
వ్యాధితో పోరాటం-31
–కనకదుర్గ
అంబులెన్స్ లో ఫిలడెల్ఫియా సిటీలో వున్న యునివర్సిటీ ఆఫ్ జెఫర్సన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. వెళ్తున్నంత సేపు భయమే. ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి రోజూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాడు శ్రీని. ఇపుడు అలా కుదరదు. తను రోజు రావడానికి కూడా కుదుర్తుందో లేదో చూడాలి. నాకు చాలా బెంగగా అనిపించింది. వార్డ్ లోకి తీసుకువెళ్తుంటే కొంతమంది పేషంట్స్ బైటికి తొంగిచూసారు ఎవరో కొత్త పేషంట్ వచ్చారని. అక్కడ వున్నట్టు షేర్డ్ రూమ్స్ కావు, ఒక రూమ్ నాకు ఇచ్చారు, దాంట్లోనే బాత్రూం, ఒక చిన్న టీవి వుంది. నా రూంకి ఆనుకుని మరో రూం వుంది. అంబులెన్స్ వాళ్ళు నన్ను రూంలో దింపి నర్సుకి నా కేస్ ఫైల్ ఇచ్చి, “ఆల్ ది బెస్ట్,” చెప్పారు, నేను,” థ్యాంక్యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్,” అన్నాను.
తర్వాత నర్స్ వచ్చి నాతో మాట్లాడి వెళ్ళింది. ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఒక నర్స్ చాలా మంది పేషంట్లని చూసుకోవాల్సి వుంటుంది.
కాసేపయ్యాక డ్యూటీ డాక్టర్ వచ్చి, “నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారో తెలుసా?” అని అడిగాడు.
“నా పాంక్రియాస్ లో స్టోన్స్ వున్నాయా, లేదా అని డా. కోవాల్స్కి, ఈ.ఆర్.సి.పి చేసి చూస్తారని చెప్పారు.”
” యస్ యువార్ కరెక్ట్. రేపు ఆయన వచ్చి ఎపుడు చేస్తారో చెబ్తారు…..”
“ఆ ప్రొసీజర్ ఎంత సేపవుతుందో మీకు తెల్సా? నాకు చాలా భయం వేస్తుంది…”
“స్టోన్స్ వున్నాయా, లేదా అన్నదాన్ని బట్టి తెలుస్తుంది ఎంత సేపవుతుందో. ఈ.ఆర్.సి.పి ఇంతకు ముందు చేసారా మీకు….”
“యస్. ఐ హాడ్ ఈ.ఆర్.సి.పి బిఫోర్. రేపే చేస్తారో లేదో తెలియదు కదా! చాలా దూరం నుండి వచ్చారు, అలసిపోయి వుంటారు, జస్ట్ రిలాక్స్ ఫర్ టునైట్. ఇట్స్ నైస్ టు మీట్ యూ, గుడ్ నైట్,” అని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
నాకంతా కంగారు కంగారుగా వుంది. నర్స్ వచ్చి మందులిచ్చి వెళ్ళింది. కాసేపు టీవి చూసి, శ్రీనితో, చైతుతో మాట్లాడాను. వాళ్ళకి ఆలస్యమవుతుందని పడుకోమన్నాను. మర్నాడు, శనివారం కాబట్టి పిల్లల్ని తీసుకొస్తానన్నాడు. నాకు సంతోషమేసింది.
నిద్రపోవడానికి ప్రయత్నించాను. టి.పి.ఎన్ వల్ల కడుపులో తిప్పడం, డయేరియా వల్ల చాలా ఆందోళ నగా వుంటుంది. నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది, కాసేపయ్యాక మెల్లిగా నిద్ర పట్టింది. కానీ కాసేపట్లోనే ఎవరో గట్టిగా ఏడుస్తుంటే మెలుకువ వచ్చింది. పక్కన ఒకావిడ వుందని తెల్సు, నేను వచ్చేపటికి ఆ రూంలో నుండి ఒకమ్మాయి, ఒకావిడ, ఒకతను బయటకు వెళ్తూ లోపల వున్నావిడకి ’బాయ్,’ చెప్తూ వెళ్ళారు.
ఆమె ఏడుపు గుండెల్ని పిండేస్తున్నట్టుగా ఉంది. ఆమె మంచం గోడకి అటువైపు ఆనుకుని వుంది అలాగే నా మంచం ఇటువైపు. ఆవిడ తల కొట్టుకుంటూ, “ప్లీజ్ హెల్ప్ మీ, ఎనీబడి……. ఎనీవన్….. ప్లీజ్ హెల్ప్ మీ ….. దిస్ పేయిన్ ఈజ్ కిల్లింగ్ మీ….. ఐ కాంట్ స్లీప్, ఐ కాంట్ సిట్…… ఐ కాంట్ డూ ఎనీథింగ్…..” అని తల కొట్టుకుంటూ ఏడుస్తుంది.
నేనిప్పటి వరకు ఆలోచించలేదు, నన్ను క్యాన్సర్ వార్డ్ కి వేరే వార్డ్స్ లో బెడ్స్ ఖాళీ లేవనే పంపించారా లేకపోతే నేను భయపడకూడదని అలా చెప్పారా? ఈ కొత్త లక్షణాలు వాంతులు, విరేచనాలు టి.పి.ఎన్ వల్ల కాదేమో, ఇది పాన్క్రియాటికి క్యాన్సరేమో?
