స్వార్ధమా! నీ చిరునామా ఎక్కడ?”

                                                                           –మంథా భానుమతి

   “వెంటనే బయల్దేరి రా భారతీ. రేప్పొద్దున్నే కారు పంపిస్తా బస్టాండ్ కి.” రేణుక గొంతులో కంగారు, దుఃఖం విని, నాకు కాళ్లు చేతులు ఆడలేదు.

   ఇంట్లో ఉండేది మేమిద్దరమే. ఇద్దరం చెరో బాంక్ లోనూ పనిచేసి రిటైర్ అయి ఐదు సంవత్సరాలయింది. పిల్లలిద్దరూ.. మా వయసు వాళ్లందరి పిల్లల్లాగానే అమెరికాలో ఒకరు, ఆస్ట్రేలియాలో ఒకరు. మేము గుంటూరులో స్థిరపడ్డాం.

    మా ఇద్దరి అనుబంధం తెలిసిన మా వారు సతీష్, నన్ను రేణుక ఉండే రాజమండ్రీకి ఏసి బస్ లో ఎక్కించి ఇంటికెళ్లారు. తనకి ఇబ్బందేం లేదు. వంటకి అమ్మాయి, ఇంటిపనికి ఇంకొక అమ్మాయి ఉన్నారు. పుట్టి పెరిగిన గుంటూరులో సెటిల్ అయ్యాము. కాలక్షేపానికి లోటు లేదు. బంధువులు, స్నేహితులు చాలా మందే ఉన్నారు.

   రాత్రి పదకొండు దాటింది. బైట వాతావరణమే చిరు చలిగా ఉంది. ఏసీ బస్సులో ఇంకాస్త ఎక్కువగానే ఉంది. చెవులు కప్పేట్లు తలకి మఫ్లర్, భుజాల నుంచీ కాళ్లవరకూ శాలువా కప్పుకుని వెనక్కి వాలాను, సీటు వెనక్కి జరిపి

   కళ్లు మూసుకుని నిద్రపోటానికి ప్రయత్నించాను. ఊహూ.. రేణు ఎందుకు రమ్మందో! మధ్యన చాలా రోజులయింది మాట్లాడి. కలుసుకునైతే కొన్నేళ్లే! ఇంతా చేసి నాలుగైదు గంటల ప్రయాణం. మనసుల్లో ఎన్నెన్ని అభిమానాలున్నా, కలుసుకోవడానికి ఎన్ని అవరోధాలో! గట్టిగా ఆలోచిస్తే అంత కొంపలు మునిగిపోయేవేం ఉండవు. అంతా అశ్రద్ధ

   కళ్ల ముందు రింగులు రింగులు.. యాభై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. రేణుకని మొదట కలిసిన రోజు..పియుసి లో చేరటానికి విమెన్స్ కాలేజ్ కెళ్లాను.

    “ఎక్స్ క్యూజ్ మి.. ఇది మీ ఫోటోనే కదా?” పెద్దపెద్ద కళ్లలో స్నేహ భావాన్ని పలికిస్తూ ఒకమ్మాయి.. చామన ఛాయలో కళగా మెరిసి పోతూ.. ఎర్రపట్టు పరికిణీ నల్ల జాకెట్టు, గులాబీ రంగు జార్జెట్ వోణీ. పొందిగ్గా నిలుచుంది.

   అనుమానం ఎందుకూ.. నాదే. అప్లికేషన్ మీద సరిగ్గా అతుక్కున్నట్లు లేదు. వరండాలో గోడవార గింగుర్లు తిరుగుతోంది. చూశాను కానీ ఎవరిదో అనుకున్నాను. అదే నాకూ, రేణుకకీ తేడా. తను వెంటనే తీసి, చూసి నా దగ్గరికి వచ్చింది. నేను నా ఉత్సాహంలో ఫొటో పట్టించుకోలేదు. అంతే అప్పటి నుంచీ, నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా సాగింది మా స్నేహం. రోజూ ఇళ్లకి రాకపోకలు, కంబైన్డ్ స్టడీలూ, రెండు పావలాలు దొరికితే, నేల టికెట్లు కొనుక్కుని సినిమాలు.. మధ్యలో చిరు అలకలు, అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది నా పెదవుల మీదికి.

