
చాక్ పీస్ (కవిత)
-వి.విజయకుమార్
చిరిగిన రంగు పేలికల్ని మింగి
చక చకా ఇంద్రధనువుల్ని లాగే
విదూషకుడి చేతుల్లా
ఎన్ని వక్రాలు తిరుగుతావో
ఎన్ని వయ్యారాలు పోతావో
జ్ఞాన మూర్తి హస్తాల్లో
చైతన్యపు తీవలై
హొయలు పోతూ
చిటికెడు బూడిదై
లయించి పోతూ
ఆవిరై చివరికి
అంతమయ్యే జీవితమే అయినా
అంతో ఎంతో ఘనీభవిస్తూ
ఒకింత జీవితాన్ని పెంచుకుంటుంది కొవ్వొత్తి
వెలుగివ్వడం కోసమే అనుకో-
అణువు అణువుగా రాలిపోతూ
హారతై హరించిపోతూ
అప్పటికప్పుడే
అదృశ్యమై పోతావు మరి నువ్వు
అనంత రహస్యాల్ని విప్పుతూ
అంతులేని కథల్ని చెబుతూ
వెలుగుల్ని నింపడం కోసమే కదా మరి!
*****

నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.