ఆవిడ ఏడుపు కాసేపు ఆగుతుంది, మళ్ళీ మొదలవుతుంది. నర్స్ ని పిలిచి యాంగ్జాయిటీ కోసం ఇచ్చే ఇంజెక్షన్ ఇమ్మని అడిగాను. నేను కాసేపన్నా నిద్రపోవాలి. లేకపోతే నేనిప్పటి వరకు ఈ జబ్బు ఎలాంటి దయినా పోరాడి, గెలవాలి ఎందుకంటే నా పిల్లల్ని ఈ ప్రపంచంలోకి నేను తీసుకొచ్చాను, వారికి తల్లిగా నేను అండగా నిలబడి, నేనెలా పెంచాలనుకున్నానో అలాగే పెంచగలగాలి అనే ఆలోచనతో ముందుకు సాగు తున్నాను, నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళానంటే పోరాడడం కష్టమవుతుంది. రెప్రొద్దున్నే డాక్టర్ రాగానే అడగాలి ఇది క్యాన్సరా, కాదా అని! నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాక పడుకోవడానికి ప్రయత్నించాను, కానీ ప్రక్కన గదిలో వున్నావిడ పాపం నొప్పి భరించలేక ఏడుస్తున్న ఏడుపుకి నిద్రపట్టలేదు, తెల్లవారుతుండగా ఆవిడకి రాత్రంతా ఇచ్చిన మందులు కాస్త పని చేసి నిద్రలోకి జారుకుందేమో, నేను అపుడే కళ్ళు మూసుకు పడుకున్నాను, కానీ నన్ను చూడడానికి వచ్చే డాక్టర్ కొవాల్స్కి ఉదయం 7 గంటలకే వచ్చేసాడు.
“హాయ్! దుర్గా డింగరి, నేను మీ రిపోర్ట్స్ అన్నీ చూసాను. మిమ్మల్ని దుర్గా అని పిలవొచ్చు అని ఉంది ఫైల్ పైన. ఈజ్ దట్ ఓకే?”
“ష్యూర్! నా ఫ్రెండ్స్, ఆ హాస్పిటల్ లో అలాగే పిల్చేవారు.”
“మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్స్ కి పాన్క్రియాస్ లో స్టోన్స్ ఉన్నాయేమో అని డౌట్ వుంది అందుకే ఇక్కడికి పంపించారు. అక్కడ మా దగ్గరున్న ఇక్విప్మెంట్స్ ఉంటే ఇక్కడికి వచ్చే అవసరం ఉండేది కాదు.” కడుపు నొక్కి నొప్పి ఎక్కడెక్కడ ఉంది, అని అడుగుతూ చూసారు.
“ఓకే ఎవ్విరిథింగ్ ఈజ్ ఫైన్. సోమవారం కల్లా గ్లాడ్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా అన్నది చూడడానికి అల్ట్రా సౌండ్, మరి కొన్ని టెస్ట్స్ చేస్తారు. సోమవారం మధ్యాహ్నం నేను ఈ.ఆర్.సి.పి సెడెటివ్ ఇచ్చి చేస్తాను. ఎనీ క్వశ్చన్స్?”
“ఐ యామ్ వెరీ స్కేర్డ్… బట్ ఐ నో ఐ నీడ్ టు హావ్ దిస్ ప్రొసీజర్….”
“మీ డాక్టర్స్ కి నా పైన నమ్మకం ఉంది కాబట్టే నిన్ను ఇక్కడికి పంపించారు. వాళ్ళ డయాగ్నిసిస్, నేను అనుకున్నది ఒకటే కాబట్టి వాళ్ళంతా ఈ స్టోన్ ఆర్ స్టోన్స్ తీసేస్తే ప్రాబ్లెమ్ విల్ బి సాల్వడ్ అండ్ యు కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ అని అనుకుంటున్నారు, నేనూ అదే అనుకుంటున్నాను. నీకో చిన్న బేబి ఉందట కదా!..”
అవునన్నట్టు తల వూపాను.
“లిటిల్ బేబీస్ గ్రో ఫాస్టర్, అందుకే తను పెరిగిపోక ముందే నిన్ను త్వరగా బాగుచేసి ఇంటికి పంపించాలి, సో దట్ యు కెన్ ఎంజాయ్ యువర్ లిటిల్ బేబి గర్ల్ సో డోంట్ వర్రీ అబౌట్ ఇట్…”
“యువార్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ మిసెస్ డింగారి, డాక్టర్ కొవాల్స్కీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హిజ్ వర్క్ అండ్ వండర్ఫుల్ విత్ పేషంట్స్.” అని ఆయనతో ఉన్న అసిస్టెంట్ డాక్టర్ అన్నాడు.
“ఎనీ మోర్ క్వశ్చన్స్?” అడిగారు డా. కొవాల్స్కి.
“నన్ను క్యాన్సర్ వార్డ్ లోకి తీసుకొచ్చారు అది ఎక్కడా బెడ్స్ లేవనా లేకపోతే నేను కూడా క్యా….”
“ఓ ఐయామ్ సో సారీ దుర్గా దట్ యు ఫీల్ లైక్ దట్! నో మీకు క్యాన్సర్ లేదు. దాని లక్షణాలు వేరుగా ఉంటాయి. చుట్టు ఆ పేషంట్సే ఉంటే అదే డౌట్ వస్తుంది. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఇంకేమన్నా అడగాలా?”
నేను తల అడ్డంగా తిప్పాను.
“ఓకే దెన్, టేక్ కేర్ అండ్ ఐవిల్ సీ యూ ఆన్ మండే!” అని వెళ్ళిపోయాడు.
ఆయన వెళ్ళాక పడుకున్నాను, నర్స్ కి చెప్పాను, కనీసం రెండు గంటలైనా పడుకుంటాను, డిస్ట్రబ్ చేయొద్దని. ఆమె టెక్ ని పిల్చి నా వైటల్ సైన్స్ తీసుకొని వెళ్ళమంది. డాక్టర్ చెప్పిన టెస్ట్స్ చేయడానికి చాలా టైముంది కాబట్టి నన్ను పడుకోమంది. రెండు గంటలు బాగా నిద్ర పట్టింది, ప్రక్క గదిలో పేషంట్ కూడా పడుకున్నట్టు ఉంది.
గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయేమోనని, అలాగే పాన్క్రియాస్లో స్టోన్స్ కనిపిస్తాయేమోనని అల్ట్రాసౌండ్ టెస్ట్, కొన్ని ఎక్స్ రేలు తీసారు.
