
“నీహార పథం” – కొండపల్లి నీహారిణి స్వీయ భావ తరంగిణులు
-డా. కొండపల్లి నీహారిణి
ఉపోద్ఘాతం
నేను అమెరికాలో ఉన్నాను. వచ్చి చాలా రోజులైంది. పెద్ద మనుమరాలు, “నానమ్మా ఏదైనా కథ చెప్పవా” అనీ, చిన్న మనుమరాలేమో, “నానమ్మా నీ చిన్నప్పటి స్టోరీ చెప్పవా” అని ఇద్దరూ నా చెరోవైపు చేరారు. ఆ చిన్నారుల చేతులు నా మెడ చుట్టేసుకున్నాయి. ఒకరు కథ కోసం …ఒకరు గాథ కోసం…
“సింహము చిట్టెలుక” కథ చెప్పగానే మరి నీ కథ? చెప్తాను రా ఉండండి..
“పోకంత పొట్టోడు-పోకంత పొట్టిది” కథనో, “రాము సోము” కథనో, “కోతి మొసలి” కథనో ఐకమత్యాన్ని సూచించే “నాలుగు ఎద్దుల” కథనో, కొంగల కథనో వాళ్ళు అన్నాలు తిన్నంత సేపుగానీ, ఎప్పుడైనా శని ఆదివారాలు సెలవుల్లో ఖాళీ సమయాల్లోనూ నేను చెపుతుంటే నా ఒళ్ళో వాలి వాళ్ళు వినడం అలవాటు.
ఈ కథలు వద్దు అన్నప్పుడు, తెనాలి రామకృష్ణ కవి కథలు, పరమానందయ్య శిష్యుల కథలు వంటివీ చెప్పేది. శ్రీరాముడివి, శ్రీకృష్ణుడివి, అర్జునుడు, శివాజీ కథలే కాదు, ఒక్కోసారి బాగా దుఃఖంలో ఉన్నప్పుడు అంటే… వాళ్లు క్రిందపడి దెబ్బలు తగిలినప్పుడో, జ్వరం వచ్చినప్పుడో నీతి సూత్రాలనూ కథలుగా అల్లి చెప్పడమూ, ” కోతి కథ” నో, “సూది కథ” నో చెప్పి నవ్వించమూ ఓ అలవాటు.
ఈ క్రమంలో ఎప్పుడో ఇద్దరిలో ఎవరికి చెప్పానో ఏమో వాళ్ళ నాన్న చిన్నప్పటి కథ! అదేంటి? నాన్న విషయం చెబితే కథ ఎలా అవుతుంది? అంటే, కథ కూడా అవుతుంది… కల్పనలతోనూ, నటిస్తూనూ కథ చెప్పేదాన్ని బట్టి!! అలా వాళ్ల నాన్న నడకనేర్చినప్పుడు పెన్నుతో, దువ్వెనతో,టూత్ బ్రష్ తో, చిన్ని కర్రతో, స్పూన్ తో బ్యాట్ లా పట్టుకొని క్రికెట్ ఆట ఎలా ఆడేవాడో చెబితే పడీ పడీ నవ్వారు. ఇలాంటివే మరికొన్ని. అవీ వద్దనుకున్నప్పుడు వాళ్ళ మేనత్త చిన్నప్పటి కథ చెప్పమనే వాళ్ళు. మా అమ్మాయి చిన్న పాపగా ఉన్నప్పుడు ఉల్లిగడ్డలను బంతుల్లా విసిరి ఎట్లా ఆడుకునేదీ, స్కూల్ కు వెళ్ళేప్పుడు ఎట్లా సైకిల్ నేర్చుకున్నది వంటివన్నీ చిత్రవిచిత్రాల కథలుగా అల్లి చెప్తుంటే కూడా వినడం ఇష్టం.
మరి ఇప్పుడేమో ఏకంగా…. నన్నే నా కథను చెప్పమంటున్నారు! ఏం చేయాలి? కథకు, గాథకు మధ్య ఉన్న తేడాలు వాళ్ళకు చెప్పి, వివరించే వయస్సు కాదు వాళ్ళది. ఒకళ్ళు ఎనిమిదేళ్లు ఒకరు ఐదేళ్లు. కానీ, నా చిన్ననాటి విషయాలు కొన్ని చెబితే పడి పడి నవ్వే వాళ్ళు కదా ఇప్పుడు ఒక నాన్నమ్మగా, అమ్మమ్మగా భారతదేశం నుంచి అమెరికా వరకు నా జీవిత ప్రస్థానం గురించే కాదు ఒక కవయిత్రిగా, ఒక రచయిత్రిగా , ఒక సంపాదకురాలిగా నేను ఇక్కడ వరకు చేసిన ప్రయాణాన్ని నా జీవన గాథగా చెప్పాలి. కథలలో కల్పన ఉంటుంది… గాథలలో గుండెచప్పుడు ఉంటుంది.