   వేసంకాల సెలవులకి మాత్రం ఇద్దరం మా ఊర్లు వెళ్లిపోయే వాళ్లం. ఉత్తరాలు తక్కువే.. ఇన్లాండ్ కవర్ కావాలంటే పది పైసలు మరి.. వచ్చాక బోలెడు కబుర్లు.. ఎడతెగకుండా.

   రేణుకది కొవ్వూరు, మాది అమలాపురం. కొబ్బరి తోటలూ, మామిడి చెట్లూ, వాటి పిందెలూ.. తోటలో విహారాలూ మామూలే. డిగ్రీ సెకండ్ యియర్ సెలవులు అయాక .. రేణుక మొహం వెలిగి పోతూ వచ్చింది వాళ్ల అమ్మమ్మగారి ఊరు నించి, కొత్త బట్టలు వేసుకుని.

   “ఏంటి విశేషం?” పరికిణీ పట్టుకుని చూస్తూ అడిగాను. నేతదే కానీ నాజూగ్గా ఉంది.

   “ సమ్మర్ హాలిడేస్ బాగా గడిచాయి తెలుసా? ఎప్పటిలాగ కాదు. చాలా హాపీగా.” చెప్తుంటే, బుగ్గలెర్రబడి పోతున్నాయి. రేణుకనెప్పుడూ అట్లా చూళ్లేదు.

   “అమ్మమ్మ బోలెడు కొత్త డ్రస్ లు కొనిచ్చిందా?” అప్పట్లో నాకు హాపీ అంటే రోజుకో కొత్త డ్రస్ వేసుకోటమే.

   “ఊహూ! సారి మా విజయ్ మామయ్య కూడా వచ్చాడు. ఆంధ్రా యూనివర్సిటీలో యమ్మే చేశాడు తెలుసా?”

   “ఎప్పుడూ మావయ్య గురించి చెప్పలేదే?”

   “మా విజయ్ మామయ్య వైజాగ్ లో మా పిన్ని దగ్గరుండి చదువుకున్నాడు. సమ్మర్ లో కూడా క్లాసులనీ, ట్యూషన్లనీ ఎప్పుడూ బిజీనే. ఇప్పుడు ఫైనల్ గా చదువయిపోయింది వచ్చేశాడు. పోటీ పరీక్షలకి తయారవుతాట్ట. హైడ్రాబాడ్ లోనో, ఢిల్లీలోనో. ఎన్ని కబుర్లు చెప్పాడో! ఎంత తెలివో.. ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా?” రేణుక కళ్లలో మెరుపు.

   రేణుక కళ్లలోకి చూశానొకసారి. తడబడుతూ కళ్లు నేలకి వాల్చేసింది. తెలిసీ తెలియని వయసు.. పదిహేడు పద్ధెనిమిదేళ్ల అడ పిల్లలం. ప్రకృతి సహజమైన ఆకర్షణలకి చలించకుండా ఉండటానికి మూగమనసుల్లో గౌరి చెప్పినట్లు మాను మాకులం కాదు కదా! అందులో కవ్వించి ఉంటాడు. అందుబాటులో వరసైన పిల్ల.. చూడ చక్కనిది. మా గుంటూరు సైడు, రోజుల్లో మేనమామకిచ్చి చెయ్యటం సర్వ సాధారణం. కానీ గోదావరి జిల్లాల్లో అంత కామన్ కాదు.

   “ఐతే మీరిద్దరూ తోటల్లో డ్యూయెట్లా?” చటుక్కున తలెత్తి చూసింది. నా ప్రశ్నలో వ్యంగ్యం తోచిందేమో! నాకు తెలియకుండానే, కాస్త ఎగతాళిగా అనేసి ఉంటాను. మగ పిల్లలకి ఆమడ దూరంలో మసలటం అలవాటు మా ఇద్దరికీ. ఇంట్లో పెద్ద వాళ్లు ఏమీ బోధలు చెయ్యకపోయినా.. పెరిగిన వాతావరణం అటువంటిది.