శ్రీని సాయంత్రం పిల్లల్ని తీసుకొచ్చాడు. పాపకి హాస్పిటల్ వాతావరణం అస్సలిష్టం వుండదు, రాగానే ఏడుపు మొదలుపెట్టేది. నేను కాసేపు ఎత్తుకుని ఊరుకోబెట్టడానికి ప్రయత్నించేదాన్ని ఆ తర్వాత స్ట్రోలర్లో పడుకోబెట్టి కాసేపు తిప్పతే నిద్రపోయేది. చైతన్య గదిలో వున్న పెద్ద కిటికీ నుండి క్రిందకు చూస్తున్నాడు. ఆ కిటికీకి గ్లాస్ డోర్స్ కానీ మామూలు డోర్స్ కానీ ఏమీ లేవు. ఒంగి చూస్తే కింద రోడ్ పైన వెళ్ళే కార్లు, బస్సులు, రోడ్డుకిరువైపులా కెఫేలు, పిజ్జా ప్లేస్లు, కొన్ని ఇతర షాప్స్ ఉన్నాయి. బయటకు చూస్తూ కూర్చుంటే సమయం మనకి తెలీకుండానే గడిచిపోతుంది. కానీ పోలీస్ కార్ల, అంబులెన్సుల, ఫైర్ ఇంజన్ల సైరన్లు ఆగకుండా వినిపిస్తుంటాయి. ( ఇది ఇరవై అయిదేళ్ళక్రితం, ఇపుడు బిల్డింగ్స్ కట్టేపుడు, పైన ఖాళీ మేడ పైన ప్రజలు ఎవరూ దూకి ఆత్మహత్యలకు పాల్పడకుండా చుట్టూ ఇనప ఫెన్సింగ్ చేస్తున్నారు ఇపుడు. హాస్పిటల్స్ లో కూడా గాజు అద్దాలు, తలుపులు లేని కిటికీలు తీసేసి కొత్తవి పెట్టేసి వుంటారు.)
నేను సోమవారం ప్రొసీజర్ చేస్తున్నారని ఆ రోజు శ్రీని వస్తే బాగుంటుందని, జోన్ ని ఆ ఒక్కరోజు ఎక్కువ సేపు పిల్లల్ని చూసుకోవడానికి రమ్మని చెప్పమన్నాను.
“నాకు రావడానికి కుదరదేమో, ఎందుకంటే రేపట్నుండి స్నో బ్లిజర్డ్ వస్తుంది, జోన్ రానని చెప్పింది. స్నోలో డ్రైవ్ చేయడం కష్టం, అయినా పిల్లలని వదిలి ఎట్లా రావడం? ఆ ఒక్కరోజు మానేజ్ చేసుకో ప్లీజ్! నాకు అవకాశం వుంటే తప్పకుండా వచ్చేవాడిని. ప్లీజ్ అర్ధం చేసుకో!” అన్నాడు శ్రీని.
“అవునమ్మా పెద్ద బ్లిజర్డ్ అట, చాలా స్నో పడుతుంది కాబట్టి మాకు స్కూలు కూడా వుండదు. మేము స్నోలో ఆడుకోవచ్చు…కానీ అమ్మా నువ్వుండవు కదా, నువ్వు లేకపోతే ఏం బాగుండదమ్మా!” అన్నాడు చైతన్య నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని.
నాకసలే ప్రొసీజర్ అంటే భయంగా వుంది. శ్రీని తప్పకుండా వస్తాడనుకున్నాను. ఇప్పటివరకు ఏ టెస్ట్స్ కి లేడు. ఎపుడైనా లంచ్ టైంలో టెస్ట్ ఉంటే వచ్చి టెస్ట్ అయ్యాక వెళ్ళేవాడు. అది ఎపుడో ఒకసారి జరిగేది.
ఏం చెప్పను? తనకి వేరే దారి లేదు. చంటి పాపను ఎవరుంచుకుంటారు? ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర వదిలిపెట్టొచ్చు. ఇపుడు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. జోన్ కి ముందే చెబితే ఉండేదేమో కానీ నాకే పొద్దున్న వరకు తెలీదు.
ఇంకేం చేస్తాం….ఎప్పుడూ తనని రమ్మని అడగలేదు….వాతావరణం మనకి సహకరించకపోతే తను మాత్రం ఏం చేస్తాడు.
స్టోన్స్ కనిపిస్తే అప్పటికపుడు తీసేస్తారు…స్టోన్స్ ఎక్కువుంటే, ఎక్కువసేపవుతుంది, అప్పటివరకు సెడెటివ్ పని చేస్తుందా… లేదా ఎట్లా తెలుస్తుంది. ప్రొసీజర్ మధ్యలో మెలుకువచ్చేస్తే ఎట్లా? అపుడేం చేస్తారు? ఇవన్నీ అనుమానాలు నన్ను పీకుతున్నాయి.
నాకు వాంతొచ్చేలా వుంది. పిల్లల ముందరైతే బాధ పడ్తారు. చలికాలం త్వరగా చీకటి పడిపోయింది అందుకని శ్రీనిని పిల్లలను ఇంటికి తీసుకెళ్ళమన్నాను.
“అమ్మా మండే ప్రొసీజర్ కి ఆల్ ది బెస్ట్ అమ్మా, ఇదయిపోతే నువ్వుంటికొచ్చేయొచ్చేమో కూడా!” అని గట్టిగా హగ్ ఇచ్చి నాకు ముద్దులిచ్చాడు, నేను వాడికి ముద్దులు పెట్టాను. పాపకు డైపర్ మార్చి, పాలు తాగించి, ముద్దు చేసి కార్ సీట్లో పడుకోబెట్టాను.
