
అనుసృజన
మీరా పదావళి (తరువాయి గీతాలు)
అనువాదం: ఆర్.శాంతసుందరి
17. ఓ జీ హరీ కిత్ గయే నేహా లగాయే
నేహా లగాయే మన్ హర్ లియో
రస్ భరీ టేర్ సునాయే
మేరే మన్ మే ఐసీ ఆవే
మరూ జహర్ విష్ ఖాయకే
(మహానుభావా హరీ ! ప్రేమలో బంధించి ఎక్కడికెళ్ళిపోయావయ్యా?
ప్రేమిస్తున్నానని చెప్పి నా మనసు దొంగిలించావు
తీయటి మాటలెన్నో చెప్పావు
ప్రస్తుతం నా మనసు ఇంత విషం తాగి చనిపోమంటూంది)
ఛాడి గయే విశ్వాసఘాత్ కరీ గయే
నేహ్ కీ రేలా చఢాయే
మీరా కే ప్రభు కబరే మిలోగే
రహే మధుపురి ఛాయకే
(ఉప్పెనలాంటి ప్రేమలో ముంచెత్తి
విడిచి వెళ్ళిపోయావు విశ్వాతఘాతం చేశావు
మీరా ప్రభూ ఎప్పుడయ్యా మళ్ళీ కలిసేది?
ఆ మధుపురిలోనే ఉండిపోయావే !)
***
18. పపీహా రే పివ్ కీ బాణీ నా బోల్
(ఓ చాతకమా , ప్రియా అంటూ అతని పేరు పలకకు)
థారా సబద్ సుహావణా రే జో పివ్ మిల్యా ఆజ్
థారీ చోంచ్ మఢావూం సోవనీ తూ మేరే సిరతాజ్
(నీ గొంతు నాకు ఆహ్లాదం కలిగించాలంటే ఈ రోజు నా ప్రియుడు నన్ను కలిసేట్టు చూడు
నీ ముక్కుకి బంగారు తొడుగు చేయిస్తాను, నువ్వే నా శిరోమణివనుకుంటాను)
ప్రీతమ్ కో పతియాం లిఖూం కౌవ్వా తూ లే జాయే
ప్రీతమ్ జో సో జా కహే రే
థారీ బిరహిణీ ధాన్ నా ఖాయే
(నా ప్రియుడికి లేఖ రాసిస్తా గాని ఓ కాకమా తీసుకెళ్ళిస్తావా?
అతని దగ్గరకెళ్ళి నీ విరహవేదనలో
ఆమె అన్నం నీరూ ముట్టటంలేదని చెప్పు)
మీరా దాసీ వ్యాకులి రే పివ్ పివ్ కరత్ బిహాయీ
బేగి మిలో ప్రభు అంతరజామీ
తుమ్ బిన్ రహ్యో న జాయీ
(నీ దాసీ మీరా కలత చెంది ఉంది
ప్రియా ప్రియా అంటూ కలవరిస్తూ కాలం గడుపుతోంది
త్వరగా వచ్చి నన్ను కలుసుకో , నువ్వు అంతర్యామివి కదా!
నువ్వు లేకుండా ఉండలేను -అని తెలుసుకోలేవా?)
***
పపీహా అనే పక్షిని హిందీ కావ్యాలలో విరహాన్ని పెంచే పక్షిగా కవులు పేర్కొన్నారు. దాని కూత పిహూ పిహూ/పియూ పియూ అని వినిపిస్తుందిట. హిందీ భాషలో పీ అన్నా పియా అన్నా ప్రియుడు/భర్త అనే అర్థాలు ఉన్నాయి కనక అతను దగ్గర లేని సమయంలో ఈ పక్షి కూత అతన్ని గుర్తుచేసి మరింత బాధ కలిగిస్తుందని కవులు వర్ణిస్తారు.
ఈ పక్షికి చాతక పక్షి అనే మరో పేరుంది. తొలకరి వాన చినుకులని అవి కింద పడేలోపల తాగుతుందని నమ్ముతారు. ఈ లోపల ఎంత దాహమేసినా ఓర్చు కుంటుందట ! ఇది చైత్ర మాసం నుంచి భాద్రపదం దాకా ఎక్కువగా చెట్లమీద ఆకుల మాటున దాగి కూస్తూ ఉంటుంది.
కోయిలకీ దీనికీ ఉన్న సామ్యం, ఇది గూడు కట్టదు, దీనికి చాతకాదు, అందుకే ఇతర పక్షుల గూళ్ళలో గుడ్లు పెడుతుంది.
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
