తప్పటడుగు

-వంజారి రోహిణి

“నీతా! బంటి, రీతూ రడీనా?

వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది, పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి.

“ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత. 

ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు.

“నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి” అన్నాడు అరవింద్  షర్టు వేసుకుంటూ.

“అరవింద్ రేపు శనివారం బంటీ వాళ్ళ స్కూల్ లో మీటింగ్ ఉందట. వాళ్ళ మేడం ఫోన్ చేసారు.

పేరెంట్స్ తప్పకుండా అటెండ్ అవ్వాలట, మీరు వస్తారుగా అంది”అరవింద్  ఏమంటాడో

అన్నట్టు చూస్తూ.

“శనివారం నాకు కూడా ఆఫీస్ లో వీకెండ్ మీటింగ్ ఉంది నీతా.నేను రావటం చాలా ఆలస్యం అవుతుంది.స్కూల్ కి నువ్వు వెళ్ళిరా” అంటూనే బయటకెళ్ళి పోయాడు అరవింద్ నిఖిత వెనుక నించి

టిఫిన్ తిని వెళ్ళమన్నా వినిపించుకోకుండా.

గాఢంగా ఓ నిట్టూర్పు విడిచి హాల్లో కొచ్చి సోఫాలో నీరసంగా కూర్చుండి పోయింది నిఖిత. 

అరవింద్, నిఖిత లకు పెళ్లి అయి పదేళ్ళు అయింది. బంటీ, రీతూ ఇద్దరు పిల్లలు.అరవింద్ సిటీలో మంచి పేరున్న సాప్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆఫీస్ లో పని విషయం లో  అరవింద్ చాలా సిన్సియర్. సాయంత్రం ఎంత ఆలస్యం అయినా ఆ రోజు పని పూర్తి చేసి కానీ ఆఫీస్ నుంచి బయట పడేవాడు కాదు.అలా

రోజూ అతను ఇంటికొచ్చేసరికి రాత్రి ఏ పన్నేండో అయ్యేది.

అతను త్వరగా వచ్చిన రోజులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. నిఖిత కూడా బి.టెక్ చేసింది.పిల్లలు పుట్టేదాక తను కూడా జాబ్ చేసేది.రీతూ కడుపులో పడ్డాక జాబ్ మానేసింది.ఇపుడు పిల్లలు కాస్త పెద్దయి స్కూల్ కి

వెళుతున్నారు.ఇంట్లో ఏం తోచడం లేదని జాబ్ చేస్తానంటే అరవింద్ వద్దన్నాడు.

పిల్లలు, అరవింద్ బయటకెళ్ళాక ఏం తోచేది కాదు నిఖిత కి. 

పనామె ఇంటి పనులన్నీ చేసేసి వెళ్లింది. కాస్త అన్నం పళ్ళెం లో పెట్టుకుని బంగాళాదుంపల వేపుడు, పెరుగు తో తిన్నాననిపించి, పళ్ళెం సింక్ లో వేసి చెయ్యి కడుక్కుని  సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది.

అన్ని వార్త చానెల్స్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగే గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రసారం అవుతోంది.

సీరియల్స్ చూస్తే అత్త కోడళ్ళు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం, ప్రియుడి భార్య ను విషమిచ్చి చంపడానికి ప్లాన్ చేయటం.

విసుగు పుట్టి టీవీ ఆఫ్ చేసింది నిఖిత.

 రోజు రోజుకు నిఖిత ఇంట్లో చాలా బోర్, ఒంటరితనం ఫీలయ్యేది. అరవింద్ ఏ అర్ధ రాత్రో రావటం, తిండి కూడా తినకుండా నిద్ర పోవటం, పొద్దున మళ్ళీ  ఆఫీస్.నిఖిత తో తీరుబడిగా కూర్చుని ఓ పది నిమిషాలు కూడా గడిపేవాడు కాదు.ఇక ముద్దుముచ్చట అసలే లేదు. తెలియని అసంతృప్తి తో రగిలిపోయేది నిఖిత.