కథా రచయిత్రినైన నా జీవితంలో రెండూ ఉన్నాయి. అవును నా గురించి, సాహిత్యంలో నేను సాధించిన అభివృద్ధిని గురించి నేను చెబితేనే కదా వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకు తెలిసేది! మొట్టమొదటిసారి అమ్మమ్మగా అమెరికాకు వచ్చిన నా విదేశీ పర్యటననైనా, పద్దెనిమిదేళ్లుగా ఇదిగో ఇప్పటి వరకు వాళ్ళకోసమే ఎలా వస్తున్నానో, ఎందుకు వస్తున్నానో నేనే చెప్పాలి కదా! నాకు యాభై ఏళ్లు వచ్చిన తర్వాత నేను కళాశాల విద్యార్థిలా ఎలా కష్టపడి చదివి సాహిత్యంలో డాక్టరేట్ సాధించానో, కవిత్వరచన, కథా రచన, సాహిత్య విమర్శలో నా ప్రతిఫలనాలూ నేను చెప్తేనే కదా తెలిసేది! ఓ బొమ్మను దించి ” నానమ్మా పుట్ దిస్ పిక్చర్ ఇన్ యువర్ ‘తరుణి’ ” అంటూ వాళ్ళు గీసిన బొమ్మలను ఇస్తుంటారు, పత్రికా సంపాదకురాలిగా వాళ్ళ నానమ్మ నేపథ్యం తెలియాలి కదా!
“అమ్మమ్మా యూ కెన్… యూ కెన్… డు లైక్ దిస్” అంటూ కంప్యూటర్ లో నా “మయూఖ”, “తరుణి ” పత్రికల పనిని ఎలా చేసుకోవచ్చో నేర్పించిన నా కూతురు పిల్లలిద్దరు, నా పెద్ద మనుమరాలు, మనుమనికి ఓ ఇరవై పుస్తకాలు రచించి, ప్రచురించిన వాళ్ళ అమ్మమ్మ గురించి కొంత అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ” ఉత్తమ రచయిత్రి ” ప్రతిభా పురస్కారం వచ్చిందని తెలిసి, నాకు అభినందనలు చెప్పారు. పైగా అవార్డు తీసుకోవడానికి ఇండియాకెళ్ళననుకుంటే , అమ్మమ్మా నువ్వు తప్పకుండా ఇండియాకు వెళ్ళి స్వయంగా అవార్డ్ తీసుకోవాలి” అన్నారంటే అమ్మమ్మ అంటే ఏంటో కొంత అర్థం అయ్యింది కానీ , నా జీవితం కొన్ని సందర్భాల్లో నదిలా, కొన్ని సందర్భాల్లో సముద్రంలా ఎందుకు ఉన్నదో , ఎలా ఉన్నదో తెలియాలి కదా! అందుకే నా స్వీయ చరిత్ర రాయాలనుకున్నాను.
నా జీవితం గురించి నేను ఏమి రాయాలి ? ఏ భేషజాలు లేకుండా, ఏ దాపరికాలు లేకుండా నిజాయితీగా రాయాలి. నా అనుభవాలను, నా కృషిని, నేను సాధించిన విజయాలను, నేను దాటి వచ్చిన వైఫల్యాలను, అప్పుడు నాలో కలిగిన భావోద్వేగాలను రాయాలి. అందమైన నా బాల్యం, నా చదువు, చదువుల కోసం నేను పడిన ఇబ్బందులు, పెళ్ళి, పిల్లలు, నా కుటుంబంతో నా అనుబంధం, నా జీవితంలో.. నా సాహిత్య జీవితంలో నేను నడిచొచ్చిన నా అలుపెరుగని అడుగులు ఎట్లా ఉన్నవో, చిన్న పెండ్యాల నుంచి ప్రపంచ పర్యంతం నా జీవన తరంగిణులు ఏమిటో ఎలా ఉండేవో నలుగురికి చెప్పాలి. అవి నలుగురికి ఉపయోగపడాలి. రాస్తానా? రాయగలనా? రాయాలి. రాస్తాను. అక్షరానికున్న శక్తి తెలిసిన రచయిత్రిని. సత్యానికున్న విలువ తెలిసిన మనిషిని. నాలోని చైతన్యాన్ని నాదైన శైలిలో రాయాలి. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతానో పాఠకులకు తెలుస్తుంది. ఇదే ప్రామాణికం! ఇదే పరీక్షా సమయం!!
ఈ నా జీవితం !! నా జీవితం కొన్ని సందర్భాల్లో నది. కొన్ని సందర్భాల్లో సముద్రం. కొన్ని సందర్భాల్లో అలజడి. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్ద గంభీరం. అందుకే… ఈ స్వీచరిత్ర భేషజాలు లేకుండా, దాపరికాలు లేకుండా, నిజాయితీగా….
ఇది కేవలం నా కథ కాదు. ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే విలువల వారసత్వం . చిన్న పెండ్యాల నుంచి ప్రపంచ పర్యంతం అలుపెరుగని అడుగుల ప్రయాణం….
*****
(సశేషం)

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .
