వ్యాధితో పోరాటం-33

కనకదుర్గ

ఆ రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఈ ఆసుపత్రులల్లో పడి వుండాలి? అసలు నేనింక ఇంటికి వెళ్తానా? పిల్లలతో మనసారా సమయం గడుపుతానా? అసలు ఈ జబ్బు తగ్గుతుందా? నేను బ్రతుకుతానా? నేను లేకపోతే ఇద్దరు పిల్లలతో శ్రీనివాస్ ఎలా వుంటాడు? అసలు ఎందుకిలా అయి పోయింది నా బ్రతుకు? ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? నాకేమన్నా అయితే అమ్మా, నాన్న ఎలా తట్టుకుంటారు? మిగతా వాళ్ళంటే వారి జీవితాలు వారికున్నాయి, కొన్నాళ్ళు బాధ పడినా వాళ్ళ సంసారాల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎక్కువగా దెబ్బ తినేది శ్రీనివాస్, పిల్లలు, అమ్మా, నాన్న. అమ్మా, నాన్న ఇప్పటికే నా తమ్ముడ్ని పొగొట్టుకున్నారు. ఆ బాధ వారికి తీరేది కాదు కానీ ఉన్నవాళ్ళందరూ జీవితాల్లో సెటిల్ అయ్యారు, బాగున్నారు అనే సంతోషంతో ఉన్నారు. అందరికీ చేయాల్సినవన్నీ చేసామనే తృప్తితో ఉన్నారు.

ఇపుడు నాకేమన్నా అయితే వాళ్ళేమవుతారు? వృద్దాప్యంలోకి అడుగుపెట్టారు, వాళ్ళు తట్టుకోగలరా?

శ్రీని ఇండియాకెళ్ళిపోతే బావుంటుంది.

ఇక్కడ ఒక్కడుండి ఇద్దరు పిల్లల్ని పెంచడం కష్టమవుతుంది.

ఇపుడు మాత్రం తనొక్కడే చూసుకోవటం లేదా? కానీ చైతన్యని ఇద్దరం కల్సే పెంచాం కదా. నాకు తగ్గితే మళ్ళీ అలాగే ఇద్దరం ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకోగలం అనుకున్నాం.

కానీ ఇపుడు నేను సడన్ గా పోతే శ్రీని ఎలా తట్టుకుంటాడు? ఇప్పటికే తల్లి రెండేళ్ళ క్రితం యాభై ఏళ్ళ వయసులో హార్ట్ ఫెయిల్యూర్ తో పోతే అప్పటికపుడు పరిగెత్తాం. ఫ్లయిట్లో ఇద్దరం ఏడుస్తూనే వున్నాం. చైతన్యకి అర్ధం కాలేదు, భయ పడ్డాడు. ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు ఆమె పోయి. తల్లితోనే బాగా క్లోజ్ గా ఉండేవాడు. ఆవిడతో అన్ని విషయాలు పంచుకునేవాడు.

రెండేళ్ళలోపే జీవితాంతం కల్సి వుండాల్సినవారం ఇలా అర్ధాంతరంగా నా ప్రాణం పోతే తనేమైపోతాడు? పిల్లలు ఎలా పెరుగుతారో? నేను చూసుకున్నట్టుగా వేరేవారు చూసుకుంటారా? ఎందుకిలా అయ్యింది నా జీవితం? ఈ రోగం ఇంతలా ఎక్కువవ్వాలా? దరిద్రం. నన్ను ఎక్కువగా బాధ పెడ్తుంది నేను చనిపోతే శ్రీని, పిల్లలు, అమ్మా, నాన్న ఎలా వుంటారా అని?

ఒక్కసారి తల విదిల్చాను.

ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నాను.

నేనే ఇట్లా డీలా పడితే ఎలా?

శ్రీని ఇంకా అధైర్యపడతాడు.

ఇప్పటివరకు నేను తను ఎక్కువ కష్టపడకూడదు, తను నేను ఎక్కువ బాధ పడకూడదు అనుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగుతు న్నాము.

ఎవ్వరైనా ఒక్కరు ఇండియా నుండి కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ కానీ వస్తే బాగుండు సాయానికి. పాపను చూసుకోవడానికి జోన్ వుంది, చైతన్యను స్కూల్ కు, వాడి ఇతర యాక్టివిటీస్ కి  శ్రీనివాస్ తీసుకెళ్తాడు, ఒక మనిషి ప్రక్కన ధైర్యం చెప్పే వాళ్ళుంటే బావుంటుంది అని అనిపించసాగింది.

సర్జరీ డిపార్ట్మెంట్ నుండి సర్జన్స్ వచ్చి చూసారు.

