చలాకీ పిల్ల – సముద్రస్నానం

चुलबुली लड़की, समंदर और डुबकियाँ

హిందీ మూలం – డా.బలరామ్ అగ్రవాల్

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          పోర్ట్ బ్లెయిర్ లో అది బహుశా మాకు మూడోరోజు. హేవ్ లాక్, నీల్ తిరిగి వచ్చాక మేము కార్బిన్ కోవ్స్ చూడటానికి బయలుదేరాం. అటువైపు వెడుతూ అనుకోకుండా నాదృష్టి నౌకలోని డెక్ మీద ఉన్న గుంపులో నిలబడివున్న ఒక కొత్త దంపతుల జంట మీద పడింది. అమ్మాయి చేతులకి మోచేతులవరకు గోరింటాకు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు ఎరుపురంగులో ఉన్న గాజులు అందంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు హనీమూన్ టూర్ లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయి సముద్రంలోని ఒక్కొక్క కెరటాన్నీ చూస్తూ అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె ఎంత సంతోషంగా అధికంగా మాట్లాడుతూ, గంతులు వేస్తోందో, వాళ్ళాయన వీటన్నిటి నుంచి అంతగానే నిర్లిప్తంగా ఉన్నాడు. అమ్మాయి ఈ యాత్రలో సముద్రాన్ని నలువైపులనుంచి తన జ్ఞాపకాలలో మూటకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అబ్బాయికి మాత్రం సముద్రంతో తనకేమీ సంబంధం లేనట్లు ఉన్నాడు. `బోటు’ అనేది అతనికి నీళ్ళమీద వెళ్ళే, ఈ తీరం నుంచి అవతలి తీరానికి తీసుకువెళ్ళే ఒక సాధారణమైన ప్రయాణసాధనం మాత్రమే. చిన్నపిల్లలలాగా కేరింతలు కొడుతూ, గంతులువేస్తూ ఆ అమ్మాయి భర్తని అతను నిలబడివున్నచోటనే వదిలి డెక్ మీద ఒకసారి ఎడమవైపు రేలింగ్ మీదకి, ఒకసారి కుడివైపున ఉన్న రేలింగ్ మీదకి వెడుతోంది. దృశ్యాలను మాటిమాటికీ చూస్తూ ఆమె అన్నివైపులా ఆనందాన్ని నింపుతోంది. అలా గెంతుకుంటూ ఇటూ-అటూ నడవటంలోనే ఆమె చాలాసార్లు మా దగ్గరగా కూడా వచ్చి వెళ్ళింది.

          ఇంచుమించు 30 నిమిషాలు ప్రయాణం చేశాక మేము సముద్రానికి ఇవతలివైపు నుంచి అవతలవైపుకి చేరుకుంటామని చెప్పారు. పదినిమిషాలు గడిచాయి. ఇంతసేపూ ఆమె భర్త నిర్లిప్తభావంతో ఒకేచోట నిలబడి ఉండటం నేను సహించుకోలేకపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడాలని, వాళ్ళగురించి తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను.

          ఈసారి ఆమె రేలింగ్ మీద నాకు దగ్గరగా వచ్చినప్పుడు నేను అడిగాను, “మీరు ఎక్కడనుంచి వచ్చారమ్మా?”

          “రాంచీ నుంచి.” ఆమె క్లుప్తంగా జవాబు చెప్పి, సముద్రానికి అవతలవైపున ఉన్న చెట్లవరుసలని చూడసాగింది.

          “ఉద్యోగం చేస్తున్నారా?”

          “నేను కాదు. మావారు చేస్తున్నారు.”

          “నేను పోస్టల్ డిపార్టుమెంటులో ఇంటర్నల్ ఆడిట్ సర్వీసులో ఉన్నాను.” పరిచయం కాస్త పెంచుకుందామనే ఆలోచనతో నా అంతట నేనే నా గురించి ఆమెకి చెప్పాను. మా ఆవిడవైపు చూపిస్తూ అన్నాను, “మేమిద్దరం ఎల్ టీసీ మీద ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాం. మీపేరు అడగవచ్చునా?”

          “నేహా” తను నావంక చూస్తూ అడిగింది, “మరి ఆంటీ గారు?”

