
కనక నారాయణీయం -73
–పుట్టపర్తి నాగపద్మిని
ఇంటిలో ఆఖరి బిడ్డ చిన్నారి రాధ, మొట్టమొదటి దౌహిత్రుడు చి.బాణగిరి కృష్ణప్రసాద్ కేరింతల మధ్య రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. అల్లుడు రాఘవ నామకరణం తరువాత కర్నూల్ వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల ప్రవేశించింది.
రెండవ బిడ్డ తరులతకు కూడా హంపీ కమలాపురంలో సీమంతోత్సవం తరువాత, పుట్టింటికి రాక, పుట్టింటిలోనే సులభంగా కుమారుడు జన్మించటం, అల్లుడు రామానుజా చార్యులు నామకరణ వేడుక కోసం కడపకు రాక ! అటు కర్నూలు నుంచీ మొదటి అల్లుడు రాఘవ కూడా యీ వేడుకల్లో పాలుపంచుకోవడానికీ, తన చిన్ని కుమారుణ్ణి చూసుకునేందుకూ వచ్చాడు. ఇంట్లో మళ్ళీ సంబరాలు.
ఒకేసారి ఇద్దరు అల్లుళ్ళూ ఇంట్లో ఉండవలసి రావటం వల్ల కనకమ్మ పుట్టపర్తిని బ్రతిమాలింది. ‘అల్లుళ్ళిద్దరికీ పైనున్న మీ గది ఇద్దాము. మీ సరంజామా ఈ సారి మనింటి ఎదురుగా ఉన్న ఇల్లు ఖాళీ అయింది కదా, అక్కడ ఏర్పాటు చేస్తాము. మీరు ఈ వారం రోజులూ సర్దుకోవాలి ఎలాగైనా..’ అని!
పుట్టపర్తికీ సూచన నచ్చలేదు. తన సరంజామా అంటే, వ్రాత బల్లా, కొన్ని కాగితాలూ, ఇంకు బుడ్లూ మాత్రమే కాదు కదా!! అక్కడున్న పుస్తకాలు కూడా! ఇవన్నీ తరలించటం సాధ్యమా?’
దీనికి ఉపాయమేమైనా ఉందా??
దీనికి సమాధానం ఎంతకీ తట్టలేదు వారికి, కావ్య వస్తువైనా త్వరగా దొరుకుతుం దేమో కానీ, నిజ జీవితంలో ఇటువంటి సమస్యలకు సమాధానాలు, అవి చిన్నవైనా చితకవైనా లభించటం కష్టమని మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చిందేమో వారికి, ఇక బుర్ర బద్దలు కొట్టుకోవటం కంటే, ఇప్పటికిలా కానిచ్చేద్దామనే నిర్ణయానికి వచ్చేశారు.
***
ఇంట్లో తరులతాదేవి మొదటి కుమారుడి నామకరణోత్సవం, ఉన్నంతలో బాగానే జరిగింది. మనుమడిపేరు శ్రీనిధి అని నిర్ణయించింది కనకవల్లి. శిష్యోత్తములు, చి. సుబ్రహ్మణ్యం, సుబ్బన్న సహకారంతో, గోవిందరెడ్డి, బాబయ్య అండదండలతో ఇంట్లో రెండవ దౌహిత్రుడి నామకరణం బాగానే జరిగింది. అల్లుళ్ళు కూడా ఆ శిష్యులను ఇంటి సభ్యులుగానే గుర్తించి, వాళ్ళతో కలిసిపోవటం చూసి, ఊపిరి పీల్చుకుంది కనకవల్లి. వాళ్ళ కోసం, మేడ మీద గదిని నాలుగైదు రోజులకోసం ఖాళీ చేసిన పుట్టపర్తి వారికి, ఆ గ్రంధాలను ఒక్కసారి తడిమి చూసుకోవాలన్నా వీలులేని పరిస్థితి. బీడీలు కట్టలు కట్టలు కాల్చేస్తున్నారు.
ఎటూ తోచక మొదటి గాంధీ బొమ్మదగ్గరున్న అప్పు అయ్యర్ హోటల్ వైపుకి అడుగులు వేశారాయన.
