కనక నారాయణీయం -80

పుట్టపర్తి నాగపద్మిని

కనకమ్మకు జాలి తోసుకుని వచ్చింది. పాపం, ఈ సారైనా ఆ అట్ట జడేదో వేయించాల్సిందే దీనికి! చాలా సార్లు మల్లె పూల వంకీ జడలు వేస్తూనే ఉంటుంది తను నాగకు! తులజకైతే యీ పూల జడలవీ అంత కాబట్టవు. నాగకివన్నీ మహా ఇష్టం. రాధ ఇంకా యీ జడల స్థాయికి రాలేదు. ఈ ముచ్చటంతా నాగదే ప్రస్తుతానికి! కానీ అమ్మవారి శాల దగ్గర కుట్టే యీ తరహా జడల వెల కూడా ఇరవై రూపాయలదాకా ఉంటుంది. అంత డబ్బు జడకోసం పెట్టాలంటే మాటలా? పైగా మూర్తీ స్టూడియోలో ఫోటో కూడా! అన్నీ కలిపితే ముప్ఫై రూపాయలదాకా ఖర్చు. అదే పది రూపాయలకే మల్లె, కనకాంబరాలు, మరువం, దవనం అన్నీ వస్తాయి. ఓపిగ్గా ఇంటి దగ్గరే వేస్తే, తృప్తికి తృప్తీ! డబ్బూ మిగులుతుంది. పిల్లలకేమి? ఏదైనా అడుగుతుంటారు. ఇంటి పరిస్థితి వీళ్ళకేమి తెలుస్తుంది? దాదాపు ఒకే సారి ఇద్దరాడ పిల్లల పెళ్ళిళ్ళూ, అట్లే దాదాపు ఒకే సమయానికే వాళ్ళ కానుపులకే ఎంతో ఖర్చయింది. ఇప్పుడీ ఖర్చులు కొంతైనా తగ్గించుకోవాలంతే! తనకూ యీ జడ ముచ్చటేదో తీర్చాలనే ఉంది కానీ, యీ సారికయ్యే పని కాదు. ఈ నాగకు ఎట్లాగైనా నచ్చజెప్పే పని చెయ్యాలంతే!!’

  ‘సరేలే, చూద్దాం. నువ్వింక స్కూల్ కు పోవా ఇప్పుడు?’ అడిగింది కనకమ్మ.

  ‘ఈ సారి నాకు అట్ట జడకావాలంతే!! ఈ రోజు స్కూల్ డే రెహార్సల్స్ ఉన్నాయి. నే పోతున్నా’ కళ్ళు తుడుచుకుని నాగ పరుగుతీసింది.

***

నాగ అటు స్కూల్ కు వెళ్ళిపోగానే, కనకమ్మ మళ్ళీ తన పనిలో పడింది. ఇక ఆచార్యులవారు కూడా సాపాటుకు వచ్చేస్తారు!

ఇంతలో, ‘అమ్మా!’ అని పరిచిత కంఠం పిలుపు.

ఆ కంఠం వినగానే గుర్తు పట్టిందామె! మునిరెడ్డిది ఆ గొంతు!

చేతిలో పని పక్కన పెట్టేసి, వీధి తలుపులవైపు వెళ్ళింది.

ఆమె  సమీపానికి రాగానే ఆ వచ్చిన వ్యక్తి చిరునవ్వుతో ‘అమ్మా!’ అంటూ వినయం తో ఆమె పాదాలంటి   సాష్టాంగ నమస్కారం చేశాడు.

‘చిరంజీవ!’ అంటూ ఆశీర్వదించిందామె!

పుట్టపర్తి శిష్యులందరికీ ఆమె అమ్మే కదా మరి!

మునిరెడ్డి బైటికి పోయి, అక్కడున్న రిక్షా వాడితో అన్నాడు,’నాయనా! ఈ మూటలు లోపల పెట్టు, డబ్బులిస్తానన్నాను కదా!’

రిక్షా వాడు మూడు మూటలు లోపల పెట్టేసిన తరువాత అతనికి డబ్బులిచ్చేసి పంపి పడసాలలో స్థంభానికి ఆనుకుని కూర్చున్నాడు మునిరెడ్డి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ!

కనకమ్మ ఆదేశం మీద  ఇంట్లోనే ఉన్న తులజ, మునిరెడ్డికి చెంబులో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.

ఇంతలో కనకమ్మ కూడా వచ్చి, అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది. ‘ఎట్లాఉన్నారప్పా అందరూ?’

‘మీ దయ వల్ల అందరూ బాగుండారమ్మా!’

‘పంటలెట్లా ఉన్నాయి?’

‘ఎప్పుడూ ఉండేదే కదమ్మా! వానలు సకాలానికి పడవు. పంట కాలువ నీళ్ళూ అందవు. పొలంలో బావి ప్రతిసారీ కొంచెం కొంచెం పూడిక తీస్తూ ఉండాల! ఈ విద్య తప్ప మరొకటి రానివాణ్ణి! పెద్ద లాభాలని లేదు గానీ, అప్పో సప్పో చేసి, పొలం పనిలోనే యీదుతున్నా. ఇల్లు వీధిన పడకుండా ఏదో పంట వస్తుందమ్మా! అయ్యగారు పెద్ద మనసుతో కౌలుకిచ్చినారు. పూట గడుస్తూ ఉంది. అంతే!’

