ఇట్లు మీ వసుధారాణి
భాగవతంలో శ్రీకృష్ణుడికి, నాకూ ఓ దగ్గరి పోలిక ఉంది. నన్ను నేను తక్కువగా అనుకున్నప్పుడల్లా ఆ పోలిక గుర్తుచేసుకుని నా ఆత్మవిశ్వాసం పెంపొందించు కుంటుంటాను. అదేమిటంటే శ్రీమతి రూపెనగుంట్ల లక్ష్మీరాధమ్మ, శ్రీ రామదాసు దంపతులకు మనం అంటే వసుధారాణి అనబడే నేను అష్టమసంతానంగా జన్మించటం. మరి అల్లరి కిష్టయ్య కూడా అష్టమ గర్భమేగా. అందువలన చేత నేనుకూడా అల్లరి చేసేయాలి కామోసు అనేసుకుని, జీవితంలో అతి ముఖ్యమైన బాల్యాన్ని అందమైన, ఆహ్లాదకరమైన అల్లరితో గడిపేసాను.
ఎవరి బాల్యమైనా చిన్న చిన్న చిలిపి పనులు లేకుండా ఉండదు కనుక, తప్పకుండా నా “ఇట్లు మీ వసుధారాణి “ తో మీరందరూ మీ జ్ఞాపకాలతో సరిపోల్చుకుని మీ మీ బాల్యాన్ని ఒక్కసారి స్పృశించి ఆనందించాలన్న కోరికతో “నెచ్చెలి” అంతర్జాల వనితా మాసపత్రికలో ధారావాహికగా అందించబోతున్నాను. ఈ అల్లరి వసుధారాణిని ఆశీర్వదించ వలసినది.
ఈ అవకాశం ఇచ్చిన నెచ్చెలి సంస్థాపక సంపాదకురాలు డా|| కె. గీత గారికి ధన్యవాదాలు.
1
సహన సముద్రం మా అమ్మ
బొత్తిగా భయం లేకుండా ఏమిటా అల్లరి ! అని చిన్నప్పుడు బడిలో టీచర్ గుడ్లు ఉరిమినా,ఎన్నివత్తిడులు ఉన్నా మీరెలా ఇంత సహనంతో,ధైర్యముతో ఎదుర్కుంటారు అని పెద్దయ్యాక నన్ను ఎవరైనా అడిగినా నాకు మా అమ్మే గుర్తుకు వస్తుంది.
1972 మార్చ్ 29 న నేను పుట్టేనాటికి నాకంటే ముందు ఆరుగురు అక్కయ్యలు,ఒక అన్నయ్యా పుట్టేసి వున్నారు.మళ్లీ ఆడపిల్లే అని మా అమ్మేమి భయపడలేదు. నాకంటే ఇరవై ఏళ్లు పెద్దయిన మా పెద్ద అక్కయ్య విజయలక్ష్మీ సరస్వతి,పద్దెనిమిది ఏళ్ళు పెద్దయిన రెండవ అక్కయ్య సావిత్రి కి మధ్య వయసు తేడా సరిగ్గా రెండు సంవత్సరాల రెండు నెలలా రెండు రోజులు. మా అమ్మేమి అలా ప్లాన్ చేయలేదు అలా జరిగింది విడ్డూరంగా.
ఇంక మన విషయానికి వస్తే మా పెద్దక్కయ్య మా అమ్మకు పదహారో ఏట పుడితే సరిగ్గా ఇరవై ఏళ్ళ తరువాత ఆమె ముప్ఫయి ఆరో ఏట ఊహించని ఉప్పెనలా నేను పుట్టానన్న మాట.ఐనా మా అమ్మ నన్ను ఆనందంగానే స్వీకరించింది.