          “సరిగ్గా నీపేరు లాంటిదే—ఈవిడపేరు స్నేహ.” నేను చెప్పాను. నా చెవిని వెనకాల నుంచి పట్టుకుని నన్ను `అంకుల్’ అంది ఈ అమ్మాయి. తెలివైనది, ధైర్యవంతురాలు ఈ పిల్ల. ముక్కూముఖం తెలియనివాళ్ళతో మాట్లాడటం తప్పించుకునే బదులు నేను అడిగినదానికి జవాబు ఇవ్వడంలో ఆసక్తి చూపించింది. జవాబివ్వడంలో ఉన్న పద్ధతి చూస్తే ఈమె సాహసంతో పాటు సంస్కారం కూడా ఉన్న మనిషి అని తెలుస్తోంది. ఆ తరువాత జరిగిన సంభాషణలో వాళ్ళ ఆయన పేరు నరేన్ అని తను చెప్పింది. ఎమ్.టెక్. చేశాక అతను రాంచీకి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద కంపెనీలో కోల్ మైన్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. నేహా మాత్రం గూడులోంచి బయటికి వచ్చి ఆకాశాన్ని మొట్టమొదటిసారి చూస్తున్న పిచ్చుకపిల్ల లాగా అనిపిస్తోంది. ఇప్పటివరకూ కేవలం మేత కోసం తెరిచే ముక్కు ఇప్పుడు కలరవం చెయ్యడానికి తహతహలాడుతోంది. బాహాటంగా విశాలంగా ఉన్న గాలిలో రెక్కలు తటతటా కొట్టుకునేందుకు మొట్టమొదటి సారిగా అవకాశం లభించింది. తనకి గనక శక్యమైతే బోటులోని డెక్ నుంచి ఎగురుతూ వెళ్ళి, చాలాదూరంగా ఒక పెద్ద వలయాకారంలో ఆకాశంలో తిరిగివచ్చేది. నిజానికి తను ఒకవిధంగా అదే చేస్తోంది. చూడటానికి నరేన్ కూడా సౌమ్యస్వభావంకలవాడే, కాని అతనిలో ఇలా ఉన్ముక్తంగా కలరవం చెయ్యాలనే ఆరాటం కనిపించడంలేదు. ఆమెలాగా గెంతడంలేదు. తనభార్య ప్రేరేపణతో శరీరంలో వచ్చిన పులకింతను కూడా అణచి వేసుకుంటున్నాడు. బయటికి తెలియనివ్వడంలేదు. అతను ఇంతవరకూ జీవితంలో మైన్ ఇంజనీరింగ్ కి చెందిన కేవలం `జ్ఞానవర్ధకమైనపుస్తకాలు’ మాత్రమే చదివాడు. అంతకన్నా ఇంకేమీ చేయలేదు. జీవితంలోని రసజ్ఞత అంటే అతనికి తెలియదు. నేహా చదువురాని అమ్మాయి కాదు. ఎమ్.ఎస్-సి. బోటనీ చదివింది. కాని కేవలం  జ్ఞానాన్ని ఇచ్చే  పుస్తకాలతోపాటు తను రసజ్ఞతని కూడా తెలుసుకుంది. చదువుకున్న, తెలుసు కున్న ఆ రసజ్ఞతని, రసప్రాప్తిని, రసపానాన్ని ఇప్పుడు  తన భర్తతో పాటు సంపాదించ డాన్ని ఆశిస్తోంది. బహుశా ఆమె భర్త  జీవితంలోని రసాస్వాదన యొక్క అస్తిత్వం అంటే కూడా తెలియని వాడేమో. నాకు మాత్రం మాటిమాటికీ ఈ యుగంలోని అగస్త్య మహర్షిని కలుసుకుంటున్నానని అనిపించింది. ఆయన తనదృష్టిని గ్రంథాలమీద నుండి అసలు పక్కకి మరల్చేవాడు కాదు. మరి అతనితో ఉన్న ఈమె లోపాముద్ర. ఈ తృషిత లోపాముద్ర భర్తలోని నిద్రిస్తున్న పురుషుడిని మేలుకున్నట్లుగా చూడాలనుకుంటోంది.

          కలుపుగోలు స్వభావం ఉన్న కారణంగా తరువాత పది నిముషాల్లోనే నేహా మా దంపతులిద్దరితోనూ కలిసిపోయింది. కాని నరేన్ ముఖం మరోవైపుకి తిప్పుకుని ఎక్కడ చూస్తున్నాడో తెలియదు. బలవంతంగా స్కూలుకి తీసుకువెడుతున్న చిన్న పిల్లవాడిలా ఉన్నాడతను. కొత్తగా పెళ్ళయిన భార్యతో ఉండవలసిన ఉత్సాహం అతనిలో లేదు.