శ్రీని నా చెయ్యి పట్టుకుని మెల్లిగా “సారీ, రాలేకపోతున్నాను…”
“నాకీ ప్రొసీజరంటే భయంగా ఉంది అందుకే అడిగాను… కానీ వాతావరణం బాగాలేకపోతే నువ్వేం చేయగలవ్? ఇట్స్ ఓకే!” అన్నాను.
మళ్ళీ “సారీ చిన్ని, ఐయామ్ సో సారీ!” అన్నాడు బాధగా.
“చీకటయిపోయింది, మీరింటికెళ్ళి నాకు ఫోన్ చేయండి. నేను పడుకోను ఫోన్ చేసేదాకా. బై బై.” అని పంపించేసాను.
మళ్ళీ రాత్రిపూట జాగారమే అయ్యింది నా ప్రక్కన గదిలో క్యాన్సర్ పేషంట్ కి తనతో పాటు నాకు.
తెల్లవారుఝామున నిద్ర పట్టింది. సడన్గా, “దుర్గా, దుర్గా, వేకప్ యూ స్లీపి బేబి,” నన్ను ఊపారు లేపుతున్నట్టుగా. నేను కళ్ళు తెరిచి చూసే వరకు, జూలియా, నా ఫ్రెండ్ కనిపించింది.
నాకు ప్రాణం లేచివచ్చినట్టయింది, ఎందుకంటే హాస్పిటల్ దూరం కదా, ఎవరికీ రావడానికి రాదంటారని, నాకు కూడా రమ్మని అడగాలన్నా కొంచెం మొహమాటంగా వుంటుంది.
“హాయ్! జూలియా! నువ్వేంటి ఇక్కడ, ఇంత పొద్దున్నే?”
“ఫిలడెల్ఫియాలో, ఇక్కడ నుండి కొద్ది దూరంలోనే “ఫ్లవర్స్ ఫెస్టివల్,” మొదలైంది. అది చూడటానికే నేను నా ఫ్రెండ్ వచ్చాం, తను వేయిటింగ్ రూంలో ఎదురు చూస్తుంది. నాకు గుర్తొచ్చింది, నువ్వు ఇక్కడికి వచ్చేసి వుంటావని. అందుక ఫెస్టివల్ కి వెళ్ళే ముందర ఈ హాస్పిటల్ కి వచ్చి నీ పేరు అడిగితే చెప్పారు, ఇక్కడ వున్నావని. అందుకే నిన్ను చూసి వెళ్ళాలనిపించింది. ఇక్కడ ఎట్లా వుంది? నీ నొప్పికి మందులు సరిగ్గా ఇస్తున్నారా? నొప్పి కంట్రోల్లో వుంటుందా? నీ ప్రొసీజర్ ఎపుడుందీ?” అని అన్నీ గబగబా అడిగేసింది.
“ఐ యామ్ సో హ్యాపీ టు సీ యూ జూలియా! యస్ రేపుంది నా ప్రొసీజర్. నిన్న డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. ప్రొసీజర్ ఎంతసేపవుతుందో వాళ్ళకే తెలియదు. స్టోన్స్ ఉంటే చాలా జాగ్రత్తగా తీయాలి కాబట్టి ఎక్కువసేపవచ్చు, స్టోన్స్ లేకపోతే త్వరగా అవ్వొచ్చు. అది ప్రొసీజర్ చేస్తే కానీ తెలియదు.”
“శ్రీనివాస్ వస్తున్నాడా? కష్టమేమో పెద్ద స్నో తుఫానొస్తుంది. మీ బేబి సిట్టర్ వస్తే తను ట్రైన్లో రావొచ్చు.”
” కానీ బేబీ సిట్టర్ ఫ్యామిలీతో ఎక్కడికో వెళుతున్నదట రానని చెప్పింది. సో హీ ఈజ్ నాట్ కమింగ్, అండ్ ఐయామ్ వెరీ వర్రీడ్ అబౌట్ ప్రొసీజర్,” అన్నాను కొంచెం నిరాశగా.
“రియల్లీ హీ కాన్ట్ కమ్…సో సారీ! సో వేరే ఎవరైనా రాగలరా, అడిగారా?”
“నో, అడగలేదు. ఎలా అడిగేది, ఇంత పెద్ద స్నో తుఫానులో రమ్మని అడగలేము కదా!”
“వై నాట్? ఒక్కదానివి ఎలా వుంటావు. నేనొస్తాను డియర్, డోంట్ వర్రీ.” అంది.
నాకు ఒక నిమిషం అర్ధం కాలేదు తను ఏమంటుందో! “రియల్లీ, యూ క్యాన్ కమ్. నువ్వు జోక్ చేయటం లేదు కదా! నీకు కూడా చాలా దూరం. నువ్వూ కూడా శ్రీని అంత దూరమే రావాల్సివుంటుంది. ఎలా వస్తావు?”
“నేను పొద్దున్నే లేచి అన్నీ కుక్కలకు, పిల్లులకు తిండి పెట్టేసి ట్రైన్లో వస్తాను. నీ ప్రొసీజర్ కాగానే మళ్ళీ ట్రైన్లో వెళ్తాను. నాకేం కష్టం కాదు. డోంట్ వర్రీ డియర్.” అంది జూలియా.
నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. తనని గట్టిగా హత్తుకుని ఏడ్చేసాను. “యూ సిల్లీ డోంట్ క్రై బేబీ. ఐ విల్ సీ యూ టుమారో ఓకే! ఇపుడు నేను ఫ్లవర్ ఫెస్టివల్ కి వెళ్ళాలి. మా ఫ్రెండ్ వేయిట్ చేస్తూ వుంటుంది. హావ్ ఏ నైస్ డే.” మెల్లిగా లేచి బై చెప్పి వెళ్ళింది.
నేను శ్రీనికి ఫోన్ చేసి చెప్పాను, తను కూడా బాధ పడ్తుంటాడు కదా అని. చాలా సంతోషించాడు. కొంచెం రిలీఫ్ గా అనిపించింది.
