
కళావతి వాటా
-బి.హరి వెంకట రమణ
‘మా అక్క రమ్మందమ్మా రెండు మూడురోజులు వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంది ‘ కళావతి చిన్నకోడలితో.
దేనికి ? ఎందుకు ? అనలేదా పిల్ల. విన్నా విన్నట్టుగానే వుండి తలగడాలకున్న గలేబీలు మారుస్తూ వుంది.
ఆ తరువాత ఆడుకుంటున్న చిన్నదాన్ని తీసుకెళ్లి స్నానం చేయించి, తాను తయారయ్యి బండి మీద ఆఫీసుకు వెళ్ళిపోయింది.
ఇంట్లో చిన్నది, తను మిగిలిపోయారు. పెద్ద పిల్లాడి స్కూలు పొద్దున్నే కాబట్టి కొడుకు స్కూలు దగ్గర దిగబెట్టేస్తాడు.
కొడుకు మధ్యాహ్నం వొచ్చి భోజనం చేసి చిన్నదానితో ఆడుకొని వెళ్ళిపోతాడు. అంతవరకూ టీవీ చూడటం, పిల్లతో కాలక్షేపం, దానికి ఆకలేస్తే అన్నం పెట్టడం, ఇవే తనకు మిగిలిన పనులు.
కాసేపు ఆడుకుని చిన్నది పడుకుండి పోయింది.
టీవీ పెట్టింది కానీ కళావతి ఏమీ బాలేనట్లు అనిపించాయి, కట్టేసి కాసేపు బయటకు చూడటం మొదలుపెట్టింది.
జనం రోడ్డంట వెళ్తా వున్నారు. వాళ్ళు స్వేచ్చగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా ? సంతోషంగా ఉన్నారా ? చెప్పడం కష్టం అనుకుంది.
స్వేచ్ఛ ముఖ్యమా ? సమయానికి భోజన సదుపాయం ముఖ్యమా ? అర్ధం కాలేదామెకి.
పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది, అతను డ్యూటీలో ఉంటే తీయడు, కానీ బయట డ్యూటీ పనిమీద తిరిగితే తీసి మాట్లాడతాడు. ఫోన్ తీయలేదు.
కూతురికి చేస్తే తీసి మాట్లాడుతుంది గాని. కయ్యి.. మని ఎగురుతుంది, ఇద్దరు కొడుకులూ కోడళ్ళు చేసిన పని గుర్తొచ్చి.
కళావతి భర్త మూడేళ్ళ క్రితం చనిపోయాడు, ఆయన బతికుండగా ఊపిరి తీసుకోలేనంత పని, వ్యవసాయం, అది సరిపోక ఇంటిదగ్గర చీపుర్లు తయారు చేయడం, కొబ్బరి తాళ్లు అల్లడం. వాటికి పనివాళ్ళు వాళ్ళకి రోజువారీ కూలీ, వొచ్చే పోయి జనాలకి భోజనాలు, టీలు.
ఇవికాక సాయంత్రం అయ్యేసరికి భర్తకి నీసు కూరలు కావాలి, ఆ చేపలు, రొయ్యలు చేసేసరికి ఒక్కోసారి బానే ఉండేది గాని చాలా సార్లు చిరాకు వొచ్చేసేది. బంధువులొస్తే ఇక భోజనాలే భోజనాలు, భర్తకి అందరూ ఇంటికి వొచ్చి భోజనం చేయాలి, కలిసి మెలిసి వుండాలని కోరిక. ఆయన కోరిక బానే వున్నా, ఇంట్లో కళావతికి బండెడు పని అయ్యేది.
అయితే బయట పనివాళ్ళతో, వ్యవసాయంతో, వొచ్చే పోయి బంధుజనంతో చాలా కళగా , గౌరవంగా ఉండేది ఆ పెంకుటిల్లు.
తన చేతులతో పని వాళ్లకు డబ్బులు ఇప్పించేవాడు భర్త, బంధు జనానికి తన చేతుల్తో అన్నం పెట్టేది, బట్టలు పెట్టేది.
ఒక రోజు భర్తకి గుండెల్లో నొప్పి , ఆయాసం అంటే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
స్టెంట్లు వేయాలన్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో నేను చేయించుకోను నాకు భయం అని అతను అంటే ఇంటిమీద అప్పుచేసి చేయించారు.
ఆరునెలల తరువాత ఒక రోజు నిద్రలోనే అతను వెళ్ళిపోయాడు.
కళావతి జీవితం ఒక్కసారి తల్లకిందులయిపోయింది, ఇలా అయిపోతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.
