
కనక నారాయణీయం -76
–పుట్టపర్తి నాగపద్మిని
కనకమ్మ నీళ్ళు పట్టుకొచ్చి పుట్టపర్తి దగ్గరున్న టెబుల్ మీద పెట్టి, కాస్త దూరాన నిలుచుని అంది.
‘శంఖవరం సంపద్రాఘవాచార్యుల వారి భార్య వచ్చి పోయిందిప్పుడే! వాళ్ళమ్మాయి బెంగుళూరులో పెద్ద చదువుకోసం పోతూ ఉందంట! మీ దంపతులొచ్చి ఆశీర్వదించాలమ్మా! అనింది. వచ్చే శుక్రవారం సాయంత్రం రమ్మని చెప్పిందామె! చాలా కలుపుగోలు మనిషి. భేషజమేమాత్రమూ లేదు పాపం!’
ఆమె మాటలకు తల పంకిస్తూ అంగీకారం తెలిపారు పుట్టపర్తి. దూరపు చుట్టం యీ శంఖవరం సంపద్రాఘవాచార్యులు. అంతకు మించి అయ్యకు మంచి స్నేహితుడు. కవిత్వం వ్రాయడమే కాదు, మంచి సాహితీ విశ్లేషకుడు కూడా! దానికి తోడు, అదృష్టం బాగుంది కాబట్టే, పెద్ద చదువు చదివి, ఇప్పుడు కడప కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. తన రచనలంటే కూడా బాగా ఇష్టపడతాడాయన! కాకపోతే శ్రీశ్రీ పట్ల మక్కువ ఎక్కువ! లోకో భిన్న రుచి: మరి!
***
‘నాగా! నాగా!’
పరుగులుపెడుతూ గట్టిగా పిలుస్తూ ఇంట్లోకి వచ్చేసింది చిట్టి.
‘ఏమే! రెండు జడల చిట్టీ! మెల్లిగా మెల్లిగా! అంత గట్టిగా అరుస్తూ రావాలా మీ నాగ కోసం?’
వంటింట్లో పనిలో ఉన్న కనకమ్మ నవ్వుతూ అడిగింది చిట్టిని.
ఆ అమ్మాయి అసలు పేరు రామసుబ్బ లక్ష్మి. కైప నాగభూషణం పెద్ద కూతురు. నాగభూషణం ఎలెక్ట్రిక్ పనులు చేస్తూ ఉంటాడు. విశ్వేశ్వరాలయం దగ్గరే ఉంటారు. ఎప్పుడు కరెంటుకు సంబంధించిన పని వచ్చినా ఆ మోచంపేటలో అందరికీ గుర్తుకు వచ్చే పేరు నాగభూషణం పేరే!
ఈ పిల్లను ఇంట్లో ముద్దుగా చిట్టి అని పిలిచే పేరే అందరికీ అలవాటై పోయింది. రెండు జడల చిట్టిగా కనకమ్మ ఇంకా ముద్దుగా పిలుస్తుందా పిల్లను! ఎప్పుడూ చాలా చక్కగా పద్ధతిగా బిర్రుగా వేసుకున్న రెండు జడలతో, పౌడర్ పూసుకుని, కళ్ళనిండా కాటుకతో, శుభ్రమైన బట్టలతో బొమ్మ మాదిరే ఉంటుందా పిల్ల!
వాళ్ళమ్మ ఆ అమ్మాయినలా ఉంచుతుంది మరి!
‘నాగెక్కడమ్మా?’
‘మీ నాగ అదుగో బావి దగ్గరుంది. తులజా, నాగా ఇద్దరూ బావిదగ్గరే ఉన్నారు.’
కనకమ్మ మాట విని తుర్రుమంటూ అటు బావి దగ్గరికి పోయింది చిట్టి.
బావి దగ్గర తులజక్కయ్య, నాగ, బావిలోంచీ నీళ్ళు చేదుతున్నారు.
