“నీహార పథం” – కొండపల్లి నీహారిణి స్వీయ భావ తరంగిణులు

-డా. కొండపల్లి నీహారిణి

భాగం-1

తొలి తొలి అడుగుల చిన్నారి లోకం

నా చిన్నతనంలో మా ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. మా అమ్మ బాపు, అన్నయ్యలు, అక్కయ్య తమ్ముడు నాయనమ్మ, బాపమ్మ…  మాది పెద్ద కుటుంబం. అప్పుడప్పుడు వచ్చి పోయే మా మేనత్తలు, మా మేనమామలు, మా చిన్నమ్మ , వీళ్ళందరి పిల్లలు ! వీళ్లే కాదు ఇతర బంధువులు , స్నేహితులు, బాపు అనుచరులు, గ్రామస్తులు ఎందరో వచ్చి పోయేవాళ్ళు. ఇదే కాదు జీతగాళ్లు ఇంట్లో పనులు చేసే పనివాళ్ళు, మమ్మల్ని నమ్మి, మాపై ఆధారపడి మా వెంటే ఉండే ఎందరో ఎందరో…. అందరితో మా ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది.

మేం బాగా ఆటలు ఆడుకునేవాళ్ళం. పాటలు పాడే వాళ్ళం. బుర్ర కథ లు, ఏకపాత్రాభినయాలు, నాటికలు..ఓ మాకు రానివేవి? సమస్త కళలూ మా చుట్టే! ఆటలు?  మాకు అడ్డేమిటి? చోర్ పోలీస్, చార్ పత్తర్ , చదరంగం, పత్తాలు అంటే ప్లేయింగ్ కార్డ్స్ సమస్త క్రీడలూ మా చుట్టే!  మా ఇంటి గురించి చెప్పాలంటే, కులాలు, మతాలు, మంచితనం, మానవత్వం మా ఇంటి ‘గుంజలు’ , ‘ఇంటిపైకప్పు’ లు అని చెప్పాలి. గుంజలంటే అంటే పిల్లర్స్, స్థంభాలు !

మా ఇల్లు పెద్దది. చతుశ్శాల భవంతి. గూన పెంకలతో ఉండేది. దీనినానుకొని వెనుక ఒక బంగళా మరో ఆకర్షణ. వంటిల్లు, మధ్యర్ర అనే భోజనాల గది, రెండు హాల్స్, ఓ పడకగది ఉండేది. గూన పెంకల ఇల్లు తాతయ్య తండ్రి కట్టించారట. బంగళాను మా  అమ్మ , నాన్న గార్లు కట్టించారు. పాత ఇంటికి తూర్పున పెద్ద దర్వాజ, పడమటన చిన్న దర్వాజ ఉండేవి. ఈ రెండు ఇళ్లు కలిపేది  పడమటి మనసాల దర్వాజనే . దీని దగ్గర ఉండే ఓపెన్ ప్లేస్ మా  ఆటలకు అడ్డా! ఎన్నో విజ్ఞాన శాస్త్ర విషయాలను నేర్చుకున్న ఓపెన్ ఎయిర్ ప్లేస్, పూలచెట్లకు కూడా చిరునామా. ఎండాకాలం మా పడకలు అక్కడే. ఆకాశంలో చుక్కలు లెక్కించడం, ఏవేవో చక్కని కథలు అల్లి చెప్పుకోవడం అవన్నీ… మధురానుభూతులు. అక్కడనే బంగ్లా ఎక్కేందుకు మెట్లు ఉండేవి. మెట్ల క్రింద పచ్చని  మల్లె చెట్టు  మెట్ల పైకెక్కి తెల్లని పూలతో తీగ చూడటానికి అందంగా ఉండేది.

మా తమ్ముడు చెందు, నేను ఆటపాటలలో ఒకే జట్టు. చెందు పూర్తి పేరు రామచందర్ రావు . మా తాతయ్య పేరే ! తాతయ్య చనిపోయాక పుట్టాడని వారి పేరునే పెట్టుకున్నదట మా అమ్మ. మన పూర్వీకులను గౌరవించడమన్నట్టు! మా అక్కయ్య ఇంద్రాణి, అన్నయ్య విజయరామారావు. డాక్టరన్నయ్య పేరు శ్యామ్ సుందర్ రావు. పెద్దన్నయ్య కిషన్ రావు. అందరి పేర్లూ దేవుళ్ల పేర్లు. అదేంటో నా ఒక్క పేరే నీహారిణి! చంద్రుడు, ఇంద్రుడు, రాముడు, శ్యాముడు, కృష్ణుడు ఇలా వాళ్ల పేర్లల్లో దేవుళ్ళు ఉన్నారు. నా పేరులో ఏ దేవుడు ఏ దేవతా లేరు. ఈ విషయంపై నన్ను ఆటపట్టించేవాళ్ళు నా తోబుట్టువులు. అందుకేనేమో మా అమ్మ నన్ను ” దేవుడూ” అని పిలిచేది !! అందుకే నేను పేరులోనే పెన్నిధి ఉందా అంటే అవును పేరులోనూ పెన్నిధి ఉంటుంది అని వాదించేది. అది కాస్త  ఇలా ‘పెన్’ ‘నిధి’ అవుతుంది అని అప్పుడు నాకు తెలియదు!!

అట్లా నన్ను “దేవుడూ” అని పిలుచుకున్నది మా అమ్మ పెండ్యాల కౌసల్యాదేవి. మా బాపు పెండ్యాల రాఘవరావు. మేం నాన్నను బాపు అనంటాం. మాది చిన్నపెండ్యాల గ్రామం. మా ఊరు చాలా చైతన్యవంతమైన ఊరు. ఆధునిక యుగ చారిత్రక పురుషులను కన్న ఊరు. నేను నా “ఎనిమిదో అడుగు “కవితా సంపుటం” లో ‘మా ఊరు చిన్న పెండ్యాల’ మీద ఒక కవిత రాస్తూ, “విరులనూ వీరులనూ/ సరిసమానంగా కన్న/  విశిష్ట తరువు/ మా ఊరు చిన్న పెండ్యాల” అని వ్రాసాను. ఇది అక్షర సత్యం. ఎందుకు అక్షర సత్యమో, ఏంటో మునుముందు సందర్భాల్లో రాస్తాను. చిన్న పెండ్యాల అప్పుడు వరంగల్ జిల్లా, ప్రస్తుత కాలంలో జనగాం జిల్లా. వరంగల్ పోరుగడ్డ బిడ్డనని గర్వంగా వేదికలపై చెప్పాను కూడా!

దీనికి కారణం లేకపోలేదు. మా బాపు ప్రజా నాయకుడు. 1952 ఎన్నికల్లో రెండు MLA సీట్లు, ఒక MP సీట్ లను గెలిచారు. అద్వితీయంగా విజయం సాధించిన ఈ మూడు సీట్లలో రెండు ఎం.ఎల్.ఎ. స్థానాలకూ రిజైన్ చేసి ఎం. పి. పదవినలంకరించారు. M.P. గా ఐదేళ్ళు ఢిల్లీలో నెహ్రూ గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న నాయకులలో ఒక నాయకుడు మా బాపు. అలా వరంగల్ జిల్లా మొట్టమొదటి ఎం.పి. కూతురుగానే కాదు. తెలంగాణ రైతాంగ పోరాటాల, సాయుధ పోరాటాల వీరుని , స్వాతంత్య్ర సమరయోధుని సంతానంగా మేం  చరిత్రలో స్థానం ఉన్న వాళ్ళం.

మా బాల్యమేమీ భారంగా గడవలేదు, అలా అని బంగారుమయమూ కాలేదు. ఈ సమాజంలో చాలా మంది కన్నా మేం సంతోషంగానే పెరిగాం.

“ఉన్న దాంట్లో తృప్తి పడాలి, లేని వాళ్ళని చూసి జాలి పడాలి, ఇంతనైనా మనకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ” అని అమ్మ చెప్పేది. ఇదే మా నమ్మకమైంది. ఇదే మేము ఆచరించేది. ఆనాటి సమాజం దాదాపు ఇలా మా ఇంట్లోలాగే ఉండడం సర్వసాధారణం అని అనుకుంటా! మా చిన్నతనం అంతా ఇలాంటి చైతన్యంతోనే పెరిగాం.