పదకొండో రోజు తరువాత ‘నేను హైదరాబాద్ లో వున్నాను కదా, అన్నయ్య దగ్గరే వుండు, కొన్ని రోజుల తరువాత తీసుకెళ్తాను అన్నాడు చిన్నోడు..
ఆ వెళ్లడం, వెళ్లడం తీసుకెళ్లడం ఏడాది పొయింది, తీసుకెళ్లలేదు.
మీ నాన్న ఇంటిమీద తెచ్చిన అప్పు తీర్చి ఇల్లు నిలబెట్టుకోండ్రా అంది ఇద్దరి కొడుకులతో.
వాళ్ళు మాకెందుకీ పాత ఇంటి లంపటం అని ఇల్లు అమ్మేసి వొచ్చిన డబ్బులు చెరో సగం వాటా తీసుకున్నారు. తన పేరు మీద ఒక రెండు లక్షలు డిపాజిట్ చేస్తారేమో అని చూసింది కళావతి, కానీ ఆ ఊసు.. వుత్తాపం లేకపోవడంతో ఒకరోజు నోరు తెరిచి అడిగింది, చిన్నోడికేమో ఫోన్ చేసింది. ‘ ఇంకెక్కడి డబ్బులు నాన్న లాగే నాకు కూడా అప్పులున్నాయి, అన్నీ తీర్చేసాను, పది పైసలు కూడా లేవు నా దగ్గర ‘ అన్నాడు.
పెద్దోడిని అడిగితే ‘ నాదీ అదే పరిస్థితి, పైసా లేదు ‘ అన్నాడు.
ఆ తరువాత ఆడపిల్ల ఎక్కడ వాటాకి వొస్తాదో అని పొలం కూడా ఆగమేఘాల మీద అమ్మేశారు. అప్పుడు కూడా అడిగింది ‘ ఒరే నా పేర కొద్దిగా డబ్బులు డిపాజిట్ చేయండ్రా ‘ అని.
పోనీలే చేద్దామని అనుకున్నారు ఇద్దరూ,
‘ మీకేమైనా మతి పోయిందా మీ అమ్మ ఆ డబ్బులు తిన్నగా వుంచుద్దనుకుం టున్నారా ? కూతురికి పోస్తుంది, ఇప్పటికే ఆ పిల్లకి కట్నం, పొలం ఇచ్చారుగా ఇంకేమిస్తారు ? అలా చేయనీయకండి, అయినా మనం లేమా కడదాకా కళ్ళల్లో పెట్టి చూసుకోము ?’ అన్నారు కోడళ్ళు.
ఆ డబ్బులు మళ్ళీ కూతురికి గానీ ఇచ్చేస్తాదేమో అని ఇద్దరూ ‘ ఎన్నాళ్ళు ఒకరి దగ్గర పనిచేస్తాము ? వ్యాపారం పెట్టుకుంటున్నాను, ఈ డబ్బులు సరిపోవు, బ్యాంకు అప్పు కూడా చేస్తున్నాను అన్నారు. ఒకరి తరువాత ఒకరొచ్చి.
కళావతికి వివరం బోధపడింది, అంటే ఇక డిపాజిట్ వేయడం కుదరదన్నమాట. ఇక మిగిలింది భర్త చేయించిన గాజులు, మూడుపేటల గొలుసు. ఇవ్వయినా జాగ్రత్తగా ఉంచుకోవాలి కడ వరకు అనుకుంది.
కొన్నాళ్ళకి ఇద్దరి వ్యాపారాలు ఏమయ్యాయో తెలీదుగాని ఉద్యోగాలకి వెళ్లడం మొదలెట్టారు. చిన్నోడు కూడా హైద్రాబాదు నుంచి వొచ్చేసి ఊర్లోనే పనిచేయడం మొదలెట్టాడు, స్థలం కొని ఇల్లు కడ్తున్నాడని వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, కానీ తనకు చెప్పలేదు, పోనీలే శుభకార్యం కదా బోడి దానికి చెప్పడం ఎందుకు అనుకున్నాడేమో అని సరిపెట్టుకుంది.
అన్నిటికన్నా సంతోషం బిడ్డలిద్దరూ ఒకే వూర్లో వుంటున్నారు, ఎప్పుడంటే అప్పుడు చూసుకోవొచ్చు అనుకుంది.