          “మీరు చూస్తున్నారు కదా అంకుల్… ఆంటీ! ఈయనెప్పుడూ ఎవరితోనైనా కలిసి మాట్లాడుకునే సంభాషణలో ఇన్వాల్వ్ కారు.”మాటిమాటికీ నేహా తన వ్యథని తెలియ పరుస్తోంది. “మిగిలినవాళ్ళ సంగతి విడిచిపెట్టండి. మా అన్నయ్య-వదినలతోనూ, మా అక్క-బావగార్లతోనూ, అందరిముందూ మౌనంగా ఉంటారు. నిజం చెపుతున్నాను నమ్మండి. ఆ సమయంలో నాకు నేను బాగా అగౌరవం పొందినట్లు, అవమానపడినట్లు ఫీల్ అవుతాను.”

          ఆమె చెప్పిన ఈమాట విని నాకు నా గతజీవితంలోని జ్ఞాపకాలని నెమరువేసుకునే అవకాశం లభించింది. నేను “చెప్పనా?” అని అడుగుతున్నట్లుగా క్రీగంటితో నా భార్య వైపు చూశాను. ఆమె తన కళ్ళతోనే ముందు కోపం చూపించింది. ఆ తరువాత నవ్వుతూ అంది- “వీళ్ళకి పనికివస్తుంది. చెప్పెయ్యండి!”

          “నేను నీ సమస్యకి సంబంధించిన విషయాల గురించి కొంచెం చెప్పాలనుకుంటు న్నాను నేహా, ఎక్కడైనా నచ్చకపోతే ఆపుజెయ్యి. నేను ఆగిపోతాను.” నా భార్య సంకేతాన్ని చూశాక నేను చెప్పడం మొదలుపెట్టాను-“అనుకోకుండా ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులు, జరిగే సంఘటనలు జీవితంతో ముడిపడివుంటాయి! నీకు నీ భర్త `రసజ్ఞత’ తెలియనివాడు దొరికాడు. నాకు అదే `రసజ్ఞత’ తెలియని భార్య దొరికింది. `రసజ్ఞత’ అంటే ఏమిటో తనకి అసలు తెలియనే తెలియదు. నేనెంత అర్థం అయేలా చెప్పడానికి ప్రయత్నించినా, అంతగానే తను వెనక్కి తగ్గేది. నిరాశలో మునిగిపోయేది. నిజానికి ఈ లోకంలో ప్రతి భర్త, ప్రతి భార్య కోరుకునేది ఇదేకదా, తన జీవితభాగస్వామి తన మనస్సుకి అనుగుణంగా వ్యవహరించాలని. అవునంటావా కాదంటావా?”

          “అదే నిజంకదా అంకుల్!” నేహా తన అంగీకారాన్ని తెలిపింది.

          “కాని, నువ్వు నా మనస్సుని తెలుసుకోకుండా నా మనస్సుకి తగినట్లుగా ఎలా వ్యవహరించగలుగుతావు?” నేను చెప్పసాగాను, “లేకపోతే, నేను నీ మనస్సుని తెలుసుకో నంతవరకు నీ మనస్సుకి అనుగుణంగా నేను ఎలా ఆలోచించగలుగుతాను! సరిగ్గా ఇదే అవకాశాన్ని మనం మన జీవితభాగస్వామికి ఇవ్వని పరిస్థితిలో అదే కారణంగా కుటుంబా లు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చును.”

          “వద్దు-వద్దు. ఏమయినా సరే, నేను కుటుంబం విచ్ఛిన్నం కానివ్వను అంకుల్!” నేహా వెంటనే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా అంది.

          “నువ్వు చూపిస్తున్న ఈ దృఢసంకల్పమే నీ కుటుంబాన్ని రక్షిస్తుందమ్మా!” నా చెయ్యి అనుకోకుండానే ఆమె తలపైకి ప్రసరించింది, “నా ఇల్లు, నా కుటుంబం కూడా నా దృఢమైన నిశ్చయంతో, సంకల్పంతోనే నిలబడింది. నేను కూడా ఓటమిని అంగీకరించ లేదు. చివరికి ఏది జరగాలో అదే జరిగింది. ధైర్యం చేసేవాళ్శకి ఎప్పుడూ ఓటమి అనేది ఉండదు. నువ్వు చూస్తున్న నీ ఆంటీ, ఇంటిపనులు తప్ప ఉల్లాసం అనేది ఎరుగని నీ ఆంటీ ఈరోజు నాతో అంటుంది- ఏమిటిది, రోజంతా దిగులుగా ఉంటారు, కాస్త సంతోషం గా, ఉత్సాహంగా  ఉండండి.” ఈ సంగతి చెప్పి నేను పగలబడి నవ్వేసరికి తన భార్యపట్ల ఉదాసీనంగా, దూరంగా నిలబడివున్న నరేన్ మావైపుకి తిరిగాడు. ఇంకా ఎవరైనా కూడా మావైపు తిరిగి ఉండవచ్చు. మరెవరిపైనా నా ధ్యాస లేదు. నేహా చేతి సంకేతంతో అతన్ని దగ్గరికి పిలిచింది. నవ్వుతూ అతనితో అంది, “మొదట్లో ఆంటీ కూడా మీలాగే బొత్తిగా మొద్దులాగా ఉండేవారని అంకుల్ చెబుతున్నారు!”