‘అదే మునిరెడ్డీ! మాకు రాని విద్య కదా నీది! మీ అయ్యగారికి తన పుస్తకాల లోకమూ, ఆ రచనా వ్యాసంగమూ తప్ప వేరే విద్య రాదు. నీకొచ్చిన విద్య, బ్రదుకుదెరువునిచ్చే విద్యయ్యా!’ మెచ్చుకోలుగా కనకమ్మ అంటూ, తలవాకిలి వైపు చూసింది, పుట్టపర్తి లోపలికొస్తున్నారు.

ఆమె చటుక్కున కుర్చీ నుండి లేచి, తళిహింటి తలుపు దగ్గర నిలబడింది,’అదుగో మీ అయ్యగారొస్తున్నారు!’ అంటూ!

మునిరెడ్డి వెంటనే లేచి నిలబడ్డాడు.

పుట్టపర్థి చెప్పులు విడిచి పడసాలలోకి రాగానే మునిరెడ్డిని చూసి చిరునవ్వుతో,’ఏమిరా మునిరెడ్డీ! బాగున్నావాప్పా?’ అని చిరునవ్వుతో పలకరించారు.

మునిరెడ్డి, వారికి కూడా పాదాలంటి, సాష్టాంగ నమస్కారం చేసాడు.

పుట్టపర్తి అక్కడున్న కుర్చీలో కూర్చున్న తరువాత,’కూర్చోరా!’ అన్న ఆజ్ఞతో తానూ మళ్ళీ వినయంగా అక్కడున్న స్థంభానికి వీపు చేరవేసి కూర్చున్నాడు.

‘మీ అన్నదమ్ములంతా బాగున్నారారా?’

‘ మీ దయ వల్లా బాగుండారు స్వామీ!’

‘నా దయేముందప్పా? ఆ ఏడుకొండల వాణి దయే! ఎట్లున్నాయి నీపొలాలు?’

‘వానాధారం కదా స్వామీ! వానదేవుని కరుణే ముఖ్యం! అమ్మగారితో అదే అంటున్నా! కిందా మీదా పడుతూ మీరు కౌలుకిచ్చిన పొలాన్నే నమ్ముకుని బతుకుతున్నా, అంతే!’

‘నాకు ఆ చీపాడు పొలాన్ని దానం చేసిన ఆ మహానుభావుడి దయరా అంతే! ఆయన నేనేదో పోతన్న మాదిరి ‘సత్కవుల్ హాలికులైననేమి? గగనాంతర సీమల కందమూల గౌద్దాలికులైన నేమి?’ అని ధైర్యంగా నాగలి పట్టుతాననుకున్నాడేమోగానీ, నేనాపనికి అస్సలు తగినవాణ్ణి కాదురా! కల్పనాలోకంలో అవలీలగా తిరగగలుగుతానేమో కానీ, వ్రాత విషయం వచ్చేసరికి, ఇదిగో మీ అమ్మమీదనే ఆధారపడుతా! కలమే పట్టలేని వాణ్ణి, నాగలేమి పడతాను చెప్పు? ఇంతకూ, నాకెప్పటికీ తగిన లిపికారిణి మీ అమ్మే! ఆమె నాకు తగ్గ సతీమణే, చూస్తూనే ఉన్నావు కదా! ఇద్దరమూ రాతపని తప్ప వేరే పని రాని దంపతులం! నీవా పనిలోనే పుట్టిన వాడివి. సార్థకంగా పనిచేసుకుంటూ, కౌలు రూపంలో నాలుగు గింజలు నాకూ తెచ్చిస్తూ ఉంటావు. అది చాలులే! ఇంతకూ ఇప్పుడెందుకొచ్చినట్టు?’

‘మీ పెద్దమనసే మాకు గొప్ప ఆధారం స్వామీ!అదుగో, మూడు సంచుల్లో వడ్లూ, ఒక సంచిలో చీనాకాయలూ (బత్తాయి)  మీకు సమర్పించుకుంటున్నా స్వామీ!’

‘సరేలేరా! కనకా వాడికి, మజ్జిగ నీళ్ళైనా ఇస్తావా?’

కనకమ్మ వంటింట్లోకి వెళ్ళి ఒక లోటాలో మజ్జిగ తీసుకుని వచ్చి, మునిరెడ్డికిచ్చింది.

తలకు చుట్టుకుని వున్న టవల్ చేతుల్లో పట్టుకుని, ఆ గ్లాస్ అందుకున్నాడు మునిరెడ్డి భక్తిగా!

పుట్టపర్తి టేబుల్ మీద బీడీ కట్టలోనుంచీ, ఒక బీడీ తీసుకుని జేబులో ఉన్న అగ్గిపెట్టెలోంచీ ఒక అగ్గిపుల్ల తీసి దానితో ముట్టించుకున్నారు.

సాపాటు ముందీ బీడీ ఎందుకని అడగలేకపోయింది కనకమ్మ.

‘ఇంకేమున్నాయి సంగతులు? నీ భారత పఠనం ఎంతవరకూ వచ్చిందిరా?’

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.