టీవీ ఆఫ్ చేసి ఫోన్ చేతిలో కి తీసుకుంది నిఖిత.

ఫేస్బుక్ లో  రోటీన్ పోస్ట్ లు, రోటీన్ కామెంట్స్, ఒకరిని ఒకరు విమర్శించుకోవటం, కుల మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చెయ్యటం.

వాట్సప్ చూస్తే గుడ్ మార్నింగ్ మెసేజ్ లు. 

సెల్ ఆఫ్ చేసి ఏం చేద్దామన్నట్లు గా మెడ ఎత్తి కళ్ళు మూసుకుని కాసేపు సోఫాకు ఆనుకుని కుర్చుండిపోయింది.

కళ్ళు తెరిచి యథాలాపంగా టేబుల్ మీదకు చూపు సారించింది.

టేబుల్ మీద ఎప్పటిదో ఓ వారపత్రిక ఉంది. బుక్ తీసి పేజీలు తిరగేస్తుంటే ఓ పేజీలో ని కథ

టైటిల్ “ప్రియ నేస్తం” నిఖితని ఆకర్షించింది. ఒక పేరా కథ చదివాక కథ  కాస్త ఆసక్తికరంగా

అనిపించడంతో మొత్తం కథ ని ఏకబిగిన చదివేసింది.కధలో స్నేహం విలువ, స్నేహితులు

జీవితానికి ఎంత అవసరమో అనే విషయాలను చక్కగా వివరించారు.

రచయిత పేరు చూసింది నిఖిత. “హేమంత్” అని ఉంది. “చాలా చక్కగా ఉంది పేరు” అనుకుంది.

పేరు పక్కనే రచయిత సెల్ నెంబర్ కూడా ఉంది. “రచయితకు అభినందనలు తెలపాలి” అనుకుని సెల్ ఆన్ చేసి నెంబర్ సేవ్ చేసింది. వాట్సప్ లోకి వెళ్ళి “హేమంత్ గారు మీ కథ ” ప్రియ నేస్తం”చాలా బాగుంది అని మెసేజ్ ని రచయిత నెంబర్ కు పంపింది.

మరుక్షణమే  రచయిత నెంబర్ నుంచి “ధన్యవాదాలు అండి. మీ పేరు  ఏమిటి” అనే రిటర్న్ మెసేజ్ వచ్చింది నిఖిత కి.

ఓ క్షణం అబ్బురపడి,మరో క్షణం ఆలోచించి “నిఖిత ప్రేమ్,  హైదరాబాద్”అని మెసేజ్ చేసింది. 

వెంటనే “నిఖిత వెరీ నైస్ నేమ్. మీరు ఏం చేస్తుంటారు” అని మెసేజ్ చూసిన నిఖిత తను హౌస్ వైఫ్

అంటే కొంచెం చీప్ గా ఉంటుందని “యోగా టీచర్” అని మెసేజ్ పెట్టింది.

“అందుకేనా నిఖిత గారు డి.పి లో మీరు కుందనపు బొమ్మలా మెరిసిపోతున్నారు” అని రచయిత హేమంత్ సెల్ నుంచి మెసేజ్ వచ్చింది. 

అంతే నిఖితని ఆ పొగడ్త సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పెళ్ళి చూపులపుడు తనని చూసిన క్షణం లోనే తన అందానికి ఫిదా అయి తనని పెళ్లి చేసుకున్న అరవింద్ పెళ్ళయి పిల్లలు పుట్టాక తననిపట్టించుకోవటమే మానేసాడు.

ఎప్పుడూ ఆఫీస్, పనీ అంటూ తనని నిర్లక్ష్యం చెయ్యడం నిఖిత భరించలేక పోతోంది.

అటువంటిది ఈ రోజు ఆ రచయిత హేమంత్ తన అందాన్ని పొగిడేసరికి కరువు పట్టి బీడుబోయిన నేలమీద

అమృత వర్షపు జల్లులు కురిసినట్లయింది నిఖిత మనసుకు. రచయిత హేమంత్ తన ఫోటోలు పంపి, 

నిఖితని కూడా తన ఫోటోలు పంపమని అభ్యర్థించాడు.