నేను అడగ్గా, అడగ్గా నర్స్ ప్రక్కనున్న పేషంట్ గురించి కొద్దిగా చెప్పింది.
నలభైల్లో వున్న ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడ్తుంది. ఆమెకి ఒక కూతురుంది, పదిహేడేళ్ళవయసు. రోజు మధ్యాహ్నం వచ్చి రాత్రి వరకు వుండి వెళ్తుంది అది నేను కూడా గమనించాను. ఇంక ట్రీట్మెంట్ తీసుకోనని నిర్ణయం తీసుకుంది అని చెప్పింది నర్స్. అంటే రోజు రోజుకి మృత్యువుకి దగ్గరవుతుంది. వున్నన్నని రోజుల కూతురితో సమయం గడుపుతుంది. అలాగని తనని స్కూల్ మానేసి కూర్చో, నా దగ్గరే వుండు అని చెప్పలేదు. వచ్చినపుడు బ్రతకడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తుందేమో!
పడుకోవడానికి రెడీ అవుతున్నాను. క్రిస్టియన్ ఫాదర్స్ కొంతమంది గబగబా నా రూం ముందునుండి వెళ్ళారు.
నర్స్ నాకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చింది, “వాళ్ళంతా ఎవరు? ఎందుకు పరిగెత్తుతున్నారు,” అనడిగాను.
ఆమె ఏదో ప్రార్ధన చేస్తూ క్రాస్ సైన్ చేసింది. “ఎవరికో దేవుడి నుండి పిలుపొచ్చింది, అందుకే ఆ ప్రీస్ట్స్ ప్రార్ధించడానికి వచ్చారు.” అని చెప్పింది.
ఇలా రోజుకి ఒకసారి, ఒకోసారి చాలా సార్లు వాళ్ళు వచ్చి వెళ్ళడం జరిగేది.
నాకు భయంగా అనిపించేది, పాడు క్యాన్సర్ ఎన్ని రకాలుందో, దానికి చిన్నా, పెద్దా తేడాలు లేవు, ఇలా రోజుకి ఎంతమంది చనిపోతున్నారో ఈ రోగాన పడి. ఒకోసారి ప్రక్కన పేషంట్ అరవగానే గుండెలో దడ వచ్చేది, ఈ రోజు వుంది, రేపుంటుందో లేదో పాపం ఆ తల్లికి తన బిడ్డని వదిలి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉందో!
ప్రొసీజర్ కోసం టి.పి.ఎన్ ఆపారు ఆ రాత్రి. అది తీసాక కాస్త తెరిపిగా అనిపించింది.
మర్నాడు పది గంటలకు తను చెప్పినట్టుగా వచ్చింది జూలియా! నాకు చాలా సంతోషమేసింది తనని చూసి. తను వచ్చిన కాసేపటికి ట్రాన్స్ పోర్ట్ వాళ్ళు వచ్చి నన్ను వీల్ చేర్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళారు క్రింద ప్రొసీజర్స్ చేసే దగ్గరకి. బయటే వేయిట్ చేయాలి మన టర్న్ వచ్చేదాక. పన్నెండు గంటలకు ప్రొసీజర్ రూంకి తీసుకెళ్తామన్నారు. ఇతర పేషంట్స్ తో పాటు నేను స్ట్రెచర్ పైన పడుకున్నాను, జూలియా నా ప్రక్కన కూర్చొని కబుర్లు చెబ్తుంది. తను లంచ్ తెచ్చుకుంది, బయటికి వెళ్ళి తినేసి వచ్చింది.
డా. కొవాల్స్కి పన్నెండు తర్వాత వచ్చి మాట్లాడారు.
“దుర్గా! హౌ ఆర్యూ డూయింగ్?”
“ఐ యామ్ సో స్కేర్డ్! నర్వస్…”
“ఇట్స్ ఓకే డోంట్ వర్రీ, వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ! సీ ఐ యామ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్టోన్స్… సో ఈ ప్రొసీజర్ త్వరగా అయిపోతుందనుకుంటున్నాను. ఇంకో పదినిమిషాల్లో నిన్ను లోపలికి తీసుకువస్తారు, నీకు సెడెటివ్ ఇచ్చి ప్రొసీజర్ చేస్తాను. ఓకే సీ యూ సూన్.” అని చెప్పి వెళ్ళిపోయారు.
నాకు గుండె దడ మొదలైంది. ప్రొసీజర్ కోసం టి.పి.ఎన్ ఆపారు ఆ రాత్రి. అది తీసాక కాస్త తెరిపిగా అనిపించింది.
“నాకు చాలా భయం వేస్తుంది జూలియా! తొందరగా అయిపోతే బాగుండు. స్టోన్స్ లేకపోతే మళ్ళీ ఆ నొప్పి ఎందుకు ఇంత ఎక్కువగా వస్తుందో తెలియదు. మళ్ళీ టెస్ట్స్, మళ్ళీ హాస్పిటల్స్ లో ఉండాలి కాబట్టి ఒకవేళ స్టోన్స్ వుంటే అవి తీసేస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది. ఇంటికెళ్ళి కోలుకున్నాక ఐ కెన్ స్లోలీ స్టార్ట్ మై నార్మల్ డైట్. రైట్?”
“దుర్గా, ప్లీజ్ రిలాక్స్. ఇపుడెక్కువగా ఆలోచించకు. ఎవ్విరిథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్రైట్ హనీ!” అన్నది నా చెయ్యి పట్టుకుని.
ఇదెక్కడి స్నేహం. ఒకప్పుడు ఈ జూలియా నన్ను చూసి, “మీ ఇండియాలో స్కూల్స్ ఉంటాయా? కార్లుంటాయా, కార్లు కొనుక్కుంటారా? మీకు ఇంగ్లీష్ ఎలా వచ్చింది? ఇక్కడకి వచ్చారని నేర్చుకున్నారా?” అని అడిగేది.