పసివయసుకు వెనక్కి వెళితే బాగా చిన్నప్పుడు మొదట్లో అమ్మ నాకు గుర్తున్నప్పుడు నా వయసు ఎనిమిది ఏళ్ళు అంటే దాదాపు ఆవిడ 44 వ ఏట కుంకుమరంగు ,గోరింట పచ్చ,మిరప్పండురంగు, గంధంరంగు ఇలాటి రంగుల చిన్న అంచున్నగుంటూరు నేతచీరలు సరిగ్గా సరిపోయే మ్యాచింగ్ జాకెట్ ,అక్కడక్కడా చాలా తక్కువగా వచ్చిన తెల్లవెంట్రుకలతో , పట్టులాగా జారిపోయే మెత్తటిజుట్టుతో వత్తయిన జడతో ,ఇంట్లో ఆవిడే తయారు చేసుకునే మామిడిచిగురు రంగు గుండ్రని కుంకుమబొట్టుతో,మంచి పసిమిరంగుతో ,చక్కని కనుముక్కు తీరుతో ,ఐదు అడుగుల ఒక అంగుళం ఎత్తుతో, నా పసికంటికి నడిచే అద్భుతంలా ఉండేది అమ్మ.
ఐతే నాకు గుర్తున్నంతలో నా పసితనంలో అమ్మ చిత్రం , చెయ్యి తిరిగిన చిత్రకారుడుచే గీసిన గంభీరమైన ముఖంతో వుండే ఓ రాణిగారి చిత్రంలా ఉండి పోయింది.సావిత్రి అక్కయ్య తర్వాత సుప్రభ, శ్రీలక్ష్మి,ఉమాదేవి,అన్నయ్య శ్రీనివాస ప్రసాద్,నాకన్నా ఐదు సంవత్సరాలు ముందు పుట్టి బడులలో (ఎలిమెంటరి,హైస్కూల్) నాకంటే ముందు చేరిపోయి బోలెడు మంచి పిల్లగా ,ఇంటిలిజెంటుగా పేరు తెచ్చుకుని నన్ను ఇరకాటంలో పడేసిన పద్దక్క.ఇదీ నా తోబుట్టువుల లిస్ట్.మనం టోకెన్ నెంబర్ ఎయిట్ అన్నమాట.అల్లరి అష్టమ సంతానానికి జన్మసిద్ధ హక్కు అని పురాణాలే ఘోషిస్తున్నాయి మరి.
సరే ఇంత మంది మధ్య బాగానే అల్లారు ముద్దుగా వుంటాను కదా.పైగా అప్పటికి మా పెద్దఅక్కయ్యకి పెళ్లయి ఓ కొడుకు పుట్టి నాలుగు నెలల వాడు. వాడి పేరు నాగరాజ శర్మ,ఇంకేముంది మా క్రియేటివ్ అక్కయ్యలు అందరూ కలిసి లలితా సహస్రనామం నుండి వసుధని , ఇంట్లో ఓ బుల్లి నాగరాజు వున్నాడు కనుక రాణిని నాపేరులో చేర్చి నన్ను వసుధారాణిగా చేసేసారు. అయితే ఏరోజు ఇంట్లో వసుధా అని ఒక్కరు పిలిచిన పాపాన (పాపమేమిటి పుణ్యమే అమ్మోరి పేరు గందా) పోలేదు .అందరూ రాణి అనే పిలిచేవారు.అలా కేవలం పేరు కోసమే, పేరు నిమిత్తమే నేను కారణజన్మురాలిని అయ్యాను కానీ చేసిన ఘనకార్యాలన్నీ ఇది ఎందుకు పుట్టిందిరా బాబూ అనిపించేవే.
నా సంగతి ముందు ముందు తెలుసుకుంటూ ముందుకు సాగుదురు గానీ అమ్మ దగ్గరికి వద్దాం.ఇంతమంది పిల్లల్లో నేను పుట్టేసరికి పెద్దక్కయ్యకి పెళ్లి అయిపోయింది,తరవాత నాకు రెండవ ఏడు వచ్చేసరికి సావిత్రి అక్కయ్యకి సుప్రభ అక్కయ్యకి కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. నా మూడవ ఏట అమ్మ జీవితంలో పెద్ద విషాదం మా సుప్రభ అక్కయ్య పండంటి పిల్ల వాణ్ణి కని కాన్పులోనే చనిపోవటం.