ఫోటోలలో హేమంత్ కూడా చాలా అందంగా ఉన్నాడు.

అలా మొదలైన నిఖితా, హేమంత్ ల వాట్సాప్ పరిచయం దినదినాభివృద్ధి చెందుతూ, ఇక ఒకరినొకరు

విడవలేని స్థితి కి వచ్చేసారు.

తీపి కబుర్లతో మొదలై, చిలిపి చేష్టలు, ముద్దు ముచ్చట్లు అన్నింటినీ మెసేజ్ లు గా మార్చుకొని ఓ రకంగా వాట్సాప్ లో సహజీవనమే చేస్తున్నారు వారిద్దరూ.

అప్పుడంతా అరవింద్  ఇంటికి త్వరగా రావాలని కోరుకునేది నిఖిత. ఇపుడు అరవింద్ ఊసేలేదు.

పొద్దున  పిల్లలను గబగబా రడీ చెయ్యటం, అరవింద్ ఆఫీస్ కి వెళ్ళటం ఆలస్యం వెంటనే వాట్సాప్

లో హేమంత్ తో చాటింగ్.

ఎడతెగని కబుర్లు, అంతూ పొంతూ లేని విరహ వేదనా, హద్దులు దాటే ప్రణయం. ఓ గంట హేమంత్ వాట్సాప్ లోకి రాకుంటే నిఖిత మనసు విలవిలలాడిపోయేది.

రెండు నెలల కాలచక్రం రెండు నిమిషాల్లో  తిరిగినట్లు అనిపించింది నిఖిత కి హేమంత్ వాట్సాప్ స్నేహంలో.

ఓ రోజు  చాటింగ్ లో హేమంత్ ఏదో పరిశోధన కోసం ఎక్కడో ట్రైబల్ ఏరియా వెళుతున్నాను అని అక్కడ సిగ్నల్స్ ఉండవువాట్సాప్ పని చేయదనీ, “వారందాక సెలవు మై డియర్ నిఖీ” అని మెసేజ్ పంపాడు.ఆ వారం

రోజులు నిఖిత మనసు మనసులో లేదు. 

నిరంతరం పర ధ్యానం. హేమంత్ కబుర్లు లేక హృదయం భారమై వేదన, ఏదో తెలియని గుబులు, కోపం

పిల్లలు, అరవింద్ మీద చూపించసాగింది. ఇవేమీ తెలియని అరవింద్ ఓ యంత్రంలా పగలు, రాత్రి తేడా లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమై ఉన్నాడు.

ఆ రోజు ఆదివారం. అరవింద్ ఇంట్లోనే ఉన్నాడు. రీతూ,బంటీ ల ప్రోగ్రెస్ రిపోర్టు చూస్తే ఇద్దరికీఅన్నీ సబ్జెక్టు లలో చాలా తక్కువ మార్కులు వచ్చి ఉన్నాయి.

నిఖిత మీద కోపం వచ్చి “ఏంటి ఇది నీతా పిల్లలను నేను పట్టించుకోడానికి కుదరదనే కదా నిన్ను జాబ్ చెయ్యవద్దు  అంది. రోజంతా ఖాళీ గానే ఉంటావుగా, సాయంత్రాలు వాళ్ళ చదువు విషయం

పట్టించుకోవచ్చు గదా. ఈ మధ్య నువ్వు ఎక్కువ పరధ్యానం లో ఉంటున్నావు” అన్నాడు. 

అంతే నిఖిత కి అగ్ని పర్వతం నుండి లావా ఎగచిమ్మినట్లు కోపం, బాధ, ఏడుపు కలగలసి ఒక్కసారిగా

ఎగదన్నుకొచ్చాయి.

