
పసుపుపచ్చ రిబ్బన్
पीली रिबन
హిందీ మూలం – డా. దామోదర్ ఖడ్సే
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
ఈసారి డా. ఉషాదేవీ కొల్హట్కర్ నుంచి ఉత్తరం రావడంలో చాలా ఆలస్యం అయింది. గల్ఫ్ యుద్ధం కారణంగా ఉత్తరాలు రావడంలో ఆలస్యం అవుతోంది. కవరు తెరవగానే ఒక పసుపుపచ్చని రిబ్బన్ బయటపడింది. ఒక మెరుస్తున్న సిల్కు రిబ్బన్. ఆకర్షణీయంగా, అందంగా ఉన్న రిబ్బన్. విషయం ఏమిటో అర్థం కాలేదు. కాని ఉత్తరం చదివిన తరువాత అంతా అర్థం అయింది. మొదట్లోనే ఆవిడ రాసింది- “అమెరికాలో రెట్టింపు సంతోషంగా ఉంది. ఒకటి విజయం సాధించినందుకు, రెండోది యుద్ధం ముగిసి నందుకు. ప్రపంచంలోని ఆ భయంకరమైన యుద్ధం అంతమైనందుకు ప్రజలు న్యూయార్క్ నగరంలో నలువైపులా పసుపుపచ్చ రిబ్బన్లు కట్టుకున్నారు. ఒక వెలుగు పండుగలాగా ఎల్లెడలా ప్రకాశవంతం అయింది. హోటళ్ళలోనూ, బహిరంగ స్థానాల లోనూ జనం సామూహికంగా సంబరాలు జరుపుకుంటున్నారు. చూపుమేర దూరంలో నలువైపులా ఎక్కడచూసినా పసుపుపచ్చని రిబ్బన్లే కనిపిస్తున్నాయి. ఆశకి సంకేతంగా మిలమిలా మెరిసే అందమైన పసుపుపచ్చని రంగు.
శిథిలాలలో ఇరాక్ తన భవిష్యత్తుని వెతుక్కుంటోంది. అమెరికా విశ్వవిజేతగా పెద్ద విజయచిహ్నాన్ని ధరించి గర్వంగా పసుపుపచ్చని రిబ్బన్ చరిత్రను అన్వేషిస్తోంది…”
ఇది ముప్ఫై సంవత్సరాల క్రిందటి సంగతి. ఒక మనిషి బస్సులో కూర్చుని తనని తానే తిట్టుకుంటున్నాడు. ఏ స్టాప్ లోనూ అతను దిగడంలేదు… చూస్తే ఏదో బాధలో ఉన్నట్లుగా, చింతాగ్రస్తుడిలా కనిపిస్తున్నాడు. బస్సు ఆఖరి స్టాప్ దగ్గరికి వస్తున్నప్పుడు అతని కళ్ళలోని కుతూహలం, జిజ్ఞాస, భయం అతన్ని కలత పెడుతున్నాయి. అకారణం గానే అతను కిటికీలో నుంచి బయట శూన్యంలోకి చూస్తున్నాడు. అతనికి దగ్గరగా ఉన్న సీట్లో కూర్చున్న ప్యాసెంజరుకి అతని ఇబ్బంది అర్థం కాలేదు. ఉండబట్టలేక అడిగేశాడు-“ఏమిటండి? మీరేదో బాధపడుతున్నట్లున్నారు?… ఒంట్లో బాగుండలేదా?”
ముందు ఆ మనిషి వినిపించుకున్నట్లు లేదు. అతని కళ్ళలో ఉన్న భీతికరమైన శూన్యం చూసి పక్కన కూర్చున్న వ్యక్తికి భయం వేసింది. కాని విషయమేమిటో తెలుసుకో వాలనే అతని కుతూహలం మరింత ఎక్కువయింది. అతను మళ్ళీ మాట కదిపాడు… ఈసారి ఆ వయోవృద్ధుడి కళ్ళలో కన్నీళ్ళు ముప్పిరిగొన్నాయి. చూస్తే ఎంతో ఆవేదన కలిగిన తరువాతనే మనిషి అలా అవుతాడని అనిపిస్తోంది. అతను ఇంచుమించు ఏడుస్తున్న స్థితికి వచ్చాడు.