ఈ హోటల్, దానిలోకి వచ్చీ పోయే వారిని గమనిస్తూ కూచోవటం వారికి అప్పుడ ప్పుడూ కాలక్షేపం. ఆ యజమానికి పుట్టపర్తి వారంటే చాలా గౌరవం. వారు రాగానే ఒక టేబుల్ ఖాళీ చేయించి తానే స్వయంగా శుభ్రపరచి వేడి వేడి కాఫీ ఆర్డర్ చెస్తాడాయన. చెన్నై పద్ధతిలో టంబ్లర్ కాఫీ పొగలుకక్కుతూ తయార్. అప్పుడిక పుట్టపర్తితో మాటలు కలిపి, తమిళ ప్రాచీన కవుల ప్రస్తావన తెచ్చి, వారు చెప్పే విషయాలు వింటూ, తానూ మధ్యలో కొన్ని మాటలు జోడిస్తూ ఉంటాడు. కడపలో తమిళం వచ్చిన వారు చాలా తక్కువ. ఇటువంటి చోట, పైగా అదో ప్రత్యేక యాసతో తెలుగు అలరారే చోట, పుట్టపర్తి వారికి తమిళ సాహిత్యం మీద ఉన్న పట్టు చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడాయన!
హోటల్ గొప్ప కూడలిలో ఉంది. దగ్గరున్న బస్ స్టాండ్ నుండీ వేరే ఊళ్ళ కోసం బయలుదేరి వెళ్ళేవాళ్ళు, రోజూవారీగా హోటల్ కు వచ్చేవాళ్ళు, పనిమీద వెళ్తూ కాసేపాగి కబుర్లు చెప్పుకునేందుకు వచ్చేవాళ్ళు..ఇంకా చాలా మంది. ఎదురుగా పోలీస్ స్టేషన్. గాంధీ బొమ్మ కూడా! రోడ్డుకటువైపు, పెద్ద టవర్ క్లాక్. అది దాటగానే పోస్ట్ ఆఫీస్ . రెవెన్యూ కార్యాలయం. ఇళ్ళు, పొలమూ పుట్రా వంటి ఆస్తి పాస్తుల రిజిస్ట్రేషన్ కార్యాలయం. కాస్త ముందుకు వెళితే, అగ్నిమాపక దళ కార్యాలయం. అక్కడెప్పుడూ ఒక అగ్నిమాపక దళవాహనం సిద్ధంగా ఉంటుంది. ఆ వాహనం ఉన్నచోట ఒక మూల చింపిరి గడ్డం, చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా కనిపించే ఒక సాధువు. అతను ఎవరినీ ఏమీ అనడు. ఆ అగ్నిమాపకదళ కార్యాలయ ఉద్యోగులే సమయానికింత టీ, తినటానికేదైనా ఇస్తూ ఉంటారు. అతను మామూలు సాధువు కాదనీ, ఏవో అతీత శక్తులున్న ఉపాసకు డనీ, అతగాడు ఎవరినైనా తిడితే ఆ తిట్టించుకున్నవాని పంట పండి భాగ్యం వెంట వస్తుందనీ అప్పట్లో ఊరివాళ్ళు అనుకునే వాళ్ళు.
రోడ్డుకు అటువైపు, పెద్ద ఆవరణలో గంభీరంగా నిలబడ్డ కలెక్టర్ గారి కార్యాలయం. చాలా పాత కట్టడం. బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్. థామస్ మన్రో కూడా ఇక్కడే పనిచేశా డట! అటు తరువాత కనీసం అరవై డెబ్భై మంది కలెక్టర్లు యీ కార్యాలయం నుండే తమ విధులు నిర్వర్తించినట్టు చెబుతారు. ఇంతకూ యీ భవనం అచ్చంగా రాతి కట్టడం. దృఢంగా తలెత్తుకుని ఎన్నెన్నో స్మృతులను నెమరువేసుకుంటూ నిలబడి ఉంటుంది. దాన్ని దాటగానే ఏడు రోడ్ల కూడలి. ఈ కూడలిలో నగరంలో ఏడు వైపులకు వెళ్ళే దారులు కలుస్తాయి.
ఈ రోజు అలా పుట్టపర్తి అప్పయ్యర్ తో బాతాఖానీ చేస్తూ ఉండగా, అక్కడికి చేరు కున్నాడు, మదనపల్లె నుంచీ వచ్చిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య.
అతగాన్ని చూడగానే పుట్టపర్తి కళ్ళలో చిరునవ్వు.
‘ఏమిరా అప్పా! ఎప్పుడొస్తివి? నేనిక్కడున్నట్టు ఎవరు చెప్పినార్రా?’
