ఆరాధన-10 (ధారావాహిక నవల)
-కోసూరి ఉమాభారతి
కృషితో నాస్తి దుర్భిక్షం
గడచిన పన్నెండేళ్ళల్లో…‘దేవి స్తోత్ర మాలిక’, ‘ఆలయనాదాలు’ అన్న ప్రత్యేక నృత్య నాటికలతో అమెరికాలోని ముప్పైకి పైగా ఆలయ నిర్మాణ నిధులకు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేయడం ఒకెత్తయితే.. అమెరికాలో జరిగే ఆటా, తానా ప్రపంచ తెలుగు సభల్లో వరసగా పాల్గొని, మూడు మార్లు ‘అత్యుత్తమ ప్రదర్శన’ (Outstanding Performance) అవార్డు అందుకోవడం మరొకటి. మా నృత్యనాటికలకి నేను రాసే కథావస్తువుకి గుర్తింపు రావడం నాలో ఉత్సాహాన్ని నింపింది.
***
నృత్యేతర రచనలు చేయాలన్న ఆలోచనతో… ముందుగా నేను నా పదకొండవ యేట రాసిన బుద్దిమంతుడు’, నేల రాలిన తార’ కథలని బయటికి తీసి వాటిని తిరగ రాశాను.
రాసిన కథలని ఎలా ఏ పత్రికకి ప్రచురణకి పంపాలో తెలియక భద్రంగా ఉంచాను.
***
ఓ ఆదివారం పొద్దుటే మా వారితో కలిసి టిఫిన్ చేస్తుండగా, న్యూ-యార్క్ నుండి మా రవి బాబాయ్ ఫోన్ చేశారు. బాల్యం నుండి నా పట్ల అభిమానంగా ఉంటారు పిన్ని, బాబాయ్ లు. పిన్ని పేరు అంజలి. క్రమం తప్పకుండా క్రిస్టమస్ సెలవలకి కొడుకు రఘు తో సహా మావద్ద కి వస్తారు. అమెరికాలో మాకున్న ఆప్తులలో పెద్దవారు, ఆత్మీయులు వారే.
ఫోన్ లో బాబాయ్ చెప్పిన విషయం విని, నిర్ఘాంతపోయాను.
నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసి విశాఖ నుండి అమెరికాకి పిలిపించుకున్న వారి పెంపుడు కుమార్తె ‘వెన్నెల కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, అది తట్టుకోలేని పిన్ని క్రుంగిపోయి డిప్రెషన్ లో ఉందని చెబుతూ ఆయన కంఠం జీర బోయింది. విన్న నేను చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాను.
స్టూడియోల బాధ్యతలు మా బృందానికి అప్పజెప్పి వెంటనే న్యూ-యార్క్ కి వెళ్ళి రమ్మన్నారు మా వారు.
***
ప్రయాణం చేసినంత సేపూ.. ‘వెన్నెల అనే అమ్మాయి.. మా పిన్ని, బాబాయిల జీవితాల్లోకి ప్రవేశించిన వైనం గుర్తు చేసుకున్నాను. తన అక్కగారి ఆకస్మిక మరణంతో… ఆమె ఐదేళ్ల కూతురు వెన్నెలని చేరదీసింది పిన్ని. వ్యసనాలకి బానిసైన వెన్నెల తండ్రి.. బిడ్డని పెంచే బాధ్యత అప్పటికైతే వదిలిందని సంతోషించాడు, సమ్మతించా డని అందరు చెప్పుకున్నారు..
ఆడపిల్లలు లేని పిన్ని, బాబాయ్ ల ప్రాపకంలో ఏడేళ్లపాటు వెన్నెల అపురూపంగా ఓ యువరాణిలా పెరిగింది.
అమెరికన్ కాన్సులేట్ లైబ్రేరియన్ గా పనిచేసే బాబాయ్, పదవీ విరమణ అనంతరం వెన్నెలతో సహా అమెరికాలో స్థిరపడాలన్న పిన్ని ఆశలపై నీళ్ళు జల్లాడట అమ్మాయి తండ్రి. చేసేది లేక వెన్నెలని అక్కడే తండ్రి వద్ద ఉంచి, కాలేజీ వరకు చదివించాక, ఆ అమ్మాయి వివాహం కూడా జరిపించారు పిన్నీ వాళ్ళు. ఆ పైన భర్తతో సహా వెన్నెలని అమెరికా రప్పించి కాలిఫోర్నియాలో కాపురం పెట్టించారు. మరి, ఇంతలోనే వెన్నెల జీవితం ఇలా విషాదంగా ముగియడం… ఏమిటో’ అనుకున్నాను.
