గట్టిగా స్వచ్చంగా నవ్వుతున్న పుట్టపర్తి నిర్మల వదనంలో ఏదో తెలియని ఆకర్షణ, వల్లంపాటిని నిరుత్తరుణ్ణి చేసింది.
నాన్నెప్పుడూ అంటూ ఉంటారు. సౌందర్య లహరిలో ‘శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం.. ‘ అనే శ్లోకం నిరంతర పారాయణం చేస్తూ ఉంటే, వాక్ శక్తినిస్తుందట ఆ తల్లి! ఆ కరుణ పుట్టపర్తి పై నిండుగా వర్షిస్తున్నదా జగన్మాత!’ అనుకుంటూ, వారికి పాదాభివందనం చేశాడు వెంకట సుబ్బయ్య.
‘అరెరే! ఇదెందుకురా మధ్య?’ నవ్వుతూ ఆపేశారతన్ని.
‘ఇంతకూ నువ్వొచ్చిన పనేమిట్రా?’ అడిగారాయన, చాప మీద కూర్చోమని సైగ చేస్తూ!!
ఇంతటి సరస్వతీ పుత్రుని ముందు తాను వచ్చిన పని చెప్పాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది వల్లంపాటికి!
‘పెద్ద పనేమీ కాదుగానీ, ఇప్పుడు మీరేమి చదువుతున్నారు స్వామీ?’ అనేశాడు.
‘ఏముందిరా! ఏమి చదువుతున్నా, నేను వీళ్ళకంటే అద్భుతంగా ఏమి చెప్ప గలనా? అన్న ఆలోచనే నా కలానికి సంకెళ్ళు వేస్తూ ఉంటుంది. ఈ ఉత్తర హరి వంశం చదువుతున్నానిప్పుడు..ఎంత అద్భుత కల్పనలో! నాచన సోమన బుక్కరాయల నుండీ అగ్రహారాలు దానం కింద తీసుకున్నాడు. అంటే రాజును అంతగా మెప్పించినాడనే కదా అర్థం? తిక్కన కంటే కవిత్వ పటిమలో ఒక్క పిసరు ఎక్కువగానే తోస్తుందితని కవిత్వం అని పండితులంటున్నారు. కొన్ని పద్యాలు చూస్తే అట్లనే అనిపిస్తుందిరా! ఇదిగో యీ సూర్యోదయ వర్ణన ఎంత బాగుందో!’
తానందుకున్న పుస్తకంలో అక్కడక్కడ పుట పై భాగం కొసన మడత పెట్టుకున్న ట్టుగా ఉంది స్వామి. చటుక్కున తీసి, గొంతెత్తి చదవటం మొదలెట్టారు. ఎంత గంభీర గాత్రమో వారిది!
సీ. కుంకుమ హత్తించి కొనగోర దీర్చిన
పురుహూతునిల్లాలి బొట్టనంగ
జక్రవాకములకు జల్లగా మందు ద్రా
గించిన చెంద్రంపు గిన్నె యనగ
బార్వతీ పతికి బ్రభాత భూపతి గొన్న
యలరు కెందమ్మి కోహళి యనంగ,
దొలి దిక్కు తొయ్యలి చెలులపై జల్లంగ
నిండ ముంచిన పైడి కుండ యనగ
తే. మేరు ధరణీ ధరంబుతో మేలమాడ
నుదయగిరి రాజు తల యెత్తెనో యనంగ
గ్రమముతో నించుకించుక గాన నగుచు
భాను బింబంబు కన్నుల పండువయ్యె.’
తెల్లవారగానే కృష్ణుడు ద్వారకకు వస్తున్నాడు. కాబట్టి సూర్యోదయ వర్ణన ఎంతో ప్రత్యేకమిక్కడ! పురుహూతుని ఇల్లాలు కుంకుమ బొట్టుగా, చక్రవాక పక్షులకు విరహ తాపాన్ని తగ్గించే ఔషధాన్ని కలిగిన రాగి పాత్ర వలె, పార్వతీ పతికి ప్రభాతమనే సామంత రాజు అందించిన ఎర్రని తామర మాదిరి, చివర తొలి దిక్కు కాంత తన చెలికత్తెల మీద పోసేందుకు సిద్ధంగా ఉంచుకున్న వసంత ద్రవ్యం నింపిన బంగారు కుండ వలె..యీ విధంగా క్రమోన్నతితో ఎంత అద్భుతంగా వర్ణించినాడో సోమన!!
ఒక్కొక్కప్పుడనిపిస్తుంది, యీ సీమ కవులే ఎక్కువగా విజయనగర రాజుల మనసు లను దోచుకున్నారా అని! పెద్దన కోకట అగ్రహారం వాడని ఎక్కువమంది అభిప్రాయం. ధూర్జటిది పొత్తపి. మల్లనలో ప్రవహించేది పుష్పగిరి రక్తం. రామభద్రుడు ఇక్కడివాడే! పింగళి సూరన, సరే , కర్నూలు వాడు. రామరాజ భూషణుడి సంగతి చెప్పేదేముంది? వీళ్ళందరినీ చదువుతుంటే, రాజుల కాలం నాటి జీవితం ఎంత అద్భుతంగా ఉండేదో అనిపిస్తుందిరా! ప్రతిభకు పట్టం కట్టేవాళ్ళారోజుల్లో!! ఇప్పుడు ఎటు చూసినా ప్రాంతీయ భేదాలు! నువ్వే జిల్లా వాడివి? నీకెంత మాత్రం కవిత్వం వ్రాయడం వచ్చు? మాముందు నువ్వెంత? ఇటువంటి పోకడలే కవుల్లోనూ కనిపిస్తూ ఉంటే, ఆ కవులందరూ మావాళ్ళే కదా! మరి మమ్మల్ని యీవిధంగా అడగడానికి అర్థమేమిటి? ‘అనాలనిపిస్తుంది.’
వారి మాటల్లో ఒక విధమైన బాధ ధ్వనించింది.
ఇప్పుడింక తాను వచ్చిన పని గురించి చెప్పడానికి సాహసించలేక, వల్లంపాటి పుట్టపర్తి వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు.
***
మొదటి, రెండవ అల్లుళ్ళ కడప విడిది ముగిసి, వాళ్ళిద్దరూ అటు వెళ్ళగానే, మళ్ళీ పుట్టపర్తి తన గదిలో మిద్దె మీద కొలువైనారు. ఈలోగా నాగ రామకృష్ణా హైస్కూల్ లో 6వ తరగతి కోసం చేరిపోవటం జరిగింది. సీతారామయ్య వీధి బడి నుంచీ పెద్ద స్కూల్ లో ప్రవేశం, తనకు మహా సంబరంగా ఉన్నట్టుంది.
తన గదిలో పుట్టపర్తి వ్రాసుకుంటూ ఉంటే, నాగ ఉత్తరమొకటి పట్టుకు వచ్చింది. ఎక్కడినుంచీ వచ్చిందో చూశారాయన! బాలమురళీ కృష్ణ అని ఉన్నది. నాగ ఇంకా అక్కడే నిలుచుని ఉంది, కుతూహలంగా అయ్యవైపు చూస్తూ!
బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీత సుప్రసిద్ధ గాయకుడు. అతను విజయవాడలో శాస్త్రీయ సంగీత విభాగంలో పనిచేసేటప్పుడు, ఒకసారి తాను అక్కడ కవి సమ్మేళనానికి వెళ్ళటం, అక్కడ అతన్ని కలవటం మంచి జ్ఞాపకం. అతనితో ఎన్నో సంగీతానుభవా లను పంచుకోవటం తనకింకా గుర్తుంది. పుట్టపర్తి ముఖంలో ఒక సంతోష రేఖ.
ఇన్ లాండ్ లెటర్ తెరుస్తూ ఉంటే, నాగ అడిగింది,’ఎవరినుంచయ్యా జాబు?’ అని!
‘బెజవాడలో బాలమురళీకృష్ణ అని పెద్ద సంగీత విద్వాంసుడున్నాడు. నీకు గుర్తుందా? నువ్వూ ఒకసారి నాతో వచ్చినట్టున్నావ్? వాళ్ళింటికి పోయినాము. అక్కడ నీళ్ళ తొట్టిదగ్గర జారి పడి ఒకటే ఏడుపు నువ్వు! ఆయన నిన్ను సముదాయించి, చాక్లెట్ ఇచ్చినాడు కూడా!’