అమ్మ పిల్ల పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని ,ఎలాగో పసి పిల్లవాణ్ణి పెంచుతూ ఉండగా , ఆరోజుల్లో పోలియో,మెదడువాపు ఈరెండు వేలాది పసిపిల్లలని వికలాంగులని చేశాయి లేదా కడుపున పెట్టుకున్నాయి . ఆ బాబు ఏడాది కల్లా చనిపోయాడు.నాకు మూడవ ఏడు నిండేటప్పటికి పాపం మా అమ్మ మనస్సు కల్లోల కడలిలా వుందన్నమాట.
నాకీ విషయం పెద్దయ్యాక కదా తెలుస్తుంది .అప్పుడు అమ్మ కొంచెం దిగులుగా ఇంటెడు చాకిరీ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ సంరక్షణ చేస్తూ ఉండటం మాత్రమే కనపడేది.
అమ్మకొంగు పట్టుకుని తిరిగింది గుర్తులేదు. అయితే ఆవిడ పొద్దుటినుంచి రాత్రి దాకా ఇంత చాకిరీ చేసి ఎంతరాత్రి అయినా సరే స్నానం చేసి మెత్తని నూలు చీర కట్టుకుని శుభ్రమైన తెల్లటి రెక్క దుప్పటి నవారు మంచంపై పరుచుకుని పడుకునే వేళకి మాత్రం నేనుకూడా నా బుల్లి నులక మంచం నుంచి ఆవిడ పక్కకి ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని.అమ్మ బొజ్జమీద చెయ్యి ,కాళ్ళ మీద నా బుల్లి కాలు వేసుకుని పడుకున్న ఆ నాలుగవ యేటి జ్ఞాపకం నన్ను అంటిపెట్టుకుని ఉండి పోయింది మనసులో ఓ పరిమళపు అరలో. ఇది దాదాపుగా ప్రతి పసితనానికీ బాగా గుర్తువుండే జ్ఞాపకం అనుకుంటాను .
ఎదుగుతున్న కొద్దీ కొద్ది కొద్దిగా నాకు అమ్మ అర్ధమవుతూ ఉండేది.ఒకే అమ్మ ,ఒకే పిల్లకి బహురూపాలలో . నాన్నగారు నాకు ఊహ వచ్చేసరికి షుగర్ వల్ల కాలు తీసివేయబడి మంచంలో, కొన్నేళ్ళుగా మంచంలో ఉన్న తాతయ్య నా నాలుగో యేటనే చనిపోయారు.అక్క చెల్లెళ్ళు అయిన అమ్మమ్మలూ, ఉమక్కయ్య,అన్నయ్యా ,పద్మక్కా నేను ,మేముకాక ఇంటికి వచ్చిపోయే బంధువులు , పురళ్ళకి వచ్చే అక్కయ్యలు ఇలా ఉండేది ఇల్లు.చిన్నమ్మమ్మ వంట చేసేది .అమ్మ నాన్న గారి పని ,మా అందరి పని,ఇంటి పని చూసుకునేది. ఇంటినిండా పాడి, పంట.
మా అమ్మ టైమ్ టేబుల్ నాకు ఇప్పటికీ తీరని ఆశ్చర్యమే.నాకు గుర్తున్నంతలో నా ఏడెనిమిది ఏళ్లప్పుడు ఎలిమెంటరీ స్కూల్‌కి వెళ్లే దశలో ఉదయం నిద్ర లేచేసరికి మా అమ్మ గేదలకి పాలు పితికి, కుంపటి రాజేసి కాఫీ డికాషిన్ వేసి ఉంచేది. అమ్మమ్మ కి ముఖం కడుక్కోవటానికి వేడినీళ్లు కూడా పెట్టి ఉంచేది.నేనూ అమ్మమ్మతో పాటు మొహం కడుక్కునేదాన్ని వేడినీళ్ల లో వాటా తీసుకుని ,మా పద్దక్క వుడుక్కుంటూ ఉండేది.అలా అమ్మమ్మ తో ఆవుపేడ కచ్చికతోనో, జెమినీ పళ్లపొడి అని ఓ పళ్లపొడి వచ్చేది తియ్యగా ఉండేది అది దాంతో తోముడు తక్కువ, తినుడు ఎక్కువా మనం ,పళ్ళుతోమేసుకుని అందరం కుంపటి చుట్టూ చేరితే ,అమ్మమ్మ ఎవరికి కావాల్సిన పాళ్లలో వారికి డికాషిన్ కలిపి కాఫీ ఇచ్చేది.