కాస్త ధైర్యం తెచ్చుకున్న తరువాత అతను అన్నాడు- “నేనొక యుద్ధఖైదీని. ఇప్పుడే విడుదలై వస్తున్నాను. ఇప్పటివరకూ నేను శత్రుదేశంలోని వేరు వేరు శిబిరాల్లో నరకయాతన సహించుకున్నాను. ఇప్పుడు నన్ను విడిచిపెట్టారు. నా దేశం భూమిని చూస్తే ఎంత బాగుంటుంది. అంతా ఎంతగా మారిపోయింది. లోకం ఎక్కడ ఉండేది ఎక్కడికి చేరుకుంది. నేను జైల్లో నా భవిష్యత్తుని తాకట్టు పెట్టుకుని నా వర్తమానాన్ని రోజూ దండిస్తూ వచ్చాను. ఆశ అనేది వదిలేశాను అందరిలాగానే. విడుదలై బయటికి వచ్చాక ఇప్పుడు నాకు అనిపిస్తోంది, ఇప్పుడు నాకు జీవితంలో ఇంక మిగిలింది ఏముందని. నేను ఎవరికోసం బస్సులో కూర్చున్నాను. ఎందుకు వెడుతున్నాను… ”
ఆ కుగ్రామంలో నాకు సంబంధించినవాళ్ళు ఎవరైనా ఉన్నారనీ, అందుకని నేనక్కడికి వెడుతున్నాననీ ఏమీ కాదు. నావాళ్ళు ఎవరూ అక్కడ లేరు. హెడ్ క్వార్టరుకి వచ్చాక నాకు దగ్గరివాళ్ళంతా యుద్దంలో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చునని, లేదా నేను తప్పిపోయానన్న దుఃఖంతో చనిపోయివుండవచ్చునని తెలిసింది… నాకు పెళ్ళి చేసుకోవడం సాధ్యపడలేదు. అలాంటప్పుడు ఇంక నావాళ్ళంటూ ఎవరైనా ఎలా వుంటారు. ఇదంతా ఒక విచిత్రమైన కథ. విషయం మొదలయింది కనుక ఇది కూడా చెప్పేస్తాను. నాకు కూడా ఊరట కలుగుతుంది. మీకు కూడా కాలక్షేపం అవుతుంది.
నిజానికి నేను ఒక చాలా అందమైన అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా నన్ను ఎంతో ప్రేమించింది. మేము పెళ్ళి చేసుకునేవాళ్ళం. మా ఇద్దరి కుటుంబాలు కూడా సంతోషించారు. అప్పుడే యుద్ధం మొదలయింది. నాకు యుద్ధరంగానికి వెళ్ళమని ఆదేశం ఇచ్చారు. నేను వార్ ఫ్రంట్ కి వెళ్ళడానికి బయలుదేరుతుండగా ఆమె నాకు వీడ్కోలు ఇవ్వడానికి నన్ను ఎంత గట్టిగా కౌగలించుకుందంటే నాకు యుద్ధరంగంలో ఇంకెందుకూ పనికిరాకుండాపోతానేమోనని అనిపించింది. ఇష్టంలేకపోయినా నన్ను నేను తన నుంచి వేరుచేసుకోవలసివచ్చింది. కలలతో నిండిన ఆమె కళ్ళలో పెల్లుబికిన కన్నీళ్ళని ఎదుర్కొనే ధైర్యం నాకు లేకపోయింది. కాని నేనే అన్నాను- “నేను బ్రతికివుండి మళ్ళీ వస్తే…”
