
కాదేదీ కథకనర్హం-14
మళ్ళీ పెళ్ళి
-డి.కామేశ్వరి
సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా.
రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కర రావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా మరి! భాస్కరరావుకి రెండో పెళ్ళే! అయినా మగాడు. అందులో ముప్పై ఏళ్ళవాడు రెండో పెళ్ళి చేసుకోడం అది మామూలు విషయం!
అందుకే భాస్కరరావుని పొగడ్తలతో, శుభాకంక్షలతో సహోద్యోగులు, మిత్రులు, అధికారులు ముంచెత్తారు. అతని సంస్కారాన్ని ఆదర్శాన్ని పొగిడారు. అతని హృదయ వైశాల్యాన్ని కొనియాడారు. భాస్కరరావు హృదయం గర్వంతో మరింత విశాలం అయింది. చాలా మంచి పని . ఘనకార్యం సాధించిన తృప్తితో అతని మనసు నిండిపోయింది.
ఇంక సుగుణ స్థితి!…..ఆమెకి యిప్పటికీ యిదంతా నిజం కాదేమో భ్రమేమోననే అనుమానం! ఈ పెళ్ళి నమ్మశక్యం కాని విషయంలాగే అనిపిస్తుంది.
పెళ్ళి అయిన ఎనిమిది నెలలకే కారు ఏక్సిడెంట్ లో భర్త పొతే ఇంకెందుకీ బ్రతుకనుకుంటూ అందరిలాగే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. దేన్లో నన్నా పడి చద్దామను కుంది. ధైర్యం చాలకపోవడం కాక తనతో పాటు మరో ప్రాణిని హత్య చేయడం పాపం అన్న పాప భీతితో ఆ పని చేయలేకపోయింది. తరువాత …..పిల్లాడు పుట్టాక వాడికోసం బ్రతకక తప్పదని నిశ్చయించుకుంది. ప్రాణాలు ఆశలు, కలలు అన్నీఆ పసికందు మీదే నిల్ఫుకుని నిర్లిప్తంగా రోజులు వెళ్ళదీయసాగింది.
నా అని చెప్పుకోడానికి ఒక అన్న మాత్రం వున్నా …..ఆ అన్న మీద జీవితాంతం ఆధారపడి వుండడం యిష్టం లేక, ఉన్న డిగ్రీ ఆధారంతో ఉద్యోగంలో చేరింది.
సహద్యోగి అయిన భాస్కరరావుతో పరిచయం, ఎనార్ధంలో యీ విధంగా మలుపు తిరిగి రూపు దాలుస్తుందని సుగుణ ముందుగా ఎన్నడూ అనుకోలేదు. తీరా చేసి రూపు దాల్చాక ఏం చెయ్యాలో తోచని అయోమయంలో పడిపోయింది సుగుణ.
పరిచయం అయిన ఎనార్ధం తర్వాత భాస్కరరావు ‘పెళ్ళి చేసుకుందాం” అని అడిగినపుడు సుగుణ తడబడిపోయింది.! భయపడింది! బాధపడింది! ముందుగా సహద్యోగిగా , తరువాత మంచి మిత్రుడిగా, ఇంకొన్నాళ్ళ తర్వాత శ్రేయోభిలాషిగా మాత్రం అనుకుంది భాస్కరరావుతో పరిచయం పెరుగుతున్న కొద్ది! అంతకు తప్ప మరో భావం ఆమె మనసులో ఎన్నడూ లేదు. అందుకే కలవర పడిపోయింది భాస్కరరావు అడగ్గానే.
భాస్కరరావు అయితే సుగుణని చూసిన ముందు రోజు నుంచీ ఒకే అభిప్రాయంలో ఉన్నాడు. అందంగా వుంది అయినింటి పిల్ల! పెళ్ళాడుదామనుకున్నాడు. ఆమె విధవ అని తెలియక పూర్వం! తీరా చేసి ఆ సంగతి తెలిశాక, అప్పటికే అతని మనస్సులో నాటుకుపోయిన కోరికని పీకీ పారేయడం అతని వశంలో లేకపోయింది. రెండో పెళ్ళి అయితేనేం…..నాకు మాత్రం రెండో పెళ్ళి కాదా! యిలాంటి విషయాలలో పురోగమిం చాలి. అని సర్ది చెప్పుకున్నాడు. పిల్లాడు వున్నాడన్న విషయం మీద చాలా రోజులు ఆలోచించాడు భాస్కరరావు. ఆఖరికి వుంటేనేం వాడిని వాళ్ళమ్మ చూసుకుంటుంది. తనేం చెయ్యాలి. వాడి పోషణ ఖర్చేగా, వాడి పోషణ ఖర్చు వాడి అమ్మే పెట్టుకుంటుంది. ఉద్యోగం చేస్తుందిగా, తనకేం నష్టం వుండదు. అనినచ్చచెప్పుకున్నాడు. ఈ పెళ్ళిని అభ్యంతర పెట్టె పెద్దలు తనకి ఎవరూ లేరు. అన్నగారున్నా అయన యీ కాలం వాడే గనక అభ్యంతరం పెట్టడు. అసలు కలుగచేసుకోడు తన విషయం. అన్నీ నిశ్చయించు కుని తన ఉద్దేశం సుగుణ ముందు బయట పెట్టాడు.
సుగుణ ముందు కాదంది. అలాంటి పని చేయలేనంది. భాస్కరరావు అనేక విధాల నచ్చచెప్పాడు. రోజులు మారాయి, మనమూ మారాలి అన్నాడు. తప్పొప్పుల ప్రసక్తి ఏం లేదని నొక్కి చెప్పాడు. ఆలోచించుకోమన్నాడు.
సుగుణ ఒక రోజు కాదు. మూడు నెలలు రాత్రింబవళ్ళు ఆలోచించింది. యీ సమస్య ఎన్నాళ్ళు ఆలోచించినా ఎటూ తేల్చుకోలేని అయోమయంగానే కనపడింది ఆమెకి! పోయిన భర్తకి ద్రోహం చేస్తున్నట్టు బాధ, ఏదో కానిపని చేస్తున్నట్టు పాపభీతి, నలుగురికీ మొహం ఎలా చూపడం, ఏమనుకుంటారన్న కుశంకలు ఓ వైపు, మరోవైపు…… మోడై పోయిన తన జీవితం మళ్ళీ చిగిర్చి పుష్పిస్తుందన్న ఆశ.