‘ వచ్చి గంటయింది స్వామీ. ఇంటికి పోయినాను. మీరు ఉంటారనుకుని ఎదురింటి గదికేసి చూపించినారు అమ్మ. తీరా నేనక్కడికి పోతే మీరు లేరు. స్కూల్ వేళ కాదుగదా! రామకృష్ణ సమాజంలో కానీ, రాఘవేంద్ర స్వామి గుడిలో కానీ, ఇదిగో అప్పు అయ్యర్ హోటల్ లోనైనా ఉండవచ్చునేమో చూడమన్నారు. అక్కడ మీరు లేరు. సరే, ఇక్కడ తప్పక దొరుకుతారని వచ్చినాను.’ నవ్వుతూ అన్నాడు వెంకట సుబ్బయ్య.
‘మొత్తానికి పట్టుకున్నావన్నమాట! సరేలే! పోదాం పద ఇంక!’
కానీ అప్పు అయ్యర్ వల్లంపాటికి వేడి వేడి కాఫీ ఇద్దరికీ ఆర్డర్ చేసినందువల్ల, తాగిన తరువాతే ఇద్దరూ బైలుదేరారు.
***
వల్లంపాటి రిక్షా పిలువబోతే వద్దనేశారు పుట్టపర్తి. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం లేప్పా..’ అంటూ వల్లంపాటి భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా నడుస్తున్నారు. అంత గొప్ప కవి, ఏదో స్నేహితునివలె తన భుజం మీద చేయి వేసి నడుస్తూ ఉంటే, ఎంతో గర్వంగా ఉంది వెంకట సుబ్బయ్యకు.
అక్కడి నుంచీ మోచంపేటలోని పుట్టపర్తి ఇల్లు ఒక మైలు పైనే ఉంటుంది. వారికి ఎక్కువగా నడకే అలవాటు. అలా నడుస్తూ వల్లంపాటి ఇటీవల చదివిన సాహిత్యం గురించి అడుగుతూ వాటి గురించి ఆ యువకుడి అభిప్రాయం కూడ చెప్పమని అడుగుతూ నడుస్తున్నారు.
మొత్తానికి ఇల్లు చేరుకుని, తనకు యీ వారంలో ఉండమని అర్ధాంగి చేసిన ఏర్పాటుకు అనుగుణంగా ఆ గదిలోకి తీసుకుని పోయారు పుట్టపర్తి వల్లంపాటిని. తలుపు దగ్గరగా వేసి గొళ్ళెం మాత్రమే పెట్టి ఉంది.
‘ఇదేమి స్వామీ!! తలుపు దగ్గరగా వేసి బైటికి వెళ్ళిపోవడమా?’
‘మరి? విలువైన వస్తువులేమున్నాయప్పా ఇక్కడ? ఇదిగో యీ వారానికి సరిపడా పుస్తకాలు, నీళ్ళ చెంబూ, నా వ్రాత సరంజామా. అసలు మా ఇంట్లో కూడ తక్కిన సామాన్ల కన్నా పుస్తకాలే ఎక్కువ. దొంగతనానికెవడైనా పొరపాటున వస్తే వాడికి తిక్కరేగి, ఆ పైన జాలేసి, తన జేబులో ఉన్న డబ్బు కొంచెం ఇక్కడ పెట్టిపోవాలంతే! నేను సరస్వతీ పుత్రుడిని మాత్రమేరా నాయనా, లక్ష్మీ పుత్రుణ్ణి కాదు మరి.’
గట్టిగా స్వచ్చంగా నవ్వుతున్న పుట్టపర్తి నిర్మల వదనంలో ఏదో తెలియని ఆకర్షణ, వల్లంపాటిని నిరుత్తరుణ్ణి చేసింది.
నాన్నెప్పుడూ అంటూ ఉంటారు. సౌందర్య లహరిలో శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం.. ‘ అనే శ్లోకం నిరంతర పారాయణం చేస్తూ ఉంటే, వాక్ శక్తినిస్తుం దట ఆ తల్లి! ఆ కరుణ పుట్టపర్తి పై నిండుగా వర్షిస్తున్నదా జగన్మాత!’ అనుకుంటూ, వారికి పాదాభివందనం చేశాడు వెంకట సుబ్బయ్య.
‘అరెరే! ఇదెందుకురా మధ్య?’ నవ్వుతూ ఆపేశారతన్ని.
‘ఇంతకూ నువ్వొచ్చిన పనేమిట్రా?’ అడిగారాయన, చాల మీద కూర్చోమని సైగ చేస్తూ!!
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