మా ఇంటి పెద్ద దర్వాజ తలుపులు నగశీ చెక్కణాలతో ఉండేది. ఆ తలుపు తీయడం, పెట్టడం మా చిన్ని చేతులకు కష్టంగా ఉండేది, అది పెట్టాము అంటే కళ్ళు కాస్త గర్వంగా మెరిసేవి. అవి అంత బరువు ఉండేవి. ఇంటి ముందు గొడ్ల కొట్టాలు, అంటే పశువుల పాకలు రెండు ఉండేవి. ఒకటి బర్రెలకు అంటే గేదెల కోసం, ఒకటేమో ఆవులకు, ఎడ్లకు  కలిపి ఉండేది. చాలా ఏళ్లు గొర్రెలకు, మేకలకు కూడా వేరువేరు చిన్న చిన్న కొట్టాలు ఉండేవి . కాలక్రమాన అన్నీ పోయాయి. పాలు పిండడం, గడ్డి వేయడం పశువులను  విప్పడం, మేతకు తీసుకుపోవడం వంటి పనులకు జీతగాళ్లు ఉండేవాళ్లు. ఇలా పశువుల పనికి , పంట పొలాల పని చేసే వాళ్ళుండేది. ఆవులకు లక్ష్మీ, సీత , దుర్గ వంటి పేర్లు, ఎడ్లకు రాముడు, లక్ష్మణుడు, భీముడు వంటి పేర్లు ఉండేవి. మా చిన్నన్నయ్య విజయరామారావు  ఈ కోడెలను, ఎద్దులను అలా పేర్లు పెట్టి పిలవగానే వచ్చేవి, అన్నయ్య పెట్టే దానా తినేసేవి.

పెద్ద దర్వాజ కింద మెట్లు ఉండడం ఆ మెట్లకు ఒక వైపు అరుగులు ఉండడం ఆ అరుగుపై కూర్చొని మేము బస్సు ఆట ఆడుకోవడం మా ఉదయపు చురుకుదనానికి వేదికలు. ఇంకోవైపు ‘బంకులు’ అని పిలవబడే కారిడార్ లో కూర్చుని  ఇవన్నీ గమనిస్తూ, ఈ పశు సంపద విశేషాలనూ తెలుసుకునేవాళ్ళం. ఇంటికి వచ్చిపోయే వాళ్ళనూ, మా బాపు చేసే సామాజిక వ్యవహారాలనూ, ప్రజల పంచాయితీలకు ఇచ్చే తీర్పులను చూసేవాళ్ళం. ఇది మరో రకమైన చురుకుదనానికి వేదిక . ఇంటి ముందు పెద్ద వాకిలి మా క్రీడా ప్రాంగణం. కోకో, కబడ్డీ ఆటలు మా ఫ్రెండ్స్ , మా కజిన్స్ అందరం కలిసి ఒలంపిక్స్ లెవల్ లో ఆడుకునేవాళ్ళం.

మా ఊళ్లో ఏ కులం వాళ్లకు ఆ కులం ‘వీధులు’ అనేవి లేవు. మా ఇంటి ముందు గౌండ్లోళ్ళు, ఇంటి వెనుక సాలోళ్ళు అంటే పద్మశాలీలు, ఒకవైపు కమ్మరోళ్ళు ఇట్లా అన్ని కులాల వాళ్ళ ఇండ్లు కలిసే ఉండేవి. మేం అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళం. ముఖ్యంగా నేనైతే అన్ని ఇండ్లనూ చుట్టబెట్టి వచ్చేదాన్ని. మా వయసు పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళంతా మాకు స్నేహితులే! “దోస్త్ మేరా దోస్త్ … ” భావనలతోనన్నట్టు  ఉండేవాళ్ళం.