వాళ్ళిద్దరూ నీళ్ళు చేది, బకెట్ నింపితే, ఆ బకెట్ నీళ్ళను స్నానాల గదిలో ఉన్న పెద్ద రాగి హండాలో (సిమెంట్ చట్రంలో పెద్ద రాగి గుండిగె ఉండేదప్పట్లో బాత్ రూంలలో) పక్కనున్న తొట్టిలోనూ పోసి వచ్చే పని అరవింద్ ది.
ఈ పని ముగ్గురూ కలిసి చేయవలసిందే!
లోతుగా ఉన్న బావిలో నుంచీ అక్క చెల్లెళ్ళిద్దరూ నీళ్ళు చేదుతుంటే వచ్చిన పని మర్చిపోయి తానూ ఆ హడావిడి చూస్తూ ఉండిపోయింది చిట్టి.
నాలుగైదు సార్లు తోడిన తరువాత, ఉన్నట్టుండి తాను వచ్చిన పని గుర్తుకొచ్చిందేమో చిట్టికి, ‘నాగా! తొందరగా రావే! రెడ్ క్రాస్ లైబ్రరీకి పోదాం.’ అన్నది.
రెడ్ క్రాస్ అనగానే నాగకు చిట్టి ఎందుకొచ్చిందో అర్థమై పోయింది.
‘అక్కయ్యా! పోతానే!’
అసలే తులజకు కోపమెక్కువ.
గంభీరంగా ఉంటుంది చాలా!
తన మాటంటే, నాగకూ, అరవింద్ కే కాదు, చిట్టికి కూడా భయమే! ఒక రకంగా పదహారేళ్ళ తులజ మాటంటే శాసనమే వాళ్ళ ప్రాణానికి!
నాగ తుర్రున చిట్టితో పోతే, నీళ్ళు చేదే పనంతా తన మీద పడుతుందని అర్థమైంది తులజకు! ‘అదిప్పుడు రాదు. నీళ్ళు చేదుతున్నాం కదా! అరగంట తరువాత రా పో!’
నాగ, చిట్టి గుండెలలో రాళ్ళు పడ్డాయి.
‘అమ్మో అరగంటనా! అక్కా! ప్లీజ్..అక్కడ మా ఫ్రెండ్ వత్సల కూడా ఉందక్కా! కాశీ మజిలీ కథలు, టాల్ స్టాయ్ కథలూ ముగ్గురూ కలిసి చదువుకోవాలనుకున్నాం. రేపు లైబ్రరీ ఉండదు. ప్లీజ్..నాగను తీసుకుపోతా!’
చిట్టి బ్రతిమాలింది తులజను.
‘ముగ్గురూ కలిసి చదువుకోడమంటే? ఒకే బుక్కుందా అక్కడ? అరగంట తరువాత ఉండదా ఆ బుక్కు? ఇప్పుడు నీళ్ళు చేదుతున్నాం కదా! అదైపోతేనే నాగొస్తుంది. అంతే!’
వీళ్ళ మాటలు విని కనకమ్మ వచ్చిందక్కడికి!
‘పోనీలేవే తులజా! నాగను పోనీలే చిట్టితో! నేను తోడుతాలే నీతో పాటూ!’
అమ్మ మాటకింక తిరుగే లేదు కదా!
చేతిలో తాడు వదిలేసి, ఆనందంగా చిట్టితో బైటికి పరుగు తీసింది నాగ. నవ్వుకుంటూ తాడందుకుంది కనకమ్మ.
***
నాగా చిట్టీ ఇంటికి దగ్గరలో ఉన్న రెడ్ క్రాస్ లైబ్రరీకి పరుగులు పెట్టారు. అక్కడప్పటికే పిల్లలు క్యూ కట్టి ఉన్నారు. గేట్ దగ్గర ఒక టేబుల్ చేసి ఉంది. దాని మీద పెద్ద అల్లూమినియం కాన్. దానిలో ఏముందో పిల్లలందరికీ తెలుసు. వేడి వేడి పాలపొడి పాలు. వారానికొకసారి, యీ లైబ్రరీ దగ్గర అక్కడికొచ్చే పిల్లలందరికీ ఉచితంగా పాలపొడి పాలు పంచుతుంటారు.