“పాన్క్రియాస్ లో ఇంకా స్టోన్స్ ఉన్నాయి కాబట్టి, సర్జరీ చేసి ఆ స్టోన్స్ తీసేసి, పాన్క్రియాటిక్ డక్ట్ ఓపెన్ చేసి దాన్ని చిన్న ప్రేవులకి కుట్టేస్తే ఒకవేళ భవిష్యత్తులో పాన్క్రియాస్ లో స్టోన్స్ వచ్చినా అవి చిన్నప్రేవుల ద్వారా వెళ్ళిపోతాయి……. ”

నాకు తల తిరిగిపోతుంది. వాళ్ళేం చెబుతున్నారో సరిగ్గా అర్ధం కావటం లేదు. నా గుండె దడదడలాడసాగింది. ” ఈ సర్జరీకి ఎంత సమయం పడ్తుంది?” అని అడిగా.

” గాల్ బ్లాడర్ తీయాల్సి వస్తే ఇంకా ఎక్కువ సమయం పడ్తుంది. కానీ మీ గాల్ బ్లాడర్ బాగానే వుంది కాబట్టి అంత సమయం పట్టదనుకుంటున్నాం. మాములుగా అయితే నాలుగయిదు గంటల్లో అయిపోతుంది.” అన్నారు.

“ఈ సర్జరీ ఎప్పటి వరకు చేయవచ్చు? ఎమర్జన్సీగా చేయాలా? కొన్ని రోజులు ఆగొచ్చా?”

“ఎక్కువ రోజులు ఆగడం మంచిది కాదు…”

“ఒక పదిరోజుల తర్వాత చేస్తే ఓకేనా?”

ఇద్దరు సర్జన్స్ ఒకరి మొహాలొకరు చూసుకొని, ” పదిరోజులైతే ఓకే కానీ ఎందుకు?”

“పిల్లల్ని చూసి, వారితో కొన్ని రోజులు టైం గడిపి రావాలని వుంది ప్లీజ్!”

“ఓకే. యూ కెన్ గో హోం అండ్ కమ్ టు సీ అజ్ ఇన్ ది ఆఫీస్, దెన్ వియ్ కెన్ షెడ్యూల్ ద డేట్ ఫర్ ది సర్జరీ,” అన్నారు.

“థ్యాంక్ యూ సో మచ్… నేను పిల్లలతో సమయం గడిపి చాలా రోజులయింది. పాపకి రెండు నెలలే, తనతో ఉండాల్సిన సమయంలో నేనిక్కడ ఉండాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ అండర్ స్టాండింగ్. ఐ యామ్ సో గ్రేట్ ఫుల్!” అన్నాను ఎమోషనల్ గా.

“ఓకే, యూ కాన్ట్ గో నౌ యాజ్ యువార్ స్టిల్ ఇన్ పేయిన్, అది కంట్రోల్లోకి వచ్చిం తర్వాత డ్యూటి డాక్టర్ కి చెబితే డిశ్చార్జ్ చేస్తారు. హావ్ గుడ్ టైం విత్ యువర్ కిడ్స్ అండ్ కం బ్యాక్, వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ.” అని దగ్గరికి వచ్చి షేక్ హ్యాండిచ్చి వెళ్ళారిద్దరు సర్జన్స్.

ఇంటికెళ్ళొచ్చు అన్న మాటొకటే నాకు గుర్తుంది. సర్జరీ గురించి కానీ ఇంకే విషయాలు గుర్తు లేవు.

శ్రీనికి ఫోన్ చేసి చెప్పాను, చైతుకి చెప్పొద్దు వాడ్ని సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పాను. ఇంక ఇంటికి వెళ్ళడానికి వేయిట్ చేస్తున్నాను.

టి.పి.ఎన్ (న్యూట్రిషనల్ సప్లిమెంట్ వేయిట్ పెరగడానికి పెట్టారు) వల్ల రోజు విరేచనాలు, వాంతులవుతున్నాయి. నొప్పి కూడా తగ్గడం లేదు. నాకు విసుగొస్తుంది.

డాక్టర్ రోజు వచ్చి అడిగి వెళ్తున్నాడు, ” హౌ ఆర్యూ ఫీలింగ్?”

“నో, ఐ యామ్ నాట్ ఫీలింగ్ బెటర్ యెట్,” అని చెప్పడం ఆయన “బెటర్ లక్ నెక్స్ట్ టైం,” అని వెళ్ళడం మామూలవుతుంది.

నేను నొప్పి లేదని చెప్పి ఇంటికి వెళ్ళినా ఏం లాభం. నొప్పితో బాధ పడడం. పిల్లలు భయపడడం. ఏం చేయను?

శ్రీని పెద్దగా ఆశ పెట్టుకోలేదు. ఒకసారి అనుభవమైంది కదా! డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళడానికి ముందే నొప్పి ఎక్కువయి డిశ్చార్జ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అడ్మిట్ చేసుకున్నరోజు ఇంకా మర్చిపోనేలేదు. ఈ పిచ్చి జబ్బు వల్ల ఎప్పుడు ఏమౌతుందో తెలీదు.

నాకు నీరసం ఎక్కువవుతుంది. ఇంటికి వెళ్ళలేనేమో అనే బాధ ఎక్కువవ్వ సాగింది. డాక్టర్స్ మళ్ళీ కొన్ని టెస్ట్స్ చేసారు ఎందుకంటే నొప్పి ఎక్కువవుతుంది, వాంతులు, విరేచనాలు ఆగటం లేదు. నేను భయపడుతున్న రోజు వచ్చింది. సర్జన్స్ ఇద్దరు వచ్చారు, ” ఇన్నిరోజులయ్యింది. ఇంకా ఇంటికి వెళ్ళాలనుకుంటే ఐ డోంట్ థింక్ వియ్ కాన్ట్ అలౌ ఇట్ ఎనీమోర్, సారీ!” అన్నాడు ఒక సర్జన్.

” ఐ నో! నేను సర్జరీకి ముందు పిల్లలతో ఒకసారి సమయం గడపాలనుకున్నాను. ఒకవేళ సర్జరీ అపుడు కానీ తర్వాత కానీ నేను చనిపోతే నా పిల్లలతో సమయం గడప లేను కదా!” అన్నాను కళ్ళలో నుండి కన్నీళు కారుతుండగా.

మరో డాక్టర్ దగ్గరకి వచ్చి, ” నువ్వింకా ఎక్కువ డిలే చేస్తే అదే జరుగుతుంది. మీ ఫ్యామిలీ ఎపుడు వస్తున్నారు?” అని అడిగాడు.

“ఈ రోజు సాయంత్రం.” అన్నాను కన్నీళ్ళు తుడుచుకుంటూ.

“దట్స్ గుడ్! ఈ రోజు వాళ్ళతో మాట్లాడి అందరూ కల్సి నిర్ణయించండి. కానీ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఒకవారం లోపల చేయకపోతే ఏం జరుగుతుందో మేము చెప్పలేము. సర్జరీ అయ్యి రికవరీకి ఇక్కడ కొన్నిరోజులుండి, ఇంటికెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రికవరీ కంప్లీట్ చేయొచ్చు. ఓకే!”

“నేను చనిపోయే అవకాశం వుందా సర్జరీ అపుడు కానీ తర్వాత కానీ,” అని ధైర్యంగా అడిగేసాను.

“మేము అలా జరగకుండా వుండడానికే ప్రయత్నిస్తున్నాము. కానీ ఎక్కువ ఆలస్యం చేస్తే మాత్రం అదే జరగవచ్చు. మేము ఈ రోజు రాత్రి డ్యూటీలో వున్నాము. మీ నిర్ణయం రాత్రయినా చెపితే మేము మా సర్జన్ కి తెలియచేస్తాము, వాళ్ళు వెంట వెంటనే అన్నీ అరేంజ్ చేసుకుంటారు, సరేనా!”

” సరే! థ్యాంక్ యూ వెరీ మచ్!”

నా మనసులో ఇంకా భయం వదలడం లేదు. నేను నర్స్ ని పట్టుకుని నా భయం చెప్పి శ్రీని వాళ్ళొచ్చినపుడు మేం కాసేపు కార్లో ఒక పావుగంట వెళ్ళి రావొచ్చా అని అడిగాను. ఆ నర్స్, ” ఈ విషయం నర్స్ మానేజర్ తో మాట్లాడాలి, నేను అట్లాంటి పర్మిషన్ ఇవ్వలేను.”

“ఆవిడ ఎక్కడుంటుంది?”

“అదిగో అక్కడ పేషంట్స్ తో మాట్లాడుతుంది కదా, ఆవిడే! వెళ్ళి అడిగితే వీలైతే వెళ్ళమని చెబ్తుంది లేదా వేరే ఏదైనా చెబ్తుంది.” అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్.

నేను నా ఐ.వి పోల్ పట్టుకుని నర్స్ మానేజర్ ఉన్న దగ్గరకు వెళ్ళాను. ఆవిడ ఒక పేషంట్ తో మాట్లాడుతోంది. నేను వేయిట్ చేసాను. ఆ పేషంట్ వెళ్ళింతర్వాత నేను దగ్గరికి వెళ్ళి నా కోరిక చెప్పాను. దానికి ఆవిడ, “కాదమ్మా! అది సాధ్యం కాదు. పేషంట్స్ హాస్పిటల్ బయటాకు వెళ్ళడానికి అనుమతినివ్వరు, మేము అదే రూల్ పాటించాలి. సారీ మిస్ డుర్గా!” అంది.

” ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అగెయిన్…నేను రెండు నెలల నుండి హాస్పిటల్స్ లో వున్నాను. నాకొక బాబు, చిన్న బేబి వుంది. ఐ మిస్ దెమ్ సో మచ్! మేము చాలా సేపు వెళ్ళం. ఒక పావుగంట పిల్లలతో కార్లో అట్లా తిరిగి వచ్చేస్తాము…ప్లీజ్ ట్రై టు అండర్ స్టాండ్…”

“ఐ డూ అండర్ స్టాండ్ యువర్ సిట్యుయేషన్ బట్ ఐ యామ్ హెల్ప్ లెస్….”

నాకు ఏడుపొస్తుంది… నా కళ్ళల్లో నీళ్ళు నాకు తెలియకుండానే బయటకు రాసాగాయి.. అవి చూసిన నర్స్ మానేజర్, “హే మిస్ దుర్గా! నో డోంట్ బి సాడ్ ప్లీజ్! లెట్ మి థింక్ వన్ మినిట్. మనం ఒక పని చేయవచ్చు. మీ ఫ్యామిలీతో ఎలెవేటర్లో గ్రౌండ్ ఫ్లోర్లో కాఫిటేరియాకి వెళ్ళి కొంచెం సేపు సమయం గడిపి రావొచ్చు… ఏమంటావ్?”

“కానీ….”

“నీకు బయటకు వెళ్ళాలని వుంది కానీ ఇట్స్ నాట్ పాజిబుల్, వై డోంట్ యూజ్ ది కాఫిటేరియా, కాసేపు ఫ్యామిలీతో కల్సి ఒక అరగంట గడపొచ్చు. మేము ఇక్కడే వుంటాము, నీకు ఏమైనా అయితే మెడికల్ స్టాఫ్ అంతా ఇక్కడే వుంటారు. ఇట్స్ ఏ నైస్ ఆప్షన్ డియర్!”

ఇంక ఇంతకంటే ఎక్కువ వాళ్ళేమి చేయలేరని అర్ధమయ్యింది. “సరే. థ్యాంక్యూ వెరీ మచ్. ఐ విల్ లెట్ యు నో వెన్ మై ఫ్యామిలీ కమ్స్.” అని ఐ.వి పోల్ పట్టుకుని నా రూంకి వచ్చి కాసేపు పడుకునే ముందర నొప్పికి ఇంజెక్షను తీసుకుని పడుకున్నాను. నేను లేచేవరకు నాలుగ్గంటలైంది. రెండు గంటల తర్వాత శ్రీని పిల్లల్ని తీసుకుని వచ్చాడు.

నర్స్ మానేజర్ వీళ్ళు రావడాన్ని చూసి నా రూంకి ఒక మనిషిని మాతో వెళ్ళడానికి తీసుకొచ్చింది. నేను నా ఐ.వి పోల్ తీసుకున్నాను, పాపను కార్ సీట్లో పడుకోబెట్టుకొచ్చాడు. మేమంతా మాతో వెళ్ళడానికి వచ్చినతను, మార్టిన్, అందరం కలిసి ఎలవేటర్లో క్రింద గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళాము. వెళ్ళాక కాఫిటేరియాలో కూర్చున్న తర్వాత పాపని ఎత్తుకుని కూర్చున్నాను. మార్టిన్ మాకు ప్రైవసీ ఇవ్వడానికి బయటే ఎవరో కనపడితే మాట్లాడుతూ నిల్చున్నాడు.

శ్రీని, చైతన్య కాఫిటేరియాలో వాళ్ళు తినగలిగే తిండి ఏదన్నా దొరుకుతుందేమో చూడటానికి వెళ్ళారు. పాప కాసేపు బాగానే వుందనుకుంటుండగా ఏడుపు మొదలు పెట్టింది.

నేను లేచి నిలబడ్డాను. కానీ ఎత్తుకుని నడవలేను నా ఐ.వి పోల్ తో. ఇంతలో శ్రీని, చైతన్య తిండి తీసుకుని వచ్చారు. చీజ్ పిజ్జా, మాష్డ్ పొటెటోస్, ఫ్రూట్ కప్. ఐస్క్రీమ్ తెచ్చుకున్నారు. శ్రీని పాపని ఎత్తుకున్నాడు. “నేనెత్తుకుంటాలే నువ్వు తిను శ్రీని,” అన్నాను.

“పర్వాలేదులే నేనొకచేత్తో ఎత్తుకుని ఇంకో చేత్తో తింటాను.”

“నన్ను పూర్తిగా మర్చిపోతుంది. నేనెత్తుకోగానే ఏడుస్తుంది,” అన్నాను బెంగగా.

“అదేం లేదులే. ఈ హాస్పిటల్ వాతావరణం దానికి నచ్చడం లేదు అంతే. నువ్వు కొంచెం కోలుకుని ఇంటికి వచ్చేసి ఇంట్లోనే వుంటే నిన్నింక అస్సలు విడిచి పెట్టదు, తెలిసిందా!” అన్నాడు శ్రీని.