“ఇంకేమీ చెప్పొద్దు.” తన వేలు నా పెదవుల మీద పెట్టి ఆమె అంది- “నువ్వు వస్తావు. క్షేమంగా తిరిగి వస్తావు. నువ్వు వచ్చినప్పుడు మనం రోజూ కలుసుకునే చెట్టు కిందనే నేను నీ కోసం ఎదురుచూస్తూ నిలబడివుంటాను… నువ్వు తప్పకుండా మళ్ళీ వస్తావు… మనం తప్పకుండా కలుసుకుంటాం.” భావోద్వేగంతో కూడిన ఆమె అనుభూతికి నా నోట్లోంచి ఎలా వచ్చిందో తెలియదు- “నేను వచ్చినప్పుడు… అప్పటివరకూ నువ్వు ఎదురుచూడగలిగితే… ఈ చెట్టులోని ఒక కొమ్మకి పసుపుపచ్చని రిబ్బన్ కట్టివుంచు… నా కోసం నువ్వింకా ఎదురుచూస్తున్నావని నేను అర్థం చేసుకుంటాను…”
నేను ఇన్ని రోజులు శత్రువుల జైళ్ళలో అలమటిస్తూ పడివుండవలసివస్తుందని అప్పుడు నాకేం తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో ఎవరికైనా నేనెక్కడ ఉన్నాననేది తెలుసుకోవడం ఎలా సాధ్యం. ఇప్పుడు నేను వయోవృద్ధుడిని కూడా అయిపోయాను. ఆ వూళ్ళో చెట్టు సంగతి అలావుంచి అసలు ఆ వూరన్నది కూడా మిగిలివుందా లేదా అన్నదే నా భయం.
అలాంటప్పుడు అక్కడ తను పసుపుపచ్చ రిబ్బన్ ఎలా కడుతుంది? ఆ చెట్టు ఎలాగో మిగిలివున్నా కూడా తను ఇప్పటివరకూ నాకోసం ఎందుకు కూర్చుంటుంది… అయినా నేను అక్కడి నుంచి ఆమెకి రాశాను… ఈ వార్ధక్యం కేవలం నా శరీరానికేననీ, లోకంలో కొత్త-కొత్త దారులెన్నో ఏర్పడ్డాయనినాకనిపిస్తుంది. కాని ఈ రోజునకూడా నా మనస్సులో ఉన్న తన భావగర్భితమైన ముఖం మాత్రమే నా కళ్ళలో కనిపిస్తోంది. ఆ కళ్ళతోనే ఆమె అంటోంది- “నువ్వు తప్పకుండా వస్తావు. మనం ఈ చెట్టుకిందనే కలుసు కుందాం.”
…నేను ఆమెకి ఒక ఉత్తరం రాశాను. తనకి అందిందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆమె నాయనమ్మ అయి వుండవచ్చు తన మనవళ్ళతో, మనవరాళ్ళతో. అయినా నేను ఉండబట్టలేక రాశాను. నేను ఈ బండిలో వస్తున్నాను… నీకు నేను చెప్పిన సంగతి, మనం అనుకున్న కోరిక జ్ఞాపకం ఉంటే అదే చెట్టు కొమ్మకి పసుపుపచ్చ రిబ్బన్ కట్టివుంచు. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వెతుక్కుంటాను…
అతని మాటల్లో ఎంత ఉత్సాహం ఉందో. అతని కళ్ళలో ఎంత అశాంతి ఉందో. ఈ కథ అంతా చెప్పి అతను మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. మళ్ళీ ఎక్కడో అతని లో గడిచిపోయిన రోజులకి చెందిన విషయాల వెల్లువ వచ్చింది. అతను శూన్య ప్రవాహం లో కొట్టుకుపోయాడు. కాని ఆ పక్కసీటులో కూర్చున్న సహప్రయాణీకుడు ఈ సంగతి అందరికీ చెప్పాడు. స్త్రీలు, పురుషులు పెద్దవాళ్ళు అందరూ ఈ సంఘటన విన్నాక సానుభూతితో నిండిపోయారు. అందరి మనస్సుల్లోనూ ఒక జిజ్ఞాస, ఒక కుతూహలం. అతని జీవితంలో జరిగిన ఈ భయంకరమైన ప్రమాదం పట్ల వాళ్ళ హృదయాలు ఆర్ద్రమై పోయాయి.