          “మొద్దుకాదు, సిగ్గుపడుతూ… బిడియపడుతూ… సంకోచిస్తూ… మొహమాటపడుతూ ఉండేది!” మాటని సవరిస్తూ నేను అన్నాను.

          “అంకుల్, నిజానికి ఇంట్లో నేనే అందరికన్నా పెద్దవాడిని. ఇద్దరు చెల్లెళ్ళున్నారు. మా అమ్మ ఉంది. నాన్నగారు మమ్మల్ని బాగా చిన్న వయస్సులోనే విడిచిపెట్టి వెళ్ళి పోయారు.” నరేన్ తన స్వభావం గురించి సంజాయిషీ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన గురించి నేహా ప్రత్యేకంగా చేసిన వ్యాఖ్యఅతన్ని ఆహతుడిని చేసిందన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. కాని, మాటని సరిదిద్దుతూ నేనన్న వాక్యం అతనికి కాస్త ఊరట కలిగించింది. అతనన్నాడు- “చిన్నతనం నుంచే బాధ్యతలు నా తలపైకి వచ్చాయి. అందువల్ల అక్కర్లేని విషయాలు మాట్లాడటానికి నాకెప్పుడూ సమయం దొరకలేదు. ఇప్పుడయితే, భయం వేస్తుంది.”

          “బాగా చెప్పావు.” నేను అతని భుజంమీద చెయ్యివేసి అతను చెప్పింది సమర్థిస్తూ అన్నాను- “కాని, ఇకముందున్న జీవితంలో నవ్వడం, సరదాగా మాట్లాడటం అనేది అవసరమైన వ్యవహారంలో భాగమైపోతుంది బాబూ. ఇంట్లోనూ, ఆఫీసులో కూడా.”

          అంగీకరిస్తూ అతను తల ఊపాడు.

          “ఈయన తలకాయ ఊపారు. కాని అంకుల్, ఈయనకి అసలేదీ అర్థమై ఉండదు.” నేహా వెంటనే ఎగతాళి చేస్తూ ఎత్తిపొడిచింది.

          “చూడమ్మా నేహా,” నేను వెంటనే అన్నాను, “బయటివాళ్ళదగ్గరైతే చెప్పే పని లేదు. కాని నీకు బాగా దగ్గరివాళ్ళ దగ్గర కూడా ఎవరినీ ఇలా ఎత్తిపొడవడం చెయ్యద్దు. ఒకరిమీద ఒకరు ఎగతాళి చేసుకోవద్దు.”

          “ఎత్తిపొడవలేదు అంకుల్. నేను ఏదో ఊరికేనే వేళాకోళానికి…” తను కాస్త కంగారు పడుతూ అంది.

          “వేళాకోళానికి కూడా వద్దమ్మా!” నేను నొక్కి చెబుతూ అన్నాను, “అది ఎప్పటికీ నయంకాని… ఒక తీవ్రమైన గాయం చేస్తుంది అప్పుడప్పుడూ.”

          “సారీ అంకుల్! నేను జాగ్రత్త పడతాను.”

          “నువ్వు మాత్రమే కాదు. ఇద్దరూనూ!”

          “దయచేసి వినండి. టూరిస్టులందరూ దయచేసి జాగ్రత్తగా వినండి!” అప్పుడే నావికుల తరఫునుంచి ఒక ప్రకటన మాకు వినిపించింది- “మనం కార్బిన్ కోవ్స్ బీచ్ కి చేరుకున్నాం. ఈ బీచ్ నుంచి ఇంచుమించు ఒక కిలోమీటరు దూరంలో సముద్రం అడుగుభాగంలో ప్రపంచంలోని అన్నిటికన్నా అందమైన పగడాలు ఉన్నాయి. అక్కడికి ఎవరు ఈదుకుని వెడతారో వారికి తోడుగా మా ఈతగాడు వస్తాడు. అవసరమైన కాస్ట్యూమ్ తో సహా అద్దె 500 రూపాయలు. ఈదకుండా వెళ్ళాలనుకునేవారిని  కిందిఅడుగుభాగం అంతా గాజుతో చేసిఉన్న మా బోటు అక్కడివరకూ చేరుస్తుంది. అద్దె 250 రూపాయలు. ఎవరు ఎలా వెళ్ళదలుచుకున్నారో ఒడ్డుకి చేరుకున్నాక దిగి సంప్రదించండి.”