“అవునమ్మా! పాపకి నువ్వే కావాలి. దానికి హాస్పిటల్స్ ఇష్టం లేదు అంతే! నువ్వేం వర్రీ కాకమ్మా!” అన్నాడు చైతన్య.

వాడి పక్కకు వెళ్ళి కూర్చున్నాను. “నాన్న చైతన్య స్కూల్ ఎట్లా వుంది?”

“బావుందమ్మా! నిన్న నీకు స్కూల్ నుండి రాగానే చెప్పాను కదా! మా టీచర్, మిష్టర్ మైకెల్ నాతో చాలా సేపు మాట్లాడాడు. నన్నేమి భయపడవద్దని, నీకు మంచి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని, నాకేమన్నా డౌట్స్ వుంటే నిన్ను కానీ నాన్నను కానీ అడగమన్నాడు.”

“దట్స్ గుడ్! నీకేం అనిపించింది ఆయన అట్లా మాట్లాడితే?”

“చాలా బాగా అనిపించిందమ్మా! నాకు చాలా భయముండేది కానీ ఇపుడు అంత భయం లేదు.” అన్నాడు ఐస్క్రీమ్ తింటూ.

“నేను ముందు ఇంటికి వచ్చి మీతో టైం గడిపింతర్వాత మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి అపుడు సర్జరీ చేయించుకుందామనుకున్నాను….” నా మాట పూర్తి కానేలేదు చైతన్య, ” ఎందుకమ్మా రెండుసార్లు హాస్పిటల్ కి రావడం. ఒకటేసారి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చేయవచ్చు కదా! అపుడు నువ్వు ఇంట్లోనే వుండొచ్చు, అపాయింట్మెంట్ వుంటే రావొచ్చు కదమ్మా!” అన్నాడు ఎంతో నిబ్బరంగా.

నేను వాడి మాటలకు ఆశ్చర్యపోయాను. చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అని చిన్నప్పట్నుంచి విని విని తల పండిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలయితేనే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో చైతన్య పదేళ్ళ వయసులోనే నేను మీకు సాయం చేయగలనంటూ రోజూ స్కూల్ నుండి రాగానే నాకు ఫోన్ చేసి స్కూల్ లో ఆ రోజు ఏం చేసాడో చెప్పడం, నేను పాప ఎట్లా వుంది అనడిగితే, ’పాప బాగుందమ్మా! బాగా ఆడుకుంటుంది, పాలు తాగుతుంది, రాత్రి కుడా బాగా పడుకుంటుంది, అస్సలు విసిగించదు. నువ్వు దాని గురించి ఆలోచించకమ్మా! జోన్ బాగా చూసుకుంటుంది. దాన్ని చూసుకోవడానికి జోన్, నేను, నాన్న ఉన్నామమ్మా! కానీ నిన్ను చూసుకోవడానికే అక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు బాగా కేర్ తీసుకుని, ట్రీట్మెంట్ త్వరగా అయిపోయి నువ్వు ఇంటికి వస్తే అపుడు మేమంద రం నిన్ను కూడా చూసుకుంటామమ్మా!’ అంటాడు.

నేను వాడి ఫోన్ కోసం ఎదురు చూసేదాన్ని. వాడితో మాట్లాడింతర్వాత నాకు కొంచెం ఊరటగా ఉండేది మనసుకి. శరీర బాధ కూడా కాసేపు మర్చిపోయే దాన్ని. పాపం చిన్నవాడు అందరిలా నార్మల్ గా ఆడుతూ, పాడుతూ పెరగాల్సిన వాడు, అమ్మకి ఈ జబ్బెందుకొచ్చిందో తెలియదు, అది అసలు తగ్గుతుందా లేదా తెలియదు, అమ్మ ఇంటికి వస్తుందా లేదా తెలియదు, అమ్మ మళ్ళీ మామూలుగా అవుతుందా చెల్లితో నాతో ఆడినట్టు ఆడుతుందా? ఇలాంటి ప్రశ్నల మధ్య, ఆ చిన్న మెదడులో ఎన్నెన్ని ఆలోచనలు ఎగిసెగిసి పడుతున్నాయో పాపం!

ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినా ఉన్న నలుగురిలో అందులో పదేళ్ళ పిల్లాడు పెద్దవాళ్ళలా ధైర్యం చెప్పగలడని ఎప్పుడన్నా అనుకున్నామా?

ఇది కష్టాల్లో వున్నపుడు వయసుతో నిమిత్తం లేకుండా నేనున్నానంటూ ముందుకు వస్తున్న ఈ చిన్న కుటుంబ సభ్యుల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చని పించింది.