***
న్యూ-యార్క్ చేరాను. ఎంతో చలాకీగా ఉండే అంజలి పిన్ని దిగులుతో నిద్రాహారాలు మాని, మాటాపలుకు లేకుండా అయిపోవడం ఆందోళన కలిగించింది.
న్యూ-యార్క్ లో బాబాయ్ వాళ్ళకి, యేళ్లగా తెలిసిన సైకియాట్రిస్ట్ వాణి మీనన్ వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లాము.
ఆమెకి వెన్నెల విషయం వివరించి, ఆ అమ్మాయి బలవన్మరణానికి ముందు.. పిన్నికి రాసిన ఉత్తరాన్ని డాక్టర్ చేతిలో పెట్టారు బాబాయ్.
ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండు మార్లు చదివింది డాక్టర్ వాణి. కౌన్సెలింగ్ రూములో తన ఎదురుగా కూర్చుని మౌనంగా రోదిస్తున్న పిన్నిని చూసి బాధపడింది. “చూడు అంజలి, వెన్నెల ఇలా లోకాన్ని వీడిపోవడం చాలా శోచనీయం. ఆ అమ్మాయి గురించి అప్పుడప్పుడు నీవు చెప్పగా విన్న విషయాలు ఇప్పుడు నా మనసులోనూ మెదులు తున్నాయి.
…చావుపుట్టుకలు మన చేతుల్లో లేవు కదా అంజలీ. ఇప్పుడు నీవు కాస్త నిమ్మళంగా ఉండాలి.” అంటూ డాక్టర్ వాణితన సీటు నుండి లేచి వెళ్లి, పిన్ని పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
“… వెన్నెల ఉత్తరం చదివాను. ఎనిమిదేళ్ల పాటు, అమ్మ కన్నా మిన్నగా ప్రేమని పంచి.. తిరిగి తనని తండ్రి వద్ద వదిలి నీవు అమెరికా వెళ్ళిపోవడం జీర్ణించుకోలేక పోయానని అంది. చిత్తుగా తాగి రచుగా కొట్టే తండ్రికి సేవలు చేస్తూ, ఓ అనాధలా జీవించానని వాపోయింది.
తండ్రి ద్వారా తనపై వొత్తిడి తెచ్చి, తనతో సంప్రదించకుండానే మీరు తన వివాహం జరిపించారని అసహనాన్ని వెలిబుచ్చింది. భర్త సంజీవ్ తో సఖ్యత, ప్రేమ, గౌరవం లోపించిన వైవాహిక జీవితం సాగించలేక, ప్రతిఘటించి జీవించే ధైర్యం లేక ఈ లోకాన్ని వదిలిపోతున్నానని రాసింది.” అని కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది డాక్టర్అమ్మ.
“అయినా మీ మధ్య తల్లీ-కూతుళ్ళ బంధం ఇంతలా బలపడినప్పుడు… ఆ అమ్మాయిని దత్తత తీసుకుని మీతోపాటు అమెరికాకి తెచ్చేయవలసింది కదా! అప్పటికే నీవు ఎనిమిదేళ్లగా వెన్నెలని సాకుతున్నావు కూడా. ఆ ఆలోచన రాలేదా?” అడిగింది వాణి.
వెన్నెలని దత్తత తీసుకోవాలన్న తమ ప్రయత్నాన్ని వెన్నెల తండ్రి తిరస్కరిం చాడని, వెన్నెలకి బంగారు భవిష్యత్తునిస్తామన్న ప్రతిపాదనని తోసిపుచ్చాడని వాపోయింది పిన్ని. “తండ్రిని నేను ఉన్నానుగా. నాకు పనులు చేసిపెడుతూ నా కూతురు ఇక్కడే ఉంటుంది. ఇలాటి ప్రతిపాదనలతో నా వద్దకు రాకండి.” అంటూ మమ్మల్ని అవమాన పరచి పంపేశాడు.” అంటూ కళ్ళు తుడుచుకుంది పిన్ని.
డాక్టరమ్మ ఆశ్చర్యపోయింది. “నిజమా? మరి వెన్నెల ఏమనలేదా? తండ్రిని ఎదురించ లేకపోయిందా?” అడిగింది.
“అంతా నా ఖర్మ వాణి! వెన్నెలకి నేను తన విషయం చెబితే, అసలు వెన్నెలతో సంబంధం లేకుండా చేస్తానని మమ్మల్ని బెదిరించాడు మా బావగారు. అందుకే వెన్నెలకి విషయం చెప్పలేక, మింగలేక సతమతమయ్యాను. ఇక్కడ స్థిరపడాలన్న మా నిర్ణయం మూలంగా వెన్నెలని దూరం చేసుకున్నాను.