నాగ, చిట్టికీ ఆ పాల రుచి భలే ఇష్టం.
వత్సల కనిపించలేదు.
సరే, వీళ్ళిద్దరూ లైన్ లో నిలబడి తమ వంతుకోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి పాలు పంచే పని మొదలైంది.
తోపులాట కూడా!
క్యూను సక్రమంగా నడిపే పని ఒకతను చేస్తుంటే, మెల్లిగా క్యూ కదులుతున్నది. గాజు గ్లాసుల్లో వేడి వేడి పాలపొడి పాలు తాగుతుంటే, ఆ మజాయే వేరు!
మెల్లిగా ఊదుకుంటూ ఊదుకుంటూ పిల్లలు పాలు తాగి అక్కడే పెట్టిన టేబుల్ మీద పెడితే, పని వాళ్ళు వాటిని పక్కనే బకెట్లలో పెట్టుకున్న మంచి నీళ్ళతో కడిగి పెడుతున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ చేపట్టే యీ పని పూర్వాపరాలు వాళ్ళిద్దరికీ తెలియక పోయినా, ఆ రుచీ, ఆ తరువాత తాము లైబ్రరీలోకి పోయి చదువుకునే కాశీ మజిలీ కథలు, టాల్ స్టాయ్ కథల రుచీ చాలా బాగా ఇష్టం.
చదువు, ఆటల విషయంలో తేడాలున్నా, ఇక్కడ మాత్రం ఇద్దరిదీ ఒకే మాటే!
***
‘అమ్మా!’
పిలుపు విని బైటికి వచ్చింది కనకమ్మ.
బైట వల్లంపాటి వెంకట సుబ్బయ్య నిలుచుని ఉన్నాడు.
‘నువ్వా నాయనా! రా రా! ఇంట్లో అంతా బాగున్నారా?’
ఆప్యాయంగా అడిగిందామె.
‘బాగున్నారమ్మా! అయ్యగారు ఉన్నారామ్మా ఇంట్లో?’
‘లేరయ్యా, రామకృష్ణ సమాజంలో ఉన్నారేమో!’
‘సరేనమ్మా! నేనక్కడికే పోతాను.’
‘ఊరికేనా, ఏమైనా పనుందా?’
యధాలాపంగా అడిగిందామె.
తాను తెచ్చిన అరటి పళ్ళ సంచీని అమ్మకు అందిస్తుంటే ‘ఎందుకయ్యా ఇవన్నీ?’ అన్నదా తల్లి.
‘పెద్దవాళ్ళ దగ్గరికి వట్టి చేతులతో పోకూడదంట, మా అమ్మ అంటూ ఉంటుంది. అరటి పళ్ళే కదమ్మా!! నేను అయ్యగారిని అక్కడే కలుస్తాను.’
వెనుదిరుగుతున్న వెంకట సుబ్బయ్యనడిగింది కనకమ్మ,’నీ చదువూ, రచనలూ ఎట్లా ఉన్నాయి?’
వెంకట సుబ్బయ్యన్నాడు ,’నా సంగతేమో కానీ, ఇటీవల నాకొక మంచి కవి గారితో పరిచయమయింది. దిట్టమైన పద్య కవి అనిపించిందమ్మా! సంస్కృతాంధ్రాల్లో మంచి పట్టుంది. ఇంగ్లీష్ లో కూడా రచనలు చేస్తుంటాడట!
వారి పనిమీదే వచ్చినాను.’
‘అవునా? మంచిదే, ఇంతకూ ఆ కవిగారి పేరేమన్నావు?
*****
(సశేషం)

సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