పిల్లలతో సమయం గడపాలి అన్న తాపత్రయమే కానీ, ఈ సర్జరీ అయిపోగానే ఇంటికెళ్ళి పిల్లలతో ఉండొచ్చు కదా అని ఎందుకనుకోలేదు నేను. నెల రోజులు ఇంటి దగ్గర హాస్పిటల్ లో, ఇక్కడి కొచ్చి పదిరోజులవుతుంది. సర్జరీ అయి నేను ఎపుడింటి కెళ్తానో తెలియదు. అందుకే పిల్లల పై అంత బెంగొచ్చేసింది. దానివల్ల సరిగ్గా ఆలోచించలేకపోయాను.

చైతన్య మాటలు విన్నాక నేను శ్రీని వైపు చూసాను. శ్రీని కనుబొమ్మలెగరేసాడు, చూసావా మనవాడు ఎంత తెలివికలవాడో! అన్నట్టు చూసాడు.

“అంతేనా చైతన్య సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చేయనా? అదే ఈజీ కదా! నేనేమో మీ దగ్గరకు వచ్చి మీతో టైం గడిపి ఆ తర్వాత సర్జరీ చేయించుకుందా మనుకున్నాను, ఇట్స్ సో సిల్లీ కదా! ఇంటికి రావాలని టైం వేస్ట్ చేసాను. ఈ రాత్రి సర్జన్స్ కి చెప్పేస్తాను. వాళ్ళెప్పుడు చేస్తామంటే అపుడే చేసేయమంటాను, సర్జరీ తర్వాత రెండు, మూడ్రోజులుంచుకుంటారేమో. ఆ తర్వాత ఇంటికొచ్చి రికవర్ అయ్యి నార్మల్ అవ్వడమే ఇక, కదా బంగారం!” అని నా చెయ్యితో వాడి చేతికి హై ఫైవ్ ఇచ్చాను.

“యస్ అమ్మా! అపుడు నువ్వు స్ఫూర్తితో నాతో ఆడుకున్నట్టు ఆడొచ్చు.” అన్నాడు సంతోషంగా.

“నీతో ఆడిన ఆటలన్నీ నీకు గుర్తున్నాయా కన్నా!”

“అన్నీ గుర్తున్నాయి. సాకర్ (ఫుట్ బాల్) ప్రాక్టీస్ చేయించడానికి లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చి అవి చదివి నాతో ప్రాక్టీస్ చేయించేదానివి. ఎక్కడ పార్క్ కి వెళ్ళినా నాతో పాటు అక్కడ వున్నవన్నీ ఎక్కి ఆడేదానివి, మనమిద్దరం కలిసి ఉయ్యాలలూగే వాళ్ళం! సెలవుల్లో నాన్న, నువ్వు, నేను బోర్డ్ గేమ్స్ ఆడేవాళ్ళం, ఒకోసారి అవి రోజులు రోజులు ఆడేవాళ్ళం గుర్తుందా అమ్మా! అది చాలా ఫన్ గా వుండేది. చలికాలంలో స్నోలో స్లెడ్ తీసుకెళ్ళి లైబ్రరీ దగ్గర హిల్స్ పై నుంచి క్రిందకి జారే వాళ్ళం. స్నో ఎక్కువ పడితే ఆడి ఆడి కాళ్ళు, చేతులు ఫ్రీజ్ అయిపోయేవి. నీకు తగ్గిం తర్వాత స్ఫూర్తితో ఇవన్నీ ఆడదామమ్మా, సరేనా!” అన్నాడు చైతన్య.

“తప్పకుండా నాన్న. అన్నీ ఆడదాం, అన్నీ చేద్దాం! మనమందరం కల్సి చేద్దాం స్ఫూర్తి పాపతో!”

శ్రీని దగ్గరికి వచ్చి, “సో ఏం డిసైడ్ చేసారు తల్లీ, కొడుకు కల్సి?”

పాప కార్ సీట్లో పడుకుంది. “అమ్మ సర్జరీ చేయించుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తుందోచ్!” అన్నాడు చైతన్య సంతోషంగా.

మాతో క్రిందకి వచ్చిన మార్టిన్ లోపలికి వస్తున్నాడు అంటే టైం అయిపోయి నట్టుంది. పైకి వెళ్ళాలి.

“మీరు మళ్ళీ పైకెందుకు రావడం. ఇక్కడ నుండే ఇంటికి వెళ్ళండి,”

“వద్దు, మేం పైకి వస్తాం. రేపు స్కూల్ లేదుగా.” అన్నాడు చైతన్య.

“పాప లేచి ఏడుస్తుందేమో రా!”

“ఏం కాదు. ఇంకొంచెంసేపుంటాం.”

శ్రీని కూడా “సరే,” అన్నాడు ఎందుకంటే బోజనం అయిపోయింది, వెళ్ళి పడుకోవడమే.