***
చిన్నది నిద్రలేచి ఏడుస్తుంటే దానికి చారుబువ్వ పిసికి అన్నం పెట్టింది, ఆ తరువాత కాసేపటికి చిన్నకొడుకు వొచ్చాడు వాడికి భోజనం పెట్టాక. ‘రేపు నన్ను అన్నయ్య ఇంటికాడ దిగబెట్టే బాబా, రేపటితో మీ టయిము అయిపొయింది, వొచ్చే రెండు నెలలు అక్కడ ‘ అంది.
చిన్నోడు ఫోన్ చూసుకుంటూ ‘ నాకవ్వదు .. పొద్దుట మీ కోడలు దిగబెడుతుంది, బట్టలు సర్దేసుకో ‘ అన్నాడు.
‘సర్లే గానీ ఆ గొలుసు ఒకసారి ఇయ్యి కొంచెం అర్జెంటు డబ్బు అవసరం పడింది, అన్నయ్యకు కూడా ఏమీ చెప్పకు, వారం లో తెచ్చేస్తాను’ అన్నాడు.
కళావతి ఏమీ మాట్లాడకుండా భర్త ఫోటో దగ్గరకు వెళ్లి చిన్నగా ఏడవటం మొదలు పెట్టింది. ‘ఎందుకయ్యా ఇలా చేసావు ? ఆఖరికి ఇంత బతుకు బతికి
ఇప్పుడు గవర్నమెంటు ఇచ్చే పింఛనుకి రాయించారు నీ కొడుకులు, కోడళ్ళు’ అని ఫొటోలో వున్న భర్తని అడిగింది.
అప్పటికే కొడుకు బయటకు వెళ్లిపోవడం వలన వాడికీ మాటలు వినపడలేదు. చిన్నది నానమ్మ ఏం మాటాడుతుందో అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోయింది చేతిలో బొమ్మ పట్టుకుని.
***
.
ఆరోజు పొద్దున్న నెల వాటాల ప్రకారం పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటుంది కళావతి. బయట ఆటో చప్పుడయింది.. అక్కడకు పాతిక కిలోమీటర్ల దూరాన ఉంటున్న కళావతి అక్క ప్రభావతి దిగింది ఆటో లోంచి.
రావడం రావడమే తుఫానులాగా ‘నీకంతా మంచేనే .. మనకు నాన్న గొడవల్లో ఉంచిన ఆస్తి వొచ్చింది’ అంది. అర్ధంకానట్లు అక్క వొంక చూస్తూ ఉండిపోయింది.
‘అదేనే నాన్న కొన్న స్థలం డాక్యుమెంట్లు లేక ఇన్నాళ్లు వేరే వాళ్ళ పరంలో ఉండిపోయాయి కదా ?ఇప్పుడు దాని లింకు డాక్యుమెంట్లు, అసలు పత్రాలు దొరికాయి..ఇంక మిగతా పనులు చూడాలి పద ఆటో ఎక్కు’ అని చిన్న కోడలు వైపు తిరిగి’ అలా చూస్తూ నుంచుండు పోకే.. వెళ్లి మీ అత్త లగేజీ ఆటోలో పెట్టు’ అంది.
‘నేను రానా పెద్దమ్మ’ అన్నాడు కళావతి చిన్న కొడుకు.
‘నీకెందుకు రా.. మీ డ్యూటీ లు మీరు చేసుకోండి.. మీ అమ్మ వాటా సరిగ్గా దాని పేరునరాసే పూచీ నాది , మీరు మీ పనులు చేసుకోండి.’ అని. లగేజీ ఆటోలో పెట్టి వొస్తున్న కోడలితో’ వొస్తాను ‘ అని చెప్పి కళావతిని తీసుకుపోయింది.
ఈ విషయం మధ్యాహ్నానికల్లా పెద్ద కొడుక్కి తెలిసిపోయి డ్యూటీ మానేసి వాడు పెద్దమ్మ దగ్గరకు వొచ్చేసాడు.
‘కొత్తగా ఈ భూమేమిటి పెద్దమ్మా’ అన్నాడు.
‘అదో గొడవరా.. ముప్పైఏళ్ళ కిందటి నుంచి నలుగుతోంది, మనకి ఆశలు లేక ఏనాడు మీకు చెప్పలేదు’ అంది.
ఒక నెలరోజుల తరువాత పిల్లలు లేకుండా పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు కోడలు కారు కట్టించుకొని ప్రభావతి ఇంటికి వొచ్చేసారు.
‘ఏమిరా నాయనలారా ?’ అంది ప్రభావతి.
‘అమ్మని ఇంటికి తీసుకెళదామని’ అన్నాడు చిన్నోడు.
‘అవును పెద్ది’ అన్నాడు పెద్దోడు.