—యిలా ఎటూ తేల్చుకోలేక నలిగిపోయింది. ఈ రెండేళ్ళలోనే తన బ్రతుకులో ఏర్పడిన వెలితి, నిర్లిప్తత తలచుకొని, ముందు రోజులు ఇంకెలా గడుస్తాయో ఊహించి తనకి దొరికిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదూ అన్న ఆలోచన వచ్చేది. తను తన బిడ్డని పోషించుకో గలదు, కాని….కానీ పట్టుమని పాతికేళ్ళు లేని తను…. పట్టుమని ఆరునెలలు కూడా కాపురం చెయ్యని తను…..ఆ ఆరునెలలని తల్చుకుంటూ అరవై ఏళ్ళు వంటరిగా బ్రతకగలదా! బ్రతుకులో మాధుర్యం చచ్చిపోయి, చావలేక బ్రతుకుతూ అవకాశం కాళ్ళ ముందుకు వచ్చి నిల్చుంటే తానెందుకిలా ఆలోచిస్తుంది! తరతరాలుగా భారత స్త్రీ సంస్కృతీ, సంప్రదాయాలు, జీర్ణించి పోయిన భారత స్త్రీ వారసురాలు సుగుణ, కనకే సుగుణ అన్నాళ్ళు యీ విషయం ఆలోచించింది . అన్నగారి ముందు యీ సమస్యని పెట్టింది సుగుణ, అభ్యంతరం చేపుతాడనుకున్న అన్న కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. నీ యిష్టం, వ్యక్తిత్వం వచ్చినదానివి, చదువుకున్న దానివి, నీకు నేనేం చెప్పను? ఆలోచించుకో, ముందుకి అడుగు వేయాల్సిందానివి నీవే, ఆ పర్యవసానం ఎలాంటిదైనా అనుభవించాల్సిందీ నీవే, నీవేం చిన్నపిల్లవి గావు, నేనేం చెప్పగలను” అన్నాడు. నీ యీ పనివల్ల నన్ను వెలేస్తారని యీ రోజుల్లో భయం లేదు. కనక ఆలోచించుకుని నీ యిష్టం వచ్చినట్టు చెయ్యి. నీవు మళ్ళీ పసుపు కుంకుమతో సుఖంగా వుంటానంటే నేను మాత్రం సంతొషించనా? అన్నాడు. అనుకున్న ఆ అభ్యంతరం కూడా లేకపోయిం తర్వాత యింకేన్నాళ్ళు ఆలోచించలేదు సుగుణ. అన్నగారు కూడా తన బరువు బాధ్యతలని ఇంకెన్నాళ్ళు మోయలేడని సుగుణకీ ఈ మధ్య అర్ధం అవసాగింది. తను సంపాదిస్తున్నా, తన బరువు మోయడం అన్నగారికి ముఖ్యంగా వదిన గారికి యిష్టం లేదని యీ మధ్య చాలా సందర్భాలలో గ్రహించింది సుగుణ. అలాంటి పరిస్థితిలో పిల్లాడిని పెట్టుకుని వంటరిగా వుండి రోజులు భయం భయంగా వెళ్ళబుచ్చడం కంటే మళ్ళీ తను, తన ఇల్లు, సంసారం అంటూ ఏర్పరచు కుంటే తప్పేమిటనుకుంది సుగుణ.
తను చేస్తున్న పనిలో తప్పులేదని తనకి తను నచ్చ చెప్పుకోడానికి సుగుణకి మూడు నెలలు పట్టింది. ఆ తర్వాత భాస్కరరావుకి తన అంగీకారాన్ని చెప్పింది సుగుణ.
భర్త పోయిన రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ విధవ వేషంలోంచి వధువు వేషంలోనికి మారటం ఏదో కలలో మాదిరి అన్పించసాగింది సుగుణకి.
అది సుగుణా భాస్కరరావులకి మొదటి రాత్రి. ఇద్దరికి మొదటి రాత్రి అనుభవం తీరిపోయినా, ఇద్దరూ కల్సిన మొదటి రాత్రి అది! సుగుణ అన్నగారు ఆ మూడు రోజులు తన యింట గడిపి వెళ్ళమని కోరాడు దంపతులని.
గది చాలా సింపుల్ గా వుంది. ఓ మంచం మీద తెల్లటి దుప్పటి పరిచిన ప్రక్క, డ్రస్సింగ్ టేబిల్ మీద మంచి నీళ్ళు, నాలుగు రకాల ఫలహారాలున్నాయి. నాలుగు అగరవత్తులు మాత్రం వెలిగించారు. రెండో పెళ్ళికి యింతకంటే ఆర్బాటం అట్టహాసం చేయడం బాగుండదని గది మాములుగానే వుంచారు.
పది దాటి ఇరవై నిమిషాలు అయినా యింకా గదిలోనికి రాని సుగుణ మీద విసుక్కుంటున్నాడు భాస్కరరావు! ఆమె రాక కోసం మహా ఆరాటంగా తలుపు వైపు పదేపదే చూస్తూ నిరీక్షిస్తున్నాడు. కాసేపు పేపరుంటే తిరగేశాడు. కాసేపు ఇటూ అటూ పచార్లు చేశాడు. మరోసారి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుని పౌడరు రాసుకు న్నాడు ఎన్ని చేసినా సుగుణ రాకపోవడంతో అశాంతిగా ప్రక్క మీద కూర్చున్నాడు.
అక్కడ ….ఇంకో గదిలో పిల్లాడిని పడుకోబెట్టడానికి సుగుణ నానా తంటాలు పడ్తుంది. “వెళ్ళవమ్మా సుగుణా, అతన్నిందాకనగా గదిలోకి వెళ్ళమన్నాం…. బాగుం డదు…..అప్పుడే పదిన్నర అయింది. నీ వెళ్ళు నేను చూస్తానులే రవిని’ అంది వదినగారు , అందిగాని రవి తల్లిని వదిలి పెడితేనా! వదినగారు ఎత్తుకోబోతే పెద్ద పెట్టున రాగం ఆరంభించాడు. మెడ కావలించుకుని వదలకుండా పడుకున్న రవిని తప్పించు కుని ఎలా వెళ్ళడమో సుగుణకి అర్ధం గాలేదు.
“ఎలా వదినా, వీడు నిద్రపొందే….ఏడుస్తున్నాడు ఎలా వెళ్ళడం? అంది కాస్త బిడియంగా. రోజూ యీ పాటికి నిద్రపోయే రవి, యివాళ యింతవరకు నిద్ర పోకుండా కళ్ళు విచ్చుకుని చూస్తున్నాడు. తల్లి అలంకరించుకోవడం, తనని వంటరిగా వదలి ఎక్కడకో వెళుతుందన్న సంగతి రెండేళ్ళ రవికి అర్ధమై పోయింది….అందుకే కాస్త కళ్ళు మూస్తూ, తెరుస్తూ ప్రక్కలో తల్లి వుందో లేదోనని చూసుకొంటూనే వున్నాడు. జోకొట్టి నిద్రపోయాడు అనుకుని నెమ్మదిగా లేచేవేళకి మళ్ళీ రవి లేచి కూర్చునేవాడు. గంట నించీ యీ భాగోతం జరుగుతుంది.
“బాగుంది ఇవాళ వీడు యిలా అల్లరి పెడుతున్నడేమిటి? అతను విసుక్కుంటాడో ఏమిటో. కాసేపు ఏడిస్తే ఏడిచాడు నీవు వెళ్ళు” అంది మళ్ళీ వదినగారు.