నాకు కొంచెం రూంలో నుండి కాస్త క్రిందకి వెళ్ళి నార్మల్ మనుషుల్లో కూర్చొని వచ్చాక, పిల్లలతో సమయం గడిపాక చైతు మాటలు విన్నాక నాకు నిజంగానే ధైర్యం వచ్చింది.

శ్రీని పిల్లలను తీసుకుని ఇంటికి బయల్దేరాక నర్స్ కి నా నిర్ణయం చెపితే ఆమె వెళ్ళి సర్జన్స్ కి చెప్పింది. పొద్దున వచ్చిన సర్జన్స్ వచ్చారు సమయం వ్యర్ధం చేయ కుండా.

“సో మిస్ దుర్గా, కంగ్రాట్స్ ఫర్ టేకింగ్ ద డిసిషన్! మా మాట విన్నందుకు థ్యాంక్స్. ఇంక వారం లోపల చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోవచ్చు అందుకని బుధవారం చేయడానికి రెడీగా వున్నారు సీనియర్ సర్జన్స్. ఆ రోజుకి మీ సర్జరీ కన్ఫర్మ్ చేసేస్తాము. మీ ఫ్యామిలీ వారికి ఇన్ఫార్మ్ చేసుకొండి! మాకు శని, ఆదివారాలు వర్క్ లేదు. రేపు ఎల్లుండి ఇంతకు ముందు వచ్చిన సర్జన్ వచ్చి చూస్తారు. మేము సోమవారం మళ్ళీ కలుస్తాము. మీకు ఎపుడైనా నొప్పెక్కువైతే వెంటనే చెప్పండి. అవసరం పడితే ఎమర్జన్సీ సర్జరీ చేస్తారు…..”

“ఓహ్! అంత సీరియస్ గా ఉందా? అసలు సర్జరీ సక్సెస్ అవుతుందా? ఈజ్ దేర్ ఎనీ చాన్స్ ఆఫ్ డెత్?” అని అడిగాను కంగారుగా.

“ఓ, నో నో నో. నో నీడ్ టు వర్రీ దట్ మచ్. జస్ట్ ఫర్ ప్రికాషన్ జాగ్రత్తగా వుండా లని చెప్పాము. వియ్ విల్ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యూ! యూ ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్… వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సర్జన్స్ టేకెన్ యువర్ కేస్. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ  నో నీడ్ టు వర్రీ మిస్ దుర్గా! ఓకే!”

“ఆర్ యూ ష్యూర్?” అన్నాను భయంగా.

” ఎస్ వియ్ ఆర్ వెరి మచ్ ష్యూర్! గెట్ సమ్ స్లీప్, యు హాడ్ ఎ టఫ్ డే, టేకింగ్ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్. నౌ రిలాక్స్ అండ్ స్లీప్. సీ యూ ఆన్ మన్డే.”

ఆ రాత్రంతా కలత నిద్రే, మధ్యలో యాంగ్జయిటీకి ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వమంటే డ్యూటీ డాక్టర్ని అడిగి ఇచ్చే వరకు ఓ గంటయింది.

ఇంజెక్షన్ పని చేసి పడుకునేవరకు మూడయ్యింది.

మర్నాడు డ్యూటీ డాక్టర్ వచ్చాడు అతనితోపాటు మెడిసన్ స్టూడెంట్స్ వచ్చారు గుంపుగా. డాక్టర్ వచ్చి చెక్ చేసి సర్జన్ తర్వాత వచ్చి చూస్తాడని చెప్పి ఆ గుంపు వైపు తిరిగి, “వీళ్ళు కాబోయే డాక్టర్లు. నీ కేస్ ని స్టడీ చేస్తారు నీకు ఓకే నా?” అని అడిగాడు.

“ఓ.కే, నో ప్రాబ్లెమ్,” అన్నాను.

ఆయన వాళ్ళ వైపు తిరిగి నా కేస్ గురించి వివరించి నన్ను ప్రశ్నలు వేయొ చ్చని, గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోయారు.

నాకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే చాలా సరదాగా ఉంటుంది.

ఒకమ్మాయి రూంలోకి వచ్చినప్పట్నుంచి ఒకటే మాట్లాడుతుంది, నవ్వుతుంది. తనే నన్ను మొదటగా టెస్టింగ్ మొదలుపెట్టింది. ముందు మామూలుగానే మాట్లాడిం ది.

సడన్ గా, ” మిస్ డింగరి వాట్ ఈజ్ యువర్ హైట్?” అని అడిగింది.

నేను, ” ఐ యామ్ ఫైవ్ ఫీట్ వన్ ఆర్ టూ ఇన్చెస్,” అన్నాను.

గొల్లున నవ్వింది, తనతో పాటు మొత్తం గ్రూప్ నవ్వారు.

