ప్రయోగశాల
-డా. కొండపల్లి నీహారిణి
అప్పుడు అమ్మ వండిన కూరలో రుచి
ఇప్పటికీ మనసు పొరలలోన
వరుస పెట్టి కథలు కథలుగా రాస్తూనే ఉన్నది
అమ్మగా నేను వండినా
నాన్న కొత్తగా ఇప్పుడు వండినా
అర్థం కాని అరుచి
ఆ రుచినే గుర్తు చేస్తున్నది
‘వాటమెరిగిన’ ‘చేతివాటం’
వంటి పదాలు పంట కింద రాళ్లవుతున్నాయి
నాలో నుంచి అమ్మతనానికి
వాళ్లలో నుంచి కోరికల అంపకాలకు
మనకు తెలిసిన
చెయ్యి తీరు చిరు చిరు చిట్కాలు
ఇప్పుడు ఎందుకో
మనసును మరుగుజ్జును చేస్తున్నాయి
బాధకు పర్యాయపదం కవిత్వం అయిందని
నానార్థాలను వెతుక్కునే మొదటి ప్రయత్నంలో
పోపుల డబ్బా దగ్గర ఆగిపోయి వంట పనిలో పడ్డారు
గప్పాలు అనలేని గొప్పలతో
వంటింటి గట్టు దగ్గరే కొట్లాటలకు వేదికవుతున్నది
గాయాలకు పసుపు కట్టినంత సులువా ?
రక్తం గుణాల మారిది!
తరాలు మారి మరోమారు
ఆకలికీ అన్నానికీ అతికిన చెలిమిని గుర్తుకు చేస్తున్నది
దేహం తన సమతుల్యత కోసం
దేశమంత గట్టిదౌతుంది
అవసరాలకోసం ప్రతినలుబూనిన ప్రతిసారీ
తిండి తిప్పలు మారవని సమయం చెప్తూ ఉంటుంది
రోగాల బాధల నదులు
కాలనికే అప్పు పెడతాయి
అదుపు తప్పే నాలుక
ఒడుపు తెలిసిన జాలరి కాదు
అరచేతిలో స్వర్గం మాటేమో గానీ
సముద్రాన్ని చూపిస్తుంటుంది
జీవితం వయసు అంత ముఖ్యం
విటమిన్లు మినరల్స్ ఒంటిని బట్టి
జట్టు కడుతుంటాయి
ఊహల శకలాలు మూటగట్టేయాలి
అమ్మ రుచులు నాన్న రుచులు ఇంటింటి
బంధాల బంగారు ముచ్చట్లు
పిల్లల ప్రేమల పూలగుచ్ఛాలు
వంటిల్లు ఓ గొప్ప ప్రయోగశాల
ప్రపంచమంతా తిరిగినా
సాంకేతికను తినరు కదా!!
*****