కనక నారాయణీయం -72

పుట్టపర్తి నాగపద్మిని

          ఇప్పుడున్న నారాయణ బాబా గారు కడపకు ఎప్పుడు వచ్చినా రామ మూర్తిగారి ఇంటిలోనే వారి బస. వారి వద్ద సుమారు మూడు నాలుగు అడుగుల సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు, వాటికి పూజలు, వారితో వచ్చే శిష్య సమూహానికి ఏర్పాట్లూ – ఇవన్నీ రామమూర్తి గారు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు.

          పుట్టపర్తికి ఉన్న పాండిత్యం, కవిగా వారికున్న కౌశలం – ఇవి కాకుండా  ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా బలం, ఇంతే కాక దేశ భక్తి కూడా నారాయణ్ మహారాజ్ కి చాలా నచ్చిన అంశాలు. అందుకే వారు కడపకు  విచ్చేసినప్పుడు, పుట్టపర్తికి తప్పక కబురు పెట్టేవారు. 

          ఈ సారి కూడా నారాయణ బాబా గారి దర్శనం సతీమణితో సహా చేసుకున్నారు పుట్టపర్తి. వారి ద్వారా సమర్థ రామదాసులవారి జీవితాదర్శము, మానవ జీవనలక్ష్య సాధనము వంటి విలువైన విషయాలను విని వాటిని పరి పరి మననం చేసుకుంటూ, ఇంటికి మరలారు పుట్టపర్తి.

***

          వంటింటి నుండీ ఇంటి వెనుకకు వెళ్ళే తలుపు దగ్గర కోతుల కీచులాట శబ్దాలు. నాగ, అరవిందు, వాటిని అనుకరిస్తూ చేసే శబ్దాలు వింటూ, నవ్వుతూ పెరటి తలుపు తీసింది వాళ్ళమ్మ కనకమ్మ.

          వీళ్ళ ఇంటి పక్కనున్న ఇంటిలో వేరుసెనగ పప్పు ఆడించి నూనె తీసే పెద్ద మిషన్లు నడుపుతున్నాడొకాయన. దానికోసం, ఎప్పుడూ, పచ్చి వేరుసెనగ పప్పు మూటలు మూటలుగా తెచ్చి పెడుతూనే ఉంటారు కూలీలెప్పుడూ!!

          రాత్రీ, పగలూ..ఆ మిషిన్లు ఆడుతూనే ఉంటాయి. ఆ వేరుసెనగ పప్పు దొంగిలించేందుకు, లెక్క లేనంత వానర మూక ఎప్పుడూ పోటీలు పడుతూనే ఉంటుంది. తెల్లవారిన దగ్గరి నుంచీ, అక్కడి పనివాళ్ళ కన్నుగప్పి, సందు దొరికినప్పుడంతా వీళ్ళు కాపురముంటున్న ఇంటి పిట్టగోడ మీదినుంచీ, ఆ ఇంటిలోకి జొరబడి, గుప్పిళ్ళు, దవడల నిండా వేరుసెనగ గింజలు కుక్కుకుని, పరుగులు. దీనికోసం కీచులాటలు. ఆధిపత్య పోరులు. చిన్న వానరాల ఆటలూ, గెంతులూ!! పేలు చూసుకోవటాలూ!!

          సమయం దొరికినప్పుడల్లా, ఇంట్లో చిన్న పిల్లలు, అరవిందూ, నాగా, సరదాగా వాటిని అనుకరిస్తూ, వాటికి కోపం వచ్చిందని తెలిసినప్పుడు, ఇంట్లోకి పరుగులు పెడుతూ..ఇదో ఆట!

          సుందర కాండలో, మధువనంలో వానర విహారం గుర్తుకు వస్తుందామెకు!

              గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్

             నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్

             పతంతి కేచిత్ విచరంతి కేచిత్

            ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్!

            పరస్పరం కేచిదుపాశ్రయంతే

            పరస్పరం కేచిదుపక్రమంతే

            పరస్పరం  కేచిదుపబ్రువంతే   

            పరస్పరం కేచిదుపారమంతే!!