          `బోటు’ ఒడ్డుకి చేరుకుంది. అందరికన్నాముందు ఒక నావికుడు దూకాడు. ఒక కుర్రవాడు బోటుమీద, మరొకడు కింద నిలబడ్డారు. వాళ్ళు ఒక్కొక్క టూరిస్టుని చాలా జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని కిందకి దిగడంలో సహాయపడుతున్నారు. నరేన్ కూడా సహాయం అందుకునే దిగాడు. మేముకూడా అలాగే వాళ్ళ సాయంతో దిగాం. కాని నేహా సహాయం అందుకునేందుకు నిరాకరించింది. ఒక్క గెంతు గెంతి బోటులోంచి కిందికి దూకింది. ఆ దూకడం ఆమెలో ఉన్న ఉత్సాహాన్ని తెలియపరుస్తోంది. నాకు మాత్రం ఇది బాగా నచ్చింది. కాని నరేన్ నెమ్మదిగా గొణుక్కోవడం నాకు వినిపించింది- “అలా దూకడం మంచిది కాదు. దెబ్బ తగిలితేనో?”

          “అయితే మీరు నన్ను ఎత్తుకుని ఇక్కడ తిప్పుతారు కదా!” తను గారం చేస్తూ అంది. అతని మెడ చుట్టూ చెయ్యివేసి వేలాడబోయింది. ఆ తుంటరితనానికి పాపం నరేన్ పళ్ళు కొరుకుతూ ఉండిపోయాడు. అతనిలో ఉన్న మంచి విషయం ఏమిటంటే, తన కలవ రాన్ని, ఉద్రేకాన్ని కోపంగా మారకుండా సహించుకుంటాడు. ఇద్దరు చెల్లెళ్ళకి అన్న కావడం మూలంగా తను ఈ స్వభావాన్ని అలవరుచుకున్నాడని నేను అనుకున్నాను.

          అప్పుడే, మాకు ఒక పక్కగా వచ్చి నిలుచున్న ఒక బాగా నల్లగా, చురుగ్గా, సన్నగా ఉన్న యువతివైపు నేహా నా ధ్యాసని మళ్ళించింది. నా దగ్గరికి వచ్చి గుసగుసలాడు తున్నట్లు నాతో చెప్పింది- “చలువరాయిని చెక్కి చేసిన ఒళ్ళు అంకుల్, జాగ్రత్తగా ఉంచుకోవలసినది.”

          హావభావాలు, ధరించిన వస్త్రాలని బట్టి ఆమె ఎవరో స్థానిక శ్రామిక యువతిలా ఉంది. దేహసౌష్ఠవం దైవప్రదత్తం. చర్మంలో నిజంగా నల్లని రాళ్ళవంటి అద్భుతమైన మెరుపు. తప్పకుండా జాగ్రత్తవహించి ఉంచుకోవలసిన అందం, మనస్సుని ఆకట్టుకునే సౌందర్యం. ఒక్క క్షణం నేను ఆమెని చూస్తూ ఉండిపోయాను. తరువాత కాస్త జాగ్రత్తపడి నేహాతో నెమ్మదిగా అన్నాను- “అవును. నిజమే. కాని ఇదే మాట ముందుగా నేను అని వుంటే నువ్వు ఏమనుకునేదానివి—అంకుల్ చాలా పోకిరి అని, తుంటరి అని.’

          “కాదు అంకుల్” ఆమె నెమ్మదిగా అంది. ఆ తరువాత వాళ్ళ ఆయన వినేలా చెప్పింది- “అందమైన వస్తువులని గుర్తించడం, ప్రశంసించడం… మనస్సులోని మాట బయటికి చెప్పడం, ప్రతి ఒక్కరికి తెలియాలి.”