క్యాథి ద్వారానే వీళ్ళు పరిచయం అయ్యారు. నాకు జూలియాను చూస్తే కొంచెం జాగ్రత్తగా వుండాలి తనతో అనిపించేది.
అక్కడ హాస్పిటల్ లో ఉన్నపుడు కూడా చూడడానికి వచ్చేది. ఒకరోజు స్ఫూర్తికి దూరంగా ఉండడం నా వల్ల కావటం లేదని ఏడ్చేసాను. అపుడు జూలియా వచ్చేసి గట్టిగా పట్టుకుని, “దుర్గా ప్లీజ్ డోంట్ క్రై. ఐ నో హౌ యూ ఫీల్. మాకు పిల్లలు పుట్టడం లేటయితే అందరూ ఎన్ని మాటలన్నారో? నేను ఏడవని రోజు లేదు. నువ్వు ఎంతో ఇష్టంగా కన్న పాపని ఇన్ని రోజులు చూడకుండా హాస్పిటల్లో వుంటూ బాధ పడటం చాలా కష్టం.” అని ఓదార్చింది.
స్ఫూర్తి అంటే చాలా ఇష్టం. ఫోటోలు తీసేది. నేను ఇంట్లో వున్నపుడు వచ్చి దాంతో ఆడుకునేది.
ఇప్పటివరకు ఏ ప్రాబ్లెమ్ రాలేదు బాగానే ఉంది, సాయం చేస్తానని ముందుకు వస్తుంది.
నర్సులు వచ్చి ప్రొసీజర్ కోసం లోపలికి తీసుకెళ్తుంటే జూలియా నా నుదుటి పైన ముద్దు పెట్టి, “బీ స్ట్రాంగ్ దుర్గా! ఆల్ ది బెస్ట్!” అని చెప్పింది.
లోపలికి వెళ్ళగానే, డా. కొవాల్స్కిప్రొసీజర్ గురించి వివరించారు. ఈ ప్రొసీజర్ ని ERCP (Endoscopic Retrograde Cholangiopancreatography) or lithotripsy అంటారు, ముఖ్యంగా పాన్క్రియాస్ నుండి స్టోన్స్ తీసే ప్రక్రియ ఇది. ఒకవేళ స్టోన్స్ లేకుంటే చాలా త్వరగా అయిపోతుంది, ఉంటే మాత్రం నేను తీసేస్తాను.”
“నాకు స్టోన్స్ తీసేపుడు మీరిచ్చిన సెడెటివ్ అయిపోతే ఏం చేస్తారు?”
“ఆ పరిస్థితి రాకపోవచ్చు ఒకవేళ వస్తే మేము ఎక్కువ సెడెటివ్ ఇస్తాము. మేము నిన్ను కంఫర్టబుల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తాం. వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ దుర్గా! జస్ట్ రిలాక్స్!” అని చెబ్తుండగానే నాకు సెడెటివ్ ఇవ్వడం ERCP మొదలయిపోయింది. నాకేమో మధ్య మధ్యలో మెలుకువ రావడం, వాళ్ళు ఇంకా మత్తు మందు ఇవ్వడం,
నేను గొంతు నొప్పిగా వుందని అనడం గుర్తుంది. ఇలా ఎంత సేపు జరిగిందో నాకేం తెలియదు.
బయటకు తీసుకొచ్చి డా. కొవాల్స్కి నాతో ఏదో చెప్పారు కానీ నాకేమి గుర్తు లేదు.
నాకు రాత్రి రెండు గంటలకు మెలుకువ వచ్చింది. నర్స్ ని పిలిచి డాక్టర్ ఏం చెప్పారు, ప్రొసీజర్ ఎలా జరిగింది? స్టోన్స్ కనపడ్డాయా? తీసేసారా? ఫైల్ లో డాక్టర్ రిపోర్ట్ రాస్తే చూసి చెప్పమన్నాను. నా తలంతా బరువుగా వుంది, అయోమయంగా ఉంది. ఏం జరిగిందో గుర్తు లేదు. కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ ఏం జరిగిందో తెలుసుకోవాలనే తాపత్రయం.
నర్స్ వచ్చి, “ఏం తెలియటం లేదు, రేప్రొద్దున్న డాక్టర్ వచ్చినపుడు చెబ్తారు ఏం జరిగిందో, ఇపుడు పడుకో, నొప్పి ఎక్కువగా ఉందా, మందు కావాలా?”
“ఊహు, నిద్ర వస్తుంది. కానీ నాకు ఏం గుర్తు లేదు, ప్రొసీజర్లో ఏం జరిగిందో!”
“ఇంకాసేపు నిద్రపోతే డా.కొవాల్స్కి త్వరగా వస్తారు, రాగానే ఆయనే చెప్పేస్తారు. సరేనా, నేను వేరే పేషంట్ దగ్గరకి వెళ్ళాలి, ప్లీజ్ పడుకో మిస్ డింగారి.” అంది నర్స్.
“ఓకే! థ్యాంక్యూ!” అని పడుకోవడానికి ప్రయత్నిస్తున్నా కానీ నా మనసులో స్టోన్స్ తీసేస్తే ఇక నొప్పి రాదా? ఇక ఈ పాన్క్రియాటైటిస్ నన్ను వదిలేసినట్టేనా? అలా జరిగితే ఎంత బావుంటుంది.
ఇలా ఆలోచిస్తుండగా మెల్లిగా నిద్ర పట్టింది. ఆ రోజు నా ప్రక్కన పేషంట్ గురించి ఆలోచించే సమయం దొరకలేదు.
ఆరు గంటలకు ఫోన్ మ్రోగింది. అంత నిద్రలోనుండి బయటకు లాక్కొచ్చింది ఫోన్ కాల్.
“హలో!”