కొడుకు యిక్కడ వంటరిగా ఏడుస్తుంటే తనక్కడ…..? …ఛా…ఎలా? ‘ఎలా వదినా?” అంది నిస్సహాయంగా సుగుణ, ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోడం? సుగుణకి ఒక ప్రక్క సిగ్గు, బిడియం. భాస్కరరావు ఏమనుకుంటాడోనన్న బెదురు. రవి నిద్రపోకుండా ఎలా వెళ్ళడం అన్న ఆలోచనలో ఆమె మనసులో అదో మాదిరిగా తయారయింది.
“పోనీ వీడిని తీసికెళ్ళి అక్కడే పడుకో బెట్టుతాను” అంది ఆఖరికి సిగ్గువిడిచి సుగుణ పడుకొండు అవవస్తుంటే.
“అతనేం అనుకుంటాడో….అలా బాగుండదు! అంది వదినగారు కాసేపు అలా ఇద్దరూ మొహాలు చూసుకుంటూ కూర్చున్నారు. ఈలోపల నిద్రకి ఇంక ఆగలేక రవి కళ్ళు మూతలు పడ్డాయి. మరో ఐదు నిమిషాలు అలాగే చూసి నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా లేచింది సుగుణ.’ ‘అమ్మయ్య ‘ అనుకున్నారిద్దరూ.
సుగుణని గదిలోకి పంపి వదినగారు రవి మంచం దగ్గిర ప్రక్కేసుకుని పడుకుంది.
భాస్కరరావు గదిలోకి వచ్చిన సుగుణని చూసి అంతవరకూ పడిన అసహనం, చిరాకు మరిచి నవ్వుతూ ‘ యిప్పుడా తీరుబాటు అయింది రావడానికి’ అన్నాడు దగ్గరికి వచ్చి.
“రవి….రవి యిప్పటివరకు పడుకోలేదు….నన్ను వదలి పెట్టకుండా ఏడిచాడు” తలవంచుకొని కాస్త సిగ్గు పడుతూనే అంది సుగుణ. కారణం విన్న భాస్కరరావు మొహం అదోలా అయింది. అయినా తొందరగా మొహంలో భావం మార్చేసి “నేనిక్కడ నీకోసం గంట నించి ఎంతలా ఎదురుచూస్తున్నానో తెలుసా, నీకలా ఏం ఆత్రుత లేదన్న మాట. అక్కడ కూర్చున్నావు అలా….’ అంటూ భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకో బోయాడు. సుగుణ హటాత్తుగా ఎందుకో త్రుళ్ళి పడింది. భాస్కరరావు స్పర్శకి, ఆమె ఎందుకో కుంచించుకు పోయింది. హటాత్తుగా తన మొదటిరాత్రి గుర్తువచ్చింది! మనసంతా ఏదో బాధగా నిండింది! ఏదో కానిపనికి పాల్పడినట్లు ఆమె హృదయం గిలగిల లాడింది. సుగుణ ఆ స్థితిలో వుండగానే గదిలో నించి రవి ఏడ్పు వినపడడం మొదలు పెట్టింది. సుగుణ కంగారు పడింది. మళ్ళీ లేచినట్టున్నాడు. ఈ రెండేళ్ళనించి, భర్త పొయిందగ్గరి నుంచి వాడిమీదే ప్రాణాలన్నీ పెట్టుకుని అనుక్షణం వాడితోనే గడిపేది. రాత్రిళ్ళు వాడిని ప్రక్కలో పెట్టుకునే పడుకునేది. తల్లి దగ్గర తప్ప విడిగా పడుకోడం అలవాటు లేని పిల్లాడు తల్లి ప్రక్కలో లేని సంగతి నిద్రలో కూడా గ్రహించి సుగుణ వెళ్ళిన వెంటనే మళ్ళీ లేచి కూర్చున్నాడు. వాడిని సముదాయించడం, మళ్ళీ నిద్ర పుచ్చడానికి వదినగారు పడే పాట్లు సుగుణకి అన్నీ వినిపిస్తూనే వున్నాయి. వదినగారు పెరట్లోకి లేచి వెళ్ళిందిగాబోలు అక్కడ నించి కూడా వాడి ఏడ్పు గట్టిగా విన్పిస్తుంది. సుగుణ ఏం చెయ్యాలో తోచనట్టు బెదురుగా చూసింది భాస్కరరావు వంక. అతను అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. ఐదు నిమిషాలు గడిచినా రవి ఏడ్పు అంతకంతకీ ఎక్కువవు తుంటే సుగుణ భరించలేకపోయింది. అమ్మా….అమ్మా…..అన్న పసివాడి ఏడ్పు ఆమె గుండెలకి తాకి ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. అలా పిల్లాడు ఏడుస్తుంటే తనిక్కడ….. ఛా…..ఆమె హృదయం కొడుకు ఏడ్పు విని ఇంకా సహిస్త్గూ వుండలేకపోయింది. భాస్కర రావు చేతుల నించి తప్పించుకుంది, “యేమిటి!” అన్నాడు కాస్త ఆశ్చర్యంగా భాస్కర రావు.
“బాబు….రవి…..ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు ….’ అంది గొణుగుతూ.
‘అయితే” అన్నాడు కాస్త అసహనంగా భాస్కరరావు. “వాళ్ళెవరో చూస్తారులే….. పడుకో పెడ్తారులే….” అన్నాడు మళ్ళీ. నిస్సహాయంగా చూస్తూ వాడి ఏడ్పు వింటూ మరి రెండు నిమిషాలు చూసింది ఇంక ఆగలేక “వస్తాను…..ఇప్పుడే వస్తాను” అంటూ వారిస్తున్నా భాస్కరరావు చేతులనించి తప్పించుకుంటూ తలుపు తీసుకొని బయటకు వెళ్ళింది. ఊరుకోబెట్టలేక అవస్థ పడుతున్న వదినగారి చేతుల్లోంచి పిల్లాడిని తీసు కుంది.
“వదినా!” అంది బేలగా సుగుణ. పిల్లాడిని గుండెల కదుముకుంటూ.
‘అమ్మా” అంటూ రవి సుగుణ మెడని గట్టిగా వాటేసుకున్నాడు. సుగుణ కళ్ళలో అప్రయత్నంగా నీరు తిరిగింది.
“అమ్మా!….నీవు నాదగ్గర బజ్జో!’ అన్నాడు మాటలు స్పష్టంగా వచ్చిన రెండేళ్ళ రవి. “నీవు వెళ్ళవద్దు నా దగ్గిరే వుండు” అన్నాడు.