          అప్పుడే, పగడాలు చూపించడానికి డైవ్ చేసే ఈతగాళ్ళైన కుర్రవాళ్ళు మా టూరిస్టుల దగ్గరికి వచ్చి అడగడం మొదలుపెట్టారు. మా దగ్గరికి కూడా వచ్చారు. ఇక్కడ స్నేహ, అక్కడ నరేన్ కూడా డైవ్ చేసేందుకు వెళ్ళడానికి నిరాకరించారు. వాళ్ళు అడుగు భాగం గాజుతో ఉన్న పడవలో వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. అటునుంచి నేహా, ఇటు నుంచి నేనూ డైవ్ చేసేందుకు వెళ్ళడానికి డబ్బులు చెల్లించాం. నేహా చురుగ్గా ఉన్న వయస్సులోని పిల్ల. ముందుగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. 56 ఏళ్ళ ప్రౌఢత్వంతో పరిణతి చెందిన నన్ను కూడా తీసుకువెళ్ళడానికి ప్రశాంత్ అనే 26 ఏళ్ళ కుర్రవాడు కొంచెంసేపు తరువాత వచ్చాడు. నన్ను తీసుకుని అతను సముద్రంలో ముందుకి వెడుతున్నకొద్దీ, నా ప్రౌఢ శరీరం గగుర్పాటుతో పులకరించింది. నేను మొదటిసారి సముద్రంలో కింద ఉన్న రంగురంగుల పూలవనాన్ని  చూశాను. వేలకొద్దీ రకాల చిన్న-చిన్న రంగురంగుల చేపలు పగడాల మధ్య ఉన్ముక్తంగా ఆనందంగా విహారం చేస్తున్నా యి.

          నేహా నాకంటే ముందే సముద్రంలోకి వెళ్ళింది. కాని తిరిగి రావడం మేము ఇంచు మించు ఒకే సమయానికి వచ్చాం. అంటే దాని అర్థం తను నాకన్నా ఎక్కువ సమయం సముద్రజలంలో గడిపింది. ఎక్కువ గగుర్పాటుని  తనలో నింపుకుంది.

          “ఎలావుంది అంకుల్?” నన్ను ఒడ్డుకి చేరుకున్నట్లు చూడగానే తను అడిగింది.

          “అద్భుతం! కల్పనాతీతం!” నేను అన్నాను.

          “మళ్ళీ ఒకసారి వెళ్ళండి!” తను అంది, “ఈసారి ఆంటీని కూడా తీసుకెళ్ళండి.”

          నేను స్నేహతో ఏమన్నా చెప్పడానికి ముందే స్నేహ తువ్వాలు నావైపుకి విసిరింది. అంది- “బట్టలు వేసుకోండి. ఇంకేమీ మాట్లాడవద్దు.”

          నేను స్నేహతో ఏమీ పట్టు పట్టలేదు. తను చెప్పింది విన్నాను. కాని నేహా మాత్రం నరేన్ చెప్పిందేమీ అసలు వినలేదు. వెయ్యిరూపాయలిచ్చి రసీదు తీసుకుంది. అతన్ని లాక్కుంటూ తీసుకువెళ్ళింది. కొంచెం సేపు తరువాత వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. నేహా ముందుకన్నా రెట్టింపు సంతోషంగా ఉంది. నరేన్ బహుశా వణుకుతున్నట్లున్నాడు.

          “చూడండి అంకుల్! సముద్రం నీళ్ళు చల్లగా లేవు, వాతావరణం కూడా చల్లగా లేదు.” నరేన్ మీద తెచ్చిపెట్టుకున్న కంప్లయింట్ చేస్తూ తను అంది- “అయినా, చలికాలంలో తడిసిపోయిన వానరంలాగా వణుకుతున్నారీయన!”

          నిజానికి ఇద్దరూ వణుకుతున్నారు. కాని ఇద్దరి వణుకులో తేడా ఉంది. నేహాకి తను వణుకుతున్నట్లు ఏమీ తెలియడంలేదు. తను కేవలం నరేన్ ని చూస్తోంది. నేను నవ్వ కుండా ఉండలేకపోయాను. నరేన్ సముద్రంలోంచి బయటికి రాగానే శుభ్రమైన మామూలు నీళ్ళు  ఒంటిమీద పోసుకునేవైపుకి ముందుకి వెళ్ళాడు. నేహా మా దగ్గరికి వచ్చింది. అంది- “ఈయన చాలా భయస్థులు!”

          తను చెప్పింది విని నేను తనని స్నేహకి కొంచెం వేరుగా తీసుకువెళ్ళాను. గొంతుక కాస్త తగ్గించి తనతో అన్నాను- “అతను ఎంత నైపుణ్యం ఉన్న  మైన్-ఇంజనీరు అయినా, నేహా! ఎన్నిసార్లు కోల్ మైన్స్ లోకి వెళ్ళివచ్చి ఉంటాడు. కాని వెళ్ళినప్పుడల్లా పనిమీద వెళ్ళాడు. సముద్రంలో అతను మొదటిసారి మునిగాడు. ఇక్కడ అతను పనిమీద వెళ్ళ లేదు. నీ వేలు పట్టుకుని కొంత కొత్త అనుభవాన్ని, అనుభూతిని సంపాదించడానికి వెళ్ళాడు. ఆ కొత్తలోకం ఏమిటో అతను చూశాడు. అతను భయంతోనూ, చలితోనూ కాదు, గగుర్పాటుతో వణుకుతున్నాడు. అతని అణువణువూ పులకరించిపోతోంది. అవకాశం దొరికితే మాటిమాటికీ వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఈ పులకరింతలో నువ్వే అతన్ని నిలిపి ఉంచగలుగుతావు. ఇది కేవలం నేనిచ్చే సంకేతం మాత్రమే. జాగ్రత్త తీసుకో.”