నాకర్ధం కాలేదు. అంటే నేను తప్పు చెప్పానా? నేను అంత హైట్ ఉండననా తన ఉద్దేశ్యం! నాకు చాలా బాధగా అనిపించింది.

మీరు రకరకాల పేషంట్స్ ని కలిసి వాళ్ళ జబ్బుల గురించి ఎంత నేర్చుకో గలిగితే అంత మంచిది. పేషంట్స్ ని మనుషులుగా చూడకుండా కేవలం శరీరాలుగా చూస్తే ఆ పేషంట్స్ మనోభావాలు దెబ్బ తింటాయి.

నేను కొంచెం తేరుకుని, “వ్వాట్ హ్యాపెన్డ్! డిడ్ ఐ సే సంథింగ్ రాంగ్?” అని అడిగా.

“నో నో నో… ఇట్స్ నాట్ లైక్ దట్! ఇఫ్ యూ ఆర్ ఫైవ్ వన్ ఆర్ టూ దెన్ ఐ విల్ బి ఫైవ్ సెవెన్ ఆర్ ఎయిట్…” అని మళ్ళీ పగలబడి నవ్వసాగింది.

ఆ అమ్మాయి కొంచెం నా హైట్ లాగే వుంది, ఆరోగ్యంగా వుంది. నేను సన్నగా వున్నాను, పైగా నేను భయంకరమైన నొప్పితో బాధ పడ్తున్న పేషంట్ని, హాస్పిటల్ గౌన్ లో మునిగిపోయి వున్నాను.

నేనేం అనలేదు. నేనక్కడ పడుకునే వున్నాను. నా గురించి చెప్పుకుంటూ పగలబడి నవ్వుతుంటే ఒళ్ళు మండిపోయింది. నాకు ఉక్రోషం వచ్చింది కానీ ఏమీ అనలేదు.

వాళ్ళడిగే వాటికి ఒకటి, రెండు మాటల్లో సమాధానం చెప్పాను. వాళ్ళల్లో ఒకమ్మాయి వేరుగా సింపుల్గా వుంది. నోట్ బుక్ లో ఇంట్రెస్టింగా అన్నీ నోట్ చేసు కుంటుంది. వీళ్ళలాగ అస్సలు పగలబడి నవ్వలేదు. తను నన్ను టెస్ట్ చేసేపుడు చాలా జాగ్రత్తగా అడుగుతూ, అన్నింటికి నా పర్మిషన్ తీసుకుని మరీ టెస్ట్ చేసింది. చాలా నెమ్మదిగా వుంది.

వాళ్ళందరూ పక్క పేషంట్ని చూడడానికి వెళ్ళారు. ఈ అమ్మాయి, “నేనొస్తాను, మీరెళ్ళండి,” అని చెప్పింది.

నేను పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంటే అమ్మాయి చూసి, “ఆర్యూ ఓకే? డిడ్ ఐ హర్డ్ యూ? ఐ యామ్ సారీ?”

“నో నో. యూ డిడ్ నథింగ్, సారీ!”

నా చెయ్యి తన చెయ్యిలోకి తీసుకుని మెత్తగా వత్తింది.

“యూ ఆర్ నాట్ లైక్ దెమ్. యూ ఆర్ సో నైస్.” అన్నాను.

“నేను ఇక్కడి అమ్మాయిని కాదు. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. నేను మా ఫ్యామిలీని, మా వూరిని మిస్ అవుతున్నాను. నాకు ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఇంకా అలవాటవ్వలేదు.”

“వాళ్ళు అలా మాట్లాడవచ్చా? ఒక పేషంట్ తో ఎవరన్నా అలా ప్రవర్తిస్తారా? నేనొక మనిషిని కానట్టే ఒక బాడీ ఇక్కడ పడి ఉంది దాని గురించి ఏమైనా మాట్లాడ వచ్చనుకుంటారేమో!”

“అవును నాకు బాధేసింది. వాళ్ళందరి తరఫున నేను మీకు క్షమార్ఫణ చెప్తున్నాను.”

“నేను చిన్న హాస్పిటల్ నుండి వచ్చాను. అక్కడ అందరూ ఎంత ప్రేమగా చూసుకున్నారో!” అన్నాను.

“పెద్ద హాస్పిటల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.”

” అక్కడంత బాగాలేకున్నా, ఇప్పటివరకు అందరూ బాగానే వున్నారు. ఇలాంటి వారెవరూ తగల్లేదు.” అన్నాను.

“ఓకే నేనెళ్తాను. మళ్ళీ నేను రాలేదని నన్ను ఆట పట్టిస్తారు మీలాగే, నన్ను కూడా నేనక్కడ లేనట్టే ప్రవర్తిస్తారు.”

“థ్యాంక్ యూ ఫర్ టాకింగ్.”

“ఐ విల్ సీ యూ టుమారో.” అని వెళ్ళింది ఆ మంచి అమ్మాయి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.