
జీవితం అంచున -30 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
చిత్రంగా తల నొప్పికి గుండెకు సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అమ్మ ECG అస్తవ్యస్తంగా చూపించింది. కొన్ని పరీక్షల అనంతరం ఆన్జియోగ్రాం చేసారు. ఎయోర్టిక్వాల్వ్ మూసుకుపోయిందని కొత్త వాల్వ్ఇంప్లాంట్ చేయాలని చెప్పారు. రెండు ఆప్షన్లు ఇచ్చారు. మొదటిది ఓపన్ హార్ట్ సర్జరీ రెండవది TAVI. ఓపన్ హార్ట్ సర్జరీకి అమ్మ వయసు ఎంతవరకూ సహకరిస్తుందో తెలియదు. పైగా రికవరీకి చాలా సమయం పడుతుంది. TAVI చేయిద్దామని నిర్ణయించుకున్నాము. నా పెద్ద కూతురు డాక్టర్ అవ్వాలని అమ్మ ఎంత తపన పడిందో, ఆ ఋణం అది వడ్డీతో సహా చెల్లించు కుంది.
నా చేతికి నా నర్సింగ్ సర్టిఫికేట్ వచ్చింది. అది నా తొలి ఓవర్సీస్ సర్టిఫికేట్. ఇది వరకే సిద్దం చేసి పెట్టుకున్న దరఖాస్తు, రికమండేషన్ లెటర్స్ తో సర్టిఫికేట్ జత చేర్చి నేను ట్రైనింగ్ అయిన ఎస్టియా హెల్త్ సెంటర్లో ఉద్యోగానికి అప్లై చేసాను. పరదేశంలో, వచ్చీరాని పరాయి భాషతో ఉద్యోగం చేయడమంటే ఏదో తెలియని భయం. కాని చేయాలన్న పట్టుదల. ఆస్ట్రేలియాలో నేను కూతురి ఇంట్లో కేవలం చాకిరీ చేయడా నికే వున్నాననుకునే బంధుమిత్రులందరికీ నేను ఉద్యోగం చేస్తున్నానని గర్వంగా చెప్పుకోవాలి. డాలర్లలో సంపాదన. రుపాయిల్లో ఎంతయినా దానం చేయవచ్చు. ఈ ఆలోచనల ఉద్వేగం ఒక పక్క, అమ్మ సర్జరీ ఆతురుత మరో పక్క.
ప్రైవేటు ఆసుపత్రిలో అమ్మకి TAVI జరిగింది. అమ్మ ఆసుపత్రిలో వున్న మూడు వారాలు నేనే తనతో వున్నాను. రొటీన్ చెకప్స్ కి వచ్చే నర్సులను గమనిస్తూ నేనూ అసిస్టెంట్ నర్సింగ్ చేసానని చెప్పేదాన్ని. వాళ్ళు మెచ్చుకోలుగా మాటాడి తప్పకుండా ఉద్యోగం చేయమని ఎక్స్‌పీరియన్స్ తోనే నర్సింగ్ లో పర్ఫెక్షన్ వస్తుందని సలహా ఇచ్చారు. ఆసుపత్రిలో వున్న మొదటి వారంలోనే నేను అప్లై చేసిన ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. అమ్మ మరో రెండు వారాలు ఆసుపత్రిలో ఆ పైన ఫిజియోథెరపీ అవసరమున్న నేపధ్యంలో నేను జాబ్ ఎలా చేస్తాననిఅమ్మాయి ప్రశ్నించింది. అదీ నిజమే. కొత్త పిచ్చోడు పొద్దేరుగడన్నట్టు కొత్తగా అందుకున్న సర్టిఫికేట్ నన్ను వాస్తవానికి దూరం నెడుతోంది. చీకటి వెలుగుల విరోధాభాస జీవితం లో విషాదంలో ఆనంద ఘడియలు, సంతోషంలో దుఃఖపు ఛాయలు అనివార్యం.
అమ్మ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాక తన పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో పూర్తిగా నిమగ్నమైపోయాను. అమ్మ సంవత్సరపు వీసా సమయం దగ్గరపడుతోంది. తనతో మళ్ళీ ఇండియా వెళ్ళి తిరిగి వీసా అప్లై చేయాలి. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు నా దీర్ఘకావ్యం ‘ఎడారి చినుకు’ కి పుస్తకరూపం ఇవ్వాలి. ఆనిక తెలుగు చదవలేదు కాబట్టి తనపై నేను రాసిన నా ప్రేమకావ్యం తెలియాలంటే ఆ పద్యాన్ని ఆంగ్లంలోకి అనువదించాలి. నాకు నేనుగా అనువాదం చేయడం కన్నా ఎవరైనా ప్రొఫెషనల్ అనువాదకులతో చేయిస్తే బావుంటుంది. ఇండియాకి తిరుగు ప్రయాణం దగ్గర పడే సమయానికి అనువాదకులు డా. శరత్ బాబుగారితో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాను. తెలుగు ఇంగ్లీషు రెండు వర్షన్లు ఒకే వేదిక పైన ఆవిష్కరించాలని నా కోరిక.
మొత్తానికి కెరీర్ లో సెకెండ్ ఇన్నింగ్స్ అనే ఆలోచనకి స్వస్తి పలికేసి అమ్మతో నా మాతృగడ్డపైన కాలు మోపాను. ఈ ట్రిప్పులో ఇండియాలో నా పర్సనల్ జీవితంలో ఎన్నడూ ఊహించని మరో సెకండ్ ఇన్నింగ్స్ నా కోసం కాచుకుని వుందని కలలోనైనా ఊహించలేదు. అప్పటి నా ఆలోచనల్లా ఒక్కటే.. మానసిక అస్వస్థతతో చిత్రవిచిత్రం గా వ్యవహరించే అమ్మను వంటరిగా ఎలా హ్యాండెల్చేయగలనా అని.
*****
(సశేషం)

ఝాన్సీ కొప్పిశెట్టి గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు, ఆంగ్ల భాషలలో డబుల్ MA, భవన్స్ నుండి IRPM డిప్లొమా చేసారు. ఆర్మీలో ముప్పై మూడేళ్ళ ఉద్యోగ నిర్వహణానంతరం స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వీరి సాహితీ ప్రస్థానం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వేగవంతంగా
సాగుతోంది. ‘అనాచ్చాదిత కథ’, ‘విరోధాభాస’, ‘అగ్ని పునీత’ అనే నవలలు, ‘గొంతు విప్పిన గువ్వ’ అనే అనుస్వనమాలిక, ‘చీకటి వెన్నెల’ అనే కథా సంపుటి,
‘ఆర్వీయం’ అనే చిత్ర కవితల దృశ్య మాలిక, ‘ఎడారి చినుకు’ అనే అనుభూతి కావ్యం వీరి సాహితీ పంటలు. నాటి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారి ప్రశంసా పత్రం, అంపశయ్య నవీన్ తొలి నవలా పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం, నవలా రాణి బిరుదు ప్రదానం, తెన్నేటి హేమలత సాహితీ పురస్కారం, శ్రీ మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం, కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం, HRC కథా పురస్కారం, నెచ్చెలి కథా పురస్కారం వీరి సాహితీ కృషికి లభించిన గుర్తింపులు. ప్రతిలిపి నుండి వీరి కథలకు అనేక బహుమతులు లభించాయి. వీరి కథలు, కవితలు తెలుగు వెలుగు, పాలపిట్ట, స్వాతి, ఆంధ్ర భూమి, సారంగ వంటి పలు పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.
