నేనొక జిగటముద్ద

 (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

– జె.డి.వరలక్ష్మి

గురితప్పి పోవడంలేదు నా ఆలోచనలు
నువ్వు కానుకిచ్చిన కపట ప్రేమను
గుచ్చి గుచ్చి చూపిస్తూ పొడుచుకుంటూ పోతున్నాయి..
మెదడులో దాగిన మోసాన్ని అరచేతుల్లో పులుముకొని
వెన్నంటే ఉంటానని నువ్వు చేసిన ప్రమాణాలు
గుండె గోడలకు బీటలు తీసి ఉప్పొంగుతున్న రక్తంబొట్లను
కన్నీరుగా నేలరాలకముందే ఆవిరి చేస్తున్నాయి..
విసురుగా నోటి నుండి వచ్చే ఆ మాటల నిప్పురవ్వలు
నన్ను నిలబెట్టి నిలువెల్లా దహించేస్తాయి..
నాకెంత ఓపికో నాకే అంతుపట్టడం లేదు
నెత్తిన అవమానాల కన్నీటి కుండలను మోస్తూ
నవ్వుతూ నడుస్తూ వెళ్తుంది ఎవరికోసం!
మొరటుగా ఆటలాడుతూ చిద్రం చేస్తున్న
చంటిబిడ్డ చేతిలో రూపం మారిన బొమ్మలా
చిత్రమైన బంధాలకు చిక్కి ముక్కలవుతున్న
నా హృదయం నేలజారి తునాతునకలైనా
నీ ప్రతిరూపానికి జన్మనిచ్చే జీవం లేని బ్రతుకుటద్దం..

కోరిక తీరని చూపుల మధ్య నడిచే శవంలా ప్రయాణం నాది
ఈ గమ్యం ఏ తీరానికో!
ఉక్రోషపు పదాల ఇటుకలతో అందంగా
నాకు సమాధిని పేరుస్తూ నువ్వు అలసిపోకే..
నా ఆత్మవిశ్వాసపు కొనఊపిరి నుదుటిగీతకు ఎదురు నిలబడి
ఆత్మహత్య కట్టడపు మెట్లు ఎక్కనివ్వదు..
విలువ తెలియని నీకు నేనొక జిగట ముద్ద..
చెంపలను వేడెక్కించే సలసల మరుగుతున్న కన్నీటితో
నేను అనుక్షణం యుద్ధం చేస్తున్న యోధురాలిని..
వికృత చేష్టల చేతుల నుండి
పూడ్చి పెడుతున్న కట్టుబాట్లకంచెలు తెగి విడుదల పొందితే
ఆకాశానికి అరచేతితో నీడనిస్తాను.
ఇప్పుడు నేను స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని
జీవితాన్ని గెలిచి తిరిగి వచ్చే ప్రాణమున్నపసిడి బొమ్మని
పదిమందికి అన్నం పెట్టే అన్నపూర్ణని..
తరగని ప్రేమాభిమానాలు పంచే అక్షయపాత్రని..
నేను ఎప్పటికీ మట్టిదుప్పటి కప్పుకున్న వజ్రాన్నే
సానపడితే సప్తవర్ణాలను నీ మనసుకు బహుమతిస్తాను
కీర్తి శిఖరాల అంచున నిలబడి చల్లని నవ్వు నవ్వుతాను.

*****

Please follow and like us: