ఆరాధన-11 (ధారావాహిక నవల)

-కోసూరి ఉమాభారతి

జీవితం తిరిగే రంగులరాట్నము

          న్యూయార్క్ నుండి హూస్టన్ చేరి,  యధావిధి పనుల్లో మునిగిపోయాను. మెడిసిన్ చదువుతున్న మా అబ్బాయి సందీప్, తన స్నేహితురాలు కామినితో కలిసి హూస్టన్ కి వస్తున్నానని తెలియజేశాడు. బహుశా తనకి నచ్చిన అమ్మాయిని మాకు చూపించడా నికే’ అని సంతోషంగా అనిపించింది.  కాలేజీ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి శిల్ప కూడా సెలవలకి ఒకరోజు ముందే రానుంది. 

***

          మావాడి స్నేహితురాలు కామిని నాకు నచ్చింది. తెలుగమ్మాయే. లా-స్కూల్లో చదువుతుంది. ఇంతకీ కామిని గురించి సందీప్ ఎక్కువగా ఏమీ అనలేదు. అడగ్గా .. వారి నడుమ ప్రస్తుతం ఉన్నది స్నేహం మాత్రమే అన్నాడు.

          ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఆలోచనలు కలిసాయనుకుంటే కుటుంబాలకి తెలియజేసి పెళ్లి విషయంగా నిర్ణయం తీసుకుంటామంటూ నవ్వేశాడు. ఆ మాటలకు కాస్త నిరుత్సాహపడినా.. అదే సరయినదేమోనని మిన్నకుండిపోయాను.

          ఉన్న నాలుగు రోజులు కామిని మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. అందరితో కలిసి పోయింది. మా శిల్పతో  స్నేహంగా మసులుకుంది. మావారి పక్కన కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడేది. తన కుటుంబం గురించి చెప్పింది.

          సెలవలు అయిపోయి పిల్లలు తిరిగి వెళుతుంటే, ఎప్పటిలా మనసు దిగులుగా అయిపోయింది.

***

          స్టూడియో పనితో, నృత్య శిక్షణతో మళ్ళీ బిజీ అయిపోయాను.

          నా శిష్యురాలు శిరీష, హైదరాబాదులో వాళ్ళ అమ్మమ్మాతాతయ్య గార్ల సమక్షంలో, కూచిపూడి రంగప్రవేశం చేయాలన్న ప్రతిపాదనతో వచ్చింది. అదీ తాను మెడికల్ స్కూల్లో చేరేలోగా.

          తన ఆలోచన బాగుందని అభినందించాను. శిరీష కుటుంబం ఉత్సాహంగా ఉన్నారు. మరో యేడాదిలోగానే  హైదరాబాదు ప్రయాణం ఉంటుందని అంచనా వేశాము. 

***

          ‘సంభావామి యుగేయుగే’ అన్న కాన్సెప్ట్ రాసి.. కొన్ని అంశాలు ప్రత్యేకంగా కూర్చి, రెండున్నర గంటలైనా ప్రదర్శన ఉండేలా ప్లాన్ చేశాను. ఆరేడు నెలల పాటు శిరీషతో సాధన చేయించాను. 

          ప్రయాణానికి మరో నాలుగు నెలల సమయం ఉందనగా… ఉన్నట్టుండి కామిని తల్లితండ్రులు వచ్చి మమ్మల్ని గౌరవప్రదంగా కలిశారు. మా అబ్బాయి సందీప్ తో వారి కుమార్తె పెళ్లి విషయమై మాట్లాడారు. 

          సందీప్, కామినిలు నిశ్చితార్ధానికి సిద్దంగా ఉన్నారని, వారి ద్వారా కూడా తెలియడం ఆనందంగా ఉంది. అందరం కొత్త ఉత్సాహంతో నిశ్చితార్ధం ఏర్పాట్ల విషయంగా ఒక అంచనాకి వచ్చాము. 