   “అదేం లేదే! మా దొడ్డమ్మల పిల్లలు, పెద్దమామయ్య పిల్లలు, చుట్టుపక్కలవాళ్లు.. అరడజను మంది పైగా ఉంటారు. మధ్యాన్నాలు కూర్చుని పేకాటలో, చదరంగమో ఆడుకునే వాళ్లం. మధ్యలో తోటలోకెళ్లి, తీయించి పెట్టిన కొబ్బరి బొండాలు కొట్టుకుని తాగుతూ.. జంతికలు చేగోణీలు తింటూ చదివిన పుస్తకాల గురించి చర్చించుకునే వాళ్లం.” తనని తను కాస్త సమర్ధించుకుంటున్నట్లు మాట్లాడుతోందేమో అనిపించింది.

   అడిగిందానికి అంత పెద్ద సమాధానం అవసరం లేదేమో.. కానీ, నేనేం మాట్లాడలేదు. రేణుక గురించి ఎందుకో బెంగ అనిపించింది. లేని పోని చిక్కుల్లో పడబోతోందేమో అని! నేనేం చెప్పబోయినా వింటుందనిపించలేదు. స్నేహాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేదు.

   “సర్లే. ఇప్పుడు ఫైనల్ ఇయర్ మనం. జాగ్రత్తగా చదివి సెకండ్ క్లాస్ ఐనా తెచ్చుకోవాలి. బాంక్ పరీక్షలు, గవర్న్మెంట్ వి రాయాలంటే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవాలి. రోజూ లైబ్రరీకి వెళ్లాలి. సెలవుల్లో జరిగింది పక్కన పెట్టెయ్యాలిసిందే.” టాపిక్ మార్చి క్లాసుకి తీసుకు పోయాను.

    ఒక్క సారిగా పెద్ద కుదుపు.. ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటికొచ్చాను. రామవరప్పాడు దగ్గరో గోతిలో పడుంటుంది బస్సు. అవటానికి పెద్ద హైవే అయినా, ఊర్లలోంచి వెళ్లేటప్పుడు, గోతులూ గుట్టలూ తప్పవు. హైవే వేసే వాళ్లు ఊర్లోంచి వెళ్ళే రోడ్లు పట్టించుకోరు. అవి వాళ్లవి కాదుట. ఊర్లలో చెప్పేదేముంది? ఎలా ఉన్నా రోజులు గడిచిపోతాయి. పెన్షన్లు, ఉచిత భృతులు ఇస్తే చాలు.

   ఫైనల్ ఇయర్ అంతా క్షణం తీరిక లేకుండా గడిచి పోయింది. మాది సైన్స్ గ్రూప్. రికార్డ్ లు, ప్రాక్టికల్స్ మధ్యలో పరీక్షలు. చివరికి వచ్చే సరికి ఫేర్వెల్ పార్టీలు, కన్నీటి వీడ్కోలు. పరీక్షలు బాగానే రాశామనిపించుకున్నాము. కానీ, రేణుక అన్యమనస్కంగానే ఉన్నట్లనిపించింది. నేను బాంక్ పరీక్షలు రాశాను. రేణుకకి గుంటూరులోనే గవర్న్మెంట్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది, టెంపరరీ.. పరీక్షలు పాసయితే పర్మనెంట్ చేస్తారు.

   “కంగ్రాచ్యులేషన్స్ రేణూ. ఉన్న ఊర్లోనే ఉద్యోగం.హాయిగా.. గొడవా లేకుండా చేరిపోవచ్చు.” రేణుక నవ్వింది. కానీ నవ్వులో జీవం లేదు.

   “ఏమయిందే? హిమాలయా కూల్ డ్రింక్స్ కి వెళ్లి ఐస్ క్రీమ్ తిందాం పద. ఎంచక్కా నెల తిరిగే సరికి జీతం వస్తుంది. వారానికో సారి తినచ్చు.” అప్పటి వరకూ రూపాయి రూపాయి దాచుకున్న పది రూపాయలున్నాయి నా దగ్గర.

   “ఏం లేదు భారతీ.. విజయ్ మామయ్య గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు.”

   “మరింకేం.. హాపీ న్యూస్ కదా? అంత డల్ గా ఉన్నావేం?” ఇద్దరం ఐస్ క్రీమ్ తింటున్నాం. హిమాలయాలో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఊళ్ల నించీ వస్తారు అక్కడ తినటానికి. పైగా బస్టాండ్ దగ్గర్లోనే ఉంది. కానీ రేణుక ఐస్క్రీమ్ ఆసక్తిగా తినటం లేదు.