దాంతో ఆ పసిదానికి నేను, ఒక మనసు లేని మరబొమ్మలా అనిపించానే తప్ప … అమ్మలా నన్ను చూడలేకపోయింది. నన్నెలా అర్ధం చేసుకోవాలో తెలియక అల్లాడి పోయుంటుంది. ఫోన్ లో నా సంభాషణలు, అప్పట్లో నేను పంపే కానుకలు వెన్నెలకి ఊరటనివ్వలేదు.
ఆ ఎడబాటు నుండి బయటపడేందుకే, వెన్నెలకి ఇరవైయొక్కేళ్లు నిండగానే… మా దగ్గరి బంధువు, సంస్కారవంతుడు అయిన పరంధామతో వివాహం జరిపించాము. నా బంగారుతల్లి నా కళ్లెదుట ఉంటుందని ఆశపడ్డాను. కానీ నాప్రయత్నాలన్నీ శాపాలుగా మారి దాన్ని కాటేస్తాయని అనుకోలేదు”,”మరో విషయం తెలుసా? తనకి ఐదులక్షలు కానుకగా ఇస్తేనే తన కూతురి పెళ్లి మాటలు సాగనిస్తానని, తన అనుమతికి మా వద్ద లంచం కూడా తీసుకున్నాడు మా బావగారు.” అంటూ భోరుమంది శారద.
ముఖం తుడుచుకోమని టిష్యు అందించి, తిరిగి వెళ్లి తన సీటులో కూర్చుంది డాక్టర్ వాణి.
గదిలో కాసేపు మౌనం తాండవించింది.
“…బావగారి మాటకి గౌరవమిస్తూ, తండ్రీ కూతుళ్ల నడుమ అపార్ధాలకి కారణ మవకూడదన్న ఏకైక కారణంతోనే, వెన్నెలకి తన దుర్మార్గపు తండ్రి గురించి చెప్పకుండా తప్పు చేసాను. నా తప్పుల వల్లే వెన్నెల జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసింది. నా చిట్టితల్లిని నేనే చేజేతులా చంపుకున్నాను. ఎలా? అసలెలా జీర్ణించుకోను? ఈ పాపం నన్ను దహించివేస్తుంది. నాకు నిష్కృతి లేదు వాణి.” అంటూ ఉప్పెనలా పొంగుకొచ్చిన వేదనతో తల్లడిల్లిపోయింది పిన్ని తల్లి హృదయం.
“చూడు అంజలి! తల్లిలా సాకిన నీకు, మనసు లేని కన్నతండ్రికి నడుమ… వెన్నెల జీవితం ఇలా ముగియడం బాధాకరమే. వెన్నెల నీకు రాసిన ఉత్తరాన్ని కూడా చదివాను కనుక… ఓ సైకియాట్రిస్ట్ గా నేను ఆలోచిస్తున్నాను.
కొన్నేళ్ళు కన్నతల్లిలా ఆ పసిదాని జీవితంలో సంతోషాలని నింపిన నీవు, ఉన్నట్టుండి తన జీవితం నుండి నిష్క్రమించడం… వెన్నెలకి శరాఘాతమే అయింది.
ఆ చిన్నారి మనసు అర్ధం చేసుకోలేకపోయింది. పెంచిన తల్లి కూడా తనని వీడిపోవడాన్ని … తిరస్కారంగా భావించి తల్లడిల్లిపోయింది. మీ ప్రాపకంలో చక్కని వ్యక్తిత్వం ఉన్న యువతిగా ఎదగవలసిన ఆ అమ్మాయి భావోద్వేగాలకు అతిగా లోనయి, కొంత సమతుల్యతని కోల్పోయింది. అందువల్లే వెన్నెల నిబద్దత లేని ఆలోచనలతో పోరాడింది, అలాగే వ్యవహరించింది కూడా.
నిజానికి ఇటువంటి సమస్యలని నా ప్రాక్టీసులో చూస్తూనే ఉంటాను అంజలి. బలహీనపడిన మానసిక స్థితి వల్లే కొందరు … హత్యలు, ఆత్మహత్యలు, ఘోరమైన నేరాలు చేస్తుంటారు. అందుకే పిల్లల గురించి, వారి మనస్తత్వాల గురించి చాలా సూక్ష్మంగా ఆలోచించి, వ్యవహరించాలి. బాధ్యతాయుతమైన పెంపకం అవసరం. అప్పుడే కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడే పౌరులుగా ఎదగ గలరు. మన వెన్నెల జీవితం… నేటి సమాజంలోని తల్లితండ్రులకి, యువతకి కూడా సందేశాత్మకం అవుతుంది అంజలి!” అంటూ బాధగా నిట్టూర్చింది డాక్టర్ వాణి.
*****
(సశేషం)