గ్రామపంచాయతీ వాళ్ళు పెట్టిన రేడియో నుండి వచ్చే కార్యక్రమాలను వినడం మాకు పెద్ద సరదా , ఇష్టం. మా ఇంటి ప్రక్కన మా బంధువుల  ఇల్లు కూలి శిధిలమైంది. ఇంకో తాతయ్య కుటుంబం వాళ్ళు ఉండేది. ఈ ఇంటికి కూడా చరిత్ర ఉన్నది, తర్వాత చెబుతాను. వీళ్ళ ఇంటి ముందే కచ్చీర్ ఉంటుంది. కచ్చేరు, కచ్చీరు ఇలా అంటాం. సిమెంటు గద్దెపై షాబాద్ బండలు వేసిన పెద్ద వేదిక. దీనికి నాలుగు గుంజలు ఉండేవి. పైన గూన పెంకుల కప్పు ఉండేది. మా పిల్లకాయలందరమూ బడి నుంచి వచ్చామంటే ఇక్కడే చేరి మా వీర ప్రతాపాలు ప్రదర్శించేవాళ్లం. కచేరికున్న స్థంబాలతో  నాలుగు గుంజలాట ఆడేవాళ్ళం. కచేరి చుట్టూ ఖాళీ స్థలం ఉండేది. ఎన్నో సంఘటనలనూ, ఎంతో చరిత్రనూ తన గర్భంలో దాచుకున్నది ఈ కచేరి. కచ్చీరు దగ్గర జరిగే చర్చలు వింటే చైతన్యం కలుగుతుంది. ఇక్కడ అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త జన బాహుళ్యానికి ఇటువంటి నాలుగు బాటల కూడలిలో చెట్టు కింద కూడి తీర్పులిచ్చే గ్రామ సంప్రదాయాలు అందరికీ తెలుసు. దీన్నే కొన్ని చోట్ల “రచ్చబండ” అంటారు కదా? అదే ఇది. తెలంగాణలో ముఖ్యంగా మా ఊళ్లో కచ్చీరు అంటారు. ఇక్కడే గ్రామపంచాయతీ రేడియో ఉండేది. కోమటి కొండయ్య ఇల్లు  ప్రహరీ గోడకు ఎత్తైన కర్ర నాటి దానికి పెద్ద మైక్ ఉండేది. కొండయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఈ  రేడియోను ఆపరేట్ చేసేవాళ్ళు.

తెల్లవారుజామున రేడియోలో వచ్చే మొట్టమొదటి మ్యూజిక్ వినడం మా అందరికీ అలవాటు.

“క్లూం…… కు కు కూం….. క్లూం…. కు..కు…కూమ్…….” ,

” టూం…టు..టు..టు..టుం టురుడుమ్…” అని వచ్చే ఓ చక్కని చిక్కని  మ్యూజిక్ మ్యాజిక్ శక్తి ఇంతా అంతా కాదు. ప్రొద్దున్నే 5.45 కు అనుకుంటా రేడియోలో వినిపించే స్వరాలే మా అలారం.  ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రం 738 MW khz అంటూ ఏవేవో మీడియం వేవ్.. షార్ట్ వేవ్ లపై ప్రసారం అంటూ చెప్పేవాళ్ళు. అవన్నీ నాటకీయంగా మానోట పాటగా, మాటగా రావాల్సిందే !   ఇలాంటి అనౌన్స్మెంట్ కాగానే, ” వందేమాతరం సుజలాం సుఫలాం… మలయజ శీతలాం…..”  ఆరు గంటలకు వచ్చే మన  జాతీయ గీతం పాడాలని తొందరగా నిద్ర లేచేవాళ్ళం. ఇందులో విశేషం ఏముంది ? అనుకోకండి… పాచి నోటితో పాడొద్దు అనే కండీషన్! వందేమాతరం పాడడం కోసం పళ్ళు తోముకుని రెడీగా ఉండాలి. లేదంటే పాడే అర్హత లేదు. ఈ రూల్ ను మాలో మేమే, పిల్లలమే పెట్టుకున్నాం. అందుకే ముందే లేచేవాళ్ళం. దేశభక్తి ఇక్కడే మొదలైంది క్రమశిక్షణ ఇక్కడే పుట్టింది. పిల్లలు పెట్టుకున్న నియమం ప్రకారం నోరు శుభ్రత ఉండాలి. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చిన బొగ్గుతో పళ్ళు తోముకుని సిద్ధంగా ఉండేవాళ్ళం. కొన్నేళ్ల తర్వాత ఫారోకీ మంజన్ అనే ఎర్ర పొడిని వాడాం. మా ఇంటర్ అప్పుడనుకుంటా కోల్గెట్ పేస్ట్ వచ్చింది. బ్రష్ పేస్ట్ వాడడం అంటే ఓ..గో…ప్ప!!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.