నాకయితే అందరికన్నా చిన్నకనుక పెద్దగ్లాసు పాలలో ఓ స్పూన్ కాఫీ డికాషిన్ వేసి ఇచ్చేది.నేను అవి గట గటా తాగేసి అమ్మ చిక్కని కాఫీ నాగ్లాసులో కొంచెం పోయించుకుని తాగేదాన్ని. ఆ కాఫీ తాగేదానికి కూర్చునేదేమో అంతే .వరుసగా మాకు జడలు వేయటం,చద్దన్నాలు పెట్టి బడులకు పంపటం,జీతగాడి సాయంతో నాన్నకి కావాల్సిన స్నానాలు అవీ చూడటం,ఇల్లు శుభ్రం చేసుకోవటం,అమ్మమ్మకి కావాల్సిన వంట సాయం చేయటం.మళ్లీ మేమందరం మధ్యాన్నం భోజనాలకి వస్తే అన్నాలు ,తరువాతి శుభ్రాలు .కొంచెం సేపు నడుము వాల్చేదేమో.
మళ్ళీ మేము బడి నుంచి వచ్చేసరికి చాలాసార్లు అమ్మ ఎలా నాకు కనపడేదంటే అది ఒక అపూర్వ దృశ్యం .నాలుగు గంటల వేళ అమ్మా ! అంటూ పుస్తకాల సంచీ తగిలించుకుని రివ్వున పరిగెత్తుకుని ఇంటికి వచ్చేవేళలో అమ్మ వంటింటి గుమ్మం పైన తల పెట్టుకుని పడుకుని చేతిలో ఏ ఆంద్రజ్యోతో,ఏ యువనో ,ఏదయినా నవలో పట్టుకుని చదువుకుంటూ ఉండేది.ఆవిడకోసం ఆవిడ జీవించిన క్షణాలు అవి. అది నాకు పెద్దఅయ్యాక అర్థం అయ్యింది.ఇన్ని పనులు ,ఇంతమంది పిల్లలు,ఇన్ని కష్టాలు ,బాధ్యతల మధ్య ఆవిడ పుస్తకపఠనం.వేటపాలెం లో ఉన్న బాపూజీ గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసింది అమ్మ అని అక్కయ్యవాళ్ళు చెప్పే వాళ్ళు నాకు.
అలా పుస్తకపఠనం ఇంట్లో అందరికీ అమ్మ వలన అబ్బింది.వచ్చేసారా ! అంటూ లేచి బడినించి వచ్చిన మాకు చిరుతిళ్ళు, కాఫీలు .మళ్లీ సాయంత్రం గేదెల పాలు తీసుకోవటం,సాయంత్రం ఇల్లు శుభ్రాలు చేసుకోవటం,సందెకసువు చిమ్ముకోవటం, రాత్రి వంట అమ్మే చేసేది.మళ్లీ అందరం తిన్నాక , వంట ఇల్లు సర్దుకుని ,స్నానంచేసి ఆఖరుగా పాలు తోడు పెట్టుకుని పడుకునే వరకూ అమ్మ అలా తిరుగుతూనే ఉండేది మా అందరి మధ్య.ఉమక్క,పద్మక్క ఇంట్లో వున్నప్పుడు పని సాయం చేస్తూనే వున్నా ఆవిడ పని అంతులెని మహాసాగరంలో అలల్లా వస్తూనే ఉండేది. నేను కొంచెం కొంచెం పెద్ద అయ్యేకొద్దీ అమ్మ చేసే ఏపనిలో నేను సాయం చేసి ఆవిడ పని తగ్గించగలనా అని చూసుకుంటుండేదాన్ని.