          జన్మతో వచ్చిన బుద్ధుల మాటెలా ఉన్నా, వాటికి ఉన్న అపారమైన జ్ఞాపక శక్తీ, సమూహ స్పృహ, రామసేతు నిర్మాణానికి ఎంతో దోహదపడ్డాయని, యుద్ధ కాండలో వానర వీరుల వర్ణన వల్ల స్పష్టం కదా!

          ఈ ఆలోచనల్లో ఉండగానే నాగ. ‘అమ్మా! కరుణక్కయ్య జాబు రాసింది..’ అంటూ సంబరంగా తెచ్చి ఇచ్చింది.

          కనకమ్మ పెద్ద బిడ్డ వ్రాసిన ఉత్తరం ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని ఇన్ లాండ్ అంచులు జాగ్రత్తగా చించి చదవటం మొదలెట్టింది. ఎందుకంటే, కరుణ ఇన్ లాండ్ లోపలి మడతల్లో కూడా అప్పుడప్పుడూ, చివరిదాకా రాయకుండా మిగిలిన విషయాలు వ్రాస్తూ ఉంటుంది మరి!

          అక్షరాల వెంట చూపులు పరుగులు పెడుతున్నాయి. సారాంశం, పదహైదు రోజుల్లో ఆమెకు అత్తగారు వాళ్ళింట్లో సీమంతం. నువ్వూ, అయ్యా రావాలి కదా! అంటూ!!

          ఓ వైపు సంతోషం, మరో వైపు సంకోచం!

          రాధ ఇంకా నెలల పిల్ల. దీన్ని చంకనేసుకుని, పెద్ద బిడ్డ సీమంతానికి పోతే, అక్కడికొచ్చిన వాళ్ళంతా, నవ్వుకోరూ!!

          తప్పంతా తనదే అయినట్టు, కనకమ్మ ముఖం ముడుచుకు పోయింది.  కానీ తప్పదు. వెళ్ళి తీరాలి. అక్కడ ఆ సంబరం అయిపోతూనే ఇక్కడికి తీసుకుని రావాలి. ఇక్కడ కూడా సీమంతం చెయ్యవలె! మొదటి బిడ్డ, మొదటి పురుడు !! దానికి ఖర్చులు! సుబ్రమణ్యం, సుబ్బన్నలు – కడుపున పుట్టకున్నా, పుట్టిన కొడుకుల కన్నా మొన్నగా ఆదుకుంటూనే ఉంటారెప్పుడూ!

***

          కర్నూల్ లో కరుణమ్మ సీమంతం బాణగిరి వాళ్ళ హోదాకు తగ్గటే జరిగింది. ఆ రెండు రోజులూ గుడిపాటవ్వ భరోసా మీద చిన్న రాధను కడపలోనే ఉంచి వెళ్ళారు పుట్టపర్తి దంపతులు. తల్లికన్నా మిన్నగా చూసుకునే ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞ తలు ఎలా చెప్పుకోవాలో తెలియలేదు, కనకమ్మకు! ప్రపంచమంతా మంచితనమే నిండిన భావమామె మనసులో నిండిపోయింది.

          మరుసటి రోజే కరుణను కూడ తీసుకుని కడపకు చేరుకోవటం, ఆమెకు సీమంతం ఏర్పాట్లూ చకచకా జరిగిపోయినాయి, సుబ్రమణ్యం నేతృత్వంలో!

          కరుణ పుట్టింటి సీమంతం కూడా సంబరంగానే జరిగింది. ఆమె ఇంట్లో బరువుగా తిరుగుతూ ఉంటే, పుట్టపర్తి దంపతులకు చూడటానికి కష్టంగానే ఉంది. కానీ పెళ్ళైన ప్రతి ఆడపిల్లకూ ఇది తప్పని తీయని అనుభవమే!        