“హే దుర్గా ఇట్స్ జూలియా! హౌ ఆర్ యూ డియర్? కంగ్రాచ్యులేషన్స్ నౌ యూ విల్ బి ఆల్రైట్!…”
“ఏం మాట్లాడుతున్నావు? నాకేం గుర్తులేదు నిన్న ఏం జరిగిందో. డాక్టర్ ఏం చెప్పారు? డిడ్ హి ఫైండ్ ది స్టోన్స్? డిడ్ హి రిమూవ్ దెమ్?” అన్నిప్రశ్నలడిగేసాను ఒకటేసారి.
“డోంట్ యూ రిమెంబర్ ఎనీథింగ్ ఎట్ ఆల్! ఐ వాజ్ సో వర్రీడ్, నిన్ను లోపలికి తీసుకెళ్ళాక నాకెవ్వరూ ఏం చెప్పలేదు.. ..”
” సారీ జూలియా! ప్లీజ్ ముందు స్టోన్స్ ఉన్నాయా, అవి అన్నీ తీసేసారా చెప్పు ప్లీజ్!”
” ఓహ్ యా, ముందు అసలు ఆయన స్టోన్స్ ఉండవనుకున్నారట. కానీ చిన్ని కెమెరా నీ నోట్లోనుండి, గొంతుద్వారా లోపలికి పంపించారు కదా, దాంట్లో మాత్రం చాలా స్టోన్స్ కనిపించాయట, ఆయన అన్నీతీసేసాననే చెప్పారు…..”
“రియల్లీ… సో నా ప్రాబ్లెమ్ తీరిపోయినట్టేనా? నేనిక కొంచెం కోలుకున్నాక మామూలుగా తినొచ్చా? ఐ యామ్ సో హ్యాపీ …”
“ఇపుడు సంతోషంగా వుంది కానీ నిన్న గంటయినా నిన్నుబయటకు తీసుకురాలేదు, ఆయనైతే ఇరవై నిమిషాల్లో అయిపోతుందని చెప్పారు కదా! బయటకొచ్చే నర్సులను అడిగితే ప్రొసీజర్ అవుతుంది అంటారు కానీ ఇంకా ఎంతసేపవుతుందో చెప్పరు. రెండు గంటలయినా రాకపోతే నాకు చాలా భయమేసింది, నీకేద యినా ఎమర్జన్సీ వస్తే హాస్పిటల్ హెలికాప్టర్లో వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళారేమో అని… నర్సులు బయటకు రాలేదు, ఎవరిని అడగాలో తెలియదు. శ్రీనివాస్ వచ్చి అడిగితే నేనేమని చెప్పాలా అనుకున్నాను. ఎంత భయపడిపోయానో. దాదాపు మూడు గంటల తర్వాత నిన్ను బయటకు తీసుకొస్తే నాకు ప్రాణం లేచి వచ్చింది. ఆయన వచ్చి గుడ్ న్యూస్ అని, చాలా స్టోన్స్ కనిపించాయని వాటిని చిన్నచిన్నముక్కలుగా కట్ చేసి తీయడానికి చాలా సమయం పట్టిందని, సెడెటివ్ అయిపోతున్నా కొద్ది మళ్ళీ ఇవ్వాల్సి వచ్చిందని, ఈ ప్రొసీజర్ వర్క్ అయితే నీ జీవితంలో ఇంక నొప్పి వుండదనిపిస్తుందని చెప్పారు. డూ యూ వాంట్ మీ టు కం టుడే డియర్?” అంది జూలియా.
నిన్ననే అంతసేపుంది పాపం అలసిపోయుంటుంది. ఈ రోజు కూడా స్నో సన్నగా పడుతుంది ఇంకా, మేయిన్ రోడ్లు క్లియర్ చేసినా లోపల రోడ్లు అంత త్వరగా క్లియర్ చేయరు.
రెస్ట్ తీసుకోని తనని పాపం! అవసరమైనపుడు వచ్చింది అంత సేపు వదిలిపెట్టకుండా కంగారు పడ్తూ వుంది.
“థ్యాంక్యూ జూలియా ఫర్ యువర్ హెల్ప్. నువ్వు లేకపోతే ఒక్కదాన్ని ఈ ప్రొసీజర్ చేయించుకోవడం కష్టమయ్యేది. కానీ నువ్వు తోడుగా వుంటే అంత కష్టమనిపించలేదు. ఈ రోజు ఏం వద్దులే. డాక్టర్ వచ్చి వెళ్ళాక ఫోన్ చేసి చెబుతాను ఆయన ఏమంటారో! సరేనా. గెట్ సమ్ రెస్ట్ టుడే! థ్యాంక్యూ వన్స్ అగైన్.”
” ఆర్యూ ష్యూర్ దుర్గా! ఐ కెన్ కమ్ ఇఫ్ యు వాంట్ మి టు కమ్,”
” నో జూలియా! ఐ యామ్ ఫైన్.”
” ఓకే డియర్. గెట్ సమ్ రెస్ట్. లవ్ యూ దుర్గా!”
“లవ్ యూ టూ!” అని ఫోన్ పెట్టేసా.
చాలా రిలీఫ్ గా అనిపించింది. నిజంగా ఇన్నిరోజుల నుండి ఇంత అవస్థ పెట్టింది ఈ రాళ్ళేనా? అయినా పాన్క్రియాస్ లో స్టోన్స్ అనే మాట నేనెపుడు వినలేదు. గాల్ బ్లాడర్లో, కిడ్నీస్లో రాళ్ళు వస్తాయి, చాలా పెద్దవి అయితే సర్జరీ చేసి తీస్తారు, చిన్నవి అయితే లాప్రోస్కోప్ ద్వారా తీస్తారు. మరీ చిన్నవయితే మందులతో కరిగిపోతాయని విన్నాను.
డా. కొవాల్స్కి వచ్చారు, “గుడ్ మార్నింగ్ దుర్గా! హౌ ఆర్యూ ఫీలింగ్ దిస్ మార్నింగ్?” అంటూ ఉత్సాహంగా.