అతని బస్సు ఊరివైపుకి వెడుతున్నకొద్దీ, అందరూ అతని కథలోని తరువాతి పేజీలో ఏమవుతుందో, ఏంకానున్నదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ముందుకి సాగు తున్నారు. అతను భయపడుతున్నాడు. ఇప్పటివరకూ ఎవరికోసం అతను ఊపిరితో ఉన్నాడో, అది ఎండమావి అయినప్పటికీ ఆ రోజు అతని కల భగ్నం కాబోతోంది. ఆ రోజు తరువాత అతను జీవించడానికి కారణం కూడా లుప్తమైపోతుంది. ఇంక అతను ఎక్కడికి వెళ్ళగలడు…
ఈలోగానే సహప్రయాణీకుల్లో ఎవరో డ్రైవరుకి కూడా ఈ సంఘటన గురించి చెప్పారు. ఇంక బస్సు నేరుగా ఆ చెట్టు కిందనే ఆపుజెయ్యాలని నిర్ణయించబడింది. సహప్రయాణీకులకి ఆ తరుణం అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది కూడా. బస్సు ఆ చెట్టు కిందకి చేరుకున్నప్పుడు అందరూ చూసింది ఆ చెట్టుకి ఎన్నో పసుపుపచ్చని రిబ్బన్లు కట్టివున్నాయని. చెట్టుకి అసలైన గుర్తింపు లేకుండా పోయిందని. అతను ఏదో కలలో ఉన్నట్లు అనుభూతి చెందుతున్నాడు. అతనికి అసలు ఏంచెయ్యాలన్నది ఏమీ స్ఫురించడంలేదు. అతని చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. కంపిస్తున్న చేతులతో అతను జేబులోంచి కళ్ళజోడు తీసి ధరించాడు. చూస్తే అన్నిపక్కలా పసుపుపచ్చని రిబ్బన్లు కనిపిస్తున్నాయి. కేవలం ఆ చెట్టుమీదనే కాక, కనుచూపుమేర దూరంలో అంతా పసుపుపచ్చగా కనిపిస్తోంది. అతని ఆశ చిగురించింది. అతను వెనక్కి తిరిగి చూస్తే, తను ఎవరికోసం వెతుకుతున్నాడో ఆమె తెల్లని వస్త్రాలలో దట్టమైన ఎర్రని గులాబీపూల గుత్తిని పట్టుకుని అతని వైపుకి ముందుకివస్తోంది. వయస్సులో ఉన్న అమ్మాయిలు ఆమెని ముందుకి తీసుకువస్తున్నారు. అతను తన కళ్ళజోడు సరిజేసుకుని పైకిచూశాడు. అతని కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. అతనికి ఇంకేమీ కనిపించడమూలేదు, ఏం చెయ్యాలో ఏమీ తోచడమూలేదు. అప్పుడే అతను ఆమె చేతుల్లోంచి పుష్పగుచ్ఛం తీసుకునే ప్రయత్నంలో ముందడుగు వేశాడు. ఆమెని నిండుగా కౌగిట్లోతీసుకుని తన బాహువుల్లో గట్టిగా బంధించాడు. మొత్తం ఒక కాలఖండం వారిద్దరి మధ్యలో కరిగి విలుప్తమైపోయింది. గ్రామస్థులు అక్కడ వాద్యసంగీతానికి కూడా ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవానికి నిరీక్షణ కేవలం తను ఒక్కడికే కాదని అతనికి అనిపించింది. సంగీతం తో పాటు గ్రామస్థులే కాక, బస్సులోని సహప్రయాణీకులందరూ నృత్యం చెయ్యసాగారు. వారిద్దరికీ, తాము ఇంకా అంత వృద్ధులం కాలేదని అనిపించింది… అడుగులు లయ బద్ధంగా కదలసాగాయి… చూస్తూ ఉండగానే రెపరెపలాడుతున్న పసుపుపచ్చ రిబ్బన్ కథ చుట్టుపక్కల హద్దులన్నిటినీ అధిగమించి నలువైపులా వ్యాపించింది. పసుపుపచ్చ రంగు ఆశకి ప్రతీకగానూ, రిబ్బన్ ఈ ఆశకి సాక్షాత్తు ప్రత్యక్ష రూపంగానూ అయింది.