అందరి పనులూ చూస్తూ ,అందరినీ కలుపుకుని పోతూ ,తక్కువ మాట్లాడుతూ,ఎక్కువ సహనంతో ఉంటూ ,ఎట్లాటి కష్టం జీవితంలో వచ్చినా తత్తర పడకుండా నిబ్బరంగా భరిస్తూ,ఉండటం ఒక స్త్రీ కి మాత్రమే సాధ్యం .ఆవిడ విస్తృతంగా చదివిన సాహిత్యం,ఆవిడ నిబ్బరంగా వుండే మనస్తత్వం ,జీవితం ఇచ్చిన కోకొల్లల అనుభవాలు ఆమెని అలా సహనశీలిగా మార్చాయనుకుంటా.పెద్ద అయ్యేకొద్దీ అమ్మ దగ్గర చనువుకన్నా గౌరవం ఎక్కువగా అనిపించేది నాకు.
ఇంత పని లోనూ ఆవిడ చక్కని అభిరుచులు,చిన్న చిన్న సరదాలు కలిగి ఉండేది. వేటపాలెం నుంచి నాకు రెండు సంవత్సరాల వయసులో గుంటూరు జిల్లా నరసరావుపేటకు మారిపోయింది కుటుంబం.నరసరావుపేటకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే మా సొంతవూరు రూపెనగుంట్ల. అక్కడ ఉన్న 12 ఎకరాల పొలం మా జీవనాధారం .అందుకని పిల్లలకి చదువులకు కాలేజీ, బడులు ఉండేవిధంగా ,మావూరుకు,పొలానికీ వెళ్ళటానికి వీలుగా మాఇల్లు ఊరి చివరగా ఉండేది.
నరసరావుపేట కొంచెం పెద్ద టవున్ ఐనా మా ఇంటి దగ్గర ఓ పల్లెటూరి వాతావరణంలా ఉండేది.పదహారు సెంట్ల పెద్ద స్థలంలో పొడవు వెడల్పు పెద్దదైన రెల్లుపాక,దాని వెనుక పెద్ద పెంకుటిల్లు. పాకలో హాలు ,పెద్ద వడ్లపురి ,చుట్టూ సిమెంటు రాళ్ళ గోడలు,ఒక గది వరుస ఓ భాగం చేసి నాన్నకి గది.హాల్లో పెద్ద టేకు టేబుల్ ఉండేది.నాన్నకి పెద్ద పట్టమంచం,ఓ రెండు నవారు మంచాలు,పిల్లలందరికీ నులక మంచాలు.వంట ఇంట్లో దేవుడి మందిరం,వంట,భోజనాలు .ఇంక ఆ పెద్ద రెల్లు పాకలోనే మిగిలిన జీవనం.బయట ఓ పక్క గడ్డివాము గేదెలకి కొష్టం , గిలకబావి ,20×20 పెద్ద ఓపెన్ ఎయిర్ బాత్రూంలో సగభాగంలో బండలు పరిచి ఉండేవి .మిగిలిన సగభాగంలో చిక్కుడు,కాకర పాదులు ఉండేవి.బాత్రూం పైన కప్పు బదులు వెదురు బద్దల పందిరి దానికి అల్లించిన చిక్కుడు, కాకర తీగెలు.అటువంటి ఆకుపచ్చ,ఆహ్లాదకరమైన స్నానం ఇంకెప్పుడూ,ఎక్కడా చేయలేదు నేను నా చిన్నతనం తరవాత.
మిగిలిన ఖాళీ స్థలంలో ఓ పక్కన కూరగాయ పాదులు. ఇంటి ముందు గేటు దగ్గర నుంచి ఇంటివరకు నడవటానికి వేసిన పొడవాటి మాచర్ల నాపరాళ్ళ బండలు వాటికి ఇరువైపులా ఆనుకుని కాలానికి అనుగుణంగా ఒక్కో సారి బంతిమొక్కలు, చేమంతి మొక్కలు పెంచేది మా అమ్మ.ఇంట్లోకి వచ్చిన వారికి పూలవరుస స్వాగత మాలికలా ఉండేది.ఇక వరుస మొక్కలకు అటు ,ఇటు వెనుక గా అమ్మ ఎన్ని రకాల పూల చెట్లు పెంచేదో.మూడు రకాల మల్లె చెట్లు తీగమల్లి పెద్ద పొడవాటి మొగ్గలతో గాఢమైన వాసనతో, బొండుమల్లి పొట్టి గుండు మొగ్గలు,ఇంక కొంచెం చిన్న సైజు నాటు మల్లెపూల పొద.విరజాజి పూలు కూడా అంతే పందిరి విరజాజి,పొద విరజాజి,ఒక సన్నజాజి పందిరి.విరజాజి పూవులైతే కోసినన్ని కోసి కోయలేక వదిలేసే వాళ్ళం.పెద్ద పెద్ద గుండ్రని స్టీల్ కంచాల్లో విరజాజులు మల్లెలు కోసి కనకాంబరం మరువం దవనం వేసి మా అమ్మ పువ్వును నలగకుండా సుకుమారంగా అల్లే మాలలు ఎంత సొగసుగా వుండేవో.