          పుట్టపర్తి పెద్ద బిడ్డ కరుణమ్మను చూస్తూ, ఆలోచనల్లో మునిగిపోతున్నారు.’ తనకెంతటి కష్టాన్ని కలిగించినా తన రక్త మాంసాలను ధారపోసి, ఒక నూతన శిసువును యీ లోకానికి కానుకగా అందించే బృహత్తరమైన బాధ్యతను బ్రహ్మ స్త్రీకి అప్పజెప్పటం, ఆ బాధ్యతను, అలవోకగా చేపట్టటం, తరువాత, ఆ మొలకను, నిండు వ్యక్తిత్వంగా తీర్చి దిద్ది సమాజానికి అప్పగించటం – సూక్ష్మంగా ఆలోచిస్తే మహత్తర బాధ్యతలు. ‘సర్వ తీర్థమయీ మాతా’ ‘గురుణామేవ సర్వేషాం మాతా గురుతరా స్మృతా..’   ‘నాస్తి మాతృసమా ప్రపా..’ వంటి సంస్కృత సూక్తులలో మాతృ స్తవం మరింత హృదయస్పర్శిగా ఉంటుంది. 

***

          ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే, జూన్ 30వ తేదీ సాయంత్రం, కరుణమ్మకు కాన్పు సమయం వచ్చేసింది. మొదటి కాన్పు కాస్త కష్టమైనా, పళ్ళ బిగివున తట్టుకుంది కరుణ. జూలై ఒకటో తేదీ సుప్రభాత వేళ, అవతరించాడు, పండంటి మొగ పిల్లాడు! రింగు రింగుల జుట్టూ, పెద్ద కళ్ళతో ! మొదటి మనవడిని చేతుల్లోకి తీసుకుంటూ ఉప్పొంగిపోయారు పుట్టపర్తి దంపతులు.

          టెలిగ్రాం అందుకున్న వెంటనే వాలిపోయాడు అల్లుడు రాఘవ కర్నూలు నుంచీ!

          ఇంకేముంది! రోజులు చకచకా గడిచిపోతున్నాయి. బాలింత కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకుని, 21వ రోజు నామకరణం కూడ వియ్యంకులను ఆహ్వానించి, ఉన్నంతలో బాగానే చేశారు. చి. బాణగిరి కృష్ణ ప్రసాద్ అన్న పేరుతో బాణగిరి వంశోద్ధారకుని రాక, ఆనంద తరంగాల వెల్లువైంది. బాణగిరి దేశికాచార్యులు, తంగమ్మ దంపతులు కూడా ఆ ఆనంద తరంగాల్లో తడిసి ముద్దయ్యారు. 

***

          ఇంటిలో ఆఖరి బిడ్డ చిన్నారి రాధ, మొట్టమొదటి దౌహిత్రుడు చి.బాణగిరి కృష్ణప్రసాద్ కేరింతల మధ్య రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. అల్లుడు రాఘవ నామకరణం తరువాత కర్నూల్ వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల ప్రవేశించింది.

          రెండవ బిడ్డ తరులతకు కూడా హంపీ కమలాపురంలో  సీమంతోత్సవం తరువాత, పుట్టింటికి రాక, పుట్టింటిలోనే సులభంగా కుమారుడు జన్మించటం,  అల్లుడు రామానుజాచార్యులు నామకరణ వేడుక కోసం కడపకు రాక ! అటు కర్నూలు నుంచీ మొదటి అల్లుడు రాఘవ కూడా యీ వేడుకల్లో పాలుపంచుకోవడానికీ, తన చిన్ని కుమారుణ్ణి చూసుకునేందుకూ వచ్చాడు. ఇంట్లో మళ్ళీ సంబరాలు.

          ఒకేసారి ఇద్దరు అల్లుళ్ళూ ఇంట్లో ఉండ వలసి రావటం వల్ల కనకమ్మ పుట్టపర్తిని బ్రతిమాలింది. ‘అల్లుళ్ళిద్దరికీ పైనున్న మీ గది ఇద్దాము. మీ సరంజామా ఈ సారి మనింటి ఎదురుగా ఉన్న ఇల్లు ఖాళీ అయింది కదా, అక్కడ ఏర్పాటు చేస్తాము. మీరు ఈ వారం రోజులూ సర్దుకోవాలి ఎలాగైనా..’ అని! 

          పుట్టపర్తికీ సూచన నచ్చలేదు. తన సరంజామా అంటే, వ్రాత బల్లా, కొన్ని కాగితాలూ, ఇంకు బుడ్లూ మాత్రమే కాదు కదా!! అక్కడున్న పుస్తకాలు కూడా! ఇవన్నీ తరలించటం సాధ్యమా?’

          దీనికి ఉపాయమేమైనా ఉందా??

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.