   “ఏం చెయ్యాలీ? నాకు డిగ్రీ వస్తోంది కదా? నాన్న పెళ్లి మాటెత్తరు. బియస్సీ లో చేరినప్పట్నుంచీ గొడవపెట్టే అమ్మకేం చెప్పారో అమ్మ కూడా మాట్లాడట్లేదు. మావయ్య జాబ్ లో చేరి రెణ్నెళ్లయింది. అతనూ గమ్మునున్నాడు. నాకీ ఉద్యోగం అదీ ఇష్టం లేదే. నాన్నే ప్రయత్నం చేసి తెప్పించారు. అందాకా చెయ్యి.. సంబంధం కుదిరే లోగా అంటూ.” రేణు గొంతులో నిర్వేదం.

   మా ఇద్దరిళ్లల్లోనూ యమ్మెస్సీ చదివించే ఉద్దేశం లేదు. మా ఇంట్లో ఐతే, ముగ్గురన్నల తరువాత పుట్టిన నన్ను ఇంత వరకూ చదివించటమే గొప్ప. ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసి పంపించేద్దామా అనే. ఇంట్లో చెప్పకుండానే బాంక్ పరీక్షలకి వెళ్లాను, అంతగా సెలెక్ట్ ఐతే అప్పుడు చూద్దాంలే అని.

   రేణుక వాళ్లది పెద్ద కుటుంబం. ఐదుగురు అక్క చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. ఇద్దరన్నలు, ఒక అక్క తరువాత రేణుక. అక్కకి పెళ్లయింది వాళ్లింటికి పక్క వీధిలోనే ఉంటారు. వాళ్ల నాన్నగారు రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో చేస్తారు. అన్నలిద్దరూ బానే చదువుకున్నారు. మంచి ఉద్యోగాలే. పెద్దన్నకి పెళ్లయింది. చిన్నన్నకి కుదిరింది. వదినల గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది రేణు.. బాగా చదువుకున్నారనీ, స్మార్ట్ గా ఉంటారనీ! తమ్ముడు పియుసీ, ముగ్గురు చెల్లెళ్లూ హైస్కూల్లో చదువుతున్నారు.

   నేను కెనరా బాంక్ లో సెలెక్ట్ అవటం, ఇంట్లో ఒప్పించి బెజవాడలో చేరటం.. నన్ను బాంక్ లో చూసిన మా ప్రొబేషనరీ ఆఫీసర్ గారు నన్ను పెళ్లి చేసుకుంటాననటం.. అదృష్టవశాత్తూ వారిది మా శాఖే అవటంతో పెళ్లయిపోవటం జరిగిపోయాయి. పెళ్లికొచ్చిన రేణుని కళ్లెగరేసి అడిగాను, ఏమయిందన్నట్లు. పెదవి విరిచింది. లోగా తన ఉద్యోగం పెర్మనంట్ అయింది.

   సంసారం పెరిగి, ట్రాన్స్ఫర్ల మీద ఊర్లు తిరిగి.. పిల్లల చదువులూ, ఆట పాటలతో పదిహేనేళ్లు గడిచి పోయాయి.

   ఏడాదికోసారి న్యూ ఇయర్ గ్రీటింగ్స్. దాంతోనే క్షేమ సమాచారాలూ తప్ప ఆన్ని రోజులూ కలుసుకో లేదు.. మనసు విప్పి మాట్లాడు కోలేదు మేమిద్దరం. ఒకసారి, హైద్రాబాద్ లో నేను పని చేసేటప్పుడు బాంక్ లో ప్రత్యక్షమయింది. బ్రాంచ్ కి వచ్చి ఒక నెలే అయింది నేను. తప్పిపోయిన అక్క చెల్లెళ్ల లాగ ఎగిరి గంతేసినంత పని చేశాం. లక్కీగా లంచ్ టైమయింది. ఒక మూలకెళ్లి పోయాం.

   “ఏమయి పోయావే ఇన్ని రోజులూ? వివరాలతో ఉత్తరాలేనా రాయచ్చు కదా! ఇక్కడికెలా వచ్చావు?” రెండు చేతులూ పట్టుకుని అడిగాను.

   “ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది భారతీ. సెక్షన్ సూపరెంటెండెంట్. గెజిటెడ్ ఆఫీసర్ని తెలుసా?” గర్వంగా, ధీమాగా చెప్ప బోయింది. కానీ నా దగ్గరా నటన? ఎక్కడ్నుంచో తొంగి చూస్తున్న నిరాశ బయట పడుతూనే ఉంది.