మధ్యాహ్నం భోజనాలయ్యాక, ‘ ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చేయి పెద్ది.. మా
దగ్గర జాగర్త చేస్తాంలే’ అన్నాడు చిన్నోడు.
‘హా.. అరె చెప్పడం మర్చిపోయాను, కాగితాలు నా దగ్గరే ఉంటాయి, దానికి ఏమీ ఉంచకుండా ఆర్పేశారు కదా , మీకు ఇవ్వడం కుదరదు’ అంది ప్రభావతి.
ప్రభావతికి కూడా భర్త పోయాడు, స్వంత ఇల్లు లేదు గానీ భర్త పెన్షన్ దండిగా వొస్తుంది, అందుకని విడిగా ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది, కూతురు పక్క వీధిలో ఉంటుంది, రోజూ అన్నం, కూరలు, టిఫిన్ అక్కడనుంచే వొస్తాయి, పెన్షన్లో డబ్బు సగం దాచుకొని, మిగతాది కూతురికి ఇస్తాది.
‘ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేస్తే మంచిది కదా’ అన్నాడు పెద్దోడు.
‘చూడండిరా మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు, రిజిస్ట్రేషన్ పేపర్లు నా దగ్గరే ఉంటాయి, మీ అమ్మ వాటా ఇప్పుడు అమ్మితే ముప్పై లక్షలు వొస్తాయి, అదమ్ముతానంటే నా కూతురు కొనుక్కోడానికి రెడీ గా వుంది’ అంది.
ఆమ్మో ముప్ఫైకే ఇప్పుడిక్కడ యాభై పలుకుతుంది కదా అని అనుకొనిపెద్దమ్మ సంగతి తెలిసిన మగ పిల్లలు, కోడళ్ళు మారు మాట్లాడకుండా కారు దగ్గర కెళ్ళిపోయారు.
అక్కడ వరకు వెళ్లిన ప్రభావతి ‘చూడండిరా అదెలాంటి బ్రతుకు బ్రతికింది, దాన్ని ఆఖరుకి రెండేసి నెలలు అన్నం పెట్టడానికి వాటాలేసేసారు, అందుకు బదులు దానికి ఎక్కడ ఎన్ని రోజులు వుండాలనిపిస్తే అక్కడ వుండే హక్కు ఇస్తే
బాగుండేది, ఏ నెల తక్కువ దానికి వొచ్చిందో ఈ దిక్కుమాలిన ఆలోచన ?లేక మీకే వొచ్చిందా?’ అంది.
కోడళ్ళు ముఖం మాడ్చుకొని వెళ్లి ఆ అద్దె కారు ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి వీళ్ళు కూడా వెళ్లి అందులో కూర్చున్నారు.
‘పోనీవే.. నీ వాటా కోసం వాల్లే వొస్తారు , నేను చెప్పినట్టు వింటానంటే పంపుతాను, లేదంటే నేను తిన్న దాంట్లోనే వాటా పెడతాను నీకు’ అంది.
కారు వేగంగా అక్కడ నుంచి మాయమయిపోయింది.
ఆ దారమ్మట వెళ్తున్న కుర్రోడిని ఆపి ‘ బాబా కొద్దిగా మిరపకాయ బజ్జీలు తీ సుకురా నాయనా’ అని డబ్బులు చేతిలో పెట్టింది. బజ్జీలు వొచ్చాక చెల్లికి ఒక రెండు ఇచ్చి మిగిలిన వాటిని పర పరా కొరుకుతూ’ వాటాలేస్తారట వాటాలు మనశ్శాంతి లేకుండా చేశాను ఎదవలకి’ అంది.
‘మరి రిజిస్ట్రేషన్ ఆఫిసుకి వెళ్లి కనుక్కుంటేనో’ అంది కళావతి.
‘కనుక్కోనీయే అక్కడా మన మనుషులని ఇద్దరిని మాటాడి పెట్టాను , అబద్దాన్ని నిజం చేయమని’ అంది నవ్వుతూ బజ్జీ కారంగా ఉండటం వలన వొస్తుందో, మరెందుకు వొస్తున్నాయో ఆమె కళ్ళనిండా నీళ్లు వొస్తున్నాయి ఒక పక్క నవ్వుతున్నా సరే.
*****

హరివెంకటరమణ యెన్. జీ. ఓ. రంగంలో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. పిల్లల కోసం బొమ్మలు, కార్టూన్లు వేస్తుంటారు. బర్మాకేంపు కథలు, మాబడి కథలు సిరీస్ గా రాసేరు. వివిధ పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతనివాసంవిశాఖపట్నం.