ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..!

(నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రథమ బహుమతి -నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

– బి.కళాగోపాల్

ఉంగా రోదనతో నెత్తుటి పిండాలకు జన్మనిచ్చిన అమ్మతనం
ఇపుడు కాన్పు కాన్పుకూ నోట్ల కట్టల బరువును మోసే ఓ అవాంఛనీయ కేంద్రం!
సూదిమందులు బలం గోలిలతో నిండా ఇరవై ఏళ్ళైనా లేని
సమీనా సన్నని నడుంచుట్టూ నలుగురు పిల్లల్ని కట్టి
లేవనీయకుండా చేస్తున్న బాలింతనాల సెడేషన్ ను చూసి కాలం కసిగా నవ్వుతోంది
సర్కారు దవాఖానాల ప్రసూతి చారికలకు ప్రకటించే నజరానాలు
పాలకులు మూడో బిడ్డకు నాలుగో బిడ్డకు ఇంతింతని నిర్ణయించేసిన అంకెల గారడీ పథకాలు
ఎందుకూ పనికిరాని కాయితం ముక్కపై రాసిన తప్పొప్పుల పట్టికలో
పొరలు పొరలుగా పాలిపోతున్న రక్తహీన దేహాల్ని
లేబర్ రూం బరిలో నిల్పుతున్న పురుషమతాలు
ఆధార్ కార్డులో వయసు మార్పించి చేయిస్తున్న షాదీ సోదాలు
కన్నెగుండెల్లోపట నిండు బురఖాల దుఃఖాలాపన
కాళ్ళు గుంజుడు నడుం పీకుడు రొమ్ముల సలపరంతో
తనబ్బీల కూలీపైసల డబ్బీ అరిగిపోయిన ఆఠాణా బిళ్ళను జారవిడిచింది
నలుగురు పిల్లల్ని సాదలేక బట్ట మార్చుకునే దాపులేక
‘దాన్ని వదిలించుకొనడమే’ అసలైన విముక్తి అనే కసాయి కార్చిచ్చు కవ్విస్తుంటే
దోపిడీ దళాల స్వైర విహారాలలో ఆకుపచ్చ పరదాల అంధకారం మాటున
వాహికలు కత్తిరించిన బచ్చేదాని దాచిన కాసిని కన్నీళ్ళు
ఎప్పుడు అవసరం పడతాయో నీకు తెలియదానని గద్దిస్తున్న ఖాందానీ హుకూమత్ కు తలొగ్గిన షాకిరాలు
వయసైపోయిన గర్భసంచిలోని రక్తం ఇంకా బిడ్డలుగ మార్చలేని
నిస్సహాయ ప్రకటనపై ఎక్కుపెట్టిన షరియా కత్తుల ఉచ్చు సరేసరి!
కానరాని హింస అంతులేని ప్రమాదం అంచున
అలసిన ఆడదేహాలే ఆటవికుల ఆటస్థలాలు
దేశం ఏదైతేనేం పుడుతూనే పుస్తెలు మెడలో వేసే పసుపుతాళ్ళ ఆట
మ్యీసార్ నిఖాలు ముక్కుపచ్చలారని లేడిపిల్లల దైహిక స్వేచ్ఛను
అపహరిస్తున్న ఉన్మాదుల ఇనుప ఊచల కారాగారాల్లో బందీలవుతున్న చౌదువీ కా చాందినీలు
ఎండోమెట్రియం పొరల కింద దాగిన మూలుగులు ముడతలు
లేబర్ రూంలో సైలెన్ బాటిల్సూ ఎనీమా ఎక్కిస్తున్న నర్సమ్మ
‘ఇది ఎన్నో కాన్పని’ ఎక్కిరించే మాటల ఈటెల్ని ఓర్సుకుంటూ
ఇంకా ఎంతకని ఉత్పత్తిని పునరుత్పత్తి చేస్తుందీ శరీరం?
ఇంకా..ఇంకా..ఎంతకని ఓపికను శక్తిని కూడదీసుకుంటుంది నీకోసం?
బిడ్డల్ని కనీ కనీ బలహీనమైన మా బచ్చేదాని మీకొక అగ్గువ సరుకు
మాతృత్వం, ప్రేమ ఈ దోపిడీ చుట్టూ అల్లిన అందమైన సాలెగూడు
ఎరుపెక్కిన ఆకాశాన్ని పొదవుకున్న కన్నీటిపుండు బచ్చేదాని
శ్రమా చెమటచుక్కలతో బిడ్డల్లేని ధనిక దంపతులు తమ జాతిని కొనసాగిస్తుంటే
జిడిపి వృద్ధిలో కనిపించని అమ్మతనపు చేతుల శ్రమను
విశ్వం విశ్వసించేలా వంచించే గణాంకాలు
గన్నేరు విషాన్ని ఆడపిండాల్లోకి దిగ్గొడుతూ వద్దనుకున్న కోట్ల చందమామల్ని మెలిదిప్పి చిదిమేస్తూ
రేపటి జనాభా నిష్పత్తి అసమతౌల్యతలో
మమ్మల్ని మొత్తంగా చెరిపేసి ఏమిలేనితనంతో బానిస బందీలుగ చేసే కుతంత్రాలు!
మా రక్త మాంసాల్నీ ఆఖరి సత్తువను జలగల్లా మీరు పీల్చేసే
ఈ దోపిడీ తీరు మారింది గానీ..తప్పించుకోలేని మూసలో బిగించబడిన
మా బచ్చేదానికి మాత్రం విముక్తి దక్కలేదు
మా గర్భకుహరాలను తొలిచి తల్లిపాల సారంతో పుట్టి పెరిగిన
సమాజ జీవుల్లారా!దయచేసి ఇంకేమాత్రం మా బచ్చేదానికి వెలకట్టకండి
నేడు అమ్మతనమంటే అమ్మకమో అడుక్కోవడమో కాదని
అది మా ఆత్మగౌరవ హక్కుల్లో ఒకటని అక్కున చేర్చుకున్నాం
ఋతుధర్మానికి అపవిత్రతను ఆపాదించి అసహ్యించుకునే మరగుజ్జుతనం
నాడు చీడనీడై పాకిన యుగస్ప్రహను దాటుకొని
తల్లి గర్భపు నెత్తుటిదారి మోసిన వేల జీవాల బరువులో
లోకమంతా నిండుకున్న మూలకణ దేహాలకు
ఆ అమ్మతనమే కదా! ఎరుపు మెరుపై ఆయువు పోసింది
అందుకే ప్రకృతికి ఒక ప్రకటన ఇస్తున్నా
“ఈ అమ్మతనం అద్దెకివ్వబడదని”..ఎలాంటి షరతులూ వర్తించవని..!!

 

*****

One thought on “ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..! (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రథమ బహుమతి -నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)”

  1. తల్లి గర్భపు నెత్తుటిదారి మోసిన వేల జీవాల బరువులో
    లోకమంతా నిండుకున్న మూలకణ దేహాలకు
    ఆ అమ్మతనమే కదా! ఎరుపు మెరుపై ఆయువు పోసింది
    అందుకే ప్రకృతికి ఒక ప్రకటన ఇస్తున్నా
    “ఈ అమ్మతనం అద్దెకివ్వబడదని”..ఎలాంటి షరతులూ వర్తించవని..!!

    అద్భుతం చాలా బాగుంది మేడం. వందనం అభివందనం!!

Leave a Reply

Your email address will not be published.