‘దెబ్బ తగలగానే పరిగెత్తుకుని వచ్చి, వసంత టీచర్తో నోరంతా శుభ్రం చేయించి, రవికె మీద పడ్డా రక్తమూ తుడిచి, వెంటనే ఇంటికి పంపించేసినాను కూడా!! ఇంతకూ డాక్టర్ దగ్గరికి పోతున్నారా, నన్ను తీసుకుని వెళ్ళమంటారా?’
అడిగాడాయన. సమాధానం చెప్పేలోగా, వీధిలో వెళ్తున్న రిక్షా వాణ్ణి పిలిచి, నాగ చేయి పట్టుకుని పెద్ద మసీదు దగ్గరున్న ప్రభుత్వ వైద్య శాల శాఖకు వెళ్ళమని చెప్పాడాయన.
స్కూల్ నుంచీ అందిన సమాచారంతో పుట్టపర్తి కూడా గాభరాగా ఇంటికి చేరు కున్నారు.
వారిని చూడగానే ఏడుపు కట్టలు తెంచుకుంది కనకమ్మకు.
పుట్టపర్తి మరో రిక్షాలో అరవిందుతో ప్రభుత్వ వైద్యశాల శాఖా కేంద్రానికి బయలు దేరారు.
వైద్యశాలలో కృష్ణమాచార్యులు అనే పుట్టపర్తి దూరపు చుట్టం ఒకతను కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. అతనున్నాడు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. మోచంపేట శ్రీవైష్ణవ కుటుంబాలుండేచోట వీళ్ళూ కూడా ఉంటారు. అక్కడున్న ఇళ్ళల్లో పదిహేను ఇళ్ళన్నీ వైష్ణవులవే! అక్కడికి దగ్గరగానే అహోబిల మఠం కూడ ఉంటుంది. ఆ కుటుంబల వాళ్ళందరికీ పుట్టపర్తి అంటే మహా గౌరవం. అప్పటికే పుట్టపర్తి జగమెరిగిన బ్రాహ్మణులు మరి!
డాక్టర్ దగ్గర కూడ చూపించి మందులు కూడ దగ్గరుండి తెచ్చి ఇచ్చాడు. దెబ్బ త్వరగానే మానిపోతుందనీ, భయపడవలసిన పనిలేదనీ, పప్పు వంటివి పెట్టవద్దనీ, ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పి, నాగపద్మినిని ఇకపై ఇటువంటి దుడుకు పనులు చేయ వద్దని మందలించి పంపాడు.
మొత్తానికి సీతారామయ్య గారికి కూడ ఇదొక అనుభవమయింది.
అందరూ వెనుదిరిగారు.
***
కనకమ్మ తులజ నాగలను తీసుకుని కృష్ణ కాలువకు బట్టలు ఉతికేందుకు వెళ్ళింది.
ఇంట్లో బావి ఉంది. కానీ ఎండ కాలంలో నీళ్ళు ఉండవు. అందుకే కృష్ణ కాలువలో బట్టలుతుక్కోవటం ఆనవాయితీ ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ!
దీని అసలు పేరు కే.సీ.కెనాల్. కర్నూల్ కడప కెనాల్. వాడకంలో కృష్ణ కాలువ యింది. కృష్ణా నదికీ దీనికీ సంబంధం ఏమీ ఉండదు కానీ, ప్రజల్ల్లో ఆ విధంగా స్థిరపడి పోయిందంతే!
కర్నూల్ నుంచీ మొదలై యీ కాలువ కర్నూల్ జిల్లా సుంకేశుల ఆనకట్టు నుంచీ కడప చేరుతుందట! తుంగభద్ర నది మీద నిర్మించిన డాం నుండీ యీ కాలువలోకి నీరు వస్తుంది. బ్రిటిష్ వారి హయాంలో దీని నిర్మాణం జరిగిందట! వ్యవసాయం కోసం దీని నీరు ఉపయోగించేవారారోజుల్లో! కర్నూల్ నుంచీ మొదలై, ఎన్నెన్నో వంపులూ , మలుపులూ తిరుగుతూ చివరికి దేవుని కడప దగ్గర ఉన్న పెద్ద చెరువులో యీ నీళ్ళు కలుస్తాయట! మొత్తానికి కృష్ణ కాలువ నీళ్ళు, ఆ రోజుల్లో పంట పొలాలకు నీళ్ళందించటంలోనూ, గృహిణులకు బట్టలుతుక్కోవటం వంటి పనుల్లోనూ సహాయ కారిగా ఉండేవి.. మోచంపేట ఇంటి నుండి నరస రామయ్య వీధి మీదుగా కనీసం ఒక అరమైలు దూరంలో ఉండే యీ కృష్ణ కాలువలో బట్టలు ఉతుక్కునే వారి హడావిడీ, యీతలు కొట్టే అల్లరి మూకల సందడి కూడ యెక్కువగానే ఉంటుంది.
వాళ్ళింకా బట్టలు ఉతుకుతూనే ఉన్నారు అరవింద్ పరుగు పరుగున వచ్చాడు, ‘అయ్య నిన్ను వెంటనే రమ్మంటున్నారని చెబుతూ!!
తులజ, నాగలను తోడుండి తీసుకుని రమ్మని చెబుతూ కనకమ్మ ఇంటికి బయలుదేరింది.