   ఒక్క సారి బాంక్ లో స్టాఫ్ అందరినీ చూశాను. అందరూ వచ్చారు. బిజీ సమయం అయిపోయింది. నేను లేక పోయినా నడిచి పోతుంది. మానేజర్ కాబిన్ లోకి వెళ్లి ఎమర్జెన్సీ వచ్చిందని, హాఫ్ డే సెలవు పెట్టి, నా సహోద్యోగికి అంతా అప్ప జెప్పి బయట పడ్డాను. అప్పటి వరకూ నా పరుగు చూస్తున్న రేణుక కళ్ల నిండా నీళ్లతో లేచి నిలుచుంది. చెయ్యి పట్టుకుని, కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్లి కార్లో కూర్చో పెట్టాను. ఏం మాట్లాడ లేదు.. నేను చెప్పినట్టు చెయ్యటం తప్ప. ఇంటికి పోనిచ్చాను కారు.

   “ఇప్పుడు చెప్పు. ఎందుకింత నైరాశ్యం? మీ వాళ్లంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? నిన్ను ఒంటరిగా వదిలేశారు కదూ? పెళ్లయితే నన్ను పిలిచే దానివి కదా? పదిహేనేళ్లు గడిచి పోయాయి. ఒక్కదానివే గడిపేస్తున్నావా?” డ్రాయింగ్ రూమ్ లో కూర్చో పెట్టి, టీ పెట్టి రెండుకప్పుల్లో తెచ్చి ఎదురుగా కూర్చుని అడిగాను.

   రేణుక నన్ను తదేకంగా కాసేపు చూసి కళ్లు మూసుకుంది. కన్నుల చివర్నించి కన్నీళ్లు ధారలా.. వదిలేసింది, తుడుచు కోకుండా. లేచి వెళ్లి రుమాలు తెచ్చిచ్చాను.

   “కమాన్ రేణూ! ఏం జరిగింది? చెప్పు. అసలు నాతో కటాఫ్ ఎందుకు చేసేశావు?”

   “ఏం జరగలేదే! అందుకే నోరు మూసుకున్నాను. నేను జాబ్ లోకి చేరగానే మా అన్నలు పట్టించుకోటం మానేశారు. నాకొచ్చే నూటాభై రూపాయలు.. అప్పట్లో నెల గడిచి పోయేది, నాన్నగారికి ఇచ్చేసి, దగ్గరే కనుక ఆఫీస్ కి నడిచి వెళ్లే దాన్ని.. ఐదు రూపాయలు పాకెట్ మనీ. అంతలో తమ్ముడికి మెడిసిన్ లో సీట్ రావటం, ఎత్తి డబ్బు పంపాల్సి వచ్చింది. నా జీతం ఎంతో వెసులుబాటుగా ఉండేది. విజయ్ మామయ్య ట్రైనింగులు అవీ అయి ఆఫీసర్ గా చేరాడు. ఉత్తరాలు రాయటం అదీ కుదరదు కదా మనిళ్లలో. నాకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని అతని దగ్గరికి వెళ్లి పోదామా అని ఉండేది.” పాత జ్ఞాపకాలు ముసురుకోగా, ఉబికి వచ్చాయి కన్నీళ్లు. చూస్తూ ఉండటం తప్ప ఏం చెయ్యలేకపోయాను.

   నిజమే.. అప్పట్లో, ఏదన్నా చెప్పుకోటమే కష్టంగా ఉండేది

   “ఒక రోజు ఉన్నట్లుండి, మామయ్యకి పెళ్లి కుదిరిందని విన్నాను. అమ్మ పెట్టి సర్దుకుంటోంది. పెళ్ళికి వెళ్లాలని. మమ్మల్ని తీసుకెళ్లాలనే ఆలోచనే ఉన్నట్లు లేదు. బోలెడు ఖర్చు కదా! చెల్లెళ్లకి పరీక్షల రోజులు పైగా. నాకేం చెయ్యాలో తోచలేదు. ఫోన్ నంబర్ సంపాదించి, పబ్లిక్ బూత్ కి వెళ్లి ఫోన్ చేశాను. గుండె దడదడ లాడుతుండగా.”