          నరేన్ మామూలు నీళ్ళతో స్నానం చేసి వచ్చాడు. ఒళ్ళు తుడుచుకుని బట్టలు వేసుకోసాగాడు. చేంజ్ చేసుకునేందుకు నేహాతో పాటు నేను స్నేహని పంపించాను. అవసరం లేదు కాని , కేవలం అభిమానంతో.

          ఆ తరువాత మేము దాదాపు ఒక వారం రోజులు పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నాం. నేనూ, స్నేహ బారాటాంగ్, బైరన్ ద్వీపం, చిడియా టాపూ, రాస్ ఐలాండ్, చాథమ్ సా మిల్లు మొదలైన చాలా చరిత్రాత్మకమైన, చూడ వలసిన చోట్లకి వెళ్ళి తిరిగి చూశాం. సెల్యులర్ జైలుకి చెందిన సుప్రసిద్ధమైన, మనోహరమైన, ఉత్సాహవర్ధకమైన వెలుగు-ధ్వని కార్యక్రమం చూశాం. నేహా-నరేన్ మళ్ళీ ఎక్కడా కలవలేదు. అయినా వాళ్ళు జ్ఞాపకం వస్తూనే ఉన్నారు. మేము తిరుగు ప్రయాణానికి ఉదయం కోల్ కాతా ఫ్లైట్ పట్టుకోవడానికి ముందురోజు రాత్రి పోర్ట్ బ్లెయిర్ లో కుండపోతగా వర్షం కురిసింది. మేం వెళ్ళవలసింది మొట్టమొదటి ఫ్లైట్. సమయానికి టెన్షన్ లేకుండా ఎయిర్ పోర్ట్ చేరుకోగలమో లేదోనని భయంగా ఉంది. మొత్తానికి చేరుకున్నాం. అమ్మో! వీర్ సావర్కర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లో రన్ వే లు  కూడా నీళ్ళలో మునిగిపోయివున్నాయి. లోపల హాలులో కూడా నీళ్ళు వచ్చేశాయి. శుభ్రం చేసే పనివాళ్ళు వైపర్లు తీసుకుని ఆ నీళ్ళని బయటికి తోడేస్తు న్నారు. చాలా సేపు ఎదురు చూశాక మేము మా సామాను స్కానింగ్ మిషన్ దగ్గరికి చేర్చ గలిగాం. వెయిటింగ్ హాల్లో అడుగు పెడుతూనే మాకు కనిపించిన మొదటి బెంచీలోనే నేహా-నరేన్ కూర్చునివున్నారు. మనస్సు ఉత్సాహభరితమయింది.

          అదే సమయంలో వాళ్ళుకూడా మమ్మల్ని చూశారు. నరేన్ వెంటనే లేచి మాదగ్గరికి వచ్చాడు. అతను మాకు పాదాభివందనం చేశాడు. మా చేతిలోని సామాను తీసుకుని బెంచీ వరకు చేర్చాడు. బెంచీమీద ముగ్గురు మాత్రమే కూర్చునే చోటు ఉంది. మమ్మల్ని నేహాతో కూర్చోబెట్టి అతను మాత్రం నిలబడివున్నాడు. సంతోషంగా మాట్లాడుతూ, నవ్వుతూ, మందహాసం చేస్తూ ఉన్నాడు. మధ్యలోని కొద్దిరోజుల్లోనే అతను నేహా కోరు కుంటున్నట్లుగా ఇంచుమించు అదేవిధంగా స్మార్ట్ యువకుడిలాగా అయ్యాడు. ఈలోగా నేహా సిగ్గుపడుతున్న కొత్త కోడలు లాగా  తదేకంగా తన భర్తని తిలకిస్తూ  కూర్చుని వుంది. పక్కనే కూర్చున్న స్నేహ ఆమెతో మాట్లాడటానికి నోరు తెరవగానే, కూర్చునిఉండే తను స్నేహని కౌగలించుకుంది.