          జరగనున్న  శుభకార్యం గురించి హైదరాబాద్ లోని మా అమ్మానాన్నలకి తెలియజేసాను. త్వరలో పిల్లల్ని తీసుకుని వారి ఆశీస్సుల కోసం వస్తానని చెప్పాను. 

***

          ఇండియాకి వెళ్ళిన మా చెల్లెలు తిరిగి వచ్చేప్పుడు, నిశ్చితార్ధ వేడుకకి… కాబోయే కోడలి కోసం నగలు, పట్టు చీరలు తెప్పించాను. కామినికి నచ్చిన  డైమండ్ ఉంగరం తీసుకున్నాడు సందీప్. 

          ఈలోగానే మా ఇరువురి కుటుంబాలు కొన్ని మార్లు కలుసుకున్నాము. చాలా అనందంగా సమయం గడిచిపోసాగింది. కామిని నా వద్ద సందీప్ కి నచ్చిన వంటకాలు నేర్చుకుని, వీడియోలు తీసుకోడం ముచ్చటగా అనిపించింది. ఆమె తల్లితండ్రుల ఆత్మీయత, అభిమానాలు మమ్మల్ని సంతోషాల్లో ముంచేశాయి. 

***

          నిశ్చితార్ధం చక్కగా జరిగింది. పెళ్ళికి మరో యేడాది సమయం ఉంటుందని నిర్ణయించారు పిల్లలు. అప్పటికి కామిని, సందీప్ ల చదువులు ముగుస్తాయని కాబోయే వధూవరుల ఆలోచన కాబోలు. పిల్లల నిర్ణయాలతో పెద్దవాళ్ళం ఏకీభవిం చాము. 

          కామిని తరుచుగా మా వద్దకు వస్తుండేది. మా అభిరుచులని అడిగి తెలుసు కుంటూ… సందడి చేసేది. 

***

          వేసవి సెలవల మొదట్లోనే శిరీష రంగప్రవేశానికి తేదీ ఖరారవడంతో, నాతో పాటు సందీప్, కామిని  కూడా  హైదరాబాదుకి బయలుదేరారు. మా నాలుగు పెంపుడు కుక్కపిల్లల్ని చూసుకునేందుకు మా వారు, శిల్ప ఉండిపోయారు. 

***

          వాద్యబృందంతో రిహార్సల్స్ అయ్యాక వారాంతంలో శిరీష రంగప్రవేశం బాగా జరిగింది. తనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ అమ్మాయి అమ్మమ్మ తాతయ్యలు, వారి బంధువర్గం చాలా సంతోషించారు. 

          నేను కార్యక్రమంతో బిజీగా ఉన్న ఆ వారం రోజులూ మా చెల్లెలి పిల్లలతో ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ చుట్టి వచ్చారు సందీప్, కామిని. బంధువులతో కామిని చక్కగా కలిసి పోయింది.

          మరో నాలుగు రోజులకి పెద్దవాళ్ళ ఆశీస్సులు అందుకుని సందీప్, కామిని తిరిగి అమెరికా వెళ్లిపోయారు. 

***

          నా తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉందనగా మా కమలత్త, రాఘవ మామయ్యలని చూసివద్దామని మా తమ్ముడు శివ, మరదలు వసుంధరతో బయలు దేరాను. అత్తయ్యా మామయ్యాలు మాకు బాగా సన్నిహితులు. వారి గారాల బిడ్డ వసుంధరే మా మరదలు. అమెరికాలో నివసిస్తున్న కొడుకు వద్దకి ఆరు నెలలు ఉందామని వెళ్ళిన అత్తయ్యావాళ్ళు మూడు నెలలకే వచ్చేశారని అన్నది అమ్మ. 

          దారి పొడుగునా వారి గురించే  చెప్పుకొచ్చారు తమ్ముడు, వసుంధర. కొడుకు సాయిరాంని వారు ఎంతో గారాంగా పెంచారని, అమెరికాలో చదివించేందుకు తమ పెద్ద ఇంటిని అమ్మేసి చిన్న ఇంట్లోకి మారారని మా అందరికీ తెలిసిన విషయమే. 

