశారు, కారణం యీ అల్లుడు జ్యోతిష్యం నేర్చుకునే బాటలో ఉండటమే!
మొత్తానికి ఆయన అల్లుడిగా కాక కొడుకుగా పుట్టపర్తి కుటుంబంలో త్వరగా కలిసిపోవటానికి ఇది కూడా మంచి కారణమైంది.
ఇంట్లో యీ పాపాయి బోసినవ్వులతో అందరి ముఖాల్లోనూ కొత్త వెలుగు.
***
మరో వారం రోజులకు తరులతను తీసుకుని రెండవ అల్లుడు రామానుజం కూడ హొసపేటకు బయలుదేరి వెళ్ళారు.
వాళ్ళు వెళ్ళిన వారం రోజులకల్లా అక్కడి నుంచీ ఉత్తరం. తరులత కూడా మూడవ నెల కడుపుతో ఉందని!
***
గుడిపాటవ్వ, ఒళ్ళో పాపను చేర్చి, కనకమ్మ ఇదివరకటిలాగే ఇంటి పనులు, భర్త పనులూ అన్నీ చేసుకోవటం మొదలు పెట్టేసింది.
పాప పెరిగి పెద్దవుతూ ఉంది. ఎవరికీ ప్రత్యేకంగా నామకరణాలూ వంటివి చేసుకునే స్థోమత లేని బడుగు పంతుల కుటుంబం కాబట్టి, ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్న చిన్న పిల్లల పేర్లలో ఒకటైన అనూరాధ, పుట్టపర్తి ఇంట్లో చిన్నారి పేరైంది.
అందరూ ముద్దుగా అనూ..అనూ..అని పిలుస్తూ ఉంటే, గుడిపాటవ్వ మాత్రం మరింత ప్రేమగా ‘మా చిన్ని రాధలూ, మా ముద్దు రాధలూ..’ అని రాగాలు తీస్తూ ఆడిస్తూ ఉంటుంది. ఆమె లోకమంతా చిన్నారి రాధే!! చిన్నతనానే వైధవ్యం పాలైన ఆమె జీవితంలో మాతృత్వ మధురిమ యీ పాప ద్వారా ఆమెకు అంది వచ్చిందనీ పుట్టపర్తి దంపతులు అనుకుంటూ ఉండేవారు.
ఏది ఏమైనా, ప్రస్తుతం, పుట్టపర్తి ఇంట్లో పెళ్ళైన ఇద్దరాడపిల్లల కానుపుల కోసం ఏర్పాట్ల విషయాలతో ఉత్తర ప్రత్యుత్తరాలూ, చర్చలూ తాజాగా మాట్లాడుకునే సంగతులు.
***
రోజులు పరుగులు పెడుతున్నాయి.
ఆ రోజు ఇంట్లో అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత, కనకమ్మ తళిహింట్లో వంట పూర్తి చేసుకుని సుందరాకాండ పారాయణం చేసుకుందామని అటు వెళ్తూ ఉంటే, గట్టిగా నాగ ఏడుపు. గాభరావేసి, తొందరగా పడసాలలోకి వచ్చేసరికి, నాగ మరింత గట్టిగా ఏడుస్తూ వచ్చి ఆమె కాళ్ళు చుట్టేసింది. తనతో పాటూ వచ్చిన తన స్నేహితురాలు చిట్టి (రామ సుబ్బలక్ష్మి) కళ్ళల్లోనూ నీళ్ళు!
నాగ రవికె నిండా రక్తం మరకలు!
కనకమ్మ గుండె గుభేలన్నది.
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