   మళ్లీ వరద.. కళ్లు వాచి పోయి.. ముక్కు ఎర్రగా.. రేణుకని ఎలా ఓదార్చాలి?

   “ఫోన్లో ఏమన్నాడో తెలుసా? నీకు ఎప్పుడైనా నిన్ను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటాననీ చెప్పానా? రైల్వే ఆఫీసర్ గారి అమ్మాయి.. బోలెడు కట్నం. మీ నాన్న పెళ్లి కూడా నా హోదాకి తగ్గట్లు చెయ్యలేడు.”

   “మరి నువ్వేమన్నావు? అసలేం జరిగింది? నీకు అతడి మీద ప్రేమెలా పుట్టింది?”

   “కోపంతో కంఠం మూసుకు పోయింది. అయినా పెగల్చుకుని అన్నాను.. ‘నిజమే చెప్పలేదు. కానీ ఇద్దరమే ఉన్నప్పుడు, చేతులు నిమరడాలు, కౌగిలించుకోడాలు, కళ్ల మీద ముద్దు పెట్టుకోడాలూ.. ఇవన్నీ ఉత్తినే చేస్తారు కదూ?’ అని పెట్టేశాను.” అప్పుడే సంఘటన జరిగినట్లు కుళ్లి కుళ్లి ఏడిచింది రేణు.

   “పోన్లే, టీనేజ్ లో అవన్నీ ఉంటుంటాయి ఒకో సారి. పట్టించుకో కూడదు. మనసుకి ఎక్కించుకోకూడదు. మీ ఇంట్లో నీ పెళ్లి ప్రయత్నాలే చెయ్యలేదా?” ఇంట్లో దీని ప్రేమ కథ తెలియదు కదా.. మరి ఊరుకున్నారా?

   “చూశారు భారతీ. మామయ్య పెళ్లికి ముందే మొదటి సంబంధం వచ్చింది. అప్పుడే ఎలాగో నాన్నగారికి చెప్పాను. వెళ్లి మాట్లాడి వచ్చారు మామయ్యతో. నాతో ఫోన్ లో మాట్లాడినట్లే అన్నాడుట. అయినా ఆశ చావక, తన పెళ్లి కుదిరిందని వినగానే ఫోన్ చేశాను. తరువాత చెల్లెళ్లకి వరుసగా మంచి సంబంధాలు వచ్చాయని చేసేశారు.” 

   “మీ అన్నయ్యలు? తమ్ముడు? వాడు డాక్టర్ అయుండాలి కదా?” రేణుక మొహంలో కోపం..

   “అన్నయ్యలు.. ఉన్నారు. వాళ్లెప్పుడు పట్టించుకున్నారు? తమ్ముడు చదువైపోగానే తన కొలీగ్ ని చేసుకున్నాడు. ఆవిడ పంజాబీ. వాడే కాస్త నయం. యు. యస్ లో ఉన్నాడు. రెండు మూడేళ్ల నుంచీ డబ్బు పంపుతున్నాడు. వారానికొక సారి ఫోన్ చేస్తుంటాడు. చెల్లెళ్లకి కూడా అవసరం ఐతే వాడే చూస్తుంటాడు.”

   “మరి అమ్మా, నాన్నా?”

   “నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఇబ్బందులేం లేవు. అమ్మ వండి పెడుతుంటుంది. నాన్న పుస్తకాలు, వాకింగ్. సాయంత్రం ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. రాజమండ్రీలో అపార్ట్ మెంట్ కొన్నాను లోన్ తీసుకుని, తాతగారి ఊరికి దగ్గరగా ఉంటుందని. ట్రాన్శ్ఫర్ తో ఇక్కడికి వచ్చాను. అమ్మా, నాన్నలని చూట్టానికి నా దగ్గరికి వస్తుంటారు అందరూ.”

   “అంతేనా లేక విజయ్ ని అప్పుడప్పుడు చూట్టానికి కుదురుతుందనా?”

   తల దించుకుంది రేణుక. తెలిసీ తెలియని వయసులో కలిగిన ప్రేమ.. తీసి పడెయ్యటానికి అదేమన్నా నెత్తి మీది జుట్టులో చిక్కా? బాగుంది. నిట్టూర్చాను

   “ఎప్పుడూ అనిపించలేదా? నీకూ సంసారం, పిల్లలు ఉండాలని?”