          సాయిరాం చదువు ముగించి ఆమెరకాలో ఉద్యోగంలో స్థిరపడ్డాక, కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో, తల్లితండ్రులకి తన పెళ్ళిఫోటోలతో పాటు.. ఓ సుదీర్ఘ లేఖ పంపాడుట సాయి. 

          తను ఒక స్పానిష్ అమ్మాయిని వివాహమాడానని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికీ తెలియ జేయకుండానే పెళ్ళి జరిగిపోయిందని రాస్తూ క్షమార్పణ కోరాడుట. కోపం పెట్టుకోకుండా తప్పకుండా తమ వద్దకి రమ్మని ఆహ్వానించాడట. 

          వాడి పెళ్ళి  కబురుతో ఎంతగానో క్రుంగిపోయిన అత్తయ్యా వాళ్ళు… మరో ఏడాదికి ఒకింత స్థిమిత పడ్డాక… సాయి వద్దకు బయలుదేరి వెళ్లారుట.   

          “అమ్మావాళ్ళు తిరిగివచ్చి రెండువారాలైనా, వాళ్ళు కాస్త తెరుకున్నాక వెళదామని ఇదిగో ఇవాళ బయలుదేరాము.” అంది వసుంధర. 

***

          వారి ఇంట్లోకి అడుగుపెడుతుంటే ఎదురుపడిన అత్తయ్య “ఉమా.. నిన్ను చూడ్డం సంతోషంగా ఉందమ్మా. రోజంతా ఇక్కడే గడపాలి మీరు, అమెరికా కబుర్లు బోలెడన్ని ఉన్నాయి!” అంది నవ్వుతూ. 

          మామయ్యని పలకరించి కబుర్లు చెబుతూ ఎదురుగా సోఫాలో కూర్చున్నాను.  పొద్దునే కాఫీ పెసరట్టుతో  మొదలయ్యాయి మా కబుర్లు. పెద్దగా ఉత్సాహం కనబడ లేదు అత్తయ్యా వాళ్ళల్లో. ఏదయినా…. అమెరికా విషయాలు చెప్పడం మొదలెట్టారు.

          “ఇక్కడ …..మన అలవాట్లకి, అక్కడి వారి జీవన విధానాలకి చాలా వ్యత్యాస ముంది. అన్నిటా అంతటి తేడా మేమస్సలు ఊహించలేదు. ఆహార విషయంలో ఒకింత ఎక్కువే ఇబ్బంది పడ్డాముకదూ.” అన్నారు మామయ్య … అత్తయ్య వంక చూస్తూ.

          “అవును, తిండి సయించక మా కోసం కాస్త వంట చేయబోతే.. చారుపొడి, ఎల్లిపాయ, ఉల్లిపాయ వాసనలు తమకి పడటం లేదని బియాంకా అనడంతో ఆ ప్రయత్నం మానేశాను. ఇక ఆ తరువాత ఇండియన్ హోటల్ నుండి వారానికి సరిపడా మా కోసం కూరలవీ తెచ్చి పెట్టేసేవాడు సాయి. 

          ఇక గమ్మత్తేమంటే.. మమ్మల్ని కూడా క్రమశిక్షణలో ఉంచేవారనుకో మా కోడలు బియాంక, ఆమె చెల్లెలు మారియం కూడా. మనవరాలితో.. దూరం నుండే మా ఆటలు, ముద్దులాటలు సాగాలనేవారు. సాయి వర్క్ నుండి వచ్చాకే మేము పాపని ఎత్తుకిని ఆడించేవాళ్ళం. మీ మామయ్య చదివే పుస్తకాలు, ఆయన చెప్పులు, స్వెటరు కూడా పైన మా గదిలోనే ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు ఆయన్ని హెచ్చరించేవారు బియాంక, మారియం.

          సెలవలకి వచ్చిన మారియం తిరిగి వెళ్ళిపోయాక, పరిస్థితి మెరుగయింది.” అని నవ్వేసింది అత్తయ్య … మామయ్య వంక చూస్తూ.  

