
దీపం వెలిగించాలి
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– ములుగు లక్ష్మీ మైథిలి
ఒక పాలు గారే చందమామను
రాహు, కేతువులు మింగివేసినప్పుడు
కూడలిలో నాలుగు కొవ్వొత్తులు
వెలిగించినపుడు వెన్నెల కాంతి వెదజల్లదు
కొన్ని గొంతులు కలిసి ఆక్రోశిస్తూ
న్యాయం కావాలనే నినాదాలతో
రోడ్డెక్కి దిక్కులు దద్దరిల్లేలా అరిస్తే
భీతిల్లిన బాధితుల ఆక్రందనలు ఆగిపోవు
అమ్మల పేగులు మెలిపెట్టినపుడు
మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తే
కడుపులో రగిలిన చిచ్చుతో
జవాబులన్నీ నిప్పురవ్వలే చిమ్ముతాయి
ఆరిపోయే దీపాన్ని వెలిగించటానికి
సమాజం శాయశక్తులా కృషి చేయాలి
మాతృవనంలో రేపటి తరాన్ని అందించే
మరి కొన్ని పసిమొలకలు రాలిపోకముందే
మనిషి అనేవాడు జాగృతం కావాలి
తనకు జన్మనిచ్చిన తల్లి సాక్షిగా
మాతృమూర్తుల కన్నీటిబొట్లు
భూమితల్లి మీద పడకముందే
జనాల మధ్య యదేచ్ఛగా తిరుగుతూ
మానవత్వం పూర్తిగా మరిచిపోయిన
మృగాళ్ళను సమూలంగా అంతం చేయాలి
అశృనివాళితో మాత్రమే
దీపాలు వెలిగించడం కాదు
అనుబంధాల కోవెలలోని
దీపాలను కొడిగట్టనీయకుండా
మనమంతా రక్షణ కవచమై నిలబడి
రాకాసి గాలులకు రెపరెపలాడుతున్న
ఆయువును ఆరిపోనివ్వకుండా చూడాలి
కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుతూ
మానవత్వపు చమురుపోసి
నలుదిక్కులా ఊపిరి వెలుగులు నిండేలా
నట్టింటి ప్రాణదీపాలను వెలిగిద్దాం!
*****

ములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు గుసగులాడే కవితాసంపుటాలు, 50 కథలు ప్రచురణ అయ్యేయి.
