
ఒకటే అలజడి
-గవిడి శ్రీనివాస్
అలసిన సాయంత్రాలు
సేదీరుతున్న వేళ
మంచు వెన్నెల కురిసి
చల్లని గాలుల్ని ఊపుతున్నవేళ
నాతో కాసేపు ఇలానే మాట్లాడుతూ వుండు
అలా నా కళ్ళల్లోకి ప్రవహిస్తూ వుండు
సమయాలది ఏముందిలే
మనసు కాసింత ఊసులతో
కుదుటపడ్డప్పుడు .
ఈ క్షణాల్ని ఇలానే
పదిల పరచుకొంటాను.
నీతో మాట్లాడుతుంటే రేగే
అలజడిని ఆస్వాదిస్తాను.
గుప్పెట్లో కాసిన్ని
చిరు నవ్వుల్ని వొంపెయ్.
అవి మల్లె లై వికసిస్తుంటాయ్.
అలా కదిలే మేఘాల్ని చూడు
మనల్ని బంధీ చేసినట్టు లేదూ…!
నా కలల ప్రపంచం లో అలజడి రేపి
ఎలా నిద్ర పోతావ్.
నీ పరిమళాల స్పర్శ లేకుండా
ఎలా జీవించమంటావ్.
నువ్వు నేను వేరుకాదు.
ఇప్పుడు
నువ్వు నేను ఒక్కటైన దృశ్యం గా
ఒకటే అలజడి….!
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
