ఎవరి అసూయ వారికే చేటు

అనసూయ కన్నెగంటి 

             అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే ఇష్టం ఉన్నవాళ్ళు  తేలికపాటి ఆహారం తీసుకువచ్చి నీళ్లల్లో విసురుతూ ఉంటారు. అప్పుడవి పోటీపడి మరీ తింటూ ఉంటాయి. 

    అలా ఆ  చేపల్లో అన్నింటి కంటే కాస్త వేరేగా బంగారు రంగులో ఉండే చేప ఒకటి ఉంది. అదంటే రోజూ ఆహారం వెయ్యటానికి వచ్చే  వాళ్లందరికీ చాలా ఇష్టం. ఒక రకంగా ఆ చేపను చూడటానికే కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటారు కూడా. కానీ తను అందంగా ఉంటానని కానీ, తనని అందరూ ఇష్టపడతారని కానీ ఆ చేపకు తెలియదు.  ఆ చేప అమానులంతా దానికి బంగారు చేప అనిపేరు పెట్టుకున్నారు. 

   ఆ బంగారుచేపకి ఒక స్నేహితురాలు ఉంది. వాళ్ళిద్దరూ కలసే తిరుగుతారు. అది నల్లగా మట్టి రంగులో ఉంటుంది. దానికి బంగారు చేపంటే చెప్పలేనంత అసూయ.  

     అయితే బంగారు చేపని అందరూ ఇష్టపడుతున్నారన్న సంగతి ఆ నల్ల చేపకి తెలుసు. బంగారుచేప ఒడ్డుకు వస్తే “ అదిగో..అదిగో బంగారు చేప “ అని అందరూ దానిని ఎగలబడి చూడటం నల్ల చేపకు అస్సలు నచ్చటం లేదు. అందుకని దానిని ఎలాగైనా చంపెయ్యాలనుకుంది. 

    అలా ఎప్పుడైతే అనుకుందో అప్పుడు..బంగారు చేప చూడకుండా వెనక నుండి వచ్చి పైకెగిరి గభాల్న దాని మీద పడేది. అయినా తప్పించుకునేది బంగారు చేప. ఇలా కొన్నిసార్లు చేసాకా ..ఇది కాదు పని, ఇలా చేస్తే బంగారు చేప చావదు అని మనసులో అనుకుని మరో ఆలోచన చేసింది నల్ల చేప. 

      “ సరదాగా అలా షికారు వెళదాం రా!” అని ఒడ్డుకంటే తీసుకొచ్చి బంగారు చేపను అకస్మాత్తుగా ఒడ్డు మీదకి తోసేసేది. అలా తోసెయ్యటమే కాదు..” అయ్యో అయ్యో “ అని ముందుగా తనే  అరిచేసేది కూడా. అలా చేస్తే బంగారు చేప వెళ్ళి ఒడ్డున పడిపోతుందని, దానికి ఊపిరి అందక చనిపోతుందని నల్ల చేప ఉద్దేశ్యం. కానీ గభాల్న లేచి నీళ్లల్లో దూకేసేది బంగారు చేప. 

“ అమ్మో..! కొంచెం సేపుంటే చనిపోయేదాన్ని తెలుసా? అస్సలు ఊపిరి అందలేదు ! ఎవరో తోసేసారు “ అని మళ్ళీ నల్లచేపతోనే చెప్పేది బంగారుచేప అమాయకంగా. అంతే తప్ప నల్ల చేప మీద కొంచెం కూడా బంగారు చేపకు అనుమానం రాలేదు.

    కానీ నల్ల చేపలో మాత్రం బంగారు చేప మీద అసూయ రోజు రోజుకీ పెరిగిపోసాగింది.

      ఒక రోజు చేపలు పట్తేవాడు ఒకాయన ఒడ్డున కూర్చుని  గేలానికి ఎర గుచ్చి నీళ్లల్లో వేసాడు. అది చూసింది నల్ల చేప. సరిగ్గా అదే సమయానికి ఎవరో నూకలు విసిరారు నీళ్లల్లో. 

   “ పదవే వెళదాం. ఎవరో నూకలు విసిరారు. అందరూ తింటున్నారు. మనమూ వెళదాం. ఆలస్యం చేస్తే అన్నీ అయిపోతాయి  “ అంది కంగారుగా బంగారు చేప. విని ఊరుకుంది తప్ప అక్కడ్నించి కదల్లేదు నల్లచేప. పైగా 

   “ ఆ నూకల్లో ఏమి రుచి ఉంటుంది. చప్ప చప్పగా ఉంటాయి. వస్తుంటే దార్లో మంచి సువాసన గల ఆహారం కనపడింది. నేను తినేస్తే నీకు తక్కువైపోతుందని వచ్చేసాను. పద వెళ్ళి అది తిందాం “ అంది కపటంగా నల్ల చేప. 

 ఆ మాటలు నమ్మి నల్ల చేప  చెప్పిన చోటుకి వెళ్ళింది బంగారు చేప. అక్కడ ఎరను చూడగానే దానికి నోరూరింది.

గభాలున వెళ్ళి తినబోతున్నంతలో..ఒక్క ఉదుటున అక్కడికి వచ్చిన చేపల గుంపు..

 “ ఏయ్..బంగారూ..! ఇక్కడేం చేస్తున్నావ్. ?అక్కడ వాళ్లంతా  నూకలు వేస్తూ నువ్వు కనపడక వెళ్ళిపోవాలనుకుంటున్నారు..పద పద.” అని హడావిడి చేసాయి. 

     దాంతో తను తినాలనుకున్న ఆహారాన్ని ముట్టుకోకుండానే “ రావే..” అని స్నేహితురాలతో అని మిగతా వాళ్లతో కలసి వెళ్ళిపోయింది బంగారు చేప. 

     తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది నల్ల చేప.

  ఈ చేపల  హడావిడికి నీళ్ళు బాగా కదిలి అలలు బాగా పెరిగాయి.  అది చూసి చేప చిక్కింది అనుకున్న చేపలు పట్తే ఆయన విస్సురుగా గేలాన్ని పైకి లాగాడు. దాంతో గేలం కాస్తా అక్కడే ఏమరపాటుగా ఉన్న నల్ల చేపకు గుచ్చుకుని దాన్నిపైకి తెచ్చి పడెయ్యటం, వెంటనే  దాన్ని పట్టుకుని బుట్తలో వేసేసుకోవటం క్షణాల్లో జరిగిపోయింది. 

               చూశారా పిల్లలూ.. చెడ్ద ఆలోచనలు, అసూయ తగదు.  

     *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.