నాగ ముఖంలోనూ వెలుగు! ఔనయ్యా, గుర్తుంది. ఆయనా మీరూ కలిసి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారారోజు! మా ఇంట్లో పిల్లలందరికీ సంగీతం నేర్పించటం ఒక సంప్రదాయమనీ, కరుణక్కయ్యా, తరులతక్కయ్యా బాగా పాడుతారనీ, ఇంకా నేను కూడా సంగీతం నేర్చుకుంటున్నాననీ మీరు చెబితే ఆయనోపాట పాడమన్నారు. నేను చీమలో బ్రహ్మలో..అని రాగం తీసేసరికి..ఆయన..’ అంటూ ఆగిపోయింది నాగ సిగ్గు పడుతూ!
‘అరెరే! భలే గుర్తుందే నీకు! ఆ..ఆయనే వ్రాశారు ఉత్తరం. సరేగానీ, నీ చదువు బాగుందా?’ అయ్య ప్రశ్నకు, తల అటూ ఇటూ ఊపేస్తూ, స్కూల్ డేకు ఎవరైనా పాటలు పాడేవాళ్ళూ, డాన్స్ చేసేవాళ్ళ పేర్లు ఇమ్మన్నారు సర్. నేనూ పేరిచ్చినాను.’ అంది గొప్పగా!
ఇప్పుడు స్కూల్ లో చేరి, అప్పుడే స్టేజ్ మీద పాటలు కూడా పాడుతానని పేరివ్వట మూ కూడానా?’
మురిపెంగా అన్నారు పుట్టపర్తి.
‘నేను ముందివ్వలేదయ్యా! కొండప్ప సారు దగ్గర సంగీతం నేర్చుకుంటున్నానని హనుమంతరావు సార్ కు తెలుసంట! ఇంకేముంది? వాళ్ళే నా పేరు రాసుకున్నారు.’
‘ఓహో! ఐతే సరేలే! అమ్మనడిగి కాఫీ తీసుకురా పో!’
తుర్రుమని వెళ్ళిపోయింది నాగ.
***
చిలుక ద్వాదశి రోజు. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టి, శాస్త్రోక్తంగా పూజ, శ్రీ సూక్త, పురుష సూక్తాలు చెప్పుకుని, తులసి చెట్టు మొదల్లో పెట్టిన లక్ష్మీనారాయణ విగ్రహాల మీద పూలు, అక్షతలూ వేసి, పాటందుకుంది కనకమ్మ.
బృందావనమే మందిరమైన ఇందిర శ్రీ తులసీ!
నందనందనుని ప్రియ సతివై అందముగా మా ఇంటను నెలకొన్న…. బృందావనమే…
- గృహమునకందము బృందావనమూ దేహమునకు తులసిదళమూ
నీవున్నదె నందనవనమౌను నీ దళసేవయె రోగహరమూ… బ్రందావనమే..
- పడతులు తీర్కాణ ద్వాదశినాడూ నడిమింటను నిను కొలువుంచీ
పట్టుచీరె కట్టి బొట్టుకాటుక పెట్టి సుష్టుగ పూల పూజించెదరమ్మ…. బృందావనమే..
- వరలక్ష్మీ! శ్రీతులసీ! నీ యెడ పరమ భక్తులౌ పడతులకెల్లను
ఇష్టమాంగల్యములిచ్చి బ్రోచెదవు అష్టాక్షరి నాయకి ! దరహసితే! .. .బృందావనమే….
అమ్మ తన్మయత్వంతో పాడుతూ ఉంటే, తానూ భక్తిగా కళ్ళు మూసుకుని కూర్చుని వుంది నాగ. పాట పూర్తయింది. టెంకాయ తెచ్చుకోలేదని గుర్తుకు వచ్చింది కనకమ్మకు!
‘ఇదిగో నాగా! ఎదురింటి కోమటి అంగట్లో టెంకాయ తీసుకునిరా పో!’
*****
(సశేషం)