మనసు కంట్రోల్ తప్పి బరస్ట్ అయి”అంతా నీ వల్లే అరవింద్. నువ్వు అసలు నన్ను పట్టించుకుంటున్నావా? నీ పక్కన పడుకున్నది ఓ రాతి బొమ్మ కాదు. మనసు, దానికి కోరికలు ఉన్న ఓ మనిషి అని నీవెప్పుడైనా గ్రహించావా? పొద్దస్తమానం ఆఫీస్ పని తప్ప మన మధ్యన ఓ సరదా అయినా ఉందా. పిల్లలు, మనం కల్సి ఎన్ని రోజులు అయింది సరదాగా బయటకు వెళ్లి” అంది చెక్కిళ్ళ మీదకు జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ.

అరవింద్ తలెత్తి తేరిపారగా నిఖిత వైపు చూసాడు. సడలని బిగువులతో నీలం రంగు నైటీలో ముగ్థ

మనోహరంగా ఉంది నిఖిత.

నిఖిత కన్నీరు చూసి మ్రాన్పడి పోయాడు అరవింద్. “నీతా నేను కష్టపడేది నీకోసం, పిల్లల కోసం. కాస్త నిమ్మళంగా ఆలోచించు. ఇంకెన్నాళ్ళు. ఇంకో మూడు నెలలు కష్టపడితే నాకు రావాల్సిన ఆఫీసర్ ప్రమోషన్ వస్తుంది. అపుడు నా కేడర్ కూడా పెరుగుతుంది. సాలరీ పెరుగుతుంది. ఇక మనం సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. ఆ ఇంటిలోకి నిన్ను మహారాణిలా ఆహ్వానించాలని, మనం  ఇక నిశ్చింతగా, ఆనందంగా గడపవచ్చని ఎన్నో కలలు కంటున్నాను నీతా. ఇది నువ్వు అర్థం చేసుకోకుండా ఎందుకు బాధ పడతావు ” అన్నాడు వేదన నిండిన స్వరంతో.

నిర్లిప్తంగా చూస్తూ ఉండి పోయింది నిఖిత.

వారం తర్వాత యథావిధిగా అరవింద్ ఆఫీస్ వెళ్ళగానే వాట్సాప్ లో కి వచ్చాడు హేమంత్. “నిఖీ దేవతకి సుస్వాగతం”అంటూ. మెసేజ్ చూచి పొంగి పోయింది నిఖిత.

వారం రోజులు అనుభవించిన వేదనంతా చేత్తో తీసేసినట్లు మనసు దూది పింజలా మారి మధుర లోకాల్లో విహరించసాగింది. 

మళ్ళీ తామర తంపరగా కబుర్లు మొదలైనాయి.

ఓ రోజు హఠాత్తుగా “నిఖీ ఎప్పుడూ ఇలా చాటింగేనా. నా దేవతని ప్రత్యక్షంగా దర్శించుకుని పుష్పం,పత్రం సమర్పించుకునే భాగ్యం ఏమైనా ఉందా ఈ భక్తునికి” అని మెసేజ్ చేసాడు హేమంత్.

“నాక్కూడా నిన్ను చూడాలని ఉంది హేమంత్” అంది నిఖిత.

నిఖిత నుంచి  పాజిటివ్ రెస్పాన్స్ రాగానే మరింత ఉత్సాహంగా  “నిఖీ డార్లింగ్.మనం కలుసుకుందాం.

మెసేజ్ లలో మనం చెప్పుకున్న ఊసులన్నీ నిజం చేసుకుందాం”

అని మెసేజ్ పెట్టాడు హేమంత్.

“కానీ హేము మనకు  పెళ్ళయింది కదా. మన పార్టనర్ని మనం మోసం చేస్తున్నట్లు కాదా”అని మెసేజ్ పెట్టింది నిఖిత.

“మోసం ఏం లేదు నిఖీ, తీరని కోరికలతో నువ్వు, అనురాగం అంటేనే తెలియని భార్యతో నేను మూడుముళ్ళ

బంధంతో బంధించబడి ఉన్నామే కానీ మన ఇద్దరి మనసులు ఎప్పుడో కలిసి పోయాయి. మనం కల్సుకుందాం. ఫ్లీజ్ కాదనకు. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను” అని హేమంత్ మెసేజ్ పంపాడు.