ఈనాడు కూడా యుద్ధం ప్రకటించబడినప్పుడు వృక్షాలు కంపిస్తాయి. గ్రామాలు నిర్మానుష్యమవుతాయి, వయస్సు అనాథ అవుతుంది. అంతా స్థిరంగా అయిపోతుంది… అందుకనే అమెరికాలోని ప్రజలు ఆ పాత సంఘటననూ, కథనూ జ్ఞాపకం చేసుకుంటూ తమ ప్రియజనులకి స్వాగతం చెబుతూ, మొత్తం అమెరికా సైన్యం తిరిగి వచ్చినప్పుడు న్యూయార్క్ నగరంలో చాలాచోట్ల పసుపుపచ్చ రిబ్బన్ కట్టుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని డా. ఉషాదేవి రాసింది. నేను కూడా కవరులోంచి బయటికి వచ్చిన ఆ రిబ్బన్ లో ఈరోజున కూడా ఆ సైనికుడి అజ్ఞాతమైన వయస్సునెమ్మదిగా తట్టుతున్న చప్పుడు వినిపిస్తోందని అనుభూతి చెందాను.
***
డా. దామోదర్ ఖడ్సే – పరిచయం
డా. దామోదర్ ఖడ్సేగారి సాహిత్యసేవ విస్తృతమైనది. వీరి 9 కథాసంకలనాలు, 4 నవలలు, 10 కవితాసంకలనాలు, 1 సమీక్ష, 4 ట్రావెలాగ్స్, 8 అధికారభాషకి సంబంధించిన గ్రంథాలు ప్రచురితమయ్యాయి. కొన్ని డాక్యుమెంటరీలకి, టెలీఫిలింలకి స్క్రిప్టు రాశారు. వీరి సాహిత్యంపైన, వ్యక్తిత్వంపైన విద్వాంసులు రాసిన 7 పుస్తకాలు వెలువడ్జాయి. వీరి రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధభారతి, దూరదర్శన్, టీవీ ఛానళ్లలో ప్రసారితమయ్యాయి. ఈయన వివిధ విద్యాసంస్థలలో 1200 కన్నా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చారు. వీరి రచనలను వివిధ విద్యాసంస్థల కోర్సులలో పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. ఈయన మరాఠీ నుంచి, ఆంగ్లం నుంచి 19 సాహిత్య గ్రంథాలను అనువదించారు. 7 పుస్తకాలకి సంపాదకత్వం నిర్వహించారు. వీరి రచనలు ఆంగ్లంతోసహా 10 భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి సాహిత్యంపై కొల్హాపూర్, అమరావతి, షోలాపూర్ యూనివర్సిటీలలో 5 పిహెచ్ డి, పుణే యూనివర్సిటీ ద్వారా 1 ఎం.ఫిల్. డిగ్రీలు ప్రదానం చేశారు. డా. ఖడ్సే ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థల ద్వారా సన్మానం పొందారు. గౌ. రాష్ట్రపతి గారిద్వారా 1992లో, 2012లో సాహిత్య పురస్కారం ప్రదానం చేయబడింది. వీరు కేంద్రప్రభుత్వానికి చెందిన కొన్ని ఉన్నత స్థాయి కమిటీలలో సభ్యులు. నాలుగు యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులు. 2025లో ముంబయిలో శబ్దసృష్టి అనే సంస్థ వీరికి జీవన సాఫల్య పురస్కారం బహూకరించి సన్మానించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 30 సంవత్సరాలు సేవ చేసిన అనంతరం అసిస్టెంట్ జనరల్ మానేజరుగా రిటైర్ అయ్యారు. డా. ఖడ్సే పుణేవాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.