
నువ్వు అణుబాంబువి
-తోకల రాజేశం
అయ్యో నా తోడబుట్టిన చెల్లెలా!
వాని దృష్టిలో మనుషులంటే రెండే జాతులు తల్లీ!!
ఒకటి నీచ జాతి రెండోది ఉన్నతమైనజాతి
మనుషుల రక్త నాళాల గుండా
మతాలు పారుతున్నంత సేపు
ఆలోచనా లోచనాలమీద
కులాలు సవారీ చేస్తున్నంత సేపు
మానవత్వానికి చిరునామా దొరుకుతుందా చెప్పు?
నిన్ను నీచమైన జాతిదానిగా శపించి
బందీఖానాలో వేసిన వాడు
నీకసలు స్వాతంత్రయమే లేదని
మంత్రాల నోటితో పలికించిన వాడు
వాని మెదడు మీద దేవుడై కూర్చున్నాడు కదమ్మా!
వానికి నువ్వెలా మనిషిగా కనిపిస్తావు
నువ్వొక ఆటబొమ్మవనుకుంటాడు వాడు
ఊపిరి లేని తోలు బొమ్మవనుకుంటాడు
కామం గజ్జితో కంపు కొడుతున్న వాడు
నిన్ను పాదాల కింద తొక్కిపెట్టాలనుకుంటాడు
కానీ వాడికి తెలియదు
నువ్వు వాని పాదాలను రెండుగా నరుకుతూ
తల ఎత్తే ధాన్యపు గింజవు
వాని అణువణువునూ చీల్చి
ముక్కలు చేసే అణుబాంబువి
(మహిళల పట్ల నోరుజారుతున్న మత ప్రవక్తల పట్ల నిరసనగా)
*****

తోకల రాజేశం మంచిర్యాల జిల్లా కవి…