తెల్లవారి అంతే శ్రద్ధగా మా అందరికీ జడలు వేసి పూలమాలలు తురిమి బడికి పంపేది.మా పూదోటలో ఇంకా ఎర్రని రెక్క మందారాలు,చిట్టి చేమంతులు,రెండుమూడు రకాల గులాబీలు,అరచేతి అంత తెల్ల చేమంతులు,పచ్చచేమంతులు,రజనీగంధాలు,నాగమల్లి పూలు,మధ్యాన్నం మల్లెలు,చంద్రకాంతలు పచ్చవి,తెల్లవి,చంద్రకాంత రంగువి ,శంఖుపూలు,ఆఖరికి ములిగోరింట పూలతో సహా పూయించేది అమ్మ.అసలు చెట్లని పాదులు చెయ్యటం ,వాటి అమరిక ,ఏపూలమొక్క పక్కన ఏమొక్క అందంగా ఉంటుంది ఓ గొప్ప తోటమాలి లా డిజైన్ చేసుకునేది. ఇప్పుడైతే లాండ్స్కేప్ చేసింది ఎవరు ? అంటారేమో మా పెరటిపూదోటను చూస్తే.
మా జీవితంతో పాటు పాతుకుపోయి మాకు బోలెడన్ని మధుర స్మృతులు మిగిల్చిన గుండ్రటి చిక్కని పొదరిల్లు మా పెరటిలో దబ్బచెట్టు .పూలమొక్కల మధ్య అందంగా అమరిపోయిన ఆ చెట్టు కింద స్నేహితులతో ఎన్నికబుర్లు ఆడుకున్నామో,దాని నీడన నులకమంచాలు వేసుకుని ఎన్ని పుస్తకాలు చదువుకున్నామో, కొత్త అల్లుడుకి కాఫీలు,టిఫిన్లు అక్కడికే సప్లయి అయ్యేవి. మా ఇంట్లో ప్రతి ఆడపిల్లకీ కొత్త అనుబంధం చిగుర్లు వేసింది ఆ చెట్టుకిందే .అందుకే మా అందరికీ ఆ దబ్బచెట్టు ఓ మధురమైన జ్ఞాపకం. పుల్లదానిమ్మ చెట్టు.ఎన్ని కాయలు ఇచ్చిందో. ఈ రెండు చెట్ల పండ్లతో అందరమూ పదహారు ఫలాలనోమును తీర్చుకున్న వారమే.
కూరగాయలకు కేటాయించిన చోట ఇంక చెప్పనలవి కాదు .గోరుచిక్కుడు,వంగ, టొమాటో,కాకర,బీర,సొర,దొండ,గుమ్మడి,బూడిదగుమ్మడి ఇలా అన్నీరకాయల కూరగాయల మొక్కలు వేసేది.కూరలు మేము వాడుకోగా అందరికీ పంచటమే.పుస్తకాలు,మొక్కల పెంపకం మా అమ్మ అభిరుచులు.అంతే కాక పిండివంటలు ఎంత ఓపికగా ఎన్నెన్ని చేసేదో, ఊరగాయలు, ఒరుగులు, వడియాలు ప్రతి సీజన్లో ఏదో ఒక పని తో ఎప్పుడూ మమేకమై ఉండేది మా అమ్మ.ఏదైనా కష్టమైన పిండి వంట చేసి పిల్లలకు పెట్టిన రోజు ఆవిడ ఎంత ఆనందంగా ఉండేదో .