“ఏమిటమ్మా యిలా అల్లరి పెడుతున్నాడు ఇవాళ…… ఏం చెయ్యడం” అంది వదినగారు విసుగ్గా! “ఇవాళ నిన్ను వదిలేట్టు లేడు….ఏం చేస్తావు? అతనే మానుకుంటాడో ఖర్మ!…”
“ఏం చెయ్యను వదినా….ఛా….ఇలా వీడిని వదిలి నేనక్కడ ఎలా సుఖంగా….. ‘ సుగుణ గొంతు పట్టుకుంది. “పోనీ వీణ్ణి గదిలోకి తీసుకేడతాను అక్కడే పక్క వేసి పడుకో పెడతాను ” అంది. మరో అయిదు నిమిషాలకు కూడా రవి పడుకునే సూచనలు లేక పోవడంతో అలా తప్ప మరో మార్గం ఏం లేదని స్పష్టమయింది. సుగుణ మరో పరుపు పట్టుకెళ్ళి గదిలో వేసి వచ్చింది. భాస్కరరావు సుగుణ వచ్చి పరుపు వేయడం మంచం మీద పడుకుని తీక్షణంగా చూశాడు. సుగుణ అది గ్రహించినా చూపులు తప్పించి రవిని తీసుకొచ్చి తలుపులు వేసింది.
“ఏమిటిది?…..వాణ్ణి ఎందుకు తెచ్చావు” అన్నాడు భాస్కరరావు చిరాగ్గా.
“ఏం చెయ్యను . నన్నొదిలి ఎంతకీ నిద్ర పోవడం లేదు…..ఏడుస్తున్నాడు ” అంది శుష్కహాసం చేస్తూ , వాడిని పడుకో బెట్టి జో కొడుతూ.
“హు……బాగుంది” కర్కశంగా అన్నాడు భాస్కరరావు. అంతకంటే క్రొత్త భార్యను ఇంకేమనాలో అర్ధం కాలేదు . అలా తీక్షణంగా కాసేపు చూసి అటు తిరిగి పడుకున్నాడు. అతని ఉత్సాహం , ఆత్రుత, ఆరాటం అంతా నీళ్ళు కారిపోసాగింది. అతనికి చాలా కోపంగా, అసహనంగా వుంది. కాని అది ఏ విధంగా చూపించాలో అర్ధం కాలేదు. తన ఆనందానికి అడ్డువచ్చిన ఆ రెండేళ్ళ పిల్లాణ్ణి నమిలి మింగేయలన్నంత కోపంగా వుంది. ఇదేం ఖర్మ! మొదటిరాత్రి హాయిగా వుండాల్సిన తనకి ఈ పిల్లాడు అడ్డు వస్తున్నాడు . పిల్లాడి తల్లిని పెళ్ళాడి తనేం తొందర పడలేదు గదా అన్న బాధ తలెత్తింది. వీడే అడ్డు లేకపోయే యీ పాటికి….. యీ పాటికి ……చిరాకుగా మళ్ళీ ఇటు తిరిగాడు. సుగుణ వాడి ప్రక్కనే పడుకుని నిద్రపుచ్చుతుంది. అర్ధరాత్రి కావస్తుంది. కోపం ముంచుకు వచ్చింది భాస్కరరావుకి. ఏమిటీ వ్యవహారం? కనీ వినీ ఎరుగని సంగతి! శోభనం రాత్రి పెళ్ళాం పిల్లాడి ప్రక్కన నిద్రపోవడం ఎక్కడన్నా ఉందా!….. అనుకున్నాడు. ‘అనుభవించు గొప్పగా, ఏదో అనుకుని పిల్లాడి తల్లిని పెళ్ళాడితే ఇంతకంటే ఏం అవుతుంది” అంది మనసు. ఈ వ్యవహారం ఏదో తేల్చాలి! లేకపోతె రోజూ ఇదే వ్యవహారం సాగితే లాభం లేదు! చాలా గట్టిగా మనసులో నిశ్చయించుకున్నాడు.
సుగుణ మరో అరగంటకి నిద్రపుచ్చి లేచి వచ్చింది. కోపంగా అటు తిరిగి పడుకొన్న భాస్కరరావుని ప్రసన్నం చేసుకోడానికి భుజం మీద చెయ్యి వేసింది. “వెళ్ళు వెళ్ళు అక్కడే పడుకో” అన్నాడు చిరాకుగా.
“కోపగిస్తే ఎలా? నేనేం చెయ్యను వాడు నిద్ర పోకపోతే” అంది నెమ్మదిగా సుగుణ. తెల్ల చీరలో మెరిసిపోతున్న అందమైన భార్య దగ్గిరికి వచ్చాక ఎంతోసేపు కోపాన్ని చూపలేకపోయాడు భాస్కరరావు. చేయి లాగి కూర్చోపెడుతూ ‘చూడు, ఇదేమన్నా బాగుందా…..నీవే చెప్పు ….” అన్నాడు. సుగుణ ఏం అంటుంది? “నాకిదెం నచ్చలేదు….. ఎందుకలా అలవాటు చేయాలి పిల్లాడికి…..రేపట్నించి ఇదే వరసయితే నాకు కోపం వస్తుంది సుమా” అన్నాడు. సుగుణ జవాబీయలేదు. అమెకిదంతా ఏమిటోలా వుంది. ఓ ప్రక్క కొడుకు, మరోప్రక్క మొగుడు! ఎవర్ని కాదంటుంది? ఏం చేస్తుంది? యేమిటి , ఇలాంటి అవస్థలో పడ్డాను అనుకుంది! మొదటిరోజు ఇలా వుంటే …..తరువాత ….
“మాట్లాడవేం. ఎంతయింది టైము చూశాడు. ఎన్ని గంటలు వృధా చేశావో చూడు” దగ్గరికి లాక్కుంటూ భాస్కరరావు నవ్వుతూ అన్నాడు . బలవంతంగా నవ్వింది సుగుణ.
***
భాస్కరరావు , సుగుణ కాపురం పెట్టి పదినేలలవుతుంది.
ఈ పదినెలలు క్రొత్తగా పెళ్ళి చేసుకున్న సుగుణకి పది క్షణాలలాగ కాక పది యుగాలు గడిచినట్లనిపించింది. పెళ్ళి చేసుకుంటే జీవితంలో పోగొట్టుకున్న ఆనందం, సుఖం లభ్యమవుతాయని ఆశించిన ఆమె ఆశలు కోరికలు తీరకపోగా ఈ పెళ్ళి చేసుకుని పొరపాటు చేయలేదు గదా. చేసుకుని తప్పు చేశాను, పొరపడ్డాను…. తొందరపడ్డాను” అనుకున్న సంఘటనులు , సన్నివేశాలు చాలా జరిగాయి ఈ పది నెలలలో!”
ఈ పెళ్ళి తనకి సుఖ సంతోషాలు యీయడం అటుంచి మరిన్ని సమస్యలని తెచ్చి పెడ్తుందని సుగుణ ముందు ఎన్నడూ ఊహించలేదు.
భాస్కరరావు యిలా ప్రవర్తిస్తాడని , యింతలో మారిపోతాడని ఊహించక పోవడం తనదే పొరపాటని వగస్తుంది. తమిద్దరి మధ్య కలతలకి, కలహాలకి తన బిడ్డ కారణంగా నిలుస్తాడని, ఆ బిడ్డని అంతలా ద్వేషిస్తాడని, శత్రువులా చూస్తాడని అనుకోని సుగుణ ఏమెరుగని పసిపిల్లాడిని అంత ఏహ్యంగా చూడడం సహించలేకపోతుంది. వాడి నీడ కూడా భాస్కరరావు భరించలేక పోతున్నాడని అర్ధం అయ్యాక ఏం చెయ్యాలో తోచని స్థితిలో గిలగిలలాడ సాగింది.