“గుడ్ మార్నింగ్ డాక్టర్. నిజంగా మీరు అన్ని స్టోన్స్ తీసేసారా? మీరు ఉండవేమో అన్నారు, ఎన్ని స్టోన్స్ తీసారు? చాలా కష్టమయ్యిందా? నాకు మధ్య, మధ్యలో మెలుకువ వస్తుంటే అనస్థిషియాలజిస్ట్ మళ్ళీ సెడేషన్ ఇచ్చినట్టున్నారు కదా! మొత్తం ఎంత సమయం పట్టింది ప్రొసీజర్ కి?”
“ఇలాంటి పేషంట్స్ నే చాలా ఆసక్తి వున్న పేషంట్స్ అంటారు, ఎపుడెపుడు తగ్గుతుందా, ఎంత త్వరగా వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంటారు. నీ తప్పేం లేదు, ఇంట్లో చిన్నపాప ఉంటే అమ్మలకి అలాగే ఉంటుంది. నేను స్టోన్స్ ఉండవనుకున్నాను, కానీ లోపలికి చిన్న కెమెరా వెళ్ళిం తర్వాత కానీ తెలియలేదు ఎన్నిఉన్నాయో! అవి ఒకొక్కటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసేసరికి చాలా సేపయింది. ఐ థింక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ త్రీ హవర్స్. ఐయామ్ ష్యూర్ అన్నీ తీసేసాను. సో అదే సమస్య అందుకే అంత బాధ పెట్టింది. ఇపుడు అవి పోయాయి కాబట్టి ఇక నొప్పి రాకపోవచ్చు….”
“అయితే నేనింటికి వెళ్ళిపోవొచ్చా?” ఫోన్ మ్రోగింది. నేను ఎత్తాను, శ్రీని. “డా.కొవాల్స్కి మాట్లాడు తున్నారు. ఆయన వెళ్ళాక ఫోన్ చేస్తాను.” అని చెప్పి పెట్టేసాను.
“అంత తొందర పడితే ఎలా? చాలా పెద్ద ప్రొసీజర్ జరిగింది. దాంతో కొన్ని రోజులు నొప్పిగా ఉంటుంది. కొద్దిగా ఈ నొప్పి తగ్గింతర్వాత నువ్వు ఏదైనా తిని చూడాలి. అపుడు నొప్పి రాకపోతే నువ్వింటికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఫుడ్ నీకు పడ్తుందో లేదో మీ ఇంటి నుండి ఏదైనా తెప్పించుకుని తిను. సరేనా! రేపు నేను రాను. నువ్వు తిన్న తర్వాత నొప్పి రాకపోతే వచ్చి డిశ్చార్జ్ చేస్తా, ఓకే మేడమ్!” అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడు.
వెంటనే శ్రీనికి ఫోన్ చేసి ఆయన చెప్పిందంతా చెప్పాను.
“అయితే నేను చారన్నం కానీ పెరుగన్నం కానీ తెస్తాను నువ్వు తినే రోజు చెపితే.”
“ఎందుకులే! ఇక్కడ ఏదైనా వెజిటేరియన్ సూప్ లైట్ గా తీసుకుని చూస్తాను. అంత దూరం నుండి తెచ్చేవరకు చల్లగా అయిపోతాయి, మళ్ళీ నీకు పనెక్కువవుతుంది.”
“నాకు పనేం ఎక్కువ కాదు. నువ్వు అక్కడి సూప్ ట్రై చేస్తా అంటే అది నీ ఇష్టం. చైతన్యకి చెప్పాలి ఎంత సంతోషపడతాడో. సరే సాయంత్రం రావడానికి ప్రయత్నిస్తాను.”
“చూడు, జోన్ వస్తుందంటే సాయంత్రం ఉంటానంటే, స్నో పడకుండా ఉంటేనే రా. నాకేం పర్వాలేదు. నేను బాగానే వున్నాను.”
“నువ్వలాగే అంటావు. కానీ ప్రొసీజర్ అపుడు రాలేకపోయాను, అయ్యాక కూడా వచ్చి చూడొద్దా? నా మనసంతా అక్కడే.”
” నాకు తెలుసులే మనకి ఎట్లా వీలవుతుందో అట్లా చేసుకోవాలి. వీలయితే రా, నేనెందుకొద్దంటాను. నాకు మాత్రం ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలనేం లేదు, పిల్లలెట్లా ఉన్నారు? చిన్నది లేచిందా? రాత్రి సరిగ్గా పడుకుందా? విసిగిస్తుందా?”
“ఏం విసిగించడం లేదు హాయిగా పడుకుంది. ఒకోసారి బట్టలు తడిస్తే లేస్తుంది, బట్టలు మార్చి పాలు తాగిస్తే మళ్ళీ పొద్దునదాక లేవదు.”
“సరే నీకు పనుందేమో చేసుకో, నేను కాసేపు పడుకుంటాను. రాత్రంతా నిద్రలో అన్నీ పీడ కలలే. నిన్న సెడెషన్ ఎక్కువిచ్చారు కదా! ఇంకా మత్తుగా ఉంది. ఓకే బాయ్!” ఫోన్ పెట్టెసి పడుకున్నాను.
అక్కడ మేఘన్ అనే నర్స్ చాలా బాగుండేది నాతో! నేను పడుకుంటే తలుపేసేసేది.
మధ్యహ్నందాక మెలుకువ రాలేదు. లేచి బ్రష్ చేసుకుని, తల దువ్వుకుని జడ అల్లుకునే వరకు తల ప్రాణం తోకకొచ్చింది. జుట్టు చాలా పెద్దది, హాస్పిటల్స్ నూనె పెట్టుకోవటం, తలకి పోసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. చేతికి ఐ.వి కనెక్షన్ ఉంటుంది, టి.పి.ఎన్ కోసం పోర్ట్ చాతీ దగ్గర వుంటుంది. చేతులు కదపడం అంత సులువుగా ఉండేది కాదు. ఒకోసారి నర్సులను అడిగి జడ అల్లమనేదాన్ని.ప్రతిసారి అడగడానికి కుదరదు.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.