“అయ్యో! హేమంత్ అంత మాటనకు. నీ ఇష్టమే నా ఇష్టం” అని మెసేజ్ పంపింది నిఖిత.

“అయితే మనం ఎప్పుడుకల్సుకుందాం. నువ్వే ప్లాన్ చెయ్యి  నిఖీ. ఎప్పుడెప్పుడు వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలా అనుంది నాకు” హేమంత్ మెసేజ్ పెట్టాడు.

“హేమంత్ ఎల్లుండి మా వారు ఆఫీస్ పనిమీద బెంగుళూరు వెళుతున్నారు.” అని మెసేజ్ పెట్టింది నిఖిత.

ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు నిఖిత కి చెప్పి బెంగుళూరు కి బయలుదేరాడు అరవింద్.

వారం రోజుల క్యాంప్.

గబ గబా  పిల్లలకు అన్నాలు పెట్టేసి వాళ్ళని నిద్రపుచ్చింది.

పది గంటలకు వాట్సాప్ లోకి రాగానే “నిఖీ డార్లింగ్ ఎక్కడున్నావ్” అంటూ హేమంత్ మెసేజ్ పెట్టాడు.

“మా వారు ఇందాకే బెంగళూరుకి బయలుదేరారు హేము” అని మెసేజ్ పంపింది నిఖిత.

“గుడ్ అయితే నిఖితా మేడం గారు ఒక్కరే ఉన్నారన్న మాట ఇంట్లో. రేప్రొద్దునే ఈ భక్తుడు

నీ ముంగిట వాలుతాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడకు వెళదాం అంటే అక్కడకి వెళదాం. స్వర్గలోకపు అంచులు చూద్దాం ” అని మెసేజ్ హేమంత్ నించి. 

చేతి వేళ్ళు తడబడుతుండగా “ఒకే హేము” అని పంపింది నిఖిత.

“నిఖీ కొంచెం వర్క్ ఉంది.గంట తర్వాత మళ్ళీ వస్తా”అని వాట్సాప్ ఆఫ్ చేసాడు హేమంత్.

 ఏదో తెలియని ఎక్సైట్ మెంట్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది నిఖిత.

రేపు తను, హేమంత్ కలుసుకోపోయే క్షణాలు తల్చుకుంటే ఒకచోట నిలవలేక పోతోంది నిఖిత.

అలారం గంట పన్నెండు కొట్టింది. 

హేమంత్ దగ్గర నుంచి ఇంకా మెసెజ్ రాలేదు.

నిద్ర పట్టక ఏమీ చేయను పాలుపోక టీవీ ఆన్ చేసింది నిఖిత. టీవీలో ఓ చానల్ లో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న శిరీష, పోలీస్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డిల కథని, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితులను, శిరీష పడిన శారీరక, మానసిక వేదనను డమ్మి యాక్టర్ లతో నటింపచేసి కథలు కథలు గా

చూపిస్తున్నారు. ఆసక్తిగా చూడసాగింది నిఖిత. ఆ ప్రోగ్రాం చివరన  శిరీష మరణంతో తల్లిని కోల్పోయిన

అనాథగా ఆమె కూతురు పన్నేండేళ్ళ పాప దీనంగా తల్లి కోసం విలపించడం. భర్తను కోల్పోయిన సుధాకర్ రెడ్డి భార్య చంకలో చంటి బిడ్డ తో ఒంటరిగా నిలవటం చూపించారు. ఆ దృశ్యాలను చూసిన  నిఖితలో అంతర్మధనం ప్రారంభమైంది.

టీవీ ఆఫ్ చేసి  బెడ్ రూం లోకి వచ్చి లైటు వేసింది.

రీతూ,బంటీలు అమాయకంగా తమతో తల్లి ఉందని ఒకింత  నిశ్చింతగా నిద్ర పోతున్నారు.