ముందునించీ, కాపురానికి వచ్చిన రోజునించే రవిని ద్వేషిస్తున్నా చాలా రోజులకి గాని గ్రహించలేక పోయాననుకుంది సుగుణ.
ముందురోజు బెడ్ రూములో రవి ప్రక్క కూడా వేస్తుంటే “వాడి ప్రక్క ఇక్కడెందుకు? ప్రక్కగదిలో వెయ్యి” అన్నాడు అదోలా. “వాడక్కడ ఎలా పడుకుంటాడు చిన్నపిల్లాడు” అంది మాములుగా సుగుణ.
‘అలాగే అలవాటవుతుంది , మనగదిలో పడుకో బెట్టడం మంచిది గాదు. అలా నాకిష్టం లేదు” అన్నాడు కాని, రెండేళ్ళన్నా నిండని పసివాడిని మరో గదిలో వంటరిగా పడుకో బెట్టడానికి సుగుణ మనసు అంగీకరించలేదు.
“మరో ఏడాది , రెండేళ్ళు పొతే ఎలాగో పడుకో బెట్టాం, ఇప్పుడింకా చిన్న వాడు వాడొక్కడు ఎలా పడుకుంటాడు. అందులో వాడికసలు విడిగా పడుకోడం అలవాటు లేదు” అంది మాములుగా సుగుణ. భాస్కరరావు కాసేపు వాదించాడు. మొహం ముడుచు కున్నాడు కాని సుగుణ అంత పట్టించుకోలేదు ఆ విషయం.
రాత్రిళ్ళు సుగుణ పడుకోడానికి రావడంలో ఆలశ్యం జరిగిందంటే అదంతా రవి వల్ల అని భాస్కరరావుకి కోపం వచ్చేది. వెళ్ళు వెళ్ళు నీ కొడుకు దగ్గరే జోల పాటలు పాడుకుంటూ పడుకో. అని అలిగే వాడు. అవతల పిల్లాడ్ని నిద్ర పుచ్చడం, తరువాత భర్త గారిని బ్రతిమాలుకోడం —– అలా అవస్థ పడేది సుగుణ.
పిల్లాడికి పాలుపడ్తూనో , భోజనం తినిపిస్తూనో , స్నానం చేయిస్తున్నప్పుడో భాస్కర రావు పిలవగానే చేతిలో పని వదిలేసి రావాలనేవాడు. వాడే నీకు ముఖ్యం, నా మీద నీకేం లేదన్నమాట. ఎంతసేపూ వాడి ఆలనా పాలనా సరిపోతుంది గానీ, నా సంగతి నీకక్కర లేదని మొహం ముడుచుకుంటూ దేప్పేవాడు.
పిల్లాడి సంగతి చూడకూడదనా ఏమిటి అతని ఉద్దేశం అని ఆశ్చర్యపడేది సుగుణ.
సుగుణ కొడుకుని ముద్దులాడుతుంటే యీర్ష్యగా చూసేవాడు భాస్కరరావు” మరీ పట్టలేనప్పుడయితే “చాల్లెద్దూ ఆ ముద్దులు…..మహా కొడుకు నీకేవున్నట్లు పొంగి పోతున్నావు’ అనేవాడు నవ్వుతూనే. ‘అంత ముద్దు వస్తున్నాడేమిటి , నీ కొడుకు?” ఆ మాటలకి కాస్త నోచ్చుకునేది సుగుణ. తన కొడుకు తనకి ముద్దు రాడూ?…. పొరపాటున కూడా ఎప్పుడూ భాస్కరరావు పిల్లాడిని దగ్గరికి తీసేవాడు కాదు. ఇంట్లో కొన్నాళ్ళ తర్వాత చనువు కొద్ది రవి దగ్గర చేరితే తప్పుకునే వాడు భాస్కరరావు. సుగుణ చుట్టుపక్కల లేకపోతే పోమ్మన్నట్టు తీక్షణంగా గదమాయించి చూసేవాడు. వాడిని చూస్తూ, ఇంట్లో వాడు తిరుగుతుంటే ఏదో బాధగా వుండేది. వాడిని చూసినపుడల్లా సుగుణ మొదటి భర్త అప్రయత్నంగా గుర్తు వచ్చేవాడు! తన కంటే ముందు సుగుణ ఇంకోడిని ప్రేమించిం దని, సుగుణని తన కంటే ముందు మరో మగవాడు అనుభవించాడన్న నిజాలు గుర్తు వచ్చేవి. అసూయ ద్వేషాలతో మండిపడేవాడు భాస్కరరావు. ఆ అసూయ అక్కసు, తీర్చుకోడానికి అందరి కంటే ముందు రవి కనపడేవాడు. వాడిని ఏదో చెయ్యాలని వుండేది. కాని ఏం చెయ్యలేక పోయేవాడు. కొట్టినా నోరు వచ్చిన వాడు తల్లికి చెప్పుకొంటా డు వెధవ అనుకునేవాడు.
రోజులు గడుస్తున్న కొద్ది తనకి సుగుణకి మధ్య అన్నింటికి ప్రతిబంధకంగా రవి వస్తున్నాడన్నది మరీ భరించరాని విషయంగా తయారయింది . ఆ కోపం సుగుణ మీద తీర్చుకునే వాడు! షికారు వెడదాం , సినిమాకి వెడదాం అనేవాడు. సుగుణ రవిని కూడా తీసుకు రావడానికి తయారయ్యే సరికి పట్టరాని కోపం వచ్చేది. “వీడెందుకు తోకలాగ, వీడు వద్దు” అనేవాడు , ఎలా అండీ, ఒక్కడ్నీ వదలడం అనేది మీ అన్నయ్య దగ్గిర వదిలేయ్ , అనేవాడు భాస్కరరావు. సుగుణ అలాగేనని అక్కడ వదిలేసరికి మారాం చేసి ఏడ్చి రాగాలు పెట్టె కొడుకుని వదిలి వెళ్ళడానికి మనసు వప్పేది కాదు సుగుణకి. తీసికెడితే ఇంక భాస్కరరావు మొహం ముడుచుకుని అసలు మాట్లాడేవాడు కాడు. తీసికెళ్ళకపోతే కొడుకు ఏడుపు చూడలేక పోయేది సుగుణ. వదిలేసి వెళ్ళినా ప్రాణాలన్నీ వాడిమీదే వుండి ఆ సినిమాని కూడా చూడలేక, అతనితో మాట్లాడలేక అన్యమనస్కంగా వుండేది. అది చూసి మరింత మండిపడేవాడు భాస్కరరావు. అలాంటి అవస్థలో నలిగి పోవడం చాలాసార్లు అనుభవమయింది సుగుణకి. ఎక్కడికన్నా వెళ్ళడానికి బయలు దేరడం అంటే ప్రాణ సంకటంగా తయారయింది.