          “ఏమీ అడగద్దు ఆంటీ, ఏమీ చెప్పొద్దు కూడా ప్లీజ్!” తన ఒళ్లో ముఖం దాచుకుని ఆమె వెక్కి-వెక్కి ఏడుస్తూ అంది-“ఈ ఆనందంతో నేను ఏడ్చేస్తాను. నిజంగా. ఏమీ తెలియని ఒక తెలివితక్కువ మనిషితో నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆశీస్సులతో అన్నివిధాలా జాగ్రత్త తీసుకునే భర్తతో నేను ఇంటికి తిరిగివెడుతున్నాను! మిమ్మల్ని ఎప్పటికీ మరువలేను.”

          “ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా!” స్నేహ అంది.

          “మీ ఇద్దరిమధ్యలో అద్భుతమైన  అండర్ స్టాండింగ్ ఉంది ఆంటీ, టచ్ వుడ్!” ఆమె అంది, “ఆరోజున బోటులో కళ్ళతోనే మీరు అంకుల్ కి సంజ్ఞ చేయడం నేను చూశాను. నాకు ఆ సపోర్ట్ అవసరం చాలా ఉంది ఆంటీ, నిజంగా!”

          “దేవుడు ఎప్పుడూ నిన్ను సంతోషంగా, సుఖంగా ఉంచాలమ్మా!” ఆ అమ్మాయి చెప్పింది విని ఆమె శిరస్సుపైన చెయ్యి ఉంచి స్నేహ అంది.

          మా ఫ్లైట్ కి చెక్-ఇన్ విండో ఓపెన్ చేసే ప్రకటన చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏదో వేరే ఫ్లైట్ లో వెళ్ళాలి. వాళ్ళ దగ్గరి నుంచి సెలవు తీసుకుని, మేము బోర్డింగ్ పాస్ తీసుకోవ డానికి ముందుకు నడిచాం.

          తేలికపాటి వర్షం మళ్ళీ మొదలయింది. ఎయిర్ పోర్ట్ కి బయట, ఎక్కడో సమీపం నుంచే వస్తున్న లకుముకిపిట్ట మధుర స్వరం చెవుల్లో పడుతోంది. నేను తలకాయ తిప్పి వెనక్కి చూశాను. నరేన్ బెంచీ మీద కూర్చునివున్నాడు. నేహా అతని భుజంమీద తల ఆన్చుకుని బరువెక్కిన కళ్ళతో మమ్మల్ని తదేకంగా చూస్తోంది.

***

డా. బలరామ్ అగ్రవాల్ – పరిచయం

26 నవంబరు 1952 న బులంద్ షెహర్, ఉత్తరప్రదేశ్ లో జన్మించిన డా. బలరామ్ అగ్రవాల్ గారు ప్రఖ్యాత రచయిత, సమీక్షకులు, అనువాదకులు. వీరు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో తన రచనాకౌశల్యం చూపించారు. వీరి విద్యార్హతలు- పిహెచ్.డి., అనువాదంలో పి.జి. డిప్లొమా, ఆయుర్వేదరత్న మొ. డా. అగ్రవాల్ గారి సాహిత్యసేవ వైవిధ్యభరితమైనది. మినీకథ, కథ, కవిత్వం, సమీక్ష, బాలసాహిత్యం, అనువాదం వీటిలో ఉన్నాయి. వీరి 9 మినీకథా-కథాసంకలనాలు, 6 సమీక్షాగ్రంథాలు, 15 బాలసాహిత్యానికి చెందిన పుస్తకాలు ప్రచురితం. ఇంచుమించు 25 కథాసంకలనాలకి సంపాదకునిగా ఉన్నారు. వీరి రచనలు సంఘంలోని చైతన్యాన్ని, లోతైన ఆలోచనని ప్రతిబింబిస్తాయి. వీరి శైలి సహజంగానూ, ప్రభావవంతంగానూ ఉంటుంది. కేంద్రప్రభుత్వంవారి సాంస్కృతిక మంత్రిత్వశాఖకి చెందిన సి.సి.ఆర్.టి. నుండి వీరికి సీనియర్ ఫెలోషిప్ (హిందీ-2019-21) లభించింది. సెకండరీ స్థాయి విద్యార్థులకోసం పాఠ్యపుస్తకాల నిర్మాణానికి సంబంధించిన ఎన్.సి.ఇ.ఆర్.టి. వారి 2 ప్రాజెక్టులలో సంపాదకత్వం నిర్వహించారు. వీరి సాహిత్యసేవకు చాలా సన్మానాలు, బహుమానాలు లభించాయి. 2023లో వీరిని ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థాన్, లక్నో ద్వారా `డా. రామ్ కుమార్ వర్మ బాలనాటక సన్మానం’ ప్రదానం చేసి సత్కరించారు. డా. బలరామ్ అగ్రవాల్ నోయిడా (ఉత్తరప్రదేశ్) వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.