***
ఇంట్లో పడసాలలో వకీలు రమ మూర్తి పుట్టపర్తి మాట్లాడుకుంటూ ఉన్నారు.
కనకమ్మను చూడగానే పుట్టపర్తి అన్నారు,’ ఆ..కనకా! సమర్థ రామదాసు సంప్రదాయం వారు కృష్ణమూర్తి గారు. తెలుసు కదా! ఆ సంప్రదాయం గురువుగారు నారాయణ బాబాగారు వీళ్ళింటికి వచ్చి ఉన్నారు. మనిద్దరమూ వెంటనే పోయిరావాల. వారి ఆశీస్సులు మనకు అవసరం. పద పద!’
అంతే, కనకమ్మ జారుముడి సరి జేసుకుని, గుడిపాటి అవ్వకు చిన్నారి రాధనూ ఇంటినీ అప్పజెప్పి వారితో బయలుదేరింది.
***
17వ శతాబ్ది ప్రథమార్థంలో జన్మించిన సమర్థ రామదాసులవారి పట్ల అంతులేని భక్తి పుట్టపర్తి వారిది. వీర శివాజీని దేశ భక్తునిగా రూపొందించటంలో సమర్థ రామదాసులవారి కృషే ఎక్కువ అని పుట్టపర్తి నమ్మకం! సమర్థ రామదాసులవారు స్థాపించిన భక్తి సంప్రదాయంలోని గురువులను దర్శించుకోవటం, అందులోని భాగమే! వారి జీవితమంతా పుట్టపర్తికి ఎనలేని స్ఫూర్తిమంతంగా ఉంటుంది. వారు కూడా జీవితాన్ని త్యాగం చేద్దామనే ఆలోచనలో ఉన్నా, దైవకృప వల్ల వారి దృష్టి దేశ సంస్కృతి పరిరక్షణ వైపు సాగటం, శివాజీ కంట పడటం, ఆ తరువాత అంతా చరిత్ర గా నిలచి పోవటం – ఇవన్నీ ఎంతో ఆకట్టుకున్నాయి వారిని! సమర్థ రామ దాసులవారి సంప్రదాయానుగుణంగా దేశ వ్యాప్తంగా ఎన్నెన్నో మఠాలను స్థాపించటం, వాటి ద్వారా వారి సంప్రదాయ విస్తరణ జరిగింది. జయ జయ రఘువీర సమర్థ్ అన్న వారి నినాదం, తనకు ఎంతో ప్రేరణనిస్తుందనేవారు వారు తరచు! ఆరోగ్యవంతమైన దేహంలోనే ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయనే సూత్రం వారిది. అందుకే దేహ దారుఢ్యాన్ని కూడా పెంపొందించుకోవటం, తద్వారా స్వీయాభివృద్ధి, దేశాభివృద్ధి కూడా సాధ్యం అన్నది వారి దృక్పథం. ధర్మ సంస్థాపకుడుగా, అవతార పురుషునిగా, లోకోద్ధారకునిగా వారిని ఆరాధించేవారనేకమంది ఇప్పటికీ ఉన్నారు. వేమనకూ భద్రాచల రామదాసు కూ సమకాలికుడైన సమర్థ రామదాసు ప్రభావం, మహారాష్ట్ర ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆంధ్ర ప్రాంతంలో కూడా వారు పర్యటించాడంటారు. బ్రహ్మచర్యాశ్రమంలో సమర్థ రామదాసును భీష్మునిగాను, తత్వబోధనలో వేమనగాను, శ్రీ రామభక్తిలో లక్ష్మణునిగానూ, లోకోద్ధరణంలో చాణుక్యునిగాను, లోక విమర్శనంలో క్షేమేంద్రుని గానూ, ధర్మ సంస్థాపనలో బుద్ధునిగానూ, యుక్తి ప్రయుక్తులలో చాణుక్యునిగాను, రాజనీతిలో బృహస్పతి గానూ పరిగణించవచ్చు. బహుముఖీనమైన వారి యీ వ్యక్తిత్వం, పుట్టపర్తికి ఆదర్శం. అందుకే వారి గదిలో సమర్థ రామదాసులవారి చిత్ర పటం, పుష్పమాలాలంకృతమై ఉన్నదిప్పటికీ!
ఇప్పుడున్న నారాయణ బాబా గారు కడపకు ఎప్పుడు వచ్చినా రామ మూర్తిగారి ఇంటిలోనే వారి బస. వారి వద్ద సుమారు మూడు నాలుగు అడుగుల సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు, వాటికి పూజలు, వారితో వచ్చే శిష్య సమూహానికి ఏర్పాట్లూ – ఇవన్నీ రామమూర్తి గారు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు.
పుట్టపర్తికి ఉన్న పాండిత్యం, కవిగా వారికున్న కౌశలం – ఇవి కాకుండా ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా బలం, ఇంతే కాక దేశ భక్తి కూడా నారాయణ్ మహారాజ్ కి చాలా నచ్చిన అంశాలు. అందుకే వారు కడపకు విచ్చేసినప్పుడు, పుట్టపర్తికి తప్పక కబురు పెట్టేవారు.
*****
(సశేషం)