          “సరేలే గానీ .. మా ఇబ్బందులు అలా ఉంచితే ప్రతి శనివారం మమ్మల్ని షాపింగ్ కి, గుడికి తీసుకొని వెళ్ళేవాడు సాయి. వాడితో గడిపిన ఆ సమయం ఎంతో విలువైనదిగా అనిపించేది. తన పని గురించే కాక సరదాగా మరెన్నో కబుర్లు  చెప్పేవాడు. హాయిగా నవ్వేవాడు. ఒక్క రెండు వారాలు మాత్రం సెలవు తీసుకొని, మమ్మల్ని కొన్ని చూడవలసిన ప్రదేశాలకి డ్రైవ్ చేసి తీసుకెళ్ళాడు. పసిదానితో ప్రయాణాలు ఒక్కోసారి ప్రయాసగా అనిపించినా సరదాగానే ఉండేవి. ఇకపోతే, అక్కడ వాళ్ళకి ఒక పెంపుడు కుక్కపిల్ల, ఒక పిల్లి పిల్ల ఉండడంతో .. పాపం కమల బాగానే ఇబ్బంది పడింది.”అన్నారు మామయ్య అత్తయ్య వంక చూస్తూ.

          వాళ్ళ అమెరికా అనుభవాలు నిరుత్సాహ పరచినా.. కబుర్లుతో  భోజనాలు కూడా అయ్యి సాయంత్రం నాలుగయింది. ఊరి నుండి క్రితం రోజు వచ్చిన మామయ్య చెల్లెలు లక్ష్మి..  టీ చేసి అందరికీ అందించి, ఎదురుగా మెట్ల మీద కూర్చుంది.  “ఇవన్నీ అలా ఉంచితే అసలు సాయిబాబు ఏమన్నా కాస్త వొళ్ళు చేసాడా వదినా?  అసలు వాడేమంటాడు? సంతోషంగా ఉన్నాడా?” అడిగింది లక్ష్మి. 

          “సాయిరాం చాలా కష్టపడుతున్నాడనిపించింది లక్ష్మీ నాకు. వాళ్ళ జీవన విధానం మాకు సంతృప్తినివ్వకపోగా ఎంతో బాధనిపించింది. ఇక కోడలు పిల్ల… నడుం నొప్పి వల్లనట. ఏ పనీ చేయలేక పోయేది బియాంక. సాయిరాం వర్క్ నుండి వచ్చాక ముందు పిల్లలకి స్నానాలు చేయించి, వంటింటి పనిలో మునిగి పోయేవాడు.” అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమైంది అత్తయ్య.

          ఆమెని వారిస్తూనే, “అలా ఇంట్లో ఆడవాళ్ళు చేయవలసిన పనులు కూడా వాడే చేస్తుంటాడమ్మా. వాడి జీవితం అలా ఉంటుందని మేమూహించలేదు. రాజాలా పెరిగినవాడు ఇలా పరాయి దేశంలో అగచాట్లు పడుతూ, రోజుకు పన్నెండు గంటలు పని చేయడమే కాక, ఇంటి పని, వంట పని, పిల్లల పని కూడా చేయవలసి రావడం చాలా బాధనిపించింది.” అంటూ తీవ్రంగా నొచ్చుకున్నారు మామయ్య.

          తమ ఇబ్బందులని సాయి వద్ద ప్రస్తావించి, వాడిని మరింత వొత్తిడికి లోను చేయడం ఇష్టం లేకనే తాము మిన్నకుండిపోయామని అన్నారు.   

***

          తమ కొడుకు ఇంట వారాశించిన ఆప్యాయత గాని, ఆదరణ గాని వారికి దక్కలేదని అర్ధమయ్యింది. ‘సంప్రదాయాలు, కట్టుబాట్లు, హోదా, పేరు ప్రతిష్టలంటే ప్రాణంగా భావించే ఆ పెద్దవాళ్ళకి ఇటువంటి అనుభవాలు, వాస్తవాలు మింగుడు పడని చేదునిజాలే అవుతాయి. విదేశీ చదువులు, పిల్లల వర్ణాంతర ప్రేమ వివాహాలు కొందరు తల్లితండ్రులకి జీర్ణించుకోలేనివిగా ఉంటాయి మరి.’ అనుకున్నాను.