ఏ పండుగలప్పుడన్నా సుగుణకి బట్టలు తెచ్చేవాడు గాని, రవికి తన చేతుల్తో తను తెచ్చేవాడు కాడు. ఆ విషయం సుగుణ గుర్తు చేసినా విననట్టు వూరుకునేవాడు. అంతగా మరీ చెప్తే “నాకు తెలియదు , నీవు వెళ్ళి కొనుక్కో” అనేవాడు.
ఆఖరికి రవి తిండి విషయంలో కూడా భాస్కరరావు కనపరించే విభేదం చూస్తే సుగుణకి పట్టరాని కోపం కలిగేది. ‘అన్ని పాలేందుకు? నా జీతంలో సగం వీడి పాలకే అయిపోతుంది” అనేవాడు భాస్కరరావు రవి పాలు తాగుతున్నప్పుడల్లా , రెండేళ్ళ పిల్లాడు రోజుకి రెండు మూడు గ్లాసులు పాలు త్రాగడూ? అదే తన కడుపున పుట్టిన బిడ్డ అయితే అలా అనగలడా? అని నోచ్చుకునేది సుగుణ. వాడికి ఏమన్నా విటమిన్ మందులవీ యిస్తే “శుభ్రంగా తిని తిరుగుతున్నాడు. ఆ మందుల ఖర్చు కూడా ఎందుకు?” అని పైకే అనడం సుగుణ భరించలేక పోయేది.
రోజులు గడుస్తున్న కొద్ది ప్రతి చిన్న విషయానికి రవిని గదమాయించడం ప్రతి చిన్న విషయానికి కూడా రాద్దాంతం చేసి రవిని కొట్టడం, వరకు వచ్చాక సుగుణకి యింట్లో నరకం ఆరంభమయింది. చిన్నపిల్లాడు ఏదన్నా పాడుచేయడం బద్దలు కొట్టడం, అల్లరి చేయడం సహజం? దానికోసం యింతలా పగ సాధిస్తున్నట్టు అంతలా ద్వేషిస్తారా అని సుగుణ మాటకి మాట జవాబీయడం ఆరంభించింది. “నీ కొడుకు నీకు ముద్దేమో కాని , ఆ వెధవ చేసే పనులు సహించడం నావల్ల కాదు ” అని కోపంగా అరిచే వాడు సుగుణ ఏమనలేక రవిని ఎత్తుకుని కన్నీళ్లు పెట్టుకునేది.
“ఛీ…ఛీ….వెధవయిల్లు ….నేరకపోయి తద్దినం తెచ్చుకున్నాను వెధవలు – వూరి వాళ్ళ పిల్లల్ని భరించడం నాకేం ఖర్మ” అనే వరకు వచ్చాడు భాస్కరరావు.
తన సొమ్మంతా ఆ రెండేళ్ళ పిల్లాడు తిని పోతున్నంత దుగ్ధ ఏర్పడింది భాస్కర రావుకి. రేపొద్దున తనకి పిల్లలు పుడ్తారు. వాళ్లతో పాటు యీ రవిగాడిని ఎందుకు భరించాలి! వాడికి చదువు సంధ్యలు చెప్పించడం తనకేం అవసరం? అసలు ఇంకోడు కన్నపిల్లాడిని యింట్లో ఎందుకు పెట్టుకోవాలి. ఆ వెధవ మూలంగా తనకి ఏ అనందం దక్కకుండా వుంది. ఆ వెధవ మూలంగా తామిద్దరికీ మనస్పర్ధలు ….కలతలు …..వస్తున్నాయి…..ఛా! ముందు ఇంతదూరం ఆలోచించకుండా తొందరపడ్డాననుకుని పశ్చాత్తాపం ఆరంభించింది భాస్కరరావుకు.
ప్రతిరోజూ భార్యభర్తల యిద్దరి మధ్య రవి కారణంగా ఏదో తగవు తప్పడం లేదు! రోజురోజుకి యీ గొడవలు భరించడం యిద్దరికిద్దరికి కష్టమవసాగింది .
ఆ కోపం , కసీ మరోవిధంగా తీర్చుకోడం కూడా సాగించడం మొదలు పెట్టాడు భాస్కరరావు.
సుగుణ కాస్త ఉదాసీనంగా వుంటే “ఏం, పాత మొగుడు గుర్తువస్తున్నాడేమిటి?” అనేవాడు.
భాస్కరరావు సరసం మరీ ఎక్కువయిన రోజున సుగుణ కాస్త కోపంగా “ఏమిటా మోటుతనం” అంటే “నీ పాతమొగుడు యింతకంటే నాజూగ్గా ప్రవర్తించేవాడా అని దేప్పేవాడు. “ఇంతకంటే బాగుండేదా నీ ఆ మొగుడి సరసం” అని అసహ్యంగా కూడా మాట్లాడడం ఆరంభించాడు. సుగుణ కళ్ళలో బాధ చూస్తె కసిదీరినట్లుండేది భాస్కర రావుకి.
ప్రతి విషయానికి అవసరం వున్నా లేకపోయినా రోజుకి పదిసార్లు “పాతమొగుడు ‘ అంటూ దేప్పుతుంటే ఎన్నో రోజులు సహించలేక ఓరోజు సుగుణ కాస్త తీక్షణంగా “నన్నెందుకిలా పదే పదే నాకు ఆ పాత సంగతులు గుర్తు చేసి బాధిస్తారు…. ఆ రోజులు మరిచిపోకుండా ఎందుకిలా గుర్తుచేసి హింసిస్తున్నారు” అంది.
“ఏం గుర్తు చేస్తే అంత బాధగా వుందేమిటి? పాపం ఆయనను ఇంకా మరిచిపోలేక పోతున్నావన్నమాట. ఏం నాకంటే బాగా చూసేవాడన్నమాట నిన్ను ….” అంటూ మరింత వ్యంగ్యంగా విసుర్లు విసిరేవాడు.
రోజురోజుకీ భాస్కరరావులో చెలరేగే రాక్షసత్వం క్రూరత్వం పెచ్చు పెరుగుతుంటే సుగుణకు ఆ యింట్లో బ్రతకడం దుర్భరమవసాగింది. కాని ఏం చేస్తుంది/ కావాలని పెళ్ళాడి యిప్పుడెం చేయగలదు? రోజూ యిద్దరూ దేని గురించో వాదించుకోడం, దెబ్బలాడు కోడం, మాటలు విసురుకోడం, తిండి మానేయడం, భాస్కరరావు యిల్లు చేరకపోవడం మొదలైన ఘటనలు జరుగుతున్నా పెళ్ళి చేసుకున్నాం తప్పదు…..అని సుగుణ ఒపిగ్గానే ఆ నరకం భరిస్తుంది.
కానీ సహనానికి ఓర్మికి దేనికన్నా హద్డుంటుంది! ఆ హద్దు సుగుణ విషయంలో ఆరోజు దాటిపోయింది.
రవికి రెండు రోజుల నుంచి జ్వరం. ఆ రెండు రోజులు ఏదో మామూలు జ్వరం అన్నట్టు యేవో తెలిసిన మందులు వాడింది. అయినా తగ్గలేదు. మూడో రోజు భయ పడుతూనే భాస్కరరావుతో చెప్పింది.
