జీవితం అంచున -31 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
ఎయిర్పోర్ట్ కి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కారులో కాశి కూడా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బహూశా కాశి నాకు దొరికడం నా అదృష్టమే. నాకు వయసు మీద పడటం వలననో, అమ్మ మానసిక అస్వస్థత కారణంగానో తెలియదు కాని నాలో ఇదివరకెన్నడూ లేని డిపెండెన్సీ ఎక్కువయిపోయింది. ప్రతీ చిన్న పనికీ కాశి పైన ఆధారపడటం అలవాటయిపోయింది. అమ్మను మెడికల్ చెకప్ లకు తీసుకువెళ్ళాలన్నా, అమ్మాయిలకి సంబంధించిన ఏదయినా పెద్ద పెద్ద షాపింగ్స్ అయినా, తెలియని చోటికి గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్ళాల్సి వచ్చినా, అన్నింటికీ నాకు తోడుగా కారులో కాశి రావలిసిందే. తోడబుట్టని తమ్ముడిలా చేదోడూ వాదోడు అయ్యాడు.
అమ్మను పసిపిల్లలను కాచుకున్నట్లు అనుక్షణం కాపు కాయాల్సి వుంటుంది. బాల్కనీలో పిట్టగోడపై చేతులాన్చి అమ్మెప్పుడూ ఎదురింట్లో పార్కయిన ఎర్రకారు వంక చూస్తుంది. తన కారు ఆ ఇంట్లో ఎందుకుందని అడుగుతుంది. తనకు ఎరుపు రంగులో WagonR వుండేది. ఎర్రకారు అమ్మేసి పదేళ్ళయ్యిందంటే అపనమ్మకంగా నా వంక చూసి నిస్సత్తువగా మేను వాలుస్తుంది. నిద్ర లేచి తాజాగా మళ్ళీ అదే కారు వంక చూసి మురుస్తుంది. ఆ మతిమాలిన మురిపెం నాకెంతో ముద్దొస్తుంది.
స్నానమయిన ప్రతిసారి అమ్మ కాటుక బరిణ కోసం వెతుకుతుంది. తన కాటుక దొంగిలించిన వారిని శాపనార్ధాలు పెడుతుంది. హడావుడిగా వెతికేసి నేనో కొత్త బరిణ తెప్పిస్తానా, మర్నాటికి అది మాయం. అమాంతం వచ్చే కోపాన్ని నిభాయించుకుని అమ్మ పోగేసిన బరిణలన్నీ వెతకటానికి సమయం లేనందుకు నిట్టూరుస్తాను.
అమ్మ అల్పాహారం అయ్యాక ఆరు మాత్రలు ఇచ్చి ఎదురుగా నిలుచుంటానా.. ఫోనులో మాటాడుతూ అరక్షణం దృష్టి మరల్చినా కనురెప్ప పాటులో ఆరు మాత్రలూ మింగేసానంటుంది. ఇక్కడ అపనమ్మకంగా చూడటం నా వంతవుతుంది. తను చిద్విలాసంగా లేచి వెళ్ళిపోతుంది. నమ్మకం కుదరని నాకు సోఫాలతో కుస్తీపట్లు మొదలవుతాయి…
కాశీ సాయంతో అమ్మను జాగ్రత్తగా మ్యానేజ్ చేస్తూ ప్రశాంతంగా జీవితం సాగుతోంది.
పుస్తకావిష్కరణ కోసం రవీంద్రభారతిలో తారీఖు ఖరారు చేసుకున్నాను. ఆంగ్ల అనువాదకుని అలసత్వమో, అతని సమయాభావమో… కారణం ఏమయినప్పటికీ ఎడారి చినుకు ఇంగ్లీషు వర్షన్ సిద్దం కాలేదు. నా తెలుగు వర్షన్, అంతక్రితం పబ్లిష్ అయిన కథాసంపుటి ‘చీకటి వెన్నెల’ తో పాటు ఆవిష్కరించడానికి వేదిక సిద్ద మయ్యింది.
రవీంద్రభారతి ఆడిటోరియం. అంతా సందడిగా వుంది. అప్పటికే ‘ఎడారి చినుకు’ అంటూ చిన్న చిన్నటీజర్స్ రిలీజ్ చేయడం వలన, ఇది యదార్ధగాధ అని ముందుగానే పాఠకులకు చెప్పడం వలన అది పాఠకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఆ వైబ్ అంతా ఆడిటోరియంలో కనిపిస్తోంది. నారాతలు క్రిస్టల్క్లియర్. అది అందరికీ తెలిసిన విషయమే. నాలోని చెడును దాచాలనో, మంచిని విప్పి చూపాలనో ప్రయత్నం ఎప్పుడూ చేయను. నేను రాసేప్రతి వాక్యమూ నా ప్రతిబింబమే.
నా రాతల్లో నినిజాయితీని ఇష్టపడే వాళ్ళూ, నా రచనల్లోని చమక్కుని మళ్ళీమళ్ళీ చదువుకునే వాళ్ళూ, నా పుస్తకాల కోసం ఎదురు చూసేవాళ్ళూ నాకంటూ ఒక అభిమాన వర్గం వుంది. అలాంటి బోలెడుమంది అభిమానులతో ఆ నాటి ఆడిటోరియం క్రిక్కిరిసిపోయింది.
సహజంగా ఇలాంటి సాహిత్య సభలకి దూరప్రాంతాల నుండిరారు. కాని ఆ రోజు హాజరుఅయ్యారు. వాళ్ళకి తెలుసు, నా అన్ని నవలల్లానే ఇదీ నా జీవిత భాగమేనని. ఆడిటోరియంలో చిట్ట చివరి వరుసలో కూర్చొన్న ఒక వ్యక్తికళ్ళు నా జాకెట్టుకి వెనుక ‘బో’లాకట్టిన తాళ్ళచివర చిరుగంటల నృత్యం చుట్టూ చక్కర్లుకొడుతున్నాయని, అతని లయ తప్పిన గుండెను చిక్కబట్టుకుని మరీ నన్ను గమనిస్తున్నాడని నాకు తెలియదు.
ఉపన్యాసాల పర్వం ముగిసి సభ నా స్పందనవరకూ వచ్చింది. నేను మాట్లాడాను. మనవరాలినే కూతురిగా పెంచుకుని ఆమేలోకంగా జీవిస్తున్న నా చివరి రోజుల ఉద్విగ్నతే ఆ రోజు ఆవిష్కరిస్తున్న నా దీర్ఘకవిత అని చెప్పాను. ఆ పుస్తకం త్వరలోనే ఆంగ్లంలోకి అనువాదం అవ్వబోతున్నట్టు ప్రకటించాను. రాయడానికి ప్రేరణ కలిగించిన నా మనవరాలికే ఆ అనువాదాన్ని అంకితం ఇవ్వబోతున్నట్టు కూడా చెప్పాను. నచ్చిన టీచర్ పాఠం చెప్తున్నప్పుడు, పిల్లాడు విన్నంత శ్రద్ధగా చివరి వరుసలోని ఆ పాఠకుడు వింటున్నాడని నాకు తెలియదు. బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా సభ ముగించాను.
*****
(సశేషం)