          తాముతిరిగి స్వస్థలానికి వెళ్ళిపోయి, మిగిలిన తమ పదెకరాల బత్తాయి, మామిడి తోటని సాగు చేసుకోవడం మేలని కూడా నిశ్చయించుకున్నామన్నారు మామయ్య. 

          వాళ్ళు  చెప్పిన విషయాలు వారి మనస్తాపాన్ని సూచించాయి. వారి కలలు చెదిరిపోయాయి అనిపించింది. అంతా విన్న మాకు గుండెలు బరువెక్కిపోయాయి.  

          తమ ఒక్కగానొక్క బిడ్డకి బౌతికంగానే కాక మానసికంగా కూడా దూరమయ్యి,  వారసుడి జీవితాన తమకంటూ స్థానమే లేనట్టు భావించి చాలా కృంగిపోయారని పించింది.

***

          రాత్రవడంతో వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇంటి ముఖం పట్టాము. కారు స్పీడుగా సాగిపోతుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నాము. 

          “ఇలా కాలానుగుణంగా మారుతున్న పరస్పర మానవ సంబంధాలు, మారే విలువలు అంతగా అర్ధం కాని నాటి తరం వారు అత్తయ్యా,మామయ్య.” అన్నాను తమ్ముడితో.

          “అయినా ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న యువత, వారి తల్లి తండ్రులతో ఈ విషయం ముందే ప్రస్తావించడమే సబబు. ఏ కొడుకైనా తాను పెళ్ళాడబోయే యువతికీ…తన తల్లి తండ్రులకి మధ్య కాస్త పొంతన ఏర్పడేలా చిన్న ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.” అన్నాడు తమ్ముడు సీరియస్ గా. 

          “అవును, అప్పుడే స్వదేశీ కోడలైన, విదేశీ కోడలైనా, అత్తా కోడళ్ళ నడుమ సహవాసం కుదిరి జీవితం మెరుగౌనేమో!” అంది వసుంధర.

          మరునాడు పొద్దుట అత్తయ్యా మామయ్యల అమెరికా కబుర్లు అమ్మకి వినిపిం చాను. మౌనంగా విన్న అమ్మ.. “జీవితం అంటే తిరిగే రంగులరాట్నము అన్నది నిజం. సాయిరాంని ఓ యువరాజులా పెంచారు కమలావాళ్ళు. ఎందరో పిల్లలకి సాయిరాం ఒక స్పూర్తి. వాడు మంచి వాడే. ఆ దేశంలో ఉంటున్న వాడి జీవనవిధానం, అక్కడి పరిస్థితులని బట్టి వాడి నడవడి ఉంటుంది. ఎవరినీ తప్పు పట్టలేము. జీవితం ఎలా నడిపిస్తే అలా నడవాల్సిందే.” అంది అమ్మ తన ధోరణిలో.

*****

(సశేషం)

Please follow and like us:

One thought on “ఆరాధన-11 (ధారావాహిక నవల)”

  1. నమస్తే మేడమ్
    మీరు వ్రాసిన ‘ఆరాధన’-11 ధారావాహిక నవలలో ‘ ‘జీవితం తిరిగే రంగుల రాట్నం’ లో ఈ కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోబోయే యువత వారి తల్లిదండ్రులకు ముందుగానే చెప్పటం మంచిది. స్వదేశీ కోడలైనా, విదేశీ కోడలైనా అత్తా కోడళ్ళ మధ్య అవగాహన అవసరం. నవల చాలా బాగా రాశారు.
    ఆసక్తికరంగా సాగుతుంది. అభినందనలు మేడం

Leave a Reply

Your email address will not be published.