“నన్నేం చెయ్యమంటావు’ విసుగ్గా అడిగాడు. ఇదే తండ్రి అయితే ఏం చెయ్యమం టావు అని అడుగుతాడా అని బాధ కలిగింది సుగుణకి. అయినా అదేం కన్పించనీయ కుండా “డాక్టరేవరినైనా తీసుకురండి” అంది.
భాస్కరరావు చిరాగ్గా మొహం చిట్లించాడు. “నేను వెళ్ళలేను. నీవే వెళ్ళి పిలుచుకొ, లేకపోతే అక్కడికి తీసికెళ్ళి చూపించుకో” అన్నాడు.
సుగుణకి వళ్ళు మండిపోయింది. “పిల్లాడు జ్వరంతో పడి వుంటే డాక్టరుని తీసుకురావడానికి కూడా మీకు అంత కష్టంగా వుందన్న మాట. ఆడదాన్ని నేను వెళ్ళి డాక్టరుని పిలుచుకోవాలన్న మాట….ఇదే మీ పిల్లాడయితే ఇలా అనే వారా? వాడు మీ కొడుకు కాదని కదూ ఇంత నిర్లక్ష్యం , ఇంత అసహ్యం వాడి మీద!” తీక్షణంగా అంది. భాస్కరరావు ఏం బెదరలేదు ఆ కోపానికి.
“అవును….వాడు నాకేం అవుతాడని నాకుంటుంది ఆదుర్దా…..నా కొడుకు అయితే ఎందుకూరుకుంటాను. ఇదేదో క్రొత్త సంగతి కనిపెట్టినట్టు మాట్లాడకు” అన్నాడు హేళనగా.
సుగుణకి వుడుకుమోత్తానంతో పాటు దుఃఖం కూడా వచ్చింది. “పిల్లాడు రోగంతో పడుకుంటే ఎలా మాట్లాడుతున్నాడు? మీకు పిల్లలుండి వుంటే, వీడే మీ పిల్లాడయితే నేను ఇలా ప్రవర్తించి వుంటే మీకెలా వుండేది….’ ఉక్రోషంగా అంది. భాస్కరరావు హేళనగా నవ్వాడు.
“ఎలా వుండడానికి ఏముంది? నాకే పిల్లలు వుంటే, సవతి తల్లి ఆ పిల్లలని ఎలా చూసేదో వందలు, వేలు కధలు విన్నాం….వాళ్ళలో నీవూ ఒకరి క్రింద జమ అయివుండే దానివి…..లేకపోతే ఇంకోరి పిల్లల్ని, ఏ ఆడది గాని, మగాడు కాని స్వంత పిల్లల్లా చూస్తారా ఏమిటి?”
‘అవును, లోకం ఇన్నాళ్ళూ సవతి తల్లుల కధలే వింది. ఆ సవతి తల్లుల కంటే యీ సవతి తండ్రుల క్రూరత్వం ఏం తీసిపోదని మీ కధ ఋజువు చేస్తుంది. నన్ను నా మానాన నా ఖర్మకి పడి వుండనీయకుండా , నాలో లేని పోనీ ఆశలు కల్పించి పెద్ద కబుర్లు చెప్పి ఆదర్శమూర్తులనిపించుకునేందుకు ఈ పెళ్ళి చేసుకున్నారు. చేసుకొన్న దగ్గర నించి ఒక్కలా కాల్చుకు తిన్నారు. పెళ్ళికి ముందు నాకు పిల్లాడున్నాడని, ఆ పిల్లాడు నాతో వుంటాడని తెలియకే చేసుకున్నారా? తెలిసి తెలిసి చేసుకుని నా బ్రతుకు నిలా నరకం ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ పెళ్ళి చేసుకుంటే ఏదో సుఖముంటుందని భ్రమించాను. కాని యీ బ్రతుకు ఆ “వెధవ బ్రతుకు’ కంటే అధ్వాన్నంగా వుంటుందని, అంతకు మించిన నరకం చూస్తానని ముందే తెలుస్తే చస్తే యీ పెళ్లి చేసుకునే దాన్ని కాను….. నోరేరుగని పసివాడి మీద అంత కసి, ద్వేషం ఎందుకు మీకు, వాడేం చేశాడని వాడిని అలా ద్వేషిస్తున్నారు . వాడు కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, వాడేం చేసినా కోపం, వాడి నీడ చూస్తేనే ద్వేషం? వాడు…..ఆ పసివాడు ఇంట్లో బిక్కుబిక్కుమంటూ దీనంగా ఏం చేస్తే తప్పోనన్నట్టు భయం భయంగా తిరుగుతుంటే నా హృదయం ఎంత రంపపు కోత అనుభవిస్తుందో తెల్సా? తల్లి ముందే తన పసిబిడ్దని అంత ద్వేషించడం చూసి ఏ తల్లి అన్నా సహిస్తుందనుకుంటున్నారా? మీరు వాడిని ఎంత హీనంగా చూస్తున్నా యిన్నాళ్ళూ సహించాను. కేవలం మిమ్మల్ని పెళ్ళాడిన నేరానికి…..ఆఖరికి పసివాడికి రోగం వస్తే మందిప్పించడానికి కూడా మీకు మనస్కరిం చడం లేదంటే మీరు….మీరు మనుష్యులు గారు…..పాషాణం…..’ ఆవేశంతో , కోపంతో , దుఃఖంతో సుగుణ గొంతు వణికింది.
“నోర్మూయ్……’ కోపంగా అరిచాడు భాస్కరరావు…..’ ఈ పెళ్ళి చేసుకుని నీవు కాదు నష్టపడింది నేను” ,…..బాధ పడ్తున్నది నేను…..తెలియక నేను…..తెలియక ఏదో అనుకున్నాను గాని తెలిస్తే నేనూ చస్తే చేసుకునే వాడిని కాదు, పెళ్ళి చేసుకున్నాను, నా సరదాలు ఏం తీర్చావు నీవు. సినిమాకి వేడదామంటే వాడో అంటావు, షికారుకి వెడదాం అంటే వాడుండాలి అంటావు. హనీమూన్ వెడదాం అంటే వాడ్నోదలి ఎలా రానంటావు. ఎప్పుడు సరదాగా కాలక్షేపం చేయడానికన్నా పిలిస్తే నీకు ఎంతసేపూ వాడి భోజనం, వాడి నిద్ర, వాడి అలానా, పాలనా తప్ప, నా సంగతి నీ కేప్పుడన్నా పట్టిందా? ఎప్పుడు చూసినా ఆ వెధవని పట్టుకుని ఏడుస్తుంటే…..తను కానని పిల్లాడ్ని పట్టుకుని ఏడుస్తుంటే ఏ మగాడన్నా సహిస్తాడనుకున్నావా ? నా సరదా, నా ముచ్చటలు ఏం తీర్చావు నీవు? వాడిని …..వాడిని చూస్తుంటే…..నీవు…..నీవు నా దానివి కాక ముందు మరోడి పెళ్ళానివని…..వాడి ద్వారా ఆ పిల్లాడిని కన్నావని…..నా కంటే ముందు మరోడు నిన్ను అనుభవించాడని అనుక్షణం వాడి ఉనికి జ్ఞప్తికి తెస్తుంటే…..నా కేలా వుంటుందో నీకేం తెలుస్తుంది. నా మీద కంటే…..ఆ కుర్ర వెధవ మీద ఇంకోడి పిల్లాడి మీద నీకు శ్రద్ధసక్తులు ఎక్కువ వుంటే ఇవతలి వాడికి ఎలా వుంటుందో నీకెలా తెలుస్తుంది….’ భాస్కరరావు ఎగిరి పడ్డాడు.
