కనక నారాయణీయం -68

పుట్టపర్తి నాగపద్మిని

          ‘మరి అక్కడ మిద్దె మీద హిందీ ప్రేమీ మండలి అని రాసుందే?’

          ‘ఔను. అక్కడ హిందీ క్లాస్ లు సాయంత్రం పూట చెప్పుతూ ఉంటారు. తులజక్కయ్య అక్కడే కదా హిందీ క్లాస్ లకు వస్తుంటుంది.’

          ‘ఔనౌను. మర్చిపోయినాను. నువ్వూ హిందీ క్లాస్ లో చేరుతావా మరి? హిందీ చిన్నప్పుడే చదువుకోవడం మంచిది. పెద్దైతే దానివల్ల లాభాలు తెలుస్తాయి నీకే! చేరుతావా?

          నాగ నొప్పి సంగతి మర్చిపోయింది. ఈ లోగా రెండో చాక్లెట్ కూడా తియ్యగా ఆమె నోట్లో హొయలు పోతున్నది మరి. అలా మొత్తానికి నాగ భుజానికి భుజకీర్తులతో ఇంటికి చేరుకుంది, అయ్యతో సహా!

***

          1962 అష్టగ్రహ కూటమి వస్తుందని మొదటినుంచీ  రఘోత్తమ రావుచెబుతూనే ఉన్నాడు. జ్యోతిష్యం తెలిసినవాడవటం వల్ల, పుట్టపర్తికీ జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉండటం వల్లా, ముందు నుంచే అప్పుడప్పుడూ యీ విషయం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

          అష్టగ్రహ కూటమి – ఎనిమిది గ్రహాలు ఒక చోట చేరబోతున్నాయి. కేతువు తప్ప తక్కిన ఎనిమిది గ్రహాలు మకర రాశిలో ఒక చోట చేరటం. కేతువు కర్కాటక రాశిలో ఉంటాడట! ఈ రోజుల్లో లేదా దీని ప్రభావం వల్ల, ప్రపంచంలో ఏదైనా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంటుందనీ, ముఖ్యంగా మన దేశంలో రాజకీయ మార్పులు ఉధృతంగా ఉండబోతాయని ఊహాగానాలు ముమ్మరంగా! చైనా కాలు దువ్వుతున్న రోజులు కావటం వల్ల, అది మరో భయం!

          పుట్టపర్తి ప్రశ్న. ‘ఒరే, మన జీవితాల మీద ఏదైనా ప్రభావం ఉంటుందంటావా?’

          రఘోత్తమ రావు : ఉండవచ్చు స్వామీ.

          పుట్టపర్తి : అంటే మన జీవిత చక్రంలోని గ్రహాల కదలికలలోనూ యీ ప్రభావం వల్ల ఏదైనా తీవ్ర పరిణామం ఉండబోతుందా అని!

          రఘోత్తమ రావు, పుట్టపర్తి జాతకం చేతిలో పట్టుకుని ఉండగానే పుట్టపర్తి అందుకున్నారు.’ అవున్రా! ఈ గ్రహాలన్నీ పనిగట్టుకుని, ఒక ఇంట్లో తీరి కూర్చోవటం, మానవ జాతిమీద దీని ప్రభావం – ఇవన్నీ ఇదివరకటి రోజుల్లో ఉండేవంటావా?

          రఘో: మా గురువుల దగ్గర నేనూ విన్నాను స్వామీ! ఈ విశాల అంతరిక్షంలో ప్రకృతి సహజంగా ఇటు వంటి అద్భుతాలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయట! కాక పోతే ఇప్పుడు వీటి గురించి ప్రజల్లోఆసక్తి పెరిగి, ఇటువంటి సంగతులు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం నుండీ ఫిబ్రవరి 5 సాయంత్రం వరకూ యీ కూటమి ఉంటుంది. ప్రళయం వచ్చి, ఊళ్ళన్నీ తుడిచిపెట్టుకుని పోవచ్చు. లేదా మరే రకంగా నైనా ప్రపంచ విపత్తు విరుచుకుని పడవచ్చు. అస్సలు ఏమీ కాకనూ పోవచ్చు. ఆశ్చర్యం మాత్రమే మన వంతు కావచ్చు. చెప్పలేము స్వామీ!

          పుట్టపర్తి (నవ్వుతూ) పోనీలేరా! నలుగురితో నారాయణా అనుకుంటూ వెళ్ళిపోవడంలో ఎంత సుఖం కదా!!

          రఘో: (తానూ నవ్వుతూ) మీకేమి స్వామీ, మీరు ఏదో అనుభవించిన వారు. మేమింకా చిన్న వాళ్ళం కదా! మా సంగతేమిటి?

          పుట్టపర్తి: పోనీ నువ్వు నీ కుటుంబంతో సహా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో! అందరూ ఒక చోట ఉంటె అదో ఊరట!

          రఘో: వాళ్ళంతా యీ జన్మలో చుట్టాలు స్వామీ! ఊరికే అన్నా కానీ, యీ జనన మరణాల వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదనీ, ఒక్క నారాయణ మంత్రమే మనలను యీ సంసార చక్రం నుంచీ బైట పడవేసే సాధనం అనీ మీ వంటి గురువుల ద్వారా తెలిసింది. ఆ మూడు రోజులూ మీ పాదాల దగ్గ్గరే ఉంటాను.

          పుట్టపర్తిలో శిష్య వాత్సల్యం పరవళ్ళు తొక్కి, రఘోత్తమ రావు తలమీద నిమురుతూ ఉండిపోయారు,  కానీ భార్య కనకమ్మ నిండు గర్భిణి. ఆమెకేదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చిన్న భయం.

          కానీ అదేదో సామెతలో చెప్పినట్టు, ఇంత పెద్ద సృష్టిలో మనమెంత, మన అస్తిత్వమెంత? గడ్డిపోచంత!  పనిగట్టుకుని ఆ గ్రహాలన్నీ మనవెంట పడతాయనుకోవటం, మన భ్రమ. అట్లాకాక, ప్రపంచానికంతటికీ ప్రమాదమో, మరొకటో వచ్చినప్పుడు, ఏ దేవుడూ మనలను కాపాడలేడు. ఆ విధంగా జరిగితే అది మన పూర్వ జన్మల ఉపాసనా బలమే అవుతుంది.’ఈ ఆలోచనతో అష్టగ్రహ కూటమి గురించి ఆందోళన తగ్గిపోయింది.

          పైగా కనకమ్మలో యీ తేదీల్లో ఎటువంటి నొప్పులూ రాలేదు. ఆ తేదీలు ఏ హడావిడీ లేకుండానే, దాటి పోగానే, మనసు తేలికైంది, అందరికీ!  కానీ భార్య కనకమ్మకు దాదాపు తొమ్మిది నెలలు నిండుతున్న సమయం కావటం వల్ల మనసులో ఏదో చిన్న కుదుపు.

***

          మార్చ్ నెల ప్రవేశించింది. అప్పుడప్పుడూ కనకమ్మకు నెమ్మదిగా నొప్పులొస్తున్నాయి. గుడిపాటి అవ్వ సహాయం ఉండనే ఉంది. ఇంట్లో అందరూ చిన్న పిల్లలే! ఒకవేళ కానుపు ఉన్నట్టుండి తోసుకుని వస్తే తోచుకుని ఆ పనుల్లో సహాయం చేసేవాళ్ళెవరు మరి? అటు కరుణాదేవికి కూడ నాలుగో నెల, అందుకే కనకమ్మ్మ ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదసలు! నొప్పులెస్తే మంత్రసానులుండనే ఉన్నారు. (ఆ రోజుల్లో ఆసుపత్రికి కానుపుల కోసం వెళ్ళటమన్నది తక్కువే!) పైగా ఎదో అస్సలు కానుపులే కానిదాని మాదిరి, వాళ్ళనూ వీళ్ళనూ పిలవటం, అవమానం. ఇన్ని కానుపులూ సులువుగానే అయ్యాయి. ఇదీ అంతే అవుతుంది. పైగా వియ్యంకుల ఇళ్ళకు పిల్లను పంప్మని ఉత్తరం వ్రాయటం ఎంత తలవంపులు? ఒకవేళ అంతగా అవసరమైతే అమ్మ శేషమ్మ ఎటూ వస్తుందనే ధైర్యం కనకమ్మకు! అందుకే మొండిగా ఉంది. కానీ కరుణాదేవి ఊరుకోలేదు. తరులతకు ఇబ్బంది ఉండదు కదా! అని తనకు పని అప్పజెప్పింది ఉత్తరాల ద్వారానే అమ్మకూ యీ సమయంలో సహాయంగా రమ్మని! వాళ్ళిద్దరూ ఒక జోడీ కాబట్టి ఆమె తయారుగానే ఉంది వచ్చేందుకు! అమ్మకూ యీ సమయంలో సహాయంగా కడపకు రమ్మని!

          ఇంట్లో హడావిడి. కనకవల్లికి కాన్పు నొప్పులు. నొప్పులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. గుడిపాటి అవ్వ దగ్గరుండి ఆదుకుంటూ ఉన్నా ఏదో ఆందోళన. కారణం. అష్ట గ్రహ కూటమి కాన్పు నొప్పులు.  అరవిందు వెళ్ళి హైద్రాబద్ కు అవ్వ శేషమ్మకూ, అటు హొసపేట అక్కయ్య తరులతాకూ వెంటనే రమ్మని టెలిగ్రాంలు కొట్టి వచ్చాడు.

***

          మార్చ్ 5వ తేదీ. ప్లవ సంవత్సర ఫాల్గుణం. శ్రవణ నక్షత్ర ఘడియల్లో కనకవల్లి పంటి బిగువున నొప్పి భరిస్తూ ఉంది. శేషమ్మ, తరులతా ఆమె దగ్గరలోనే ఉన్నారు. మంత్రసాని ఆజ్ఞతో వేడినీళ్ళు కాస్తున్నారు, తులజా అరవింద్! నాగ భయం భయంగా ఇంట్లోకీ బైటికీ పరుగులు పెడుతూ ఉంది.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.