
చిత్రం-70
-గణేశ్వరరావు

అజంతా గుహల్లో అద్భుతమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి. వాటిలో “మహారాణీ అలంకరణ దృశ్యం” చెప్పుకోదగ్గ చిత్రం, ఇది చిత్ర కళకు వేగుచుక్క లాంటిది. ఇందులో రూప నిర్మాణం అద్భుతంగా కుదిరింది, ఈ చిత్రంలోని వాతావరణం ఎవరినైనా సమ్మోహితులను చేస్తుంది.
చిత్రం మధ్యలో కనిపిస్తున్న మహారాణి (శాతవాహన, బాదామి చాళుక్యుల రాణీలలో ఎవరైనా కావచ్చు) రూపం, నిల్చున్న భంగిమ ముందుగా అందర్నీ ఆకర్షిస్తుంది. అజంతా చిత్రకారులకు అలవాటు అయిన ప్రత్యేక శైలిలో ఇది చిత్రించబడింది. అందుకే రాణి, తన స్థాయికి అనుగుణంగా నిలువెత్తున కనిపిస్తుంటే, ఆమె పక్కనే ఉన్న సైరంధ్రి, పరిచారిక మరుగుజ్జులుగా చిత్రించబడ్డారు. మహారాణి తన పరిచారికల కన్నా గొప్పదని చెప్పడమే చిత్రకారుడి ఉద్దేశం. ఆమె ఎంతో మెరుగుపెట్టబడి తళతళలాడే అద్దంలో తనను తాను చూసుకుంటోంది, అలంకరణ సరిగా ఉందా, పూర్తయిందా అని తరచి చూసుకుంటోంది. ఆమె పరిచారిక బిగుతైన దుస్తులలో, రెండు వైపులా నేలపైన జీరాడుతున్న కొంగులను సర్దుతూ ఆమెకు సాయపడుతోంది, రాణీకి ఎడమ వైపు నిల్చుని ఉన్న సైరంధ్రి వీపున ఒక పూల బుట్ట వేళ్ళాడుతోంది, ఆమె ఎంతో ఉత్సుకతో పూలను అందిస్తోంది, రాణీ గారి ఆజ్ఞలకోసం ఎదురుచూస్తోంది. పూర్తి నేపథ్యం అంతా – విభిన్నమైన శిరోజాల అలంకరణ, వదులుగా ఉన్న కొన్ని దుస్తులు , బిగుతుగా ఉన్న మరికొన్ని దుస్తులు, మహారాణి కంఠసీమలో అలంకరించిన మణిమయ హారం – చిత్ర పటానికి కొత్త సొగసును చేకూరుస్తున్నాయి.
ఇక రంగుల మేళవింపు గమనించండి. లేత నారింజ రంగు పూత చెట్ల కొమ్మలపైన, నేల రాలిన ఆకుల పైన, దూరంలో ఉన్న కొండలపైన పరచుకోగా, సాయంకాలం చీకట్లో వెనకగా దట్టంగా ఉన్న చెట్లు, వాటి కొమ్మలు ముదురు నలుపు రంగులో చిత్రించబడ్డాయి. వర్ణ సంవిదాన నైపుణ్యం చెప్పుకోదగ్గది. ఈ వర్ణపటంలో కనిపించే రంగుల సమ్మేళనం – మరో చోట కనిపించదు.
శిల్ప కళకు కాలదోషం లేదు, కాని చిత్రకళ అలా కాదు, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ కుడ్య చిత్రాలు కాలగర్భంలో లీనం అవకపోవటానికి కారణం – ఆ నాటి చక్రవర్తుల కళాకారులు అజంతా గుహాభ్యంతరాలలో వాటిని భద్రపరచి వాటిని శాస్వతం చేయడమే .
అసలు కుడ్యచిత్రంతో పాటు దాన్ని అనుసరించి వేసిన నమూనా చిత్రాన్ని కూడా ఇస్తున్నాను , పురాతనమైన కుడ్య చిత్రం యొక్క గొప్పతనాన్ని ఊహించుకోవడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది.
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
