ఏంచెప్పను?
(డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)
– పద్మావతి రాంభక్త

ఏమని చెప్పను
లోలోతుల్లో మనసుకు ఉరేసే
దుఃఖముడులు
ఎన్నని విప్పను
గోడపై కదిలే
ప్రతిముల్లూ
లోపల దిగబడి
అల్లకల్లోలం చేస్తుంటే
ఏమని చెప్పను
నా మౌనానికి గల కారణాలకు
రంగురంగుల వస్త్రాలు తొడిగి
గాలిలోకి ఎగరేస్తుంటే
ఏంచేయను
నా పెదవులపై తూలిన
ప్రతి పలుకును
మసిబూసి మారేడుకాయను చేసి
పుకారులను
వీధివీధిలో ఊరేగించి
కృూరంగా ఉత్సవాలు చేసుకుంటుంటే
ఎంతకని ఓర్చను
నడకను నడతను
శల్యపరీక్ష చేసి
ఎలా మసలినా
భూతద్దాలతో వెతికి
అరక్షణంలో ఆవగింజనైనా
పట్టుకుని రాక్షసానందాన్ని
పొందుతుంటే
కాల్చేమంటలను
ఎలాచల్లార్చుకోను
గదిలో కూర్చున్నా
గడపదాటినా
గంభీరనదిలా సాగినా
గలగలా ప్రవహించినా
నాపై కథలు ప్రచారంచేస్తుంటే
ఎంతకని ముందుకు నడవను
మగువను సరే
మీలాంటి మనిషినే కదా
మీ పొట్టవిప్పి చూపకుండా
పురుగుల్లాంటి ఆలోచనలను
రహస్యంగా పొదిగి
నాపై విసురుతుంటే
మిమ్మల్ని ఎలా ఎదుర్కోను
కనపడకుండా
నాపై గురిపెట్టే బాణాలకు
కలిగే నా మానసిక వేదనకు
మీకు ఎంత పెద్దశిక్ష విధించను
*****