ఇలా అమ్మ గురించి ఏ పిల్లలకైనా అంతే లేని సంగతులు వస్తూనే ఉంటాయి. అయితే నాకు 10 ఏళ్ల వయసు వచ్చేసరికి అమ్మ గురించి అచ్చం సినిమాల్లో లాంటి విషయం ఒకటి తెలిసింది.అది నా చిన్ని బుర్రని ఓ కుదుపు కుదిపిన వార్త అనే అనుకోవాలి.మరి వచ్చే సంచికలో అమ్మ మాటల్లో ఆమె అంతరంగం గురించి.
*****
(ఫోటో- తల్లిదండ్రులతో రచయిత్రి)
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.
అద్భుతమైన కథనం. శ్రీపాద వారి “అనుభవాలూ జ్ఞాపకాలూను” గుర్తుకొస్తున్నాయి. అంత అలవోకగానూ రాసినట్లు ఉంది. అభినందనలు.
Very nice narration. Looking forward to next one. Super. kallaki kattinatluga chebutunnaru.
థాంక్యూ అండి
వసుధారాణి గారు నేను కెంజాయ కసుమం నవల ని చాలా సంవత్సరాల క్రితం చదివాను,ధయచేసి ఆ పుస్తకాన్ని నేను ఎలా పొందగలనో తెల్పండి,
చాలా సంవత్సరాలు నేను ‘కెంజార లోయ ‘ అని వెతికేవాడిని,ఈ రోజు బ్రౌజ్ చేస్తుంటే…కెంజాయ కుసుమం అని కనపడి సమీక్ష చదివాను , మీరు What’s app కి మెసేజ్ పెడితే రుణపడి ఉంటాను.
Dr.M.Raghavendra,kakinada
9866118456
దయచేసి ,
ప్రేమలు,విలువలు,ఆహ్లా దం,ఆనందం కలగలిసిన రోజుల లోని కధ లాంటి జీవితం.బాగుంది మీ రచన.ఇందులో మీ ఆహ్లాదకర జీవనం తో పాటు అమ్మ కష్టం అదే సమయంలో ఆవిడ కుటుంబాన్ని నడిపే నైపుణ్యం,సాహసం కళ్ళకు కట్టినటు తెలుస్తున్నాయి.పెద్ద వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనల్ని పెంచడానికి అని చిన్నవాళ్ళు ఆలోచిస్తే వృద్ధాశ్రమాల అవసరం ఉండదు కదండీ.బాగుంది మీ కధ లాంటి జీవితం.
మీరు కథని చడవటమే కాక చక్కని విశ్లేషణ చేశారు.సంతోషం సర్.
థాంక్యూ అనూరాధ గారు .మీకు నచ్చి మరో సంచిక కోసం ఎదురుచూడటం అంటే నాకు ఎంత ఆనందం కదా.💖🙋💐
వసుధా! మీ జ్ఞాపకాల బాటలో అందర్నీ నడిపించుకుంటూ వెళ్తున్నారు. “అడుగడుగు గుడి ఉంది అందరిలో గుడి ఉంది” లా! Beautiful !!!!
థాంక్యూ సుశీలగారు.మీ ప్రోత్సాహానికి 💖🙋💐
Nice narration.
థాంక్యూ సర్.
Ippudu pillalandarikee ilaanti baalyam andite baagundu. Idantaa chadivaka ippati pillalu enta miss avutunnaro anipistundi. Enta baga rasaro !!
అవును సుభాషిణి గారు నిజమే,కనీసం ఇప్పటి పిల్లలకి ఇలాంటి జీవితం,బాల్యం వున్నదని తెలియాలని వ్రాస్తున్నాను.థాంక్యూ మీకు నచ్చినందుకు.💖🙋💐
కధా ప్రారంభమే అదరగొట్టేసా వసుధ గారూ,తరువాయిభాగాల కోసం ఎదురు చూస్తున్నాం
హాయిగా ఉంది…ఈ స్మృతి పునశ్చరణ…ధన్యులం
థాంక్యూ శైలజ గారు
Good beginning ma’am…..
థాంక్యూ సుదీప్తి.మీ ప్రోత్సాహం నాకు బలం.