   “ఎందుకనిపించదే.. నేనేమన్నా సన్యాసినినా? ఉప్పు, కారం తినే మామూలు మనిషినే కదా!” రేణుకని చూస్తుంటే జాలికి కూడా అందని భావం కలిగింది నాకు. ఇష్ట పూర్వకంగా, త్యాగం చెయ్యటం వేరు. ఇంకే దారి లేకుండా తన జీవితం నిర్దేశించబడి కొట్టుకు పోవటం వేరు. ఎవరి దోషం ఇది? అన్న దమ్ముల స్వార్ధానికి బలైపోయిన ఆడపిల్ల.

   మేము ఊర్లో ఉన్న మూడు సంవత్సరాలూ, తరచుగా కలుసుకుంటుండే వాళ్లం. మాకు బదిలీ అయి వెళ్లిపోయినా, ఉత్తరాల్లో, తరువాత ఫోన్లలో పలకరించుకునే వాళ్లం. నా కంటే ముందే రిటైరయి, రాజమండ్రీలో సెటిల్ అయింది రేణు. వాళ్లమ్మ  పోయి నాలుగైదేళ్లయింది. బస్సాగి, కేకలు వినిపించి కళ్లు తెరిచాను.

   “రాజమండ్రీ వచ్చింది. దిగండి.. దిగండి.” కండక్టరు అందర్నీ లేపుతున్నాడు. కాళ్లు ఈడుస్తూ దిగాను. ఎక్కువ సేపు కూర్చుంటే అంతే మరి.. కాసేపు మొరాయిస్తాయి. మోకాళ్లు.

   “భారతిగారు మీరేనామ్మా?” పాతికేళ్ల కుర్రాడొకడు, నా దగ్గరకొచ్చి, చేతిలో సంచీ తీసుకున్నాడు. రేణు ఇంటికి తీసుకెళ్లాడు కారులో. నాలుగయింది టైము.

   మొదటి అంతస్థులోనే రేణు ఫ్లాట్.. లోపలికెళ్లగానే కంటపడింది దృశ్యం.. 95 ఏళ్లు దాటిన వాళ్ల నాన్న నిర్జీవంగా పడుకోబెట్టి ఉన్నాడు, చాప మీద. పక్కనే కుర్చీలో రేణు. తన చెల్లెళ్లు తలో మూల కునుకుతున్నారు. చిత్రంగా నాకేం భావం కలుగలేదు

   “వచ్చావా భారతీ.. చూశావా? మా అన్నలిద్దరూ పోయినేడే వెళ్లిపోయారు. తమ్ముడు హార్ట్ అటాక్ తో హాస్పిటల్ లో ఉన్నాడుట. మా అక్క వాళ్లాయన పోయి ఐదేళ్లయింది. మిగిలిన అల్లుళ్లకి తల్లిదండ్రులున్నారు. సంబంధం లేని వాడు కిరాయికి చేస్తున్నాడు కర్మ. నాకేం తోచలేదే. నువ్వు తోడుంటే ధైర్యంగా ఉంటుందని రమ్మన్నా.”

   చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకెళ్లి కూర్చోపెట్టాను. సాంత్వన వచనాలు పలకాలి.. కానీ రావట్లేదే..

   యాదృచ్ఛికంగా మా రీజినల్ మానేజర్ అమ్మాయి పెళ్లిలో కొన్ని సంవత్సరాల క్రితం నా పక్కన కూర్చున్నఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ గుర్తుకొచ్చాడు. అతనే రేణు మామయ్యని మాటల్లో తెలుసుకుని, నిర్మొహమాటంగా అడిగేశాను.

   “నేను చేసుకుందామనుకున్నానండీ. మా బావే వచ్చి ప్రేమా దోమా మన ఇంటా వంటా లేవని నానా తిట్లూ తిట్టి, ఇంకెప్పుడూ వాళ్లకి కనిపించద్దని వార్నింగిచ్చాడు. అప్పుడు, వయసులో ధైర్యం చెయ్యలేకపోయాను.”

   అందుకే నేమో.. కొడుకులుండీ అక్కరకు రాలేదు. చివరి వరకూ, తను అన్యాయం చేసిన కూతురి దగ్గరే కాలం గడపాల్సి వచ్చింది.

                                                    ‌     *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.