ఒక్కసారిగా వివేకం మేల్కొంది నిఖిత మనసులో. “తన భర్త అరవింద్ తన కోసం, పిల్లల కోసం పగలనకా, రేయనకా అంత కష్టపడుతుంటే తను అదుపు తప్పి హేమంత్ తో సుఖపడాలనుకుంది.

మూడు నెలలు వాట్సాప్ లో పరిచయం అయిన హేమంత్ గురించి తనకి ఏం తెలుసని అతనితో కలవడానికి సిద్ధపడింది తాను? అతని నిజ స్వరూపం ఏమిటో. రేపు అతనొక్కడే కాకుండా ఇంకెవరినైనా తీసుకుని వస్తే, తన మీద వాళ్ళు అఘాయిత్యం జరిపితే? ఆ తర్వాత అవమానం భరించలేక తన ఆత్మ హత్యో,లేదా వాళ్ళ చేతుల్లో తన హత్యో జరిగితే, టీ.వీలో చూపించినట్లు  తన బంగారం లాంటి భర్త, ముత్యాల లాంటి బిడ్డలు అనాథలైపోరా.”

ఆ ఊహే భరించలేక పోయింది నిఖిత.

అంతలోనే “నిఖీ డార్లింగ్, నిద్ర పట్టడంలేదా. నాకు అలాగే ఉంది ఇక్కడ. అన్నట్లు మర్చిపోయాను.ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నా మీ ఇంటి అడ్రస్ అడగలేదు నేను. వెంటనే ఇంటి అడ్రస్ మెసేజ్ పెట్టు. రేపు

పొద్దున్నే రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను” అంటూ మెసేజ్ పెట్టాడు హేమంత్.

నిఖిత తను చేసిన ఒక మంచి పని ఏమిటంటే ఇంతవరకు హేమంత్ కి తన ఇంటి అడ్రస్ చెప్పకపోవటం.

తను తప్పటడుగు వేసేముందే టీవీలో ఆ ప్రోగ్రాం చూడటం మంచిది అయింది.

చిన్నప్పుడు తన నాయనమ్మ చెపుతూ ఉండే “తాటి చెట్టు నీడ నీడా కాదు. తగులుకున్నోడు మొగుడూ కాదు” అనే సామెత గుర్తు కొచ్చింది నిఖితకు.

వెంటనే హేమంత్ నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది నిఖిత.

“ఖాళీగా ఉండే వాని మెదడు దెయ్యాల ఖార్జానా “అన్నట్టు ఏ వ్యాపకం లేకపోవటం మూలాన తనకీ పిచ్చి ఆలోచనలు వచ్చాయి.ఇక నించి  ఖాళీ సమయాల్లో “వర్క్ ఫ్రం హోం” చేస్తానని అరవింద్ ని ఒప్పించాలని దృఢ నిర్ణయం తీసుకుంది నిఖిత.

ఇపుడు ఆమె హృదయంలో ఎటువంటి అలజడీ లేదు.

అరవింద్ మీద అంతులేని అనురాగం పొంగి పోరలుతోంది. రీతూ,బంటీలమధ్యన పడుకుని ఇద్దరి మీద

చేతులు వేసి నిశ్చింతగా కళ్ళుమూసుకుంది నిఖిత. 

ఆమె మనసు ఇపుడు నిర్మలమైనదని తెలుసుకున్న నిద్రాదేవి ఆలస్యం చెయ్యకుండా నిఖిత ను తనలోకి ఆహ్వానించింది.

*****

 

Please follow and like us:

7 thoughts on “తప్పటడుగు(కథ)”

  1. నిఖిత వివేకంతో వ్వవహరించటం బాగుంది.
    కథ నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఉంది.
    రచయిత్రి రచనాశైలి బాగుంది.

    1. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు సర్.ఎల్లప్పుడూ మీ ప్రోత్సాహం అవసరం

Leave a Reply

Your email address will not be published.