పడమటితీరం

-ఘాలి లలిత ప్రవల్లిక

          “పద్దూ” ప్రేమగా పిలిచాడు మాధవ్.
 
          లోపల ఉన్న పద్మకు వినిపించ లేదేమో పలకలేదు.
 
          ” ఎంతసేపూ ఆ వంటింట్లో ఏడవకపోతే… కాస్త మొగుడు ముండా వాడిని ఏడ్చానని, వాడి అతి గతి పట్టించుకోవాలని, ఆలోచన ఏమైనా ఉందా?” కోపంగా గట్టిగా అరిచాడు మాధవ్.
 
          ” ఇక్కడ ఎవరికి చెముడు ఏడ్చింది అని, అంత గట్టిగా అరుస్తున్నారు? ఇప్పుడే గా మీ దగ్గర నుంచి ఇవతలకు వచ్చా! ఇంతలోకే ఆ గావు కేకలు ఎందుకు? 24 గంటలు మీ చుట్టూ తిప్పుకుంటూ ఉంటే… ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మళ్లీ వేళకు ముద్దపడకపోతే శివాలెత్తిపోతారు. కాసేపు నా నామ జపాన్ని ఆపి…కృష్ణా రామా అనుకోండి పుణ్యం అన్నా వస్తుంది” విసిగిపోయిన కామాక్షి లోపల నుంచే జవాబు గట్టిగా చెప్పింది.
 
          “రాను రాను మొగుడు మీద శ్రద్ధ తగ్గిందే నీకు… నా మాటకు విలువ ఇవ్వడం మానేస్తున్నావు!” నిష్టూరంగా అన్నాడు
 
          “ఇంకా ఎంత కాలం అండి మీ మొగుడిరకం పళ్ళూడి చూపు మందగించినా… అహాన్ని అంటిపెట్టుకుని… నా వయసునన్నా దృష్టిలో పెట్టుకోకుండా ఈ దాస్టికం ఏమిటి? నా ఖర్మ కాకపోతే… ఛాదస్తం మొగుడు చెబితే వినడు… బుర్రకి తట్టి చావదు ” అంది.
 
          “ఏమిటే గొణుగుతున్నావు? నాకు వినపడదనేగా నీ ధైర్యం. నీ నాలికకి స్వేచ్ఛ ఇచ్చేసావు?” అన్నాడు కాస్త కోపం నటిస్తూ.
 
          “ఈ వయసులో దేనికి స్వేచ్ఛ ఇచ్చినా ఏం లాభం లెండి. జరగాల్సిన ఉపద్రవాలన్నీ జరిగిపోయాయి. ఈ కాలం పిల్లల్ని ఏమనకూడదండి అంటే విన్నారా?
ఈ కాలపు పిల్లల్ని ఒక మాట అంటే పది మాటలు పడాలి అవసరమా? మీరు నోరు విప్పకండి మహప్రభో వాళ్ళు ఎలా ఉన్నా  సర్దుకు పోవడం నేర్చుకోవాలి అని నేను నెత్తి నోరు మొత్తుకున్నా… వినకుండా  కోడల్ని కాఫీ అడిగారు . అది ఇవ్వను అంటే ఊరుకోకుండా… ఇంటి కోడలివి చేయాలి అంటూ సూక్తులు చెప్పారు.
 
          ఈనాటి కోడళ్ళకి సూక్తులు ఎక్కుతా ఇటండి? డబ్బులు లెక్క చూసుకునే కళ్ళకి బంధాల విలువ ఏం తెలుస్తుంది? రెక్కలొచ్చిన పక్షులు గూడు నాక్రమించుకుని రెక్కలు ఉడిగిన మనల్ని బలవంతంగా బయటికి గెంటేసాయి. వడ్లతో తట్ట తట్టతో ఒడ్లు ఎండాలి కదా! నాకు తప్పదు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు… మీ అహంకారానికి అడుగులకు మడుగులు ఒత్తక తప్పదు” అంది బాధగా.
 
          ‘పిచ్చి మొహంది. కోడలు దీనిని పని మనిషి లాగా చూస్తోందని గ్రహించే… అలా కోడలు పిల్లను అని, దాశ్యరికం నుంచి దీనిని విముక్తి చేశాను. పిచ్చి మొహంది గ్రహించుకుంటేగా! మాటిమాటికి పిలుస్తున్నానని అనుకుంటుంది గాని… అలా పిలిచి దానిని నా సన్నిధిలోనే ఉంచుకుని… ఎక్కువ పనిని చేయకుండా చూస్తున్నాను అన్న విషయం గ్రహించలేదు మరి.’ అనుకున్నాడు మాధవ.
 
          “ఏమిటో ఆయనకు నేనంటే ప్రేమ. నన్ను కూర్చో పెట్టాలని చూస్తారు. కోడలైన కూతురైన ఒకటే కదా! కోడలు ఒక మాట అన్నా, కడుపులో పెట్టుకోవాలి. ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు కూడా ఎక్కడ చేయగలుగుతుంది. నా ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం నా బిడ్డలకు నా చేతులతో చేసి పెట్టుకుంటే అదే తృప్తి.
 
          “రేపొద్దున్న మాకు ఏమన్నా అయితే మమ్మల్ని ఎవరు చూస్తారు? వృద్ధాశ్రమం లో పడేయకుండా మమ్మల్ని ఇంట్లో ఉంచుకున్నందుకు మేము సంతోషించాలి. వయసు మీద పడి పనులు సరిగ్గా చేయలేకపోయినా, చూపు మందగించి వంట తేడా వచ్చినా, జ్ఞాపక శక్తి సన్నగిల్లి వస్తువులు ఎక్కడ పెట్టానో మరిచినా, తప్పు నాదే కదా! తన ఉద్యోగ ఒత్తిడివల్ల  నా కోడలు నన్ను ఒక మాట అన్నా నన్ను కాదు అనుకుంటే సరిపోయేదిగా!
 
          అది మనసులో పెట్టుకుని, ఈయన కోడలితో గోడవ వేసుకుని బయటకు వచ్చారు. చాకిరీ చేయడమేమన్న తప్పిందా? ఆడదానికెక్కడున్నా పని తప్పదు. ఆయనకు వచ్చే కాస్త పెన్షన్ తో పని మనిషిని పెట్టుకోలేము. ఈమాత్రం దానికి బిడ్డల అండను వదిలించుకుని వస్తామా! బ్రతిమాలో బామాలో అక్కడే ఉంటే బాగుండేది. డబ్బు దండిగా ఉంటేనే,  మలి సంధ్యలో మనిషికి మనుగడ, లేకపోతే పడమటి తీరానికి చేరుకున్నా తూర్పు వేడి, వాడీ కావాలి అంటారు. 
 
          ప్రేమ, ఓర్పు, బంధం లాంటి పదాలు నేడు వృద్ధుల జీవితాలలో మృగ్యమే. చేతకానితనానికి  చెవి సూత్రమే (ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం) సరైన మార్గం.”  అనుకొంది పద్మ.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.