‘అయితే ముందిది తెలియదా?”
“ముందు నీకు తెలియనట్టే…..నాకూ తెలియలేదు…..కనకనే గోతిలోకి దిగాను. లేకపోతే మగాడ్ని……ముప్పై ఏళ్ళున్న మగాడికి పెళ్ళాడడానికి పిల్లలు దొరకరని నిన్ను రెండో పెళ్ళి దాన్ని, పిల్లాడి తల్లిని కట్టుకుండేవాడిని కాను. తెలియకనే మోసపోయాను….. యీ వెధవ పిల్లాడి వల్ల నీకు నాకు మధ్య అడ్డుగోడలు లేస్తాయని , యీ కుర్ర వెధవ యిలా నా ఆనందాన్ని హరిస్తాడని ముందు తెలిస్తే…..’ కసిగా అంటున్నాడు భాస్కరరావు.
‘ఆపండి…..మాటిమాటికి వెధవ పిల్లాడంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నా ముందే ఇంతలేసి మాటలు నోరేరుగని పసివాడిని అంటుంటే ఏ తల్లి అయినా సహిస్తుందనుకుంటుంన్నారా? ఇన్నాళ్ళు సహించాను ఇక సహించను ” పౌరుషంగా అంది సుగుణ.
‘సాహిన్చాకపోతే మానేయి….నేనూ ఇదంతా సహించలేను…..ఇంకోడు కన్న పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని బాధపడాల్సిన అవసరం నాకేం లేదు” కఠినంగా అన్నాడు భాస్కరరావు.
‘అంటే యేమిటి మీ ఉద్దేశం?” ఎగిసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అంది సుగుణ.
“అంటేనా? విడమర్చి చెబుతున్నాను విను…..ఈ ఇంట్లో నీకు వుండాలని వుంటే నా దగ్గిర వాడుండటానికి వీలులేదు.”
“యేమిటి? పిల్లాడు తల్లిదగ్గిర వుండకుండా ఎక్కడ వుంటాడని మీ ఉద్దేశం?”
‘అదంతా నా కనవసరం! వాడిని ఎక్కడ వుంచుతావో, ఏం చేస్తావో నా కక్కరలేదు. కావలిస్తే మీ అన్నయ్య ఇంట్లో వుంచి, డబ్బు పారేయ్….”
సుగుణ కళ్ళు ఎర్రబడ్డాయి. “నేను కన్న పిల్లాడిని పెంచాల్సిన అవసరం మా అన్నయ్యకేం లేదు” వ్యంగ్యంగా అంది.
“నేను కనని పిల్లాడిని వుంచుకోవాల్సిన అవసరం నాకంత కంటే లేదు.’ అంత కంటే హేళనగా అన్నాడు భాస్కరరావు.
“మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి. నన్నింట్లోంచి వెళ్ళమనా అర్ధం?”
“నిన్ను వెళ్ళమనలేదు. నేన్నదల్లా నీకు నేను కావాలో వాడు కావాలో తెల్చుకోమ న్నాను—— ఆలోచించుకో….”
సుగుణ ఓ క్షణం ఆవేశంతో ఊగిపోయింది. అంతలోనే నిలదొక్కుకుంది. పిచ్చి దానిలా పెద్ద నవ్వు నవ్వింది హేళనగా. వ్యంగ్యంగా . “ఛాయిస్ ఇచ్చారన్న మాట. మొగుడా? పిల్లాడా? అంటూ. భేష్…..ఆలోచించాలా…..ఈ విషయం గురించి ఆలోచించ డానికి ఏ తల్లికి అరక్షణం కూడా పట్టదని మీలాంటి మగాళ్ళకి తెలియక పోవచ్చు! నోరేరుగని పసివాడిని అనాధ చేసి మొగుడుతో కులుకుతుంది ఆడది అని మీరనుకుని ఛాయిస్ ఇచ్చారా నాకు! నోరేరుగని పక్షులు సైతం రెక్కలు రాని తమ బిడ్డలని రక్షించు కోడానికి తమ ప్రాణాలు సైతం అర్పిస్తాయే అలాంటిది మనిషి హృదయం ఎలాంటిదో తెలియకే ఛాయిస్ ఇచ్చారా? నేను కాకపొతే మరో పెళ్ళాం మీకు క్షణంలో వస్తుంది కాని వీడికి తల్లి రాదు అని తెలియనంత తెలివి తక్కువతనం నాకుందనే ఛాయిస్ ఇచ్చారా మీరు!…..ఇదే మీ పిల్లాడయితే ….నేనే మీకు ఈ ఛాయిస్ ఇచ్చి వుంటే మీరు నన్నే ఎంచుకునుండేవారు . కన్నతండ్రి బిడ్డల్ని అలక్ష్యం చేసి పెళ్ళాంతో కులకబట్టే సవతి తల్లుల కధలు వచ్చాయి! కాని….. తల్లి….తల్లి వుండగా బిడ్డ మీద ఈగ వాలనీదు! బిడ్డని రక్షించుకోడానికి అవసరమైతే రాక్షసి అవుతుంది. పెంచుకోడానికి ముష్టి అన్నా ఎత్త గలదు! బిడ్డ కోసం యే త్యాగమన్నా…… ఆఖరికి భర్త నన్నా సరే వదులుకోగలదు. తండ్రికి, తల్లికి తేడా యిప్పటికయినా తెలుసుకోండి! ఇప్పటికయినా యీ నరకంలోంచి నా బిడ్డకు విముక్తి కలిగి స్వేచ్చగా ఊపిరి పీల్చుకోడానికి అవకాశం యిచ్చినందుకు సంతోషం! ఎటొచ్చి ఈ పెళ్ళి చేసుకుని లోకంలో ఇదివరకు వుండే సానుభూతి కాస్త పోగొట్టుకుని హేళన పాలయ్యాననేదే నా ఆవేదన! ఈ సంగతి ముందు తెలుసుకోలేక తప్పటడుగు వేసి అందరి చేత అన్పించుకునే స్థితికి వచ్చానన్నదే నా బాధ. వస్తా…. శలవు.’ అంటూ పిల్లాడిని తీసుకుని భుజం మీద వేసుకున్న సుగుణని వెర్రివాడిలా చూశాడు భాస్కరరావు.
“స్వాతి”
*****
( సశేషం)

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.