
అనుసృజన
మీనాకుమారి హిందీ కవిత-1
అనువాదం: ఆర్.శాంతసుందరి
అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. 1. ఆబలాపా కోయీ ఇస్ దశ్త్ మే ఆయా హోగావరనా ఆంధీ మే దియా కిస్ నే జలాయా హోగా(ఎవరో మతిభ్రమించిన మనిషి ఈ శిథిలాల్లోకి వచ్చి ఉండాలిలేకపోతే ఈ గాలి వానలో ఇంకెవరు దీపం వెలిగిస్తారు?) జర్రే జర్రే పే జడే హోంగే కుంవారే సజదేఏక్ ఏక్ బుత్ కో ఖుదా ఉసనే బనాయా హోగా(ఒక్కొక్క ఇసుక రేణువు కీ ఏ అవివాహితుడో ప్రణమిల్లి ఉండాలి ఒక్కొక్క ప్రతిమను దైవంగా మార్చి ఉండాలి!) ప్యాస్ జలతీ హుయీ కాంటోం కీ బుఝాయీ హోగీరిసతే పానీ కో హథేలీ పే సజాయా హోగా(కాలుతున్న ముళ్ళ దాహాన్ని తీర్చే ఉండాలికారుతున్న నీటిని అరచేతిలో అలంకరించుకుని ఉండాలి!) మిల్ గయే హోంగే అగర్ కోయీ సునహరే పత్థర్అపనా టూటా హుఆ దిల్ యాద్ తో ఆయా హోగా(ఏవో బంగారు రంగు రాళ్లు దొరికినట్టున్నాయిఛిద్రమైన తన మనసు జ్ఞాపకం వచ